హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?

ఫొటో సోర్స్, Sonatali/Getty Images
- రచయిత, మాళవిక భట్టాచార్య
- హోదా, ...
ప్రకాశవంతమైన సూర్యుడి వెలుతురులో సుదూరంగా రాళ్లు గుట్టలుపోసి చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. నా చుట్టూ ఆకర్షణీయంగా రూపొందించిన తోరణాలు, రాతి మండపాలు, భారీ శిల్పాలు కనువిందు చేస్తున్నాయి.
నేను హంపి నగరంలో ఉన్నాను. గ్రానైట్ రాళ్ల ఎరుపు, గులాబీ, ఊదా రంగులతో కూడిన గ్రానైట్ రాళ్లు కలగలసి కనిపించే అసాధారణ ఉపరితలానికి, శతాబ్దాల కిందటి ఆలయాలు, రాజప్రసాదాలకు నెలవు ఈ నగరం.
ఇవి రెండూ 15 శతాబ్దపు విజయ విఠల ఆలయం ఆవరణలో కలిసి కనిపిస్తాయి. అక్కడ నేను నిల్చుని ఉన్నాను.
హంపి నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. తుంగభద్ర నది ఒడ్డున అద్భుతమైన రాతి శిలల శిథిలాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఓపెన్-ఎయిర్ మ్యూజియం అని కూడా అభివర్ణిస్తారు.
14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కొనసాగిన దక్షిణ భారత హిందూ విజయనగర రాజ్యానికి రాజధాని ఈ నగరం. ఈ రాజ్యాన్ని పాలించిన రాజులు కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతల మీద ఎక్కువగా మక్కువ చూపేవారు. వాటి కోసం విపరీతంగా ఖర్చు చేసేవారు.
విజయ విఠల ఆలయంలో హిందూ దేవుడు విష్ణువు ఆలయం. ఇది ఒక అద్భుత కళాఖండం. ఇందులోని పొడవాటి స్తంభాలు, భారీ తోరణాలు అన్నిటినీ ఈ ప్రాంతంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన చలువరాతితో రూపొందించారు.
దాదాపు 500 ఏళ్ల కిందట విజయనగర రాజ కుటుంబాలు, ప్రజలు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేసుకునే వారు. పండుగలు చేసుకునేవారు. వినోదాలు పొందేవారు.
చుట్టూ చూసినపుడు విస్తారమైన మండపాలు కనిపించాయి. ఆ మండపాల్లోని రాళ్ల మీద హిందూ పురాణ గాథల దృశ్యాలు చెక్కి ఉన్నాయి. వీటిన్నటిలోకీ అతి పెద్దది మహామండపం.
పొడవాటి రాతి స్తంభాలు, అందమైన శిల్పాలతో కూడిన ఈ భారీ మండపంలో.. రాజుల కోసం, దేవుళ్ల కోసం నృత్యకళాకారిణిలు నాట్య ప్రదర్శలు చేసేవారు.

ఫొటో సోర్స్, Malavika Bhattacharya
‘‘ఈ మండపంలో వీణ, తబలా, జలతరంగణిల శ్రావ్యమైన సంగీత సవ్వడులు నిండిపోతే ఎలా ఉంటుందో ఊహించండి’’ అని నా గైడ్ మంజునాథ్ నాతో అన్నాడు.
ఈ నిర్మానుష్య శిథిల మండపంలో.. భారతీయ సంగీత వాయిద్యాలైన వీణ, తబలా, జలతరంగణిల నుంచి వెలువడే శ్రావ్యమైన సంగీతాన్ని, ఆ సంగీతానికి అనుగుణంగా నాట్యగత్తెలు సుడులు తిరుగుతూ నృత్యం చేయటాన్ని నేను ఊహించుకున్నాను.
అప్పుడు నా గైడ్ మా చుట్టూ ఉన్న రాతి స్తంభాల వైపు చూపించాడు. ‘‘ఇక్కడ వాడిన సంగీత వాయిద్యాలు ఇవి మాత్రమే’’ అని చెప్పాడు. మేం ఆశ్చర్యపోయాం.
హంపీ ‘సంగీత స్తంభాలు’ ఎన్నో శతాబ్దాలుగా ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. వీటి రహస్యం ఎవ్వరికీ అంతుచిక్కలేదు.
ఈ మహామండపంలో 56 రాతి స్తంభాలు ఉన్నాయి. అవన్నీ ఏకశిలా స్తంభాలే. అంటే ఒక స్తంభాన్ని ఒకే రాతిలో చెక్కారు. ఆ స్తంభాలను ‘‘రాగాల రాళ్లు’’ అని పిలుస్తారు. ‘‘స-రి-గ-మ స్తంభాలు’’ అని కూడా అంటారు.
‘‘ఆ రోజుల్లో వాయిద్యకారులు తమ చేతి వేళ్లతో కానీ, గంధపు చెక్కపుల్లలతో కానీ.. ఈ నాజూకు స్తంభాల మీద వాయిస్తూ విభిన్న రాగాలను, వివిధ వాయిద్యాల సవ్వడులను పలికించేవారు’’ అని గైడ్ మంజునాథ్ చెప్పారు.
ఈ స్తంభాలను కొట్టినపుడు వీటి నుంచి గంట, డమరుకం, మృదంగం, డప్పు వంటి వివిధ సంగీత వాయిద్యాల ధ్వనులు పుడతాయని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Sonatali/Getty Images
సంగీత స్తంభాలు అనేవి దక్షిణ భారతదేశంలోని చాలా కొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపిస్తాయి. అయితే వాటి శైలిలో తేడా ఉంటుంది.
విజయనగర శకంలో ఆ కళ చాలా విశిష్టంగా కనిపిస్తుంది. హంపి రాతి స్తంభాలు కళాకృతిలోనూ, రాతి గట్టిదనంలోనూ చాలా అట్టహాసంగా కనిపిస్తాయి.
‘‘ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో లిథోఫోన్లు (సవ్వడి చేసే రాళ్లు) ఉన్నాయి. కానీ హంపి స్తంభాల వంటి కళాత్మక, సౌందర్యాత్మక, చరిత్రాత్మక సంగీత శిలలు మరెక్కడా లేవు’’ అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ స్టడీస్ బెంగళూరు ఆర్కియాలజికల్ సైన్సస్ ప్రొఫెసర్ శారదా శ్రీనివాసన్ అన్నారు.
మహామండపంలోని ఈ సంగీత స్తంభాల నుంచి శబ్దాలను వినేందుకు సందర్శకులు పదే పదే వీటిని కొడుతుండటం వల్ల అవి దెబ్బతింటున్నాయి. దీంతో ప్రస్తుతం సందర్శకులు ఈ సంగీత స్తంభాలను చూడటానికి మాత్రమే అనుమతి ఉంది. వాటిని తాకడానికి వీలు లేదు.
నిజానికి చాలా మంది పర్యాటకులు ఈ స్తంభాల విలువ ఏమిటనేది తెలియకుండానే వెళ్లిపోతూ ఉంటారు.

ఫొటో సోర్స్, Sonatali/Getty Images
ఈ అద్భుతమైన ప్రాంతంలో సంగీతం, నృత్యం, కళల గురించి నా గైడ్ నాకు వివరించినప్పుడు, నా మనస్సులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి.
నిజంగానే ఈ రాళ్లు పాడతాయా? అదే నిజమైతే ఎలా సాధ్యమవుతుంది?
ఈ స్తంభాలు లోపల బోలుగా ఉంటాయేమోనని, అందువల్ల మనం వీటిని తాకినపుడు అవి ప్రతిధ్వనులను పుట్టిస్తాయేమోనని నేను తొలుత అనుకున్నాను.
కానీ నా థియరీని మంజునాథ్ వెంటనే కొట్టిపారేశారు. గతంలో ఈ మిస్టరీని చేధించేందుకు కొన్ని స్తంభాలను మధ్యకు విరగగొట్టి చూశారని, మొత్తమంతా గట్టి రాయి మాత్రమే ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు.
ఇక్కడ లభించే గులాబి రంగు పోర్ఫిరిటిక్ గ్రానెట్ రాయిలోని కొన్ని భాగాల్లో.. ముఖ్యంగా పలుచని భాగాల్లో ప్రతిధ్వనించే గుణాలు ఉన్నాయని ప్రొఫెసర్ శారదా శ్రీనివాసన్ పేర్కొన్నారు.
అయితే మహామండపంలో ఉన్న 56 స్తంభాలన్నీ కూడా సంగీత ధ్వనులను వినిపించవని ఆమె చెప్పారు. 14 స్తంభాల సమూహం వంటి వాటి దగ్గర మాత్రమే వాటిని తాకినపుడు సంగీత స్వరాలు వినిపిస్తాయని తెలిపారు.
‘‘ఆ సంగీతం అది సప్త స్వరాల ఆరోహణ, అవరోహణ క్రమాన్ని మనకు గుర్తుకు తెస్తుంది’’ అని వివరించారు.
ఈ రాళ్ల నాణ్యత వల్లే ఈ సంగీత ధ్వనులు వినిపిస్తున్నాయని దక్షిణ భారత ఆలయాల వాస్తుశిల్ప నిపుణురాలు మీరా నటంపల్లి ఏకీభవిస్తున్నారు.
‘‘ఈ శబ్దాలను సృష్టించేందుకు ఈ రాళ్లలో ఎలాంటి రసాయనాలను వాడలేదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Sonatali/Getty Images
‘‘ఈ స్తంభాలలో వాడిన గ్రానైట్‌ను స్థానికంగా ఉండే వివిధ రకాల క్వారీల నుంచి తెచ్చారు. అందుకే వివిధ రకాలైన ఈ రాళ్లు భిన్నమైన శబ్దాలను మనకు వినిపిస్తున్నాయి’’ అని నటంపల్లి చెప్పారు.
స్తంభాల రూపం, పరిమాణం, అవి కొలువు తీరిన విధానం ఈ శబ్దాలను పలికించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
అన్ని రాతి స్తంభాలు కూడా చూడటానికి ఒకే మాదిరి కనిపిస్తాయి. కానీ, నిశితంగా పరిశీలించి చూస్తే, వాటిలో తేడా తెలుస్తుంది. మధ్య స్తంభం నుంచి వాటికున్న దూరం, స్తంభాల పొడవులోనూ ఆ తేడాలు ఉన్నాయి.
‘‘ఆ స్తంభం ఉన్న స్థానం కూడా చాలా ముఖ్యమే. ఉదాహరణకు.. ఒక గుంపులో ఏర్పాటైన నాలుగు స్తంభాలను తీసుకుంటే.. చివరిన ఉన్న ఒక స్తంభం భిన్నమైన శబ్దం చేస్తుంది’’ అని నటంపల్లి వివరించారు.
ఈ రాతి స్తంభాలు పలికించే ధ్వనులకు వాటి చుట్టూ ఉన్న శిల్పాలకు కూడా సంబంధం ఉంటుందని శారదా శ్రీనివాసన్ చెప్పారు. శిల్పాల నాట్య విన్యాసాలు, అవి ప్రదర్శించే సంజ్ఞలను బట్టి అక్కడి రాతి స్తంభాలు పలికించే ధ్వనులు, రాగాలను గుర్తించవచ్చునని తెలిపారు.
ఈ ఆలయంలో జరిగిన పండుగలు, ప్రదర్శనలకు సంబంధించిన చరిత్ర అందుబాటులో ఉంది. కానీ ఈ స్తంభాలను ఎప్పుడు ఏర్పాటు చేశారనేది చెప్పగలిగే సరైన ఆధారాలు మాత్రం లేవు.
1565లో దక్కను సుల్తానులతో జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. హంపి నగరం ధ్వంసమైంది. గొప్ప కళాఖంఢాలు శిథిలమయ్యాయి. విజయనగరం నేలమట్టమైంది.
ఆ కాలం నాటి భౌతిక నిర్మాణాలు, జ్ఞాన సంపద రెండూ దక్కకుండాపోయాయి. సుసంపన్నమైన మహాసామ్రాజ్యం అంతర్థానమైపోయింది. కానీ కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి.
ఈ స్తంభాలను సంగీత శబ్దాలు పలికించేలా కావాలనే రూపొందించారా? లేదంటే వాటి రూపకల్పన వల్ల అనుకోకుండా అలాంటి సంగీత ధ్వనులు పలికిస్తున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
బాగా అరిగిపోయి, దెబ్బతిన్న కొన్ని స్తంభాలాను చూసినప్పుడు నాకొకటి అనిపించింది.
ఈ స్తంభాలతో శబ్దాలు పలికించవచ్చని జనం కాకతాళీయంగా గుర్తించి ఉంటారేమో. ఆ తర్వాత వాటిని సంగీత పరికారల్లాగా ఉపయోగించడం మొదలు పెట్టారేమో.
లేదంటే విజయనగర కాలంనాటి కళాకారులు తమకు కావలసిన శబ్దం పుట్టించే వరకు ఆ రాళ్లను చెక్కుతూ ఇలా తయారు చేశారేమో.
నిజం ఏమిటనేది మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు.
‘‘ఈ శిలలు పలికించే సంగీత స్వరాలకు సంబంధించి చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదంతా కేవలం కాకతాళీయం అనటానికి వీలు లేదు’’ అని శారదా శ్రీనివాసన్ పేర్కొన్నారు.
కథలు, కల్పనలు కలగలసి విహరించే ఆధ్యాత్మిక హంపి నగరంలో.. రాతి నుంచి రాగాలు పలుకుతాయని, శిలా తోరణాలతో సంగీత కచేరీ జరిగేదని ఊహించటం సులభం. ఆ ఊహ బాగుంటుంది కూడా.
ఈ స్తంభాల మీద దశాబ్దాలుగా శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు. అయినా ఇవి మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటి నిర్మాణం నేటి నిపుణులకు అంతుచిక్కని రహస్యంగానే ఉంది.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














