చందా కొచ్చర్: పదేళ్ల కిందట పద్మభూషణ్.. ఇప్పుడు ఆర్థిక నేరాలలో అరెస్టు

ఫొటో సోర్స్, Getty Images
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూప్‌కు సుమారు రూ.3000 కోట్ల రుణం ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ రుణం ఇచ్చే సమయంలో ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా ఉన్నారు. ఈ రుణం మొత్తాన్ని తన భర్త కంపెనీలో పెట్టుబడి పెట్టారనే ఆరోపణలు వచ్చాయి.
ఆమెపై వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, ఎలక్ట్రానిక్స్ తయారీ, చమురు-గ్యాస్ మైనింగ్ కంపెనీలను నిర్వహిస్తున్న వీడియోకాన్ కంపెనీ మాజీ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్ కంపెనీ నూ పవర్ రెన్యూవబుల్స్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు.
ఈ గ్రూప్ ఐసీఐసీఐ బ్యాంక్ నుండి రుణం పొందిన తర్వాత వీడియోకాన్ ఈ పెట్టుబడి పెట్టింది.
వీడియోకాన్‌కు ఇచ్చిన రుణం ఎన్‌పీఏ ( నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ )గా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
చందా కొచ్చర్ ఎవరు?
చందా కొచ్చర్‌ను ఒకప్పుడు భారతీయ బ్యాంకింగ్ రంగంలో స్టార్‌గా పేర్కొనేవారు. అతి తక్కువ కాలంలోనే ఆమె కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
"ఆకాశం కోసం ఆశపడండి. కానీ నెమ్మదిగా నడవండి. ప్రతి అడుగును ఆస్వాదించండి. ఈ చిన్న అడుగులు మన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దోహద పడతాయి" .. 2009లో చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సుదీర్ఘ జీవన ప్రయాణంలో వేసే చిన్న చిన్న అడుగుల ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు.
కానీ, ఎంతో అద్భుతంగా సాగుతున్న తన బ్యాంకింగ్ కెరీర్ ఇలా దారి మళ్లుతుందన్న ఆలోచన బహుశా ఆ సమయంలో ఆమెకు వచ్చి ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మెరుపుల నుంచి మరకల వరకు..
భారత బ్యాంకింగ్ రంగంలో పురుషాధిక్యాన్ని ఛేదించి యావత్ ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న చందా కొచ్చర్ ఇప్పుడు సీబీఐ విచారణలో ఉన్నారు.
చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లపై సీబీఐ నేరపూరిత కుట్ర, చీటింగ్ కేసు నమోదు చేసింది.
అయితే, ఇప్పుడు చందా కొచ్చర్ నేరారోపణలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ, అంతకు ముందు బ్యాంకింగ్ రంగంలో ఆమె ప్రయాణాన్ని తక్కువ చేసి చూడలేం.
రాజస్థాన్ నుండి ముంబయికి..
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన చందా కొచ్చర్ జైపూర్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు.
ఆమె తండ్రి రూప్‌చంద్ అద్వానీ జైపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ప్రిన్సిపాల్ కాగా, తల్లి గృహిణి.
చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ అధికారిక బ్లాగ్‌లో ఆమె గురించి రాశారు. దాని ప్రకారం, చందాకు 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారు.
ముంబైలోని జై హింద్ కళాశాలలో కొచ్చర్ బీకామ్ చేశారు.
1982లో గ్రాడ్యుయేషన్ తర్వాత, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ అకౌంటెన్సీని అభ్యసించారు.
జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు.
మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ప్రతిభ కనబరిచినందుకు వోకార్డ్ గోల్డ్ మెడల్, అకౌంటెన్సీలో జేఎన్ బోస్ గోల్డ్ మెడల్‌లను చందా అందుకున్నారు.
చందా కొచ్చర్ 1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు.
1955లో భారతీయ పరిశ్రమలకు ప్రాజెక్ట్ ఆధారిత ఫైనాన్సింగ్ కోసం జాయింట్ వెంచర్ ఫైనాన్సింగ్ సంస్థగా ఐసీఐసీఐ (ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పడింది.
1994లో ఐసీఐసీఐ పూర్తిగా బ్యాంకింగ్ కంపెనీగా మారినప్పుడు, చందా కొచ్చర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంక్ సీఈవో నుంచి పద్మభూషణ్ అవార్డు వరకు
ఆ తర్వాత కూడా ఆమె కెరీర్‌లో విజయాల పరంపర కొనసాగింది. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్‌గా ఎదిగి 2001లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు.
తర్వాత బ్యాంక్ కార్పొరేట్ వ్యాపారాన్ని చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించారు. మరికొన్నాళ్లకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్‌ను నియమించే రోజు వచ్చింది. ఆమె నాయకత్వంలో బ్యాంక్ రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులోనూ బ్యాంక్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
బ్యాంకింగ్ రంగానికి ఆమె చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం 2011లో పద్మ భూషణ్ ప్రదానం చేసింది.
ఆమె పదవీకాలంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ విదేశాలకు కూడా విస్తరించింది. ఈ బాధ్యతలను కూడా ఆమెకే అప్పజెప్పారు.
ఆమె నాయకత్వంలో ఉండగానే ఐసీఐసీఐ బ్యాంక్ భారతదేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించింది.
ఆమె ఏడాదికి రూ. 5.12 కోట్ల వేతనాన్ని తీసుకున్నట్లు 2016 సంవత్సరంలో దీపక్ కొచ్చర్ వెల్లడించారు.
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు కూడా చోటు దక్కింది.
అధికార దుర్వినియోగం
ఐసీఐసీఐ బ్యాంకుకు తొమ్మిదేళ్లపాటు సీఈఓగా పనిచేసిన చందా కొచ్చర్‌పై 2018 నుంచి చీకటి మేఘాలను కమ్ముకోవడం ప్రారంభించాయి.
వీడియోకాన్ గ్రూపుకు రుణం ఇవ్వడం ద్వారా, వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
2018 అక్టోబర్ నాటికి ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి 2019 మార్చి వరకు ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
2012 ఏప్రిల్ లో ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ గ్రూప్ కు చెందిన కంపెనీలకు రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక మార్చిలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు విషయం ఎలా వెలుగులోకి వచ్చింది?
విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదుతో ఈ విషయం మీడియా ద్వారా బహిర్గతమైంది. అరవింద్ గుప్తా వీడియోకాన్ గ్రూప్‌లో పెట్టుబడిదారు.
2016లో ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై ఆయన అనేక సందేహాలు వెలిబుచ్చారు.
కొచ్చర్ తన పదవిని దుర్వినియోగం చేశారని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో అరవింద్ గుప్తా ఆరోపించారు.
అయితే మొదట్లో అరవింద్ గుప్తా ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో ఆయన 2010 సంవత్సరంలో దీపక్ కొచ్చర్ ప్రమోట్ చేసిన ‘ను పవర్ రెన్యూవబుల్స్’ గురించి మరింత సమాచారాన్ని సేకరించారు.
ఈ ఆర్థిక అవకతవకలపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ మొత్తం వ్యవహారం బహిర్గతమైంది.
ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది.
అరవింద్ గుప్తా చేసిన ఆరోపణలపై బోర్డు సమగ్రమైన విచారణ జరుపుతుందని 2018 మే 30న బ్యాంక్ బోర్డు ప్రకటించింది.
ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తు బాధ్యతను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణకు అప్పగించారు.
2019 ఏప్రిల్ నెలలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. అదే సంవత్సరం జూన్ లో చందా కొచ్చర్ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
జూన్ 19న సందీప్ బక్షీని ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈఓగా నియమించారు. చందా కొచ్చర్ రాజీనామా తర్వాత సందీప్ బక్షీని పూర్తికాల సీఈఓగా, ఎండీగా బ్యాంక్ నియమించింది.
ఇవి కూడా చదవండి:
- ఒక సీరియల్ కిల్లర్‌ను విడుదల చేయడం ప్రమాదకరం కాదని ఎలా నిర్ణయించారు?
- ఇండియాలో టీనేజ్ సెక్స్ ఎందుకు నేరం? ‘సమ్మతి తెలిపే వయసు’ను తగ్గించాలని కొందరు జడ్జిలు ఎందుకు అంటున్నారు
- భాగల్పూర్ మర్డర్ :‘‘మా అమ్మను గొడ్డలితో జంతువులకన్నా దారుణంగా నరికి చంపాడు’’
- సొరంగం తవ్వి రైలింజిన్‌ను దొంగిలించారా....అసలేం జరిగింది?

















