మావోయిస్టులతో గెరిల్లా పోరాటం చేస్తున్న మహిళా పోలీస్ కమాండోలు...

వీడియో క్యాప్షన్, వాళ్లు మగవారితో సమానంగా సత్తా చాటుతున్నారంటున్న అధికారులు
మావోయిస్టులతో గెరిల్లా పోరాటం చేస్తున్న మహిళా పోలీస్ కమాండోలు...
మహిళా పోలీస్ కమాండోలు
    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.

ఈ ఘటన బీజాపుర్ జిల్లా తిమ్మేనార్‌లో జరిగిందని జిల్లా ఎస్‌పీ అంజనేయ వార్ష్‌ణేయ్ తెలిపారు. మరోవైపు, ఇదే ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో ఒక మహిళా నక్సలైటు సరెండర్ అయినట్టు పోలీసులు ప్రకటించారు.

పోలీసు, పారా మిలిటరీ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగే ఎదురుకాల్పుల ఘటనల్లో మహిళా మావోయిస్టుల ప్రస్తావన తరచూ వస్తూ ఉంటుంది.

అయితే, ఇప్పుడు భద్రతా బలగాల వైపు నుంచి కూడా మహిళలు రంగంలోకి దిగారు.

బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో పని చేస్తున్న మహిళా పోలీసు కమాండోలపై బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న ప్రత్యేక కథనం.

‘‘ఇంట్లో వాళ్లు పోలీసుల్లో చేరొద్దన్నారు. ఎందుకంటే, మా ఊరు చాలా లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. నక్సలైట్లకు తెలిస్తే, చాలా నష్టం చేస్తారన్నారు. నాకు ఉద్యోగం వచ్చాక నేను సుక్మాలోనే ఉంటున్నాను. ఇంటికి ఎప్పుడూ వెళ్లలేదు. మా ఇంట్లో వాళ్లు ఇక్కడికి వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు’’ అని మహిళా పోలీసు కమాండో పూనమ్ బీబీసీతో చెప్పారు.

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య అనేక హింసాత్మక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది ఈ ప్రాంతం. మావోయిస్టుల మహిళా దళాలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు రాష్ట్ర పోలీసు విభాగం కూడా స్థానిక మహిళలను చేర్చుకుంటోంది. వారికి గెరిల్లా యుద్ధంలో శిక్షణనిచ్చి పోరాటంలో దించుతోంది. ట్రెయినింగ్ తర్వాత ఈ మహిళా కమాండోలను బస్తర్ ప్రాంతంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమిస్తున్నారు.

ఇప్పటి వరకూ పురుష కమాండోలు మాత్రమే నిర్వర్తిస్తూ వచ్చిన విధులన్నీ ఇప్పుడు ఈ మహిళా కమాండోలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది మారుమూల గ్రామాలకు చెందిన వారు. వీరికి తమ సొంతూరు వెళ్లటం కూడా కష్టమే.

‘‘నక్సలిజం మంచిది కాదు. మరింత ఎక్కువ మంది పోలీసుల్లో చేరితే అంత ఎక్కువగా నక్సలిజాన్ని అంతం చేయొచ్చు. అప్పుడే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. ఎప్పుడు, ఎవరు వచ్చి మాపై దాడి చేస్తారో అనే భయాల్లో బతకాల్సిన పని ఉండదు’’ అని మహిళా పోలీసు కమాండో పూనమ్ అభిప్రాయపడ్డారు.

‘‘ఇప్పుడు క్యాంపులు ఏర్పాటవుతున్నాయి. అయితే, ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంటు లేదు. నీటి సరఫరా లేదు. మొదట్లో నేను పోలీసులంటే చాలా భయపడేదాన్ని. నాది చింతల్‌నార్ గ్రామం. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కానీ పోలీసుల సంఖ్య చాలా తక్కువ. సల్వాజుడుం మొదలయ్యాక పోలీసుల సంఖ్య బాగా పెరిగింది. అప్పటి నుంచే నాకు పోలీసునవ్వాలనే కోరిక కలిగింది’’ అని ఆమె తెలిపారు.

మహిళా పోలీస్ కమాండోలు

ఈ టీమ్‌లో భాగమైన మహిళా కమాండోల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకం అనుభవం.

‘‘మేం మొదటిసారి పోలీసు క్యాంపులోపలికి వెళ్లినప్పుడు భయపడ్డాం. మాకది కొత్త కావడంతో చాలా భయపడ్డాం. స్థానిక పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లపై వెళ్లినప్పుడు కూడా భయమేసేది. ఫైరింగ్ చప్పుడు వినిపించినా భయం వేసేది. మేం ఓసారి ఎర్మగుండకు వెళ్లినప్పుడు అలాగే జరిగింది. మాపై ఫైరింగ్ జరిగింది. ఎదురు కాల్పులు జరిపాం’’ అని అనుసూయ సోరీ అనే మరో మహిళా పోలీస్ కమాండో వివరించారు.

‘‘నేను పోలీసునవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు టీచరు కావాలని ఉండేది. కానీ పోస్టులు పడగానే దీనికి అప్లై చేసుకున్నాను. అలా ఇక్కడికి వచ్చాను’’ అని తెలిపారామె.

‘‘మేం గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మాకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మహిళలు పోలీసు శాఖలో పని చేయలేరు అని మొదట్లో అందరూ అనుకునేవారు. మొదట్లో మహిళలు మమ్మల్ని విచిత్రంగా చూసేవారు. కానీ ఇప్పుడు అందరూ మమ్మల్ని బాగా చూస్తున్నారు’’ అని అనుసూయ సోరీ చెప్పారు.

ఇళ్లలో చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికొచ్చి తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా కమాండోలు కూడా వీరిలో ఉన్నారు.

‘‘నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పాపకు ఏడాది. పెద్ద పాపకు 11 ఏళ్లుంటాయి. ఉదయం 4 గంటలకే నిద్ర లేచి నేను ఇద్దరు పిల్లల పనులన్నీ పూర్తి చేస్తాను. పెద్ద పాపకు లంచ్ బాక్స్, టిఫిన్.. చిన్న పాపకు పాలు తాగించడం వంటి పనులన్నీ పూర్తి చేయాలి. చాలా కష్టంగా ఉంటుంది’’ అని ఇంకో మహిళా పోలీస్ కమాండో మీనా కశ్యప్ తెలిపారు.

మహిళా పోలీస్ కమాండోలు
ఫొటో క్యాప్షన్, ‘నా మొట్టమొదటి డ్యూటీ.. నా కమాండో భద్రత’ అంటున్నారు సుక్మా జిల్లా పోలీస్ సూపరింటిండెంట్ పారుల్ అగ్రవాల్

ఇక మహిళా కమాండోలకు నేతృత్వం వహించడం చాలా సవాళ్లతో కూడుకున్న పని.

‘‘నా మొట్టమొదటి డ్యూటీ.. నా కమాండో భద్రత. మేం నక్సల్ ఆపరేషన్ లేదా క్యాంప్ ఎస్టాబ్లిష్‌మెంట్ పనిపై వెళ్లేటప్పుడు ముందుగా వీరి ఫిట్నెస్‌ను చూడాల్సి ఉంటుంది. వీరు అక్కడ ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వీరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి. రెండోది – వీళ్లకు భద్రత ఉండేలా చూస్తాం. వీరికి చాలా మంచి ట్రెయినింగ్ ఇస్తాం’’ అని సుక్మా జిల్లా పోలీస్ సూపరింటిండెంట్ పారుల్ అగ్రవాల్ చెప్పారు.

‘‘ఈ కమాండోలకు పోరాడే వ్యూహం, ఆయుధాల ప్రయోగంతో పాటు సాంకేతికత కూడా నేర్పిస్తాం. అడవుల్లో ఎలా నడవాలో చెబుతాం. ముందుగా ఇక్కడి భౌగోళిక పరిస్థితినంతా బాగా అర్థం చేయిస్తాం. ఎలాంటి సవాళ్లు ఎదరవుతాయో, నక్సల్స్ ఎలాంటి ఎత్తుగడలు పన్నుతారో చెబుతాం’’ అని ఆమె తెలిపారు.

‘‘ఇది యుద్ధరంగం. కచ్చా రోడ్ల మీద మందుపాతరలు ఉండొచ్చు. మావోయిస్టులు మాటువేసి ఉండొచ్చు. వాటికి తగినట్టుగానే మేం వ్యూహాల్ని రచిస్తాం. మొదట్లో నక్సలైట్లతో పోరాడటానికి పురుషులే వెళ్లేవారు. మహిళా ఉద్యోగులు హెడ్‌క్వార్టర్లకు, కార్యాలయాలకు పరిమితమయ్యేవారు. కానీ పోరాటంలో పురుషులు, మహిళలు సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారని మేం గ్రహించాం’’ అని ఎస్‌పీ వివరించారు.

‘‘నాకు కుకింగ్ అంటే ఇష్టం. 90 దశాబ్దం నాటి పాత పాటలు వినడం అంటే ఇష్టం. ఈ రైఫిల్ బరువు దాదాపు నాలుగు కిలోలుంటుంది. నేను 7 కిలోల వరకూ బరువున్న రైఫిల్స్ ఉపయోగించాను. ఇంటినీ, ఉద్యోగాన్నీ సమానంగా నిర్వర్తించగలిగేది మహిళలు మాత్రమే’’ అంటున్నారామె.

మహిళా పోలీస్ కమాండోలు

గెరిల్లా యుద్ధంలో, నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లలో మహిళా కమాండోలు అద్భుతంగా పని చేస్తున్నారని ఉన్నతాధికారులు అంటున్నారు.

‘‘నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లలో మహిళా కమాండోలను ఏ మేరకు ఉపయోగించాలనే విషయంలో మొదట్లో మాలో సందిగ్ధత ఉండేది. కానీ.. ఈ మహిళా కమాండోలు స్వయంగా ముందుకు వచ్చారు. బస్తర్‌లో సానుకూల పరిస్థితి నెలకొనాలంటే నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొనే అవకాశం మాక్కూడా ఇవ్వండని అన్నారు. వారిలో ఆసక్తిని గమనించాకే మేం వారికి గెరిల్లా యుద్ధంలో అదనపు శిక్షణ, ఆధునిక ఆయుధాల వాడకంలో శిక్షణ, యుద్ధ వ్యూహాల్లో తర్ఫీదు అందించాం’’ అని బస్తర్ డివిజన్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ బీబీసీకి చెప్పారు.

‘‘నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లలో ఇప్పుడు పురుష పోలీసులు ఎలా పని చేస్తున్నారో వారితో సమానంగా మహిళా కమాండోలు కూడా పని చేస్తున్నారు. నక్సల్ ఆపరేషన్లలో కొన్ని రోజుల పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. వీరికి ఏ బాధ్యతలు అప్పగించినా, సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.

బస్తర్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మవోయిస్టులకు మధ్య సంఘర్షణ కొత్తదేం కాదు. కానీ ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు చెందిన ఈ మహిళా కమాండోలు ఇప్పుడు ఈ సంఘర్షణ నియమాల్ని మారుస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ భవితవ్యంపై గద్దర్ ఆలోచనలేమిటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)