ఒక సీరియల్ కిల్లర్‌ను విడుదల చేయడం ప్రమాదకరం కాదని ఎలా నిర్ణయించారు?

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘వరుసగా నేరాలు చేసే ఒక నేరస్థుడిని అసలు ఎప్పుడూ జైలు నుంచి విడుదల చేయకూడదు’’ అని 85 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారి మధుకర్ జెండే అన్నారు.

మధుకర్ నాయకత్వంలోని పోలీసు బృందమే 1986లో గోవాలో ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను అరెస్ట్ చేసింది.

1975లో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన కేసులో శోభరాజ్ 19 ఏళ్ల పాటు నేపాల్ జైలులో ఉన్నారు.

1972- 1982 మధ్య కాలంలో భారత్, థాయ్‌లాండ్, నేపాల్, తుర్కియే, ఇరాన్‌లలో 20కి పైగా హత్యలు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి.

పర్యాటకులకు మత్తుమందు ఇవ్వడం, గొంతు కోయడం, కొట్టడం లేదా తగలబెట్టడం వంటి చర్యల ద్వారా హత్యలకు పాల్పడ్డారని చెబుతారు.

భారత్, థాయ్‌లాండ్ దేశాలకు వచ్చే యువ పర్యటకులను ఆయన ఎక్కువగా టార్గెట్ చేసేవారు.

నేపాల్‌లో హత్యానేరం రుజువు కావడానికి ముందు, ఫ్రెంచ్ టూరిస్టులపై విషప్రయోగం చేసిన కేసులో దాదాపు 20 ఏళ్లపాటు భారత్‌లో జైలు జీవితం గడిపారు.

బీబీసీ, నెట్‌ఫ్లిక్స్ సహ సమర్పణ అయిన ‘ది సర్పెంట్’ సిరీస్ ద్వారా ఆయన కేసు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ప్రస్తుతం 78 ఏళ్ల వయస్సులో ఉన్న చార్లెస్ శోభరాజ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది.

అతని వయస్సును, జైలు కాలంలో సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని నేపాల్ సుప్రీం కోర్టు డిసెంబర్ 21న ఈ తీర్పును వెలువరించింది.

గత 40 ఏళ్లలో ఎక్కువ భాగం జైలు జీవితమే గడిపిన శోభరాజ్, సుప్రీం కోర్టు తీర్పుతో బయటికొచ్చారు.

దీంతో రాబోయే కాలంలో ఇలాంటి సీరియల్ కిల్లర్స్‌ విడుదల కాకుండా నివారించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీబీసీతో మధుకర్ జెండే చెప్పారు.

అయితే, ఒక సీరియల్ కిల్లర్‌ను విడుదల చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు?

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

హేయమైన నేరాలు

దీర్ఘకాల శిక్ష అనుభవిస్తున్నవారి తరఫు న్యాయవాదులు... ఖైదీల వయస్సు, జైలులో గడిపిన కాలం, అనారోగ్యాన్ని కారణాలను చూపిస్తూ తమ క్లయింట్లను విడుదల చేయాలంటూ ఒత్తిడి చేస్తారు.

అదే సమయంలో ప్రాసిక్యూషన్, బాధిత కుటుంబాలు దీన్ని వ్యతిరేకిస్తుంటాయి.

హేయమైన నేరాల్లో దోషిగా ఉన్న ఒక ఖైదీని ఎలాంటి కారణాలపై విడుదల చేయొచ్చు? అసలు ఖైదీని విడుదల చేయొచ్చా లేదా? అనే అంశాలపై న్యాయ నిపుణుల మధ్య కూడా చాలా అరుదుగా ఏకాభిప్రాయం కుదురుతుంది.

శోభరాజ్‌ను నిరంతరంగా జైలులో ఉంచడం, ఖైదీల మానవ హక్కులకు అనుగుణంగా లేదని నేపాల్ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలతో చార్లెస్ శోభరాజ్ బాధపడుతున్నారు. అనారోగ్యానికి చికిత్సను మరో కారణంగా చూపిస్తూ సుప్రీం కోర్టు ఆయన్ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

మధుకర్ జెండే
ఫొటో క్యాప్షన్, సీరియల్ కిల్లర్ల విషయంలో వృద్ధాప్యం, అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ జాలి పడకూడదని మధుకర్ జెండే అన్నారు

అయితే, కోర్టు వెలువరించిన ఈ తీర్పుపై జెండే నిరాశ వ్యక్తం చేశారు.

‘‘నేను, అతని లాంటి నేరస్థుడిని ఎప్పుడూ చూడలేదు. చాలా దేశాల్లో 40కి పైగా మహిళలను హత్య చేసినట్లు ఆయన ఒప్పుకున్నాడు.

అతని గత రికార్డు, నేరాలు చేసే క్రమాన్ని చూపిస్తుంది. అమ్మాయిలతో స్నేహం చేసి ప్రలోభపెట్టడం, మత్తు మందు ఇచ్చి వారిని చంపడం చేసేవాడు. అతను సమాజానికి ప్రమాదకరం’’ అని జెండే వివరించారు.

అమెరికా మహిళ క్యానీ జో బ్రాంజిచ్, ఆమె కెనడియన్ స్నేహితురాలు లారెంట్ క్యారీర్‌ను చంపినందుకు గానూ ఈ రెండు హత్య కేసుల్లో శోభరాజ్ 20 ఏళ్ల చొప్పున జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

పుణే నగరం నుంచి బీబీసీతో మాట్లాడిన మధుకర్ జెండే, చేసిన నేరాలకు తగిన శిక్షను శోభరాజ్ అనుభవించలేదని అభిప్రాయపడ్డారు.

‘‘మద్యం, ధనం, మహిళల కోసం ఒక వ్యక్తి, హంతకుడిగా మారతాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఒకటి లేదా రెండు హత్యలు చేసి ఉంటే, దీర్ఘకాల జైలు శిక్ష అతనిలో మార్పు తీసుకురాగలదు.

కానీ, సీరియల్ కిల్లర్స్ విషయంలో ఇలా జరుగదు. కొంతమంది నేరస్థులు ఎప్పటికీ మారరు’’ అని జెండే వివరించారు.

అనూప్ సురేంద్రనాథ్

ఫొటో సోర్స్, Anup Surendranath

ఫొటో క్యాప్షన్, అనూప్ సురేంద్రనాథ్

‘‘ప్రతీకారం, సమాధానం కాదు’’

నేర న్యాయ వ్యవస్థలు (క్రిమినల్ జస్టిస్ సిస్టమ్) చాలా కాలం కిందటే క్షమ అనే మాటకు దూరంగా జరిగాయని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

‘‘కొన్ని నేరాలకు పాల్పడిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయకూడదంటూ మనం వాదించలేం. సంస్కరించడం, పునరావాసం వంటి అంశాలను కూడా తీవ్రంగా పరిగణించాలి’’ అని డాక్టర్ అనూప్ సురేంద్రనాథ్ అన్నారు.

అనూప్ సురేంద్రనాథ్, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన క్రిమినల్ జస్టిస్ ప్రోగ్రామ్ ‘ప్రాజెక్ట్ 39ఎ’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. లా ప్రొఫెసర్ కూడా.

భారత్‌లో నేరస్థులకు కఠినమైన, దీర్ఘకాల శిక్షలు విధించాలంటూ తరచుగా ఒత్తిడి ఉంటుందని ఆయన అన్నారు.

భారత జైళ్లలో పెరోల్, ఫర్లాఫ్, క్షమాపణ వంటి ప్రక్రియల విషయంలో చాలా తక్కువ పారదర్శకత ఉంటుందని ఆయన చెప్పారు.

న్యాయం జరగాలంటే శిక్షించడం ఒక్కటే మార్గం కాదని డాక్టర్ సురేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు.

‘‘నేరస్థులను శాశ్వతంగా ఖైదు చేస్తే బాధితులకు న్యాయం జరిగినట్లు అని మనం అనుకోలేం. ఒక నేరం జరిగినప్పుడు బాధితుడు, నేరస్థుడి పట్ల ప్రభుత్వాలు, సమాజం విఫలమవుతున్నాయి. బాధితుడి పట్ల, నేరస్థుడి పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

సెరెనా సిమ్మన్స్

ఫొటో సోర్స్, Serena Simmons

ఫొటో క్యాప్షన్, సెరెనా సిమ్మన్స్

‘‘బాధిత కుటుంబాలను అగౌరవపరిచినట్లే’’

శోభరాజ్‌ను విడుదల చేయకుండా ఉండాల్సిందని యూకేలోని నాటింగ్‌హాట్ ట్రెంట్ యూనివర్సిటీ సీనియర్ సైకాలజీ లెక్చరర్ సెరెనా సిమ్మన్స్, బీబీసీతో అన్నారు.

‘‘ఇది బాధిత కుటుంబాలను పూర్తిగా అగౌరవపరిచినట్లే. అతను నిజంగా ఒక ప్రమాదకర వ్యక్తి. హత్యలు చేయడం అతని వృత్తిగా మారింది. అలా చేస్తూ అతను ఆనందాన్ని పొందాడు’’ అని ఆమె చెప్పారు.

యూకేలోని చాలామంది సీరియల్ కిల్లర్స్‌ల మానసిక స్వభావాలను సిమ్మన్స్ అధ్యయనం చేశారు. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిని చంపినవారిని సీరియల్ కిల్లర్స్‌గా ఆమె నిర్వచించారు.

‘‘సీరియల్ కిల్లర్లు సాధారణంగా 25-35 ఏళ్ల మధ్య ఉంటారు. తెలివైన పురుషులు వారు. బాధితులను ప్రలోభపెట్టడానికి ఒక స్థాయి వరకు కుట్రలు చేస్తారు. అలా నేరం చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు చేయరు. బాధితులను తమ వైపుకు ఆకర్షించుకోవడంలో వారు సఫలం అవుతారు’’ అని ఆమె చెప్పారు.

చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

సీరియల్ కిల్లర్స్‌ను విడుదల చేయొచ్చా? అనే ప్రశ్నకు ఆమె నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.

  • ఎంతమంది బాధితులు ఉన్నారు?
  • లైంగిక దాడికి సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉన్నాయా?
  • నేరం చేయడానికి ఎన్ని ప్రణాళికలు రచించారు? సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారా?
  • మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా?

నేరస్థుల విషయంలో జాలి, కనికరం చూపే ముందు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె అన్నారు.

‘‘సీరియల్ కిల్లర్లు చాలా ప్రమాదకరం. చాలా మంది హంతకులు, నేరం చేసేటప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తారు. వారు చాలా తెలివిగా మసలుతారు. నేరం చేసేందుకు ప్రణాళికలు రచిస్తారు. వాటిని పక్కాగా అమలు చేస్తారు. ఒకవేళ పట్టుబడితే తక్కువ శిక్షతో బయటకు వచ్చేందుకు వీలుగా తాము నేరం చేసిన విధానాన్ని చాలావరకు గోప్యంగా ఉంచుతారు. లేకపోతే చాలా తక్కువ స్థాయి సాక్ష్యాలను మాత్రమే బయటపెడతారు.

చాలా మంది చేసిన నేరాలకు పశ్చాత్తాపం చెందరు. పైగా పోలీసులకు పట్టుబడినందుకు పశ్చాత్తాప పడతారు’’ అని ఆమె వివరించారు.

యూకేలో సీరియల్ కిల్లర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అంటే వారు ఎన్నటికీ జైలు నుంచి విడుదల కాకుండా శిక్ష ఉంటుంది.

‘‘కానీ, చాలా దేశాల్లో చేసిన ప్రతీ నేరం పరంగా హంతకుడికి శిక్ష విధించరు. కాబట్టి శోభరాజ్ తరహాలో నేరస్థులు బయటకు వస్తుంటారు అని ఆమె చెప్పారు.

వారు చేసిన కొన్ని నేరాలు మాత్రమే విచారణ స్థాయికి వస్తాయి. సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల మరికొన్ని నేరాల్లో శిక్ష నుంచి తప్పించుకుంటారు.

వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలను కారణాలుగా చూపిస్తూ శోభరాజ్ వంటి నేరస్థులు బయటకు రాకుండా నిరోధించేలా భారత న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటున్నట్లు జెండే చెప్పారు.

‘‘బాధిత కుటుంబాలకు అన్యాయం జరిగినట్లు నేను భావిస్తున్నా. శోభరాజ్ వంటి సీరియల్ కిల్లర్స్ ఎన్నటికీ బయటకు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా.

జైలు శిక్షకు పరిమితి ఉండకూడదు. జీవిత ఖైదు అంటే మరణం వరకు జైలులో ఉంచితేనే అది సరైన శిక్ష అవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)