కరోనా లాక్‌డౌన్ విధించే ముందు ప్రధాని మోదీ ఎవరినైనా సంప్రదించారా? ఆర్టీఐ దరఖాస్తుకు పీఎంఓ సమాధానం ఏంటి?

కరోనా లాక్‌డౌన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2020 మార్చి 24... మంగళవారం... రాత్రి 8 గంటల సమయంలో..

ప్రధాని నరేంద్ర మోదీ టీవీ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.

మరి లాక్‌డౌన్ నిర్ణయాన్ని వెల్లడించే ముందు ప్రధాని మోదీ ఎవరినైనా సంప్రదించారా? ఎవరి సలహానైనా తీసుకున్నారా? ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) అడిగింది బీబీసీ. కానీ సమాచారం ఇచ్చేందుకు పీఎంఓ నిరాకరించింది.

దీనిపై అప్పీలు చేయగా... 'మరోసారి మీ నిర్ణయాన్ని సమీక్షించండి' అంటూ పీఎంఓను ఆదేశించింది సెంట్రల్ ఇన్ఫరేషన్ కమిషన్(సీఐసీ). అంతేకాదు సంబంధిత సమాచారాన్ని పాయింట్ల మాదిరిగా అందించాలని సూచించింది.

ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం ఇచ్చేందుకు పీఎంఓ నిరాకరించడం సరికాదని, సమాచార హక్కు చట్టానికి అది వ్యతిరేకమని సీఐసీ వ్యాఖ్యానించింది.

లాక్‌డౌన్‌తో నడిచి వెళ్తున్న కార్మికులు

బీబీసీ అప్పీలు ప్రకారం చీఫ్ ఇన్ఫరేషన్ కమిషనర్ వైకే సిన్హా జులై 11న ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి 2020 నవంబరులో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశాం.

లాక్‌డౌన్ విధించే ముందు నిర్వహించిన సమావేశాల గురించి సమాచారాన్ని ఆ దరఖాస్తు ద్వారా అడిగాం. ఏయే అధికారులు, మంత్రులు, నిపుణులను సంప్రదించారు? రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముందుగానే సమాచారం ఇచ్చారా? అనే ప్రశ్నలను కూడా ప్రస్తావించాం.

కానీ సమాచార హక్కు చట్టం సెక్షన్ 7(9) ప్రకారం సమాధానం ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. దీని మీద చేసిన అప్పీలును కూడా తిరస్కరించింది. దాంతో చీఫ్ ఇన్ఫరేషన్ కమిషనర్ వద్ద బీబీసీ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ విచారిస్తూనే సంబంధిత సమాచారం దరఖాస్తుదారునికి ఇవ్వాల్సిందిగా పీఎంఓను ఆదేశించింది సీఐసీ.

ఆర్టీఐ దరఖాస్తు

'అధికారయంత్రాంగం వనరులు చాలా ఎక్కువ స్థాయిలో అవసరమైనప్పుడు... రికార్డ్ భద్రత, దాని రక్షణ ప్రమాదంలో పడుతున్నప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో దరఖాస్తుదారు అడిగిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి' అని ఆర్టీఐ యాక్ట్‌లోని సెక్షన్ 7(9) చెబుతోంది.

సమాచారం ఇవ్వడం గురించి ఈ సెక్షన్ చెబుతోంది కానీ సమాచారం ఇవ్వొద్దంటూ ప్రభుత్వ విభాగాలకు ఇది మినహాయింపు ఇవ్వడం లేదు.

లాక్‌డౌన్ నిర్ణయం గురించి మీకు సమాచారం ఉందా? లేదా? అంటూ కేంద్ర హోంశాఖకు కూడా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశాం. 2020 డిసెంబరులో ఒకసారి, 2021 జనవరిలో మరొకసారి వేశాం. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంది? ఎలాంటి సలహాలు ఇచ్చింది? అనేది సమాచారాన్ని కూడా కోరాం.

కానీ కేంద్ర హోంశాఖ కూడా అడిగిన సమాచారం ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) కింద తిరస్కరించింది.

ఆర్టీఐ దరఖాస్తు
ఆర్టీఐ దరఖాస్తు

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశభద్రతలకు ప్రమాదకరంగా ఉండే సమాచారం... వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగే సమాచారం... విదేశీ సంబంధాలను ప్రభావితం చేసే సమాచారం... నేరాలను ప్రేరేపించే సమాచారం... వంటి వాటిని సెక్షన్ 8(1) కింద ఇవ్వక్కర్లేదు.

సెక్షన్ 8(1)(జె) ప్రకారం... ప్రజా ప్రయోజనాలకు సంబంధంలేని వ్యక్తిగత సమాచారం లేదా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే సమాచారాన్ని ఇవ్వనక్కర్లేదు.

కేంద్ర వైద్య, కార్మిక, ఆర్థిక, హోంశాఖలతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) వంటి వాటికి పంపిన 240కి పైగా దరఖాస్తుల్లో ఈ ఆర్టీఐ పిటీషన్ ఒకటి.

ఆర్టీఐ దరఖాస్తు

ప్రధాని నరేంద్ర మోదీ 2020 మార్చి 24న లాక్‌డౌన్ విధించే ముందు కేంద్ర మంత్రిత్వశాఖలు ఎలాంటి సన్నాహాలు చేపట్టాయో తెలుసుకునేందుకు ఆరు నెలలపాటు ప్రయత్నం చేశాం. లాక్‌డౌన్ అమలు చేయడానికి నాలుగు గంటల ముందు మాత్రమే ప్రధాని ఆ నిర్ణయాన్ని ప్రకటించారు.

ప్రధాని లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించే ముందు నిపుణుల సలహాలు తీసుకున్నట్లు కానీ సంబంధిత విభాగాలను సంప్రదించినట్లు కానీ మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

లాక్‌డౌన్‌తో రిక్షాలో వెళ్తున్న కార్మికులు

ఫొటో సోర్స్, NUR PHOTO

ఎన్‌డీఎంఏ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం లాక్‌డౌన్ విధించే ముందు వారిని కూడా ప్రధాని సంప్రదించలేదని అర్థమవుతోంది. ఎన్‌డీఎంఏకు ప్రధాని చైర్మన్‌గా ఉన్నారు. ప్రధాని లాక్‌డౌన్ ప్రకటించే నాటికి దేశంలో 519 కరోనా కేసులు ఉండగా 9 మంది చనిపోయారు.

అయితే అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. నాడు దేశవ్యాప్తంగా అనేక మంది కూలీలు, కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కష్టపడ్డారు. ఎండలో కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లారు. చాలా మంది పనిలేక ఉపాధి కోల్పోయారు.

వీడియో క్యాప్షన్, భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: ఒడిశాలోని ఆమె స్వగ్రామం ఎలా ఉంది.. అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)