కరోనా: బీఎఫ్7.. ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎంత డేంజరస్

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BF.7 కేసులు మూడు బయటపడ్డాయి.
ప్రస్తుతం చైనాలో పెరుగుతున్న కోవిడ్ 19 కేసులకు కారణం ఈ వేరియంటే.
మొదటి BF.7 కేసు అక్టోబర్‌లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో వెలుగులోకి వచ్చిందని, ఇప్పటివరకు గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదైందని అధికారులు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.
గుజరాత్‌లో ఈ సబ్‌వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు కోలుకున్నారని గుజరాత్ ఆరోగ్య శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిపుణులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న ట్రెండ్ కనిపించట్లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించాారు.
అలాగే, ఇప్పటికే ఉన్న వేరియంట్లనూ, కొత్త వాటినీ ట్రాక్ చేస్తూ, పరిస్థితిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, YALCINSONAT1
ఈ కొత్త సబ్‌వేరియంట్ ఏమిటి?
వైరస్ పరివర్తన చెందినప్పుడల్లా ఒక కొత్త వర్గం, ఉప వర్గంగా రూపాంతరం చెందుతుంది. BF.7 అంటే ఇంతకు ముందు వచ్చిన BA.5.2.1.7 వేరియంట్ నుంచి పరివర్తన చెందిందే. ఇది ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BA.5 నుంచి పరివర్తన చెందిన రకం.
ఈ నెల 'సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్' అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఈ కొత్త వేరియంట్ చాలా బలహీనమైనది.
అంటే వ్యాక్సీన్ తీసుకున్నవాళ్లపై ఇది ఎక్కువ ప్రభావం చూపదు.
అయితే, ఈ సబ్‌వేరియంట్ కారణంగానే ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసులు తీవ్రమవుతున్నాయని చెబుతున్నారు.
ఈ వేరియంట్ వేగంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తోందని అంటున్నారు.
ఇంతకుముందు కరోనా సోకినవారికి, వ్యాక్సీన్ తీసుకున్నవారికి కూడా ఈ సబ్‌వేరియంట్ సోకవచ్చని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పరిస్థితి ఏమిటి?
ఈ సబ్‌వేరియంట్ కేసులు చాలా దేశాల్లో వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ సహా పలు దేశాలో కేసులు బయటపడుతున్నాయి.
అక్టోబర్‌లో, అమెరికాలో మొత్తం కోవిడ్ కేసుల్లో BF.7 కేసులు 5 శాతంగా ఉండగా, బ్రిటన్‌లో 7.26 శాతం ఉన్నాయి.
పశ్చిమ దేశాల్లో ఈ సబ్‌వేరియంట్ సంక్రమణను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆధారాలు కనిపించలేదు.
2022 జనవరిలో నమోదైన కరోనా కేసుల్లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌లు BA.1, BA.2 ఎక్కువగా కనిపించాయి. దీని తరువాత BA.4, BA.5 వంటి సబ్‌వేరియంట్‌లు వచ్చాయి కానీ, అవి ఐరోపా దేశాలలో విజృంభించినంతగా భారతదేశంలో లేవు.
చైనాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
కోవిడ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అధిపతి వీకే పాల్ మాట్లాడుతూ, కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, తగినన్ని పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. జనం గుంపుగా ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించాలని సూచించారు.
దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా సీనియర్ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రి ట్వీట్ చేస్తూ, "కోవిడ్ ఇంకా ముగియలేదు" అని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వేరియంట్‌లు, సబ్‌వేరియంట్‌లను గుర్తించడానికి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక విలేఖరుల సమావేశంలో చైనాలో కోవిడ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
"చైనాలో ఎక్కువ రిస్క్ ఉన్నవారికి టీకాలు అందించడంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి పెడుతోంది. అయితే, పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడానికి మాకు మరింత సమాచారం కావాలి" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?
- హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?
- డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ
- కుల్దీప్ యాదవ్: బాగా ఆడుతున్నప్పటికీ ఈ క్రికెటర్‌కు భారత జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదు?
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’












