ఆస్ట్రేలియా: పింక్ కలర్‌లోకి మారిపోయిన ఆకాశం.. ప్రపంచానికి అంతమేమోనని భయపడిన ప్రజలు.. ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Nikea Champion
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
అనగనగా ఒక పట్టణం... ఆ పట్టణంలో ఒక సాయంత్రం... మసక మసక చీకట్లు ముసురుకుంటున్న వేళ ఆకాశం ఒక్కసారిగా గులాబి రంగులోకి మారిపోయింది.
అక్కడి వాళ్లు ఆకాశాన్ని నీలంగా ఉన్నప్పుడు చూశారు... నల్లగా ఉన్నప్పుడు చూశారు... ఎర్రగా మారినప్పుడు కూడా చూశారు. కానీ ఇలా గులాబి రంగులో ఎన్నడూ చూడలేదు.
అందుకే కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు ఆందోళన చెందారు. ఇంకొందరు జీవితంలో ఇదే చివరి రోజు అన్నంతగా భయపడ్డారు కూడా.
గ్రహాంతరవాసులు భూమి మీదకు దండయాత్రకు వచ్చారా? లేక గ్రహశకలాలు ఏమైనా పడుతున్నాయా? మరికొందరిలో అంతులేని సందేహం.
కిటికీ నుంచి ఆకాశాన్ని తదేకంగా చూస్తున్న ఒక తల్లి, మనసులో భయపడుతున్నా లేని ధైర్యం తెచ్చుకుని పిల్లలకు మాత్రం ధైర్యం చెబుతున్నారు.
'ఒకవేళ ఇదే మానవాళికి అంతం అయితే ఎలా? చివరిసారిగా నాకిష్టమైన టీ తాగుతా...' అనుకుంటూ ఒకామె కిచెన్‌లోకి దూరారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఆకాశం గులాబి రంగులోకి మారడానికి... అక్కడి జనాలు అంతలా భయపడటానికి కారణం ఒక గంజాయి తోట.
గంజాయి తోటకు ఆకాశం రంగుకు సంబంధం ఏంటాని ఆశ్చర్యపోతున్నారా? పదండి తెలుసుకుందాం...
ఇంతకు ముందు అనగనగా ఒక పట్టణం అనుకున్నాం కదా... అదే మిల్డురా. ఆస్ట్రేలియాలోని నార్తరన్ విక్టోరియాలో ఉంటుంది ఆ సిటీ. ఆ సిటీలో గంజాయి తోటలు పెంచుతారు.
అయ్యో! గంజాయి పండిస్తే పోలీసులు పట్టుకోరా అనే అనుమానం రావొచ్చు. కానీ అది ఆస్ట్రేలియా. అక్కడ వైద్యపరమైన అవసరాల కోసం గంజాయి పండించడంలో తప్పులేదు. అందుకు 2016లో ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది.
గంజాయి పండించడం చట్టబద్ధమే అయినా ఆ తోటలు ఉండే ప్రాంతాలను మాత్రం చాలా రహస్యంగా ఉంచుతారు. భద్రతా కారణాల రీత్యా ఆ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడతారు. అంటే తమ చుట్టుపక్కల గంజాయి పండిస్తున్నారనే విషయం అక్కడి ప్రజలకు కూడా తెలియదు. అంతలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు.
కానీ ఎంత రహస్యమైనా చిన్న తప్పుతో బయటిపడిపోతుంది. ఇక్కడా అదే జరిగింది.

ఫొటో సోర్స్, Google
గంజాయి బాగా ఏపుగా పెరగడానికి ఎరుపు గులాబి వర్ణంలో ఉండే కాంతిని వాడతారు. అందుకు సంబంధించిన లైట్లను మొక్కల మధ్య ఏర్పాటు చేస్తారు.
మరి లైట్లు ఆన్‌లో ఉంటే రాత్రి పూట చుట్టుపక్కల వాళ్లకు కనిపిస్తుంది కదా... అలా గంజాయి తోట ఉన్న లొకేషన్ తెలిసిపోతుంది కదా... అందుకే చీకటి పడగానే మొక్కలను పెంచే ఎన్‌క్లోజర్స్‌ను నల్లని తెరలతో మూసేస్తారు. మళ్లీ పొద్దున్నే వాటిని తొలగిస్తారు.
కానీ మిల్డురా పట్టణంలో బుధవారం సాయంత్రం కాన్ గ్రూప్‌కు చెందిన తోటలో ఒక టెక్నికల్ లోపం తలెత్తింది. గంజాయి మొక్కల ఎన్‌క్లోజర్స్ మీద నల్లటి తెరలను కప్పే సిస్టమ్ పని చేయలేదు.

ఇంకేముంది గంజాయి తోటలు కొన్ని ఎకరాల్లో ఉంటాయి... వాటిలో గులాబి రంగు కాంతిని వెదజల్లే అనేక లైట్లు ఉంటాయి... దాంతో అక్కడి ఆకాశమంతా గులాబి రంగును సంతరించుకుంది.
కానీ ఆకాశంలో దట్టంగా రంగు అలుముకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం బాగా మబ్బులు పట్టి ఉన్నాయి. దాంతో ఆ మబ్బుల మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అవడం వల్ల కాంతి ఘాడత బాగా పెరిగింది. దాన్ని చూసే అక్కడి ప్రజలు భయపడ్డారు.
చివరకు విషయం తెలుసుకున్న ఆ పట్టణ వాసులు ఊపిరి పీల్చుకోవడమే కాదు హాయిగా నవ్వుకున్నారు కూడా. అంతేనా అప్పుడప్పుడు ఇలా రాత్రి పూట ఆ లైట్స్‌ను వెలిగిస్తూ ఉండాలని గంజాయి పండించే కంపెనీని కోరారు కూడా.
ఇదండి ఆస్ట్రేలియా ప్రజలను భయపెట్టిన గంజాయి తోట కథ.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: పోలవరం ముంపు మండలాల ప్రజల పరిస్థితి ఏమిటి? ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?
- ‘ప్రభుత్వ కార్యక్రమంలో హిందూమత పూజలు ఎందుకు చేయిస్తున్నారు? పూజారి ఉంటే.. ఫాదర్, ఇమామ్ ఎక్కడ?’ - భూమి పూజను ఆపించిన డీఎంకే ఎంపీ
- ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














