ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరెస్పాండెంట్
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించటానికి భారత దేశం మరో నాలుగు నెలల దూరంలోనే ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెల మధ్యలో జనాభా సంఖ్యలో చైనాను భారత్ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఆసియాలో పెద్ద దేశాలైన భారత్, చైనాల్లో ఇప్పటికే ఒక్కొక్కదానిలో 140 కోట్లకు పైగా జనాభా ఉంది. 70 ఏళ్లుగా ప్రపంచ జనాభాలో మూడో వంతుకు పైగా ఈ దేశాల్లోనే ఉంది.
చైనా జనాభా వచ్చే ఏడాది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గతేడాది అక్కడ కోటీ అరవై లక్షల జననాలు నమోదయ్యాయి. ఇది ఆ ఏడాది నమోదైన మరణాల సంఖ్య కంటే పెద్దగా ఎక్కువ కాదు. సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గిపోవడంతో ఇలా జరిగింది.
ఇటీవలి దశాబ్దాలలో భారత్‌లో కూడా సంతానోత్పత్తి రేటు పడిపోయింది. 1950లో భారత మహిళల సంతానోత్పత్తి రేటు సగటున 5.7 జననాలు కాగా, ఇప్పుడు అది రెండుకు తగ్గింది. కానీ, సంతానోత్పత్తి రేటు తగ్గుదల నెమ్మదిగా జరుగుతోంది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమిస్తే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన ఆదాయం, ఆయుర్దాయం...
చైనా తన జనాభా వృద్ధి రేటును దాదాపు సగానికి తగ్గించింది. 1983లో చైనా జనాభా వృద్ధి రేటు 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.1 శాతంగా కొనసాగుతోంది.
ఈ జనాభా వృద్ధి రేటు తగ్గుదలలో ఎక్కువ భాగం మానవ హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారానే చైనా సాధించిందని జనాభా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ‘కేవలం ఒకే బిడ్డను కనండి’, ‘పిల్లల మధ్య ఎడం పాటించండి’ అనే ప్రచారాలను చైనా నిర్వహించింది.
భారత్‌లో జనాభా వృద్ధి వేగంగా జరిగింది. గత శతాబ్దపు రెండో అర్ధభాగం వరకు ఏడాదికి దాదాపు 2 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. కాలక్రమంగా మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుర్దాయం పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో నివసించే ఎక్కువ మందికి స్వచ్ఛమైన తాగు నీరు, ఆధునిక మురుగు నీటి పారుదల వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి.
ఇండియాలో ‘‘ఇంకా జననాల రేటు ఎక్కువగానే ఉంది’’ అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెమొగ్రాఫర్ (జనాభా శాస్త్ర అధ్యాయకుడు) టిమ్ డైసన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1976లో తొలిసారిగా జాతీయ జనాభా విధానాన్ని రూపొందించింది. భారత్ ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయానికి చైనా, జననాల రేటును తగ్గించడంలో తలమునకలై ఉంది.
కానీ, 1975 ఎమర్జెన్సీ సమయంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో అతి పట్టుదల కారణంగా లక్షలాది మంది పేద ప్రజలకు బలవంతంగా స్టెరిలైజేషన్ చేశారు. ఈ చర్య ప్రజల్లో కుటుంబ నియంత్రణపై వ్యతిరేకతకు దారి తీసింది.
‘‘ఒకవేళ ఎమర్జెన్సీ విధించి ఉండకపోతే, భారత్‌లో సంతానోత్పత్తి క్షీణత మరింత వేగంగా జరిగి ఉండేది. రాజకీయ నాయకులు మరింత చురుగ్గా ఉన్నా ఇది సాధ్యమయ్యేది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కుటుంబ నియంత్రణ విషయంలో ఆచితూచి వ్యవహరించాయని దీన్నిబట్టి అర్థం అవుతుంది’’ అని ప్రొఫెసర్ డైసన్ అన్నారు.
కొరియా, మలేసియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి తూర్పు ఆసియా దేశాలు, భారత్ కంటే ఆలస్యంగా జనాభా నియంత్రణ కార్యక్రమాలను మొదలుపెట్టాయి. అయినప్పటికీ భారత్ కంటే ముందుగా సంతానోత్పత్తి స్థాయి తగ్గించడంతో పాటు.. మాతాశిశు మరణాల రేటు తగ్గుదల, ఆదాయాల పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలను సాధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
జనాభా విస్పోటనం జరగట్లేదు
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత జనాభా 100 కోట్ల కంటే ఎక్కువ పెరిగింది. మరో 40 ఏళ్ల వరకు భారత జనాభా పెరుగుతుందని అంచనా వేశారు.
కానీ, కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. ‘‘జనాభా విపత్తు’’కు సంబంధించిన భయంకలిగించే అంచనాలను భారత్ కొట్టిపారేసింది.
కాబట్టి, చైనా కంటే ఎక్కువ జనాభా ఉండటం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశంగా కనిపించదు.
ఆదాయాల్లో పెరుగుదలతో పాటు మెరుగైన విద్య, వైద్య వసతుల కల్పన వంటివి.. జననాలు మునుపటి కంటే తగ్గటానికి దోహదపడ్డాయి.
17 రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలనలో ఉన్న ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు, రిప్లేస్‌మెంట్ లెవల్ కంటే తక్కువకు పడిపోయింది. జనాభా సంఖ్య స్థిరంగా కొనసాగటానికి సరిపడా ఉండే కొత్త జననాల స్థాయిని ‘రీప్లేస్‌మెంట్ లెవల్’గా పిలుస్తారు.
అధిక జనాభా గల ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో జననాల రేటు వేగంగా తగ్గింది.
‘‘భారతదేశంలోని ఎక్కువ ప్రాంతం దక్షిణాదిలా లేకపోవడం విచారకరం. అన్ని విషయాల్లో సమానంగా ఉన్నప్పటికీ ఉత్తరాదిలో జనాభా వేగంగా పెరడటం వల్ల జీవన ప్రమాణాలు దిగజారాయి’’ అని ప్రొఫెసర్ డైసన్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘యువ భారత్’తో లాభాలు...
అయితే, జనాభాలో చైనాను అధిగమించటం వల్ల భారతదేశానికి ప్రాధాన్యత పెరగవచ్చు.
ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సీటును పొందాలనే భారత డిమాండ్‌కు ఇది బలాన్ని ఇవ్వవచ్చు.
భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా సహా అయిదు శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. ఐరాస వ్యవస్థాపక సభ్య దేశమైన ఇండియా.. భద్రతామండలిలో తనకు శాశ్వత సభ్యత్వం అనేది న్యాయమైన హక్కు అని వాదిస్తోంది.
జనాభా రీత్యా అతి పెద్ద దేశంగా ఉన్నపుడు ‘‘మనకు కొన్ని విషయాల్లో హక్కులు ఉంటాయని నేను భావిస్తాను’’ అని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖలో జనాభా విభాగం డైరెక్టర్ జాన్ విల్‌మోత్ పేర్కొన్నారు.
భారత జనాభా సంఖ్య మారుతున్న తీరు కూడా ముఖ్యమైనది అని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌కి చెందిన కేఎస్ జేమ్స్ అన్నారు.
పేదలు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ద్వారా ‘‘ఆరోగ్యకరమైన జనాభా పరివర్తన’’ను తీసుకొచ్చిన భారత్‌ను ఈ విషయంలో అభినందించాలని జేమ్స్ వ్యాఖ్యానించారు.
చాలా దేశాలు ముందుగా అక్షరాస్యత, జీవన ప్రమాణాల్లో మెరుగుదల సాధించిన తర్వాతే జనాభా నియంత్రణ అంశంలో పురోగమించాయని ఆయన పేర్కొన్నారు.
మరో మంచి విషయం ఏంటంటే, ప్రపంచంలో 25 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ అయిదుగురిలో ఒకరు భారతీయులే. అంతేకాదు.. భారతదేశంలో 47 శాతం జనాభా 25 ఏళ్ల లోపు వారే ఉన్నారు.
భారత్‌లోని మూడింట రెండొంతుల మంది 1990 దశకం ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత జన్మించిన వారే. ఈ కాలంలో జన్మించిన యువతకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని ఒక వార్తా పత్రికతో ఆర్థికవేత్త శ్రుతి రాజగోపాలన్ అన్నారు.
‘‘నాలెడ్జ్, నెట్‌వర్క్ గూడ్స్ ఎకానమీలో ఈ తరానికి చెందిన యువ భారతీయులే అతిపెద్ద వినియోగదారులుగా, కార్మిక వనరులుగా ఉంటారు. టాలెంట్ ఉన్న వారు ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలోనే ఉంటారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జనానికి ఉద్యోగాలు ఉంటాయా?
అధిక జనాభా నుంచి లబ్ధి పొందాలంటే పనిచేసే యువసులో ఉన్న జనాభా కోసం భారత్ తగినన్ని ఉద్యోగాలను సృష్టించాలి. కానీ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం భారత్‌లో పనిచేసే వయస్సులో ఉన్నవారిలో ప్రస్తుతం పని చేస్తున్నవారు లేదా పనిచేయాలనుకుంటున్న వారు 40 శాతం మాత్రమే.
ఎక్కువ మంది మహిళలు.. తమ పని వయస్సులో ప్రసవించడం, పిల్లలను చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తించడం వల్ల తక్కువ కాలం పాటు పనిచేస్తారు. కాబట్టి వారికి ముందుగా ఉద్యోగాలు అవసరం.
పనిచేసే వయస్సులో ఉన్న 10 శాతం మంది మహిళలు మాత్రమే భారత శ్రామిక శక్తిలో భాగంగా ఉన్నారని సీఎంఐఈ లెక్కలు చెప్తున్నాయి. చైనాలో ఈ వయసు మహిళలు 69 శాతం మంది పని చేస్తున్నారు.
భారతదేశంలో వలసలు మరో సమస్య. దాదాపు 20 కోట్ల మంది భారతీయులు పక్క రాష్ట్రాలకు లేదా జిల్లాలకు వలస వెళుతున్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. వీరిలో చాలా మంది కార్మికులు పని కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్తారు.
‘‘గ్రామాల్లో ఉద్యోగాలు లేకపోవడం, వేతనాలు తక్కువ ఉండటం వల్ల వలస వచ్చే వారితో నగర జనాభా పెరగుతుంది. వలస వచ్చే వారికి తగిన జీవన ప్రమాణాలను ఈ నగరాలు అందించగలవా? ఒకవేళ అలా చేయలేకపోతే నగరాల్లో మురికివాడలు, వ్యాధులు పెరిగిపోతాయి’’ అని కేరళ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో వలస నిపుణుడు ఎస్.ఇరుదయ రాజన్ అన్నారు.
అలాగే భారతదేశంలో బాల్య వివాహాలను ఆపటం, త్వరగా పెళ్లి చేసుకోవటాన్ని నిలువరించటం ముఖ్యమని.. జనన, మరణాలను కూడా సక్రమంగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని జనాభా నిపుణులు చెప్తున్నారు. జననాల్లో బాలికలకన్నా బాలురు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.
దేశానికి వృద్ధాప్య సమస్యలు...
భారతదేశంలో వృద్ధాప్యం గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని కూడా జనాభా నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
1947లో భారతదేశ ప్రజల సగటు వయస్సు 21 సంవత్సరాలుగా ఉండింది. ఆ సమయంలో 60 ఏళ్ల పైబడిన వారు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు.
కానీ ఇప్పుడు భారత దేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలకు పైగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 10 శాతంగా ఉంది.
రచయిత ఎస్.రుక్మిణి ‘హోల్ నంబర్స్ అండ్ హాఫ్ ట్రుత్స్: వాట్ డేటా కెన్ అండ్ కెనాట్ టెల్ అజ్ ఎబౌట్ మోడ్రన్ ఇండియా’ అనే పుస్తకం రాశారు.
‘‘పనిచేసే వయస్సు ఉన్న జనాభా తగ్గుతున్న కొద్దీ.. వృద్ధ జనాభాకు మద్దతునివ్వటం ప్రభుత్వ వనరుల మీద భారంగా మారుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















