కోవిడ్-19 బీఎఫ్ 7: వ్యాక్సీన్ వేసుకోవాలా వద్దా? రెండేళ్ల తర్వాత టీకా దుష్ప్రభావాల గురించి మనకు ఎంత తెలుసు

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆండ్రే బీర్‌నత్
    • హోదా, బీబీసీ న్యూస్

లండన్ సైన్స్ మ్యూజియం ఎగ్జిబిషన్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ అభివృద్ధి, పంపిణీలపై ప్రత్యేక ప్రదర్శన కనిపిస్తోంది.

ఇక్కడి ఒక షెల్ఫ్‌లో సిరంజి, వ్యాక్సీన్ సీసా, కార్డుబోర్డు ట్రే ఉన్నాయి. వీటిని 2020, డిసెంబరు 8న 90 ఏళ్ల మార్గరెట్ కీనన్‌కు వ్యాక్సీన్ ఇచ్చినప్పుడు ఉపయోగించారు. క్లినికల్ ట్రయల్స్‌ తర్వాత ఇక్కడ తొలి టీకా వేసుకున్నది కీనన్?

ఆ తర్వాత, 1300 కోట్ల డోసులను ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చారు. దీనిలో బూస్టర్ డోసులు, కరోనావైరస్‌ కొత్త వేరియంట్ల పోరాడే అప్‌డేటెడ్ ఇమ్యునైజర్లు కూడా ఉన్నాయి.

ఈ రెండేళ్లలో మనం కోవిడ్-19 వ్యాక్సీన్ల గురించి ఏం నేర్చుకున్నాం. ఈ వ్యాక్సీన్ల సామర్థ్యం గురించి డేటా ఏం చెబుతోంది. దుష్ప్రభావాల గురించి ఏం తెలిసింది?

క్లుప్తంగా చెప్పాలంటే, పెద్దసంఖ్యలో ప్రజలు ఆసుపత్రిపాలు కాకుండా, పెద్దయెత్తున మరణాలు సంభవించకుండా కోవిడ్-19 వ్యాక్సీన్లు రక్షణ కల్పించాయి. ఇవి లేకుంటే కోవిడ్-19 సంక్షోభం చాలా ఎక్కువగా ప్రభావం చూపించేది.

మరోవైపు తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదుగా కనిపించినట్లు ఆరోగ్య నిపుణులు గుర్తించారు.

కోవిడ్-19 వ్యాక్సీన్లు

దుష్ప్రభావాలు ఏమిటి?

ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సీన్ డోసులు చేరినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

అత్యంత వేగంగా వ్యాపించేందుకు కారణమైన ఒమిక్రాన్ లాంటి వేరియంట్ల విషయంలోనూ ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరకుండా లేదా చనిపోకుండా ఈ వ్యాక్సీన్లు అడ్డుకున్నాయి.

‘‘అసలు వ్యాక్సీన్లే లేకపోతే ఏం జరిగి ఉండేది?’’అని ప్రశ్నతో అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు ఒక సర్వే చేపట్టారు.

వ్యాక్సీన్లు లేకపోతే గత రెండేళ్లలో ఒక్క అమెరికాలోనే 1.85 కోట్ల మంది అదనంగా ఆసుపత్రుల్లో చేరేవారని, 32 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యేవని వెల్లడైంది.

అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల 1.15 ట్రిలియన్ డాలర్ల నిధులు ఆదా అయినట్లు తేలింది. ఒకవేళ వ్యాక్సీన్లు లేకపోతే చికిత్సల కోసం ఈ నిధులు ప్రజలు ఖర్చుపెట్టాల్సి వచ్చేది.

కోవిడ్-19 వ్యాక్సీన్లు

ఫొటో సోర్స్, Getty Images

‘‘2020 డిసెంబరు 12 నుంచి 8.2 కోట్ల ఇన్ఫెక్షన్లు, 48 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరడం, 7,98,000 మరణాలు అమెరికాలో సంభవించాయి. అంటే ఇక్కడ వ్యాక్సినేషన్ లేకపోతే మొత్తం కేసులు 1.5 రెట్లు ఎక్కువగా ఉండేవి, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య 3.8 రెట్లు పెరిగేది, మరణాలు అయితే 4.1 రెట్లు ఎక్కువగా ఉండేవి’’అని ఆ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు వెల్లడించారు.

‘‘కోవిడ్-19 వ్యాక్సీన్లు చాలా మంది ప్రాణాలు కాపాడాయి’’అని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ఇమ్యునైజేషన్ (ఎస్‌బీఐఎం) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇసబెల్లా బల్లలాయ్ చెప్పారు.

కోవిడ్-19 వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. వ్యాక్సీన్లు ఎలా మెరుగ్గా పనిచేశాయో ఇక్కడి పరిస్థితులను చూసి అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ జనవరి 2021లో తొలి టీకాలకు ఆమోదం లభించినప్పుడు.. కరోనావైరస్ కేసులు విపరీతంగా ఉండేవి.

గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల మధ్యలో కోవిడ్-19 మరణాలు రోజుకు 3,000కుపైనే ఉండేవి. మరోవైపు కొత్త కేసులు కూడా రోజుకు 72,000 ఉండేవని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ సెక్రటరీస్ సమాచారం చూస్తే తెలుస్తుంది.

అయితే, ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ వ్యాక్సినేషన్ స్థాయిలు పెరిగాయి. దీంతో క్రమంగా మరణాల సంఖ్య కూడా తగ్గింది.

అయితే, 2022 జనవరిలో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసులు పెరిగాయి. అయితే, అప్పుడు మరణాలు రోజుకు 950 మాత్రమే ఉండేవి. ఇదివరకటి గరిష్ఠ మరణాల్లో ఇది మూడో వంతు మాత్రమే.

కోవిడ్-19 వ్యాక్సీన్లు

ఫొటో సోర్స్, Getty Images

దుష్ప్రభావాలు ఏమిటి?

‘‘రోజులు గడిచేకొద్దీ ఇక్కడ కోవిడ్-19 వ్యాక్సీన్లు తీసుకున్న ప్రజల సంఖ్య పెరిగింది. దీంతో ప్రజల్లో కూడా భరోసా పెరిగింది’’అని ఇసబెల్లా చెప్పారు.

మరోవైపు కోవిడ్-19 వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా ఆరోగ్య ప్రాధికార సంస్థ, ప్రజారోగ్య సంస్థలు జాగ్రత్తగా గమనించాయి.

తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదుగా కనిపించాయని బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) వెల్లడించింది. సాధారణ దుష్ప్రభావాలు ఏమిటంటే.. ఇంజెక్షన్ తీసుకున్నచోట నొప్పి, అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, జబ్బు చేసినట్లు అనిపించడం..

‘‘చాలా దుష్ప్రభావాలు స్వల్ప తీవ్రతతోనే కనిపించాయి. గరిష్ఠంగా వారం రోజుల్లోనే ఇవి తగ్గాయి’’అని బ్రిటిష్ ప్రభుత్వం వెల్లడించింది.

మరి తీవ్రమైన దుష్ప్రభావాల మాటేమిటి? నంబర్లు ఏం చెబుతున్నాయి? దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)లో చూడొచ్చు.

వీడియో క్యాప్షన్, వ్యర్థాల సమస్యను మహమ్మారి మరింత పెంచిందంటున్న ఓ అధ్యయనం

సీడీసీ సమాచారం ప్రకారం, తీవ్రమైన దుష్ప్రభావాల కేసుల్లో ఎక్కువగా ఎలాంటి సమస్యలు కనిపించాయంటే..

  • అనఫిలాక్సిస్ (వ్యాక్సినేషన్ తర్వాత తీవ్రమైన అలర్జీ): పది లక్ష మందిలో ఐదు కేసులు ఇలాంటివి వచ్చాయి.
  • జాసెన్ వ్యాక్సీన్ థ్రోంబోసిస్: పది లక్షల మందిలో నాలుగు కేసులు ఇలాంటివి వచ్చాయి.
  • గులియన్ బారె సిండ్రోమ్: దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే, 50 ఏళ్లకు పైబడిన పురుషుల్లో ఈ లక్షణాలు కనిపించాయి.
  • మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ (హార్ట్ ఇన్‌ఫ్లమేషన్): ఫైజర్ వ్యాక్సీన్ తీసుకున్న 12 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల్లో ప్రతి 7 కోట్ల మందిలో ఒకరిలో ఇది కనిపించింది. 16 నుంచి 17 ఏళ్ల పిల్లల్లో పది కోట్ల మందిలో ఒకరికి, 18 నుంచి 24 ఏళ్ల వయసులో పది లక్షల కేసుల్లో 52.4 కేసులు కనిపించాయి.
వీడియో క్యాప్షన్, ఈ 11 ఏళ్ళ అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది...

మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ కేసుల్లో చాలావరకు మందులతో నయం అయ్యాయని, కొన్ని రోజుల విశ్రాంతితో పరిస్థితులు మెరుగు పడ్డాయని సీడీసీ వెల్లడించింది.

ఇక మరణాల విషయానికి వస్తే, అమెరికాలో 2022 డిసెంబరు 7నాటికి 65.7 కోట్ల డోసులను ప్రజలకు ఇవ్వగా.. 17,800 మరణాలు వ్యాక్సీనేషన్ తర్వాత సంభవించాయి. ఇక్కడ నేరుగా వ్యాక్సినేషనే మరణాలకు కారణమని ధ్రువీకరించే ఆధారాలేలు బయటపడలేదు.

ఈ కేసుల్లో బాధితుల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించిన తర్వాత తొమ్మి కేసుల్లో మాత్రమే జాన్‌సెన్ వ్యాక్సీన్ కారణం అయ్యుండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తంచేశారు.

అయితే, ఎక్కడైనా ఏ వైద్యం లేదా చికిత్స వంద శాతం ముప్పు లేకుండా ఉండబోదని డాక్టర్ ఇసబెల్లా చెప్పారు.

‘‘మనం ఈ గణాంకాలను పరిశీలిస్తే, వ్యాక్సీన్ వల్ల వచ్చే ముప్పులతో పోలిస్తే, ప్రయోజనాలు చాలా ఎక్కువని తెలుస్తోంది’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, పిల్లలకు కరోనా టీకా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

తర్వాత ఏమిటి?

కోవిడ్-19 వ్యాక్సినేషన్ మొదలైన రెండేళ్ల తర్వాత, నేటికి ఇప్పటికీ కరోనావైరస్‌తో చాలా సవాళ్లు పొంచివున్నట్లు కనిపిస్తున్నాయి.

‘‘ఇప్పటికీ వ్యాక్సినేషన్‌లో చాలా వెనుకన ఉన్న దేశాలు చాలా కనిపిస్తున్నాయి’’అని ఎపిడెమియోలజిస్టు ఆండ్రేస్ రిబాస్ ఫ్రేటాస్ చెప్పారు.

ఉదాహరణకు హైతీని తీసుకోండి. ఇక్కడ కేవలం 2 శాతం జనాభా మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకుంది. మరోవైపు అల్జీరియా (15 శాతం), మాలి (12), కాంగో (4), యెమెన్ (2) లాంటి దేశాలు చాలా వెనుకన ఉన్నాయి.

‘‘ఇది నిజంగా చాలా ఆందోళన చెందాల్సిన విషయం. మనం వ్యాక్సీన్లు ఇవ్వకపోతే మరింత వేగంగా వ్యాప్తిచేందే వేరియంట్లు ఆయా ప్రాంతాల్లో చెలరేగే ముప్పు ఉంటుంది’’అని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)