హైదరాబాద్ కిడ్నాప్ కేసు: ఇంతకీ వారు భార్యాభర్తలా కాదా? తేలేది పోలీసు దర్యాప్తుతోనే

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మన్నెగూడ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది.
ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, అతని స్నేహితుడు రూబిన్ ఇంకా దొరకలేదని పోలీసులు ‘బీబీసీ’తో చెప్పారు.
మరోవైపు వైశాలి విదేశాలకు వెళ్లేందుకు అవసరమయ్యే జేఆర్ఈ పరీక్షకు హాజరయ్యారు.
మన్నెగూడ కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, అనేక ట్విస్టులను ఇస్తోంది. శుక్రవారం నాటి దాడి తరువాత, పోలీసులు ఇప్పటి వరకూ మొత్తం 32 మంది నిందితులను పట్టుకున్నారు.
వారందరినీ ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. వీరిలో ఎక్కువ మంది నవీన్ రెడ్డి దగ్గర పనిచేసేవారే. వారిలో వేర్వేరు రాష్ట్రాల వారు ఉన్నారు.
‘‘వారికి అసలు విషయం తెలియదు. వాళ్లంతా దాదాపుగా నవీన్ సంస్థ అయిన మిస్టర్ టీ లో పనిచేస్తారు. తనకు పెళ్లి అయ్యిందనీ, తన భార్యను వేరే వాళ్లకి ఇచ్చి పెళ్లి చేసేందుకు తన మామ ప్రయత్నిస్తున్నాడనీ, దానికి మీ సహకారం కావాలంటూ వారిని కోరాడు. వాళ్లంతా పాతికేళ్ల లోపు కుర్రాళ్లు. దీంతో వారు నవీన్ మాట విని ఆయన వెంట వెళ్లారు.’’ అని బీబీసీతో చెప్పారు ఒక పోలీసు అధికారి.
మొత్తం 37 మంది దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.
వారిలో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నవీన్, రూబిన్ సహా మరో ఐదుగురి ఆచూకీ తెలియాలి.
వారిలో మిగిలిన ముగ్గురు కంటే మొదటి ఇద్దరిదే కేసులో పెద్ద పాత్ర. ప్రస్తుతం వారి కోసం వెతుకుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ఎక్కడివక్కడే
సోమవారం మధ్యాహ్నానికి కూడా వైశాలి ఇంటి బయటి పరిస్థితి అలానే ఉంది.
ఆమె ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్కడ మిష్టర్ టీ ఆఫీసు, ఒక టీ స్టాల్ ఏర్పాటు చేశాడు.
శుక్రవారం పరిణామాల తరువాత దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు వైశాలి కుటుంబ సభ్యులు.
అటు నవీన్ ధ్వంసం చేసిన వైశాలి తరఫు వారి కార్లు ఆమె ఇంటే ముందే ఉన్నాయి.
ఇంట్లో వస్తువులు కాకుండా, బయట మూడు కార్ల అద్దాలు పగిలాయి.
అటు వైశాలి వర్గం దాడిలో తగలబడ్డ టీ స్టాల్, కూలిన రేకుల షెడ్ కూడా అక్కడే ఉంది.
ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైశాలి రాకపోకల సమయలో కూడా ఆమె వెంట ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకన్నారు రాచకొండ కమిషనర్ అధికారులు.
పరీక్ష రాసిన వైశాలి
కిడ్నాప్ నుంచి బయటపడిన తరువాత శనివారం ఉదయం పరీక్ష రాశారు వైశాలి.
హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రైవేటు టెస్ట్ సెంటర్ లో జీఆర్ఈ పరీక్షకు ఆమె హాజరయ్యారు.
పోలీసులే స్వయంగా ఆమెను బందోబస్తు మధ్య తీసుకెళ్లి, తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలారు.

ఫొటో సోర్స్, UGC
పెళ్లి అయిందా? కాలేదా?
‘‘మా అబ్బాయికి, ఆ అమ్మాయికి రెండేళ్ల పరిచయం ఉంది. తమకు పెళ్లి అయిందని కూడా చెప్పాడు. అమ్మాయి తండ్రి మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు. మాకు స్వీటు కూడా తినిపించాడు. తరువాత వద్దనుకున్నారు. విదేశీ సంబంధం వచ్చిందని మా సంబంధం వద్దనుకున్నట్టున్నారు.’’ అని మీడియాతో చెప్పారు నవీన్ తల్లి.
నవీన్ ఎల్బీ నగర్ కోర్టులో వేసిన పిటిషన్లో కూడా తమకు పెళ్లయినట్టు రాశాడు.
అయితే ఇది నిజం కాదు అంటున్నారు వైశాలి.
నవీన్ రెడ్డి తరపు వారు చెబుతున్నట్టుగా తనకు పెళ్లి కాలేదని వైశాలి అంటున్నారు.
నవీన్ తో తమకు బ్యాడ్మింటన్ ఆడే చోట పరిచయం అని చెప్పారామె.
అసలు తమకు పెళ్లి అయినట్టు వస్తున్న ఏ వార్తా నిజం కాదు అన్నారు వైశాలి.
‘మార్పింగ్ ఫోటోలను నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ ఎక్కౌంట్ ద్వారా పంపిస్తున్నాడు.
మా అమ్మానాన్న ఆరా తీసి అతనితో పెళ్లి వద్దన్నారు. నేను అదే తెలియజేశాను. కానీ అతను మాత్రం నన్ను వెంటపడి వేధిస్తున్నాడు. ఇదే మొదలు కాదు. గతంలోనే అతనిపై ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కనీసం పట్టించుకోలేదు. కోర్టులో కేసు కూడా అన్ని అసత్యాలతో వేశాడు.’’ అని మీడియాతో చెప్పారు వైశాలి.
‘‘అసలు మాకు పెళ్లి అయిందని అతను చెబుతోన్న రోజు నేను ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నాను.’’ అని అన్నారు వైశాలి.

స్పష్టత లేని ఆర్థిక సంబంధాలు
వైశాలి కుటుంబంతో నవీన్‌కి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయని తెలిసినప్పటికీ వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంలో ఎటువంటి స్పష్టతా లేదు.
నవీన్ కి చెందని కొన్ని షాపుల రిజిస్ట్రేషన్లు, స్కానింగ్ ద్వారా వాటికి వచ్చే సొమ్ము – అంతా వైశాలి తండ్రి పేరిన పెట్టాడని వార్తలు వచ్చాయి.
గతంలో నవీన్ ఫామిలీ కోర్టులో వేసిన పిటిషన్ లో కూడా ఆ విషయాలు రాశారు.
రెండు వర్గాలు ఒకరిపై ఒకరు, కోర్టులో ఒకరు, స్టేషన్లో ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో నవీన్ పై వైశాలి ఫిర్యాదు చేయగా, ఎల్బీ నగర్ ఫామిలీ కోర్టులో వైశాలిను కాపురానికి పంపాలంటూ నవీన్ పిటిషన్ వేశారు. కానీ ఆ ఫిర్యాదులో, పిటిషన్లో పేర్కొన్న వాటిలో ఎన్ని వాస్తవాలు అనే దిశగా పోలీసుల విచారణ సాగుతోంది. అలాగే వారి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా విచారణ సాగుతోంది.
ఎన్ఆర్ఐ సంబంధం సమస్య?
ప్రస్తుతం గొడవ కంటే ముందే, నవీన్ – వైశాలి కుటుంబం మధ్య రెండు మూడు సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు అయినట్టుగా స్థానికులు చెప్పారు.
ఆ క్రమంలోనే వైశాలి కుటుంబాన్ని గట్టిగా బెదిరించాలని నవీన్ ప్లాన్ చేశాడని పోలీసుల అంచనా.
అదే సమయంలో ఒక పెళ్లి సంబంధం విషయంలో వైశాలి కుటుంబం ముందుకు వెళ్లడం నవీన్ తక్షణ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.
తాను కూడా విదేశాలకు వెళ్లడం కోసం వైశాలి సన్నద్ధం అవుతోంది.
ఆ క్రమంలోనే జీఆర్ఈ వంటి పరీక్షలకు హాజరయ్యారు.
ఆ క్రమంలో పెళ్లి నిశ్చితార్థం రోజు నవీన్ ఘర్షణకు దిగాడని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పార్లమెంటుపై దాడికి 21 ఏళ్లు: మిలిటెంట్ల దాడి నుంచి భారత ప్రధాని, ఎంపీలు ఎలా బయటపడ్డారంటే
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











