భారతదేశంలో వందేళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం.. ఐదు కీలక ఘట్టాలు

కమ్యూనిస్ట్ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జీఎస్ రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

'కమ్యూనిస్టు భూతం యూరప్‌ను వెంటాడుతోంది' అనే వాక్యంతో మొదలవుతుంది కమ్యూనిస్టు మేనిఫెస్టో. అది ఐరోపాను ఎంత వెన్నాడుతుందో ఏమోగానీ భారత్‌లో మాత్రం ఏటికి ఎదురీదుతోంది. వందేళ్ల ప్రయాణంలో ఇప్పుడు కీలక మలుపులో ఉంది.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో కీలక పరిణామాల్లో తెలుగు గడ్డ, తెలుగు నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.

తెలంగాణ సాయుధ పోరాటం కీలకపాత్ర పోషించింది. ఈ వందేళ్ల ప్రయాణంలో ఆసక్తికరమైన ఐదు ఘట్టాలు ఇవీ..

ఎంఎన్ రాయ్

ఫొటో సోర్స్, NBT

ఫొటో క్యాప్షన్, ఎంఎన్ రాయ్

1) తాష్కెంట్‌లో పార్టీ ఏర్పాటు-కాంగ్రెస్‌తో ఒడిదుడుకుల బంధం

భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1920 అక్టోబర్ 17న తాష్కెంట్‌లో ఏర్పడింది.

సోవియట్ యూనియన్‌లో బోల్షివిక్ విప్లవం విజయవంతమయ్యాక అంతర్జాతీయ స్పిరిట్ విస్తృతంగా ఉన్న రోజుల్లో అందులో భాగంగా ఆరంభమైంది.

వ్యవస్థాపనలో ఎంఎన్ రాయ్ కీలకపాత్ర పోషించారు. ఎంఎన్ రాయ్, ఆయన సహచరి ఎవ్లిన్ ట్రెంట్ రాయ్, అబానీ ముఖర్జీ, రోసా ఫిటింగో, మహమ్మద్ ఆలీ, మొహమ్మద్ షపీఖ్, ఎంపీబీటీ ఆచార్యలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్‌లో ప్రకటించారు.

ఇంద్రవెల్లి స్తూపం
ఫొటో క్యాప్షన్, ఇంద్రవెల్లి స్తూపం

ఇందులో ఎవ్లీన్ రాయ్ అమెరికన్ కమ్యూనిస్ట్, అబానీ ముఖర్జీ సహచరి అయినటువంటి రోసా రష్యన్ కమ్యూనిస్టు.

మొహమ్మద్ అలీ, మొహమ్మద్ షఫీఖ్ టర్కీలో ఖలీఫా పాలనను పునరుద్ధరించడానికి భారత్‌లో సాగుతున్న ఖిలాఫత్ ఉద్యమం తరపున రష్యా మద్దతుకోసం వెళ్లిన వారు.

ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ కూడా మద్దతునిచ్చిన దశ. టర్కీకి మద్దతుగా అక్కడి బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా భారత్ నుంచి అనేకమంది ఉద్యమకారులు రోడ్డు మార్గాన మరీ ముఖ్యంగా కొందరు కాలినడకన సిల్క్ రూట్లో టర్కీ వెళ్లిన దశ. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సెకండ్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన పరిణామమిది.

బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ సొంత ప్రభుత్వాన్ని ఎదిరించి భారత స్వాతంత్ర్యోద్యమానికి మద్దతునిచ్చిన అంతర్జాతీయ భావన ప్రబలంగా ఉన్న రోజులవి. భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడిగా చెప్పుకునే ఎంఎన్ రాయ్ అప్పటికే అంటే 1917లోనే మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీని(సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ)ని ఆరంభించి ఉన్నారంటే ఆ నాటి అంతర్జాతీయత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంసాగిస్తున్న బృందాలను ఇది ఆకర్షించింది.

ముఖ్యంగా అమెరికా కేంద్రంగా సాగుతున్న గదర్ పార్టీ కార్యకర్తలపై ప్రభావం బలంగా ఉన్నది. అలాగే ఖిలాఫత్ ఉద్యమంలో భాగమైన ఉద్యమకారులు కమ్యూనిస్టు పెద్దఎత్తున కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు.

వీరితో పాటు బోల్షివిక్ ప్రభావంతో కమ్యూనిస్టు భావజాలంతో వివిధ నగరాల్లో పనిచేస్తున్న చిన్నచిన్న బృందాలను కలిపే ప్రయత్నాలు ఎంఎన్ రాయ్ సాగించారు. కాకపోతే పార్టీకి నిర్దుష్టమైన కార్యక్రమం లేకపోయింది.

కాంగ్రెస్‌తో కలిసి కాంగ్రెస్‌లోనూ అంతర్భాగమై దానిని ప్రభావితం చేయడం, కలసివచ్చే వారిని కలుపుకొని పోవడం అనే పంథా అవలంబించారు. నగర పారిశ్రామిక వాడల్లో సమ్మెలను ఆయుధంగా మల్చుకున్నారు.

గయలో 1922లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోనే మద్రాస్ గ్రూప్ కమ్యూనిస్ట్ నాయకుడు సింగారవేలు చెట్టియార్ సంపూర్ణ స్వరాజ్ నినాదమిచ్చి కలకలం సృష్టించారు.

పుచ్చలపల్లి సుందరయ్య

ఫొటో సోర్స్, Phuleeducationalcircle

ఫొటో క్యాప్షన్, పుచ్చలపల్లి సుందరయ్య

ఆంక్షలు, కుట్ర కేసులు

ఆంక్షలు కుట్ర కేసులు అంటే చాలామందికి ఇపుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గుర్తొస్తుంది. కానీ బ్రిటిష్ వారి హయాంలో కమ్యూనిస్టులపై అంతకంటే తీవ్రమైన ఆంక్షలు నిషేధాలు సాగాయి.

కమ్యూనిస్టు కార్యకర్తలపై అనేక కుట్రకేసులు పెట్టారు. పెషావర్ కుట్రకేసులు, కాన్పూర్ కుట్రకేసు, మీరట్ కుట్ర కేసు ప్రధానమైనవి. ముఖ్యంగా కాన్పూర్ కుట్రకేసులో అగ్రనాయకత్వాన్ని అంతా ఇరికించారు.

ఎంఎన్ రాయ్ దేశంలోని కమ్యూనిస్టులతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం ట్రాక్ చేసిందని అందరికీ అర్థమైంది.

కరస్పాండెన్స్ ట్రాక్ చేయడం, వాటి ఆధారంగా కుట్ర కేసులు అలా మొదలయ్యాయి. ఒకరకంగా నేటి భారత ప్రభుత్వాలు బ్రిటిష్ చట్టాలనే కాకుండా వారి ట్రాకింగ్ పద్ధతులను కూడా ఇపుడు వారసత్వంగా తీసుకున్నాయమని చెప్పొచ్చు.

బీటీ రణదివె

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీటీ రణదివె

కాన్పూర్ కాన్ఫరెన్స్-సీపీఐ ఏర్పాటు

కాన్పూర్ కుట్రకేసులో నాయకులు జైలునుంచి బయటకొచ్చాక అక్కడే 1925 డిసెంబరులో నాయకులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు తాష్కెంట్‌లో ఏర్పాటైన పార్టీ నిర్మాణం, నిర్వహణల్లో ఒడిదుడుకుల రీత్యా పూర్తిస్థాయి దేశవ్యాప్త కమ్యూనిస్టు నిర్మాణం ఏర్పాటుచేయాలని నిర్ణయించి జాతీయస్థాయిలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటైనట్టు ప్రకటించారు.

సింగావేలు చెట్టియార్ అధ్యక్షుడిగా, ఘాటే కార్యదర్శిగా పార్టీ ఏర్పాటైంది. అయితే సీపీఎం, కొన్ని ఎంఎల్ పార్టీలు భారత కమ్యూనిస్టు ఉద్యమం తాష్కెంట్లో ఏర్పాటైన కమ్యూనిస్టు పార్టీతో ఆరంభమైందని గుర్తిస్తే నేటి సీపీఐ మాత్రం కాన్పూర్‌లో 1925లో ఏర్పాటైన పార్టీనే ఆరంభం అని చెపుతూ వస్తున్నది. ఆరంభానికి సంబంధించి నేటికీ కొనసాగుతున్న భిన్నాభిప్రాయం ఇది.

పార్టీ సొంతంగా పనిచేసే వాతావరణం లేకపోవడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల నేతలు పీసాంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలను ఆరంభించారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు సాగించింది.

అదే సమయంలో భగత్ సింగ్ వంటి విప్లవకారులు కమ్యూనిజం చేత ప్రభావితులయ్యారు. చిట్టగాంగ్‌లో స్థానిక కమ్యూనిస్టులు జరిపిన పోరు చారిత్రాత్మకంగా నిలచిపోయింది.

హైదర్ ఖాన్ శిష్యుడైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరరావు, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఏకే గోపాలన్, బీటీ రణదివె వంటి కొత్త తరం నాయకత్వంలోకి వస్తూ ఉన్నది.

మీరట్ కుట్రకేసు నుంచి నాయకులు విడుదలయ్యాక 1934లో నాయకులంతా కలకత్తాలో సమావేశమై దేశవ్యాప్త ఉద్యమానికి జాతీయవ్యాప్త పార్టీ నిర్మాణం జరపాలని నిర్ణయించింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉన్న బ్రిటిష్ పాలకులు 1934లో పార్టీని నిషేధించారు.

నిషేధం తర్వాత అదే సంవత్సరంలో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైంది.

అది కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న సోషలిస్టుల బృందంగా పనిచేసేది. ముఖ్యంగా దక్షిణాదిన అది పూర్తిగా కమ్యూనిస్టుల ఆధిపత్యంలో ఉండింది. కాంగ్రెస్‌లో భాగంగా ఉండి సోషలిస్ట్ ఉద్యమానికి అనుకూలంగా పనిచేయడమే వ్యూహాన్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం కాంగ్రెస్‌లో అంతర్భాగంగా ఉండి పనిచేయడం రెండూ చేస్తూ వచ్చారు.

అయితే కమ్యూనిస్టుల వైఖరి పట్ల సదభిప్రాయం లేని జయప్రకాశ్ నారాయణ్ ఆయన అనుచరులు 1940 రామ్ఘర్ కాంగ్రెస్‌లో కమ్యూనిస్టు శక్తులను బయటకు పంపించేశారు. పరస్పరం అనుమానాలతోనే అప్పటివరకూ వారి ప్రయాణం సాగింది.

కాంగ్రెస్అధినాయకత్వంతోనూ సంబంధాలు అదే రీతిలో ఉన్నాయి. 1936లో ఏర్పాటైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్-ఏఐఎస్ఎఫ్ తొలికాన్ఫరెన్స్‌ను పండిట్ నెహ్రూ ఆరంభించారు.

తర్వాత ఆయనకూ కమ్యూనిస్టులకు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒక్క విద్యార్థి సంఘమే కాదు, మహిళా సంఘం, రాడికల్ యూత్ సంఘాలు, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ లాంటి సంఘాలన్నీ ఆ కాలంలోనే ఏర్పాటయ్యాయి.

ఇప్టా-ప్రజానాట్యమండలి

1943లో ఏర్పాటైన ఇప్టా అత్యంత కీలకమైన సంఘంగా అత్యంత ప్రభావశీలమైనసంఘంగా చరిత్ర కెక్కింది.

ముల్క్‌రాజ్ ఆనంద్, కైఫీ ఆజ్మీ , పృథ్విరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, రిత్విక్ ఘటక్, ఉత్పల్ దత్, సలీల్ చౌదరి లాంటి ఎందరో స్టాల్‌వార్ట్స్ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేశారు. తొలిదశ సినిమాల పైనా వీరి ప్రభావం బలంగా ఉంది.

తెలుగులో అదే సంస్థ ప్రజానాట్యమండలిగా ఏర్పాటైంది. గరికపాటి రాజారావు, జగ్గయ్య, అల్లురామలింగయ్య, నాగభూషణం, జి వరలక్షి, కాకరాల, తిలక్, మిక్కిలినేని, తాతినేని ప్రకాశరావు, బొల్లిముంత శివరామ కృష్ణ, తమ్మారెడ్డి కృష్ణమూర్తి. వంటి ఎంతో మంది సినిమా బాట పట్టారు,.తమదైన ముద్ర వేశారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతో మంది వారిబాట పట్టారు. సంపన్నవంతమైన కోస్తా ప్రాంతం కావడం వల్ల వ్యవసాయ కులాలనుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. తర్వాత అదిపూర్తిగా కమర్షియల్ బాటగా మారిపోయింది కానీ తొలిదశలో ప్రజానాట్యమండలి ముద్ర ప్రబలంగా కనిపించేది.

అలాగే అప్పట్లో గుంటూరులో అత్యంత క్రూరమైన అణచివేతకు పేరుమోసిన ఎస్పి పళనియప్పన్ బారినుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా పలువురు మద్రాస్ బాట పట్టారని ఆ నాటి కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజానాట్యమండలి ప్రదర్శనల్లో పాల్గొన్న నంబూరి పరిపూర్ణ గారు తన ఆత్మకథ వెలుగుదారులలో పేర్కొన్నారు.

ఎలమర్రు కాటూరుల్లో జరిగిన ఘటనలు అప్పటి పోలీసుల క్రూరత్వం ఆనాటి చరిత్రను చెపుతాయి.

అంటే ప్రజానాట్యమండలి కళాకారులు సినిమా బాట పట్టడానికి అనేకానేక కారణాలు పనిచేశాయని అర్థం అవుతుంది. తెలుగు గడ్డ నుంచి జాతీయ దృశ్యానికే వస్తే ఇప్టా ఉద్యమం అనేక స్టాల్ వాల్ట్స్‌ని తయారుచేసింది.

హిందీనాటక సినిమా రంగాలపై బలమైన ముద్ర వేసింది. పృథ్విరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, రిత్విక్ ఘటక్, ఉత్పల్ దత్, సలీల్ చౌదరి లాంటి ఎందరో స్టాల్ వార్ట్స్ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేశారు.

మహాత్మా గాంధీలోని కొన్ని అంశాలతో తీవ్రంగా ప్రభావితులైన పుచ్చలపుల్లి సుందరయ్య, నంబూద్రిపాద్ దక్షిణాదిన దళితుల దేవాలయ ప్రవేశం, రైతకూలీల హక్కుల వంటిరంగాల్లో విశేషంగా పనిచేసిన కాలమిది. వారిద్దరి వ్యవహారశైలిలో గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

క్విట్ ఇండియా ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్విట్ ఇండియా ఉద్యమం

2) 1942-క్విట్ ఇండియా-కమ్యూనిస్టుల తప్పిదం

1942లో గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. కానీ కమ్యూనిస్టులు మరో రకంగా ఆలోచించారు. అపుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం కమ్యూనిస్టులను ఇప్పటికీ వెంటాడుతోంది.

దాని వల్ల పార్టీ ఒంటరైందని పార్టీ అధికార పత్రాల్లో కూడా పేర్కొన్నారు.

అది రెండో ప్రపంచయుద్ధ కాలం. అప్పటికే నాజీ సేనలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో అప్పటికి రష్యా పట్టు బలంగాఉన్న భారత కమ్యూనిస్టు పార్టీపై ఆ ప్రభావం పడింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించింది. అపుడు జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు ఉంటే రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా మిత్రదేశాల కూటమిగా ఉన్నాయి.

అంటే సోవియట్‌కు బ్రిటన్ మిత్రదేశంగా ఉండింది. ఈ టైంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడం నాజీ సైన్యాలను ఓడించే ఉమ్మడి ప్రయత్నాలను దెబ్బతీస్తుంది అని విశ్లేషిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించింది.

నాజీ సేనల పురోగతిని అడ్డుకోవడానికి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. బ్రిటిష్ వాళ్ల మెడలు వంచడానికి ఇదే సరైన సమయం అని గాంధీ అనుకున్నారు.

కమ్యూనిస్టు పార్టీ మాత్రం సోవియట్ లైన్ తీసుకుని ఉద్యమాన్ని వ్యతిరేకించింది. జపాన్ సేనలు బర్మా వరకు వచ్చాయి కాబట్టి వారు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను ఈ ఉద్యమం దెబ్బతీస్తుంది అని ఏవో సమర్థనలు చేసుకున్నది కానీ అది జనానికి రుచించలేదు.

అప్పటివరకూ స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి వివిధ రూపాల్లో పాల్గొన్నప్పటికీ స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత కీలకమైనదిగా భావించే ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించి వ్యూహాత్మకమైన తప్పిదానికి పాల్పడిందని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు.

స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టులు విస్తృతంగా పాల్గొని జైలుశిక్షలు అనుభవించినా ఈ తప్పిదం మాత్రం కారు మబ్బులా కమ్మేసింది.

ఏమైతేనేం, ఆ తర్వాత అదే ఏడాదిలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసింది. కాంగ్రెస్ అని పిల్చుకునే పార్టీ తొలి కాన్ఫరెన్స్ 1943లో బాంబేలో జరిగింది. అంటే పార్టీ ఏర్పడిన 23 ఏళ్ల తర్వాత గానీ తొలి కాన్ఫరెన్స్ జరుపుకోలేని స్థితి ఆనాడు ఉండింది అని అర్థం అవుతుంది.

ఆంక్షలు, నిషేధాల మధ్య వర్కర్స్ సమ్మెలు, కొన్నిచోట్ రైతాంగ ఉద్యమాలు ప్రధాన అస్ర్తంగా పార్టీ గ్రూపులు పనిచేస్తూ వచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటం
ఫొటో క్యాప్షన్, తెలంగాణ సాయుధ పోరాటం

3) పార్టీలో చీలిక-పట్టణాల నుంచి గ్రామాలకు

1947లో స్వాతంత్ర్యం వచ్చింది. నెహ్రూ స్వయంగా సోషలిస్ట్ అని గుర్తింపు పొందుతున్నారు, సోషలిస్ట్ పంథాలో ప్రభుత్వం నడుస్తుందిఅని చెపుతున్నారు. 49లో చైనాలో మావో అధ్వర్యంలో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమై అంతర్జాతీయంగా రష్యా స్థానాన్ని చైనా ఆక్రమించడం మొదలైంది.

దీనికితోడు మూడు ప్రధాన రైతాంగ ఉద్యమాలు చైనా మోడల్ వైపు ఆకర్షితులయ్యేలా చేశాయి. స్వాతంత్ర్యం ఒక డైలమా తెచ్చిపెడితే చైనా విజయం మొత్తం మార్గం ప్రోగ్రాంపైనే చిచ్చు రేపింది.

సోషలిజం లక్ష్యంగా సాగే పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో సాధించిన స్వాతంత్ర్యాన్ని ఎలా చూడాలి తొలి రోజుల్లో పెద్ద డైలమా. నెహ్రూ ప్రభుత్వాన్ని ఎలా చూడాలనేది దానికి అనుబంధమైన డైలమా.

అది స్వాతంత్ర్యం కాదని అధికారం చేతులు మారిందని తొలిరోజుల్లో కమ్యూనిస్టులు తీర్మానాలు చేశారు. అప్పటికి భారత్ సహా వివిధ దేశాల దేశాల కమ్యూనిస్టు పార్టీలు సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉన్నాయి.

ఒక రకంగా ఆయాదేశాల పాలసీలను నిర్దేశించే స్థితిలో సోవియెట్ పార్టీ ఉన్నది. సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ మాత్రం ప్రభుత్వం జాతీయ బూర్జువాల నేతృత్వంలో ఉంది దానిపై పోరాడకూడదు అని పార్టీకి సలహాఇచ్చింది.

అదే బాటలో నెహ్రూ స్వతంత్రంగానే వ్యవహారిస్తున్నారు, పైగా సోషలిస్ట్ పంథా తనది అని చెపుతున్నారు కాబట్టి కాంగ్రెస్‌లోని వామపక్ష సమూహాలతో కలిసి పనిచేసి తమ దారికి తెచ్చుకోవడం మంచిది అని ఒక వర్గం వాదిస్తే కాదూ, ఇది అర్థవలస రాజ్యం, ఇది సరైన స్వాతంత్ర్యం కాదు, చైనా బాటలో పోరాడాలి అని రెండో వర్గంవాదించింది.

రెండు శిబిరాలు ఏర్పడ్డాయి. వలసపాలకులతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ఎలా చూడాలి అనేదానిపైనా రష్యా, చైనా లైన్లపైనా రెండు శిబిరాల మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.

కమ్యూనిస్టుల అధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధపోరాటం, తెభాగ, పునప్రవాయలార్ ఉద్యమాలు అందులో గ్రామీణ రైతాంగం కదిలిన తీరు కమ్యూనిస్టుల్లో బలమైన వర్గాన్ని చైనా వైపు మళ్లేలాచేశాయి. ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో మూడువేల గ్రామాలు నిజాంనుంచి విముక్తి పొంది కమ్యూనిస్టు గ్రామ కమిటీల అధ్వర్యంలోకి రావడం అనేది చైనా మార్గం వారికి అత్యంత ఉత్సాహమిచ్చిన అంశం.

అదే ఊపులో పోరాటం సాగిస్తే దేశంలో సోషలిజం సాధించొచ్చని అప్పట్లో అంచనాలు వేశారు.

అయితే నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం వేరు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడడం వేరు అని అందులోని వారు కూడా తర్వాత గుర్తించారు. అప్పటికే కొమింటార్న్ అంటే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ నుంచి కొమింఫామ్‌గా పేరు మార్చుకున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ కూడా చైనా మార్గాన్నే ప్రతిపాదించింది.

గార్డ్ చేతులు మారింది. భారత కమ్యూనిస్టు పార్టీలో చైనా లైన్ ఆధిపత్యం సాధించింది. 51లో రణదివేను దించేసి చండ్ర రాజేశ్వరరావు పార్టీ నాయకత్వం చేపట్టారు. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది.

సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా విరమించాలా అనే విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. కొనసాగించాలనేవారు, విరమించాలనే వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పంచాయితీ రష్యాకు చేరింది.

రష్యా సలహా కోసం నలుగురు నాయకుల బృందం మాస్కో వెళ్లి స్టాలిన్ సలహా తీసుకుని వచ్చింది. బసవపున్నయ్య, అజయ్ ఘోష్, అమృతపాద డాంగే, చండ్ర రాజేశ్వరరావు నలుగురూ స్టాలిన్ బృందంతో చర్చించారు.

తిరిగొచ్చాక తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించారు. విరమించి 1952 ఎన్నికల్లో పాల్గొనడానికి మార్గం సుగమం చేసుకున్నారు. చైనా మార్గం తమ మార్గం అని ప్రకటించుకున్నారు.

కాకపోతే అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాబోయే నిర్బంధాన్ని అప్పటికి ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండు లైన్లను ప్రతిపాదించారు. టాక్టికల్ లైన్లో సుదీర్ఘ సాయుధ పోరాటం, పొలిటికల్ థీసీస్లో పార్లమెంటరీ పంథాను ప్రతిపాదించారు.

అదే సమయంలో మధురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్లో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని ప్రతిపాదించారు. తర్వాత కూడా పార్టీలో రష్యా, చైనా మార్గాల్లో రెండు లైన్ల పోరాటం కొనసాగుతూ వచ్చింది.

ఎవరు ఆధిపత్యంలో ఉంటే వారి పంథాలో విధానాలు రూపొందుతూ వచ్చాయి. మెజారిటీ, మైనారిటీ అభిప్రాయాల ఘర్షణ సాగుతూ వచ్చింది.

ఈఎంఎస్ నంబూద్రిపాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈఎంఎస్ నంబూద్రిపాద్

కేరళ విజయం-బర్తరఫ్

1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1955 ఆంధ్రా ఎన్నికల్లో విజయం తథ్యమని మెజారిటీ నాయకులు భావించినప్పటికీ అప్పుడు సాగిన అత్యంత భయానకమైన ప్రచారాల మధ్య వారి అంచనా తల్లకిందులైంది.

కాకపోతే 1957లో కేరళ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. నంబూద్రిపాద్ అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల మార్గంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం అప్పటికిప్రపంచంలోనే అరుదైన ఘటన. ఎన్నికల మార్గంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావచ్చు అనే భావన బలపడింది.

దీనికి తోడు రష్యాలో స్టాలిన్ తర్వాత అధికారంలోకి వచ్చిన కృశ్చేవ్ అంతర్జాతీయంగా శాంతియుత పరివర్తనను ప్రతిపాదించారు.

చైనా మార్గమే మా మార్గం అనేదానికి తోడు కేరళ మార్గమే మా మార్గం కూడా జతకలిసింది. అంటే గతంలో ఎజెండాలో ఉన్న సాయుధ పోరాటం స్థానంలో ఎన్నికల పోరాటం ప్రధానంగా ముందుకొచ్చింది.

కాకపోతే నంబూద్రిపాద్ భూసంస్కరణలు, వేతన సంస్కరణలు అమలు చేయడం మొదలెట్టాక అక్కడ మత సంస్థలు బలీయమైన ఇతర సమూహాలతో కలిసి ఒక అలజడి రేగుతున్నది.

నంబూద్రిపాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి అధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వివాదాల నడుమ అప్పటి కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ రాష్ర్టంలో పర్యటించి బర్తరఫ్‌కు సిఫారసు చేశారు.

నెహ్రూ ప్రభుత్వం 1959లో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. బర్తరఫ్ వెనుక అమెరికా హస్తం కూడా ఉందని కమ్యూనిస్టులు అప్పటినించీ ఆరోపిస్తూ వస్తున్నారు.

అప్పటికే రష్యా చైనాల మధ్య గ్రేట్ డిబేట్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అటూ ఇటూ చీలిపోయాయి.

1962లో భారత్ చైనా యుద్ధం కీలకమలుపు తీసుకుంది. యుద్ధంలో చైనాను సమర్థించారంటూ సీపీఐలోని లెఫ్టిస్ట్ నాయకులను జైలుకు పంపించారు. పార్టీలో రెండు లైన్ల మధ్య సాగుతున్న పోరాటం తీవ్రరూపం దాల్చింది. 1963లో తెనాలిలోని ఒక రైస్ మిల్లులో సమావేశమైన అసమ్మతి నేతలు తమ లైన్తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. తొలిసారిగా అక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో పెద్ద మావో జెడాంగ్ బొమ్మ గ్రాండ్‌గా అవతరించింది. దాదాపుగా సీపీఎం ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు అక్కడే జరిగిపోయినట్టు లెక్క. తర్వాత 1964లో పార్టీ చీలిపోయింది.

పార్టీ ఏడో కాంగ్రెస్ విడివిడిగా కలకత్తాలోనూ బాంబేలోనూ జరిగింది. చైనీస్ లైన్ తీసుకున్న సీనియర్ నేతలు తొమ్మిదిమంది పాలిట్ బ్యూరో మెంబర్లుగా సీపీఎం కలకత్తాలో ఏర్పడింది. ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికయ్యారు. బాంబేలో సమావేశమైన పార్టీ నాయకులు సీపీఐగానే కొనసాగారు. మొత్తం మీద ఈ దశలో సంకేతాత్మకంగా చూసినపుడు అంతకుముందు ప్రధానంగా పట్టణ ప్రోలటేరియెట్ ఫోకస్డ్‌గా ఉన్న పార్టీ శ్రేణులు గ్రామీణ రైతాంగం వైపు మళ్లడం ప్రధానంగా కనిపిస్తుంది. అది చైనా మార్గంగా భావించొచ్చు.

కానూ సన్యాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కానూ సన్యాల్

4) రాడికల్ లెఫ్ట్ -గ్రామాల నుంచి అడవులకు

తర్వాత అల్ర్టా లెఫ్ట్ లేదా ఎంఎల్ పార్టీల దశ మొదలైంది. ఫోకస్ గ్రామాల నుంచి అడవులకు మళ్లింది. సీపీఐ చీలిపోయి సీపీఎం ఏర్పడానికి చాలాకాలమే పట్టింది కానీ తర్వాత సీపీఎంనుంచి సీపీఐ ఎంఎల్ శ్రేణులు చీలిపోయి వేరు పార్టీలు ఏర్పరుచుకోవడానికి ఎక్కువ కాలమేమీ పట్టలేదు.

సీపీఎం అప్పటికి రాడికల్‌గా ప్రోగ్రాం ప్రకటించుకుని ఉన్నది. కాకపోతే కేరళ విజయం తర్వాత ఎన్నికల మీద ఫోకస్ పెరిగింది. ప్రోగ్రాంలో మార్పు లేనప్పటికీ ఎన్నికల మార్గం ప్రధానమార్గంగా మారడాన్ని అప్పుడు పార్టీలో ఉన్న కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోయారు. అంతర్జాతీయంగా కూడా 60ల్లో పెను కదలిక ఉన్నది. పలు దేశాల్లో యువత ఉద్యమాల వైపు నడిచింది. యాంగ్రీ యంగ్ మెన్ అనేది ఒక ఇమేజ్‌గా మారింది.

గువేరా అంతర్జాతీయ యూత్ రెబల్ ఐకాన్‌గా నిలిచిన దశ. దేశంలో పేదరికం, నిరుద్యోగం తాండవిస్తున్న దశ. వియత్నాం చాలామందికి కొత్త ఉత్సాహమిచ్చింది. బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా సీపీఎం నాయకుడిగా ఉండిన చారుమజుందార్ కొన్ని పత్రాలు రాశారు. వాటిని తెరాయ్ డాక్యుమెంట్స్ అని పిలుస్తారు. ఇది బూటకపు స్వాతంత్ర్యమని దీనికి వ్యతిరేకంగా చైనా బాటలో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.

కొండపల్లి సీతారామయ్య

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, కొండపల్లి సీతారామయ్య

1975 కల్లా సాయుధ విప్లవం విజయవంతమవుతుందని ఆయన అంచనా వేశారు. అదే సమయంలో అక్కడి సిలిగురి దగ్గరిలోని నక్సల్బరీలో బిమల్ కిసన్ అనే రైతు పై భూస్వాములు జరిపినదాడి అక్కడ ఒక తిరుగుబాటును లేవనెత్తింది. ఆదివాసీ రైతుల తిరుగుబాటు జరిపి భూములు స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేపట్టారు.

చారుమజుందార్ పర్యవేక్షణలో జంగల్ సంతాల్, కానూ సన్యాల్ ప్రత్యక్ష నేతృత్వంలో సాగిన నక్సల్బరీ తిరుగుబాటు భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో కొత్త బాట వేసింది. చైనా డైలీ మార్నింగ్ స్టార్ దీన్ని వసంత మేఘ గర్జనగా అబివర్ణించింది.

అది దేశవ్యాప్తం అవుతుందని అంచనా వేసింది. నక్సలైట్ పార్టీలు ఇప్పటికీ వసంతమేఘ ఘర్ఝన అనే ఆ పదబంధాన్ని విరివిగా వాడుతుంటాయి.

కేజే సత్యమూర్తి

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, కేజే సత్యమూర్తి

సీపీఎంలోని అసమ్మతివాదులు 1968లో ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషరనరీస్(ఏఐసిసిఆర్) అనే సంస్థ ఏర్పాటైంది. ఎన్నికల మార్గాన్ని వ్యతిరేకించడం, సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించడం అనేది ప్రధానసూత్రాలుగా ఉన్నాయి. కానూ సన్యాల్, చారు మజుందార్లను సీపీఎం బహిష్కరించింది.

వారు, వారితో పాటు సీపీఎంలోని అసమ్మతి వాదులు బర్ద్వాన్ ప్లీనంలో గట్టిగా గొంతెత్తారు.. సీపీఎం నుంచి ఆ నాయకులను బహిష్కరించారు. తెలుగు గడ్డ నుంచి అలా బర్ద్వాన్ ప్లీనంలో పాల్గొన్న నలుగురు నాయకులను సీపీఎం బహిష్కరించింది.

దేవులపల్లి వెంకటేశ్వరరావు
ఫొటో క్యాప్షన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు

దేవులపల్లి వేంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య అలా బహిష్కృతులయ్యారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నసందర్భంగా నాగిరెడ్డి అసెంబ్లీలో చేసిన ఉపన్యాసాన్ని ఇవ్వాల్టికీ కొంత మంది ప్రస్తావిస్తూ ఉంటారు. మిగిలిన రాష్ర్టాలకు భిన్నంగా ఇక్కడ బహిష్కృతులైన నేతలకు కమిటీల్లో ఎక్కువ మెజారిటీ ఉండింది.

రాజీనామాల విషయానికే వస్తే సీపీఎం కేంద్ర కమిటీ నాయకత్వానికి, పొలిటి బ్యూరోకు రాజీనామా చేస్తూ పుచ్చలపల్లి సుందరయ్య రాసిన లేఖ కూడా అత్యంత కీలకమైంది. ఎమర్జెన్సీని వ్యతిరేకించే పేరుతో జనసంఘ్‌తో చేతులు కలపడానికి సిద్ధమవుతారా అని ప్రశ్నిస్తూ.. చైనా తరహా పోరాటమంటూ గతంలో చేసిన టాక్టికల్ లైన్ సంగతేంటంటూ మెజారిటీ నాయకత్వాన్ని నిలదీస్తూ 1975లో తన కార్యదర్శి పదవికి, కేంద్ర కమిటీకి రాజీనామా లేఖను సమర్పించారు సుందరయ్య. పార్టీ నాయకత్వం చాలాకాలం దీన్ని బయటపెట్టలేదు.

ఇక ఏఐసీసీసీఆర్ బాటలోనే ఆంధ్ర కమిటీ ఏర్పడింది. ఈ దశలో చారు మజుందార్‌ను కొందరు కమ్యూనిస్టు విప్లవకారులు ఆంధ్రాకు రప్పించారు. గుంటూరు జిల్లాలోని శైవక్షేత్రమైన గుత్తికొండబిలంలో రహస్య సమావేశం నిర్వహించారు. కొండపల్లి సీతారామయ్య కుమారుడు చంద్రం, కేజీ సత్యమూర్తి, గుంటూరులో ప్రస్తుతం సీనియర్ న్యాయవాదిగా ఉన్న వై.కోటేశ్వరరావు సహా 20 మంది అందులో పాల్గొన్నారు.

ఆంధ్రకమిటీ సాయుధ విప్లవ సన్నాహాల్లో ఉండగానే శ్రీకాకుళం కమిటీ సాయుధ పోరాటాన్ని ఇంకెంత మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదంటూ రెండు తీర్మానాలు చేసి అక్కడ ఆదివాసీలను కూడగట్టి సవర జాతావులతో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించింది.

దేశంలోని నలుమూలలనుంచి చదువుకున్న మధ్య తరగతి యువతను అది ఆకర్షించింది. అదే సమయంలో బిహార్లోని ముషాహరిలో స్థానిక సీపీఎంలోని రాడికల్ ఎలిమెంట్ల నేతృత్వంలో రైతు కూలీల పంటల స్వాధీన ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకుంది.

యూపీ, పంజాబ్, బెంగాల్‌లో పంటల స్వాధీనం, భూస్వాధీన ఉద్యమాలు ఆరంభమయ్యయి. కేరళలో అజిత లాంటి వాళ్లు పోలీస్ స్టేషన్లపై దాడితో అలజడి రేపారు.

ఇలాంటి శక్తుల సమ్మేళనంగా 1969లో సీపీఐ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఏర్పాటైంది. తర్వాత సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న పార్టీలు ఈ మార్క్సిస్టు లెనినిస్టు అనే సఫిక్స్‌ను యాడ్ చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది.

1970ల్లో చారు మజుందార్ అనుచరులు, గెరిల్లా నాయకులు తమలాంటి శక్తుల పునరేకీకరణ కోసం సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సీఓసీని ఏర్పాటు చేసుకున్నారు. చర్చల్లో ఏకాభిప్రాయం రాలేదు కానీ 1979లో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి నాయకత్వంలో పీపుల్స్‌వార్ ఏర్పడింది. తెలంగాణ కేంద్రంగా గెరిల్లా పోరు సాగుతూ వచ్చింది.

తెలంగాణలో భూస్వాములు, పెద్ద రైతులపై దాడులు, ఎన్‌కౌంటర్లు, కాల్పులు సర్వసాధారణమైపోయాయి. అదే సమయంలో గ్రామాలనుంచి దొరలు భూస్వాములు ప్రాణాలు అరచేతపట్టుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. అప్పటికే చివరి దశలో ఉన్న వెట్టిచాకిరీ లాంటివి లేకుండా పోయాయి. ప్రశ్నించే తత్వం పెరిగింది.

అదేసమయంలో ప్రజాస్వామిక శక్తులు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం లేకుండాపోయింది. ప్రశ్నించే వారినల్లా నక్సలైట్ల ముద్రవేసి అణచివేయగలిగిన పద్ధతులు ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు అందివచ్చాయి. అయితే అక్కడ నీటి సౌకర్యం పెరిగాక, పట్టణీకరణ పెరిగాక, రోడ్డు రవాణా సౌకర్యాలు పెరిగాక, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఊపు పెరిగాక నక్సలైట్లు తెలంగాణ గడ్డలో ప్రభావం కోల్పోయారు.

అప్పటికే కొండపల్లి సీతారామయ్య వ్యూహంలో భాగంగా షెల్టర్ జోన్‌గా ఉన్న దండకారణ్యం వైపు నాయకత్వం కార్యకర్తలు తరలిపోయారు. 2004లో పీపుల్స్ వార్ బిహార్ కేంద్రంగా పనిచేసే ఎంసీసీ కలిసి మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది.

తర్వాత కూడా తెలుగు గడ్డమీద మావోయిస్టు ప్రభావం పెద్దగా లేకుండా పోయింది. ఏజెన్సీలోనూ, ఇటు ఉత్తర తెలంగాణలోనూ అడపా దడపా వినిపించే వార్తలుగా తప్ప తెలుగు గడ్డ మీద తిరిగి కాళ్లూనుకునే స్థితి లేకుండా పోయింది.

ఎంఎల్ పార్టీ అనేకానేక చీలికలుగా త్వరత్వరగా చీలిపోయింది. అందులో ముఖ్యంగా ఆంధ్రా తెలంగాణ దండకారణ్యం ప్రధానంగా ఉన్నటువంటి పీపుల్స్ వార్, బిహార్, బెంగాల్ కేంద్రంగా అంతకుముందునుంచే సొంతంగా పనిచేస్తూ వచ్చిన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, వినోద్ మిశ్రా నేతృత్వంలొని సీపీఐ ఎంఎల్ లిబరేషన్, సత్యనారాయణ్ సింగ్, చండ్ర పుల్లారెడ్డి నేతృత్వంలోని ఇంకో ఎంఎల్ గ్రూప్ ప్రధానంగా ఉన్నాయి. ఇందులో పీపుల్స్ వార్, ఎంసీసీ తప్ప మిగిలిన సంస్థలు ఎన్నికల్లోనూ పాల్గొంటున్నాయి.

2004లో మావోయిస్ట్ సెంటర్, పీపుల్స్ వార్ కలిసిపోయి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. ఇవాళ దేశంలో అదే పెద్ద నక్సలైట్ గెరిల్లా పార్టీగా ఉన్నది. కాకపోతే నక్సలైట్ పార్టీలన్నీ నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి.

80ల నుంచి మధ్య తరగతి అండ తగ్గిపోతూ వస్తున్నది. 90ల తర్వాత మారిన సామాజిక సమీకరణాల్లో మరీ బలహీనపడ్డాయి. నక్సలైట్ పార్టీల పంథామీద భవిష్యత్తుమీద బోలెడన్ని చర్చలు సాగుతున్నాయి.

సీపీఐ, సీపీఎం, ఇతర నక్సలైట్ పార్టీలు తెలుగునాట విద్యుత్ ఉద్యమంలోనూ సారా వ్యతిరేక ఉద్యమంలోనూ ఇతరత్రా రైతుకూలీ ఉద్యమాల్లో పనిచేస్తూ వచ్చారు.

నిషిద్ద మావోయిస్టు పార్టీతో పాటు జనశక్తి, సీపీఎంఎల్ న్యూడెమొక్రసీ వంటి పార్టీలూ తెలుగు నేల మీద ఏదో రూపంలో పనిచేస్తున్నాయి.

గత పదిహేనేళ్లుగా కలిసిపనిచేయడమనే మార్గం పెరుగుతున్నది. ఇటీవల తెలంగాణలో సీపీఎం అనేక ఇతర ప్రజాసంఘాలతో కలిసి పనిచేస్తే ప్రయత్నం చేస్తున్నది.

కాకపోతే కమ్యూనిస్టు పార్టీలు తొలిదశలో వైజాగ్, నెల్లూరులాంటి సెంటర్లలో ప్రాభవం కోల్పోయాయి. మలిదశలొ ముఖ్యంగా విజయవాడ, నల్లగొండ లాంటి కంచుకోటలను కోల్పోయాయి. చివరి ఖిల్లా ఖమ్మంను కూడా ఇపుడు దాదాపు కోల్పోయింది. దేశవ్యాప్తంగా పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు.

సుత్తీకొడవలి గుర్తు

5) విమర్శలు... ఆత్మవిమర్శలు

1952, 57 పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించిన కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ఎక్కడుంది?

సీపీఎంకు లోక్‌సభలో మూడు సీట్లు, సీపీఐకి రెండు, ఆర్ఎస్పీకి ఒకటి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీకి ఒకసీటు ఉన్నాయి. ప్రధానమైన బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోవడమే కాక అక్కడ సిపిఎం శ్రేణులు ఇపుడు భావజాల ప్రత్యర్థి బీజేపీలోకి ప్రయాణిస్తున్న వార్తలొస్తున్నాయి. అటు పార్లమెంటేతర సాయుధపోరాటమార్గాన్ని ఎంచుకున్న పార్టీలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

అడవుల్లో కొంతభాగానికి మాత్రమే పరిమితమైపోయామని, మైదానప్రాంతాలకు విస్తరించలేకపోయామని కొత్త తరాన్ని చేరే మార్గాలు తెలీకుండా పోయాయని ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉందని కొంతకాలం క్రితం మావోయిస్ట్ పార్టీ నాయకుడు కోబాడ్ గాంధీ ఈపీడబ్ల్యూలో రాసి ఉన్నారు.

కమ్యూనిస్టు పార్టీల రిలవెన్స్ బలాలు, బలహీనతలకు సంబంధించి రెండు ప్రధాన పరిశీలనలు మనముందుకొస్తున్నాయి.

ఎ)భూస్వామ్య శక్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమైనట్టుగా కమ్యూనిస్టులు పెట్టుబడిదారి వ్యవస్థను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేరు. వారి దగ్గర దానికి అనుగుణమైన విశ్లేషణ, పరికరాలు లేవు. అందుకే దుర్భరదారిద్ర్యం విచ్చలవిడి అణచివేతలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించగలరు ప్రభుత్వ చట్టాల వల్ల గానీ, సమాజ పురోగతి వల్ల కానీ ఏ కారణం రీత్యానైనా ఆ పరిస్థితులు సరళమై మోడర్న్ మార్పులొస్తే అక్కడ వారు రిలవెన్స్ కోల్పోతున్నారు.

అందులోనూ భారత సమాజం ఈ వందేళ్లలో పల్లెల నుంచి పట్టణాలుగా పట్టణాల నుంచి నగరాలుగా మారుతున్న దశలో కమ్యూనిస్టుల ప్రయాణం నగరాలనుంచి గ్రామాలకు గ్రామాల నుంచి అడవులకు భిన్నమైనప్రయాణం చేసింది.

ఇందులోనే భాగంగా ఇంకాస్త విస్తృతమైన మౌలిక మైన ప్రతిపాదన సైద్ధాంతికమైనది. అంతర్జాతీయంగానే పెట్టుబడిదారి విధానం రూపం మార్చుకున్నది. వర్తమానానికి అనువుగా తనను తాను మార్చుకున్నది. ఆ మేర కమ్యూనిస్టు సిద్ధాంతంలో కూడా మార్పులవసరం. కమ్యూనిస్టులు పడికట్టు పద్థతుల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది అనేది కొంతమంది అభిప్రాయం. అంతర్జాతీయంగానే ఈ విషయంలో బలమైన చర్చ సాగుతున్నది.

బి)భారత కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోలేదు. భారతదేశంలో కులం ప్రధానమైన రియాలిటీ. రష్యా, చైనా అంటూ రకరకాల అంచనాలు వేశారు తప్పితే కులసమీకరణాలను అంతగా పట్టించుకోలేదు. దేశ రాజకీయాల్లో దాని పాత్రను సరిగా అర్థంచేసుకోలేదు. కమ్యూనిస్టు నాయకుడు డాంగే కాలంలోనే అంబేద్కర్ సామాజిక పోరాటాలను సాగించినప్పటికీ దాని తీవ్రతను పట్టించుకోలేదు.

పునాది ఉపరితలం లాంటి మాటలతో కులసమస్యను తక్కువ చేశారు. రాను రాను కులం రూపం మార్చుకుంటూ సోషల్ కాపిటల్గా, పొలిటికల్ మొబిలైజింగ్ టూల్ గా మారుతుంటే నిస్సహ యంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. కులనిర్మూలనకూ పటిష్టమైన ప్రోగ్రామ్ తీసుకోలేకపోయారు, ఉన్న సమీకరణాల్లో తాము సమర్థంగా పనిచేయడానికి అవసరమైన వ్యూహాలు ఎత్తుగడల్లోనూ వైఫల్యం చెందారు.

ఇక సొంతంగా తప్పిదాలు పరస్పరం రివిజనిజం, దుస్సాహిసిక వాదంఅని నిందించుకుంటూ చేసుకున్న తీవ్ర విమర్శలు, చీలికలు, వాటి ప్రభావం సంగతిచెప్పనే అక్కర్లేదు. అది క్విట్ ఇండియా తప్పిదం మాత్రమే కాదు.

డాంగేకు బ్రిటీష్ వారితో ఉన్న బంధం పైన తలెత్తిన వివాదం మాత్రమే కాదు, జోషి, రణదివే ఆత్మవిమర్శలు, పొత్తులపై తీవ్రమైన విభేదాలు , ఐక్యసంఘటనలకు సంబంధించిన వివాదాలు అనేకం. తప్పులు చేసుకుంటూ వాటిని అంగీకరిస్తూ మళ్లీ తప్పులు చేసుకుంటూ అలా పార్టీ ప్రయాణంసాగుతూ ఉన్ననది కాన్పూర్ లో ఏర్పాటైన సిపిఐ కార్యదర్శి, తొలితరం నాయకుడు ఘాటే ఒక ఇంటర్య్వూలో చెప్పారు.

పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఘాటైన విమర్శలకే పరిమితమైతే , ఎంఎల్ పార్టీలు ఒకరినొకరు చంపుకునే దాకా తమలోని విభేదాలను తీసికెళ్లాయి. ఐక్య కమ్యూనిస్టు పార్టీ ఉండాలని వాదిస్తూనే తామే నిజమైన ప్రతినిధులం అని చెపుతూ ఎదుటివారిని తక్కువగా చూసే ధోరణి కమ్యూనిస్టు శిబిరాల్లో బలంగాకనిపిస్తుంది.

అయితే బలహీనతలను అధిగమిస్తామని అన్ని కమ్యూనిస్టు పార్టీలు చెపుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీల ప్రభావాన్ని సీట్ల సంఖ్యను బట్టి లెక్కవేయకూడదని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి బిబిసి తెలుగుతో చెప్పారు.

సమాజంలో సెక్యులరిజాన్ని కాపాడడంలో వివిధ రంగాల్లో ఆధిపత్య శక్తులను కాపాడడంలో ప్రజల చైతన్యాన్ని పెంచడంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందని ఆయన అన్నారు.

రైతు కూలీలు, కార్మికుల హక్కుల పరిరక్షణలో వారి పాత్ర గణనీయమని మరికొందరు ఇండిపెండెంట్ పరిశోధకులు పేర్కొన్నారు. అనేక ప్రోగ్రెసివ్ చట్టాలు సమాజంలో ముందుకు రావడానికి కమ్యూనిస్టు పార్టీల, నక్సలైట్ పార్టీల ఒత్తిగడి పరోక్ష ఒత్తిడి ఉన్నదని ఆ రకంగా అవి ప్రెఫర్ గ్రూప్ గా పనిచేశాయని అంచనా.

దుర్భరదారిద్ర్యం, విపరీతమైన అసమానతలు , వివక్ష ఉన్న చోట వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంలో కొంతమేరకైనా హక్కులు సాధించడంలో వారి పాత్ర ఉన్నదని పలువురు చరిత్రకారుల అధ్యయనాల్లో కనిపించే అంశం.

ముఖ్యంగా వెట్టిచాకిరీ నిర్మూలన, భూసంస్కరణలు ప్రత్యక్షంగా కనిపించే అంశాలని విశ్లేషణలున్నాయి. ఇట్లా వందేళ్ల చరిత్రలో అవి సాధించిన అంశాలపై చాలానే విశ్లేషణలున్నాయి.

ఏమైనా భారత కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ చారిత్రక చౌరస్తాలో నిలబడి ఉన్నాయనేది వాస్తవం.

మాది దీర్ఘకాలిక పోరాటం అని పార్లమెంట్ పార్టీలు నాన్ పార్లెమంట్ నక్సలైట్ పార్టీలు అన్నీ చెపుతూ భవిష్యత్తులో బలపడతాం అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూనే ఉంటాయి.

కానీ ఊహాతీతమైన వేగంతో మార్పు చెందుతున్న సమాజానికి తమని తాము రిలవెంట్గా మార్చుకోగలిగన విధంగా అవి మారతాయా మారగలవా? స్టేట్ విదర్ అవే అనేది దీర్ఘకాలిక పరిణామంగా ప్రకటించుకున్న కమ్యూనిజం తాను విదర్ అవే కాకుండా నిలుపుకోగలదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)