ధమాకా రివ్యూ: రవితేజ మార్క్ ఉందా? రిమార్క్‌గా మిగిలిపోయిందా?

ఫొటో సోర్స్, @peoplemediafcy
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ తెలుగు కోసం
జుత్తు ఉంటే ఎలాంటి కొప్పు అయినా పెట్టొచ్చు.
సరైన ఆటగాడికి మైదానం తీరుతో పని లేదు.
ఇలాంటి ఉపమానాలు ఎన్నయినా చెప్పొచ్చు.
కానీ కథ లేకుండా.. సినిమా తీయొచ్చని ఎవరూ చెప్పలేదు. ఎక్కడా రాయలేదు. సినిమాకి పునాది కథే. దానిపై ఎన్ని అందమైన ఇటుకలు పేర్చనివ్వండి.. పునాది గట్టిగా లేకపోతే అది అచ్చంగా ఇసుక మేడే.
కానీ, కొంతమంది హీరోలుంటారు. వాళ్లకంటూ ఓ స్టైల్ ఉంటుంది. వాళ్లకంటూ ఓ సెటప్ ఉంటుంది. వాటి చుట్టూ రేఖామాత్రంగా ఓ చిన్న కథ ఉంటే చాలు.. బాక్సాఫీసు దగ్గర వర్కవుట్ అయిపోతుంటుంది. ‘ఈ హీరోల సినిమాలకు పెద్ద కథలేం అక్కర్లేదు’ అని ప్రేక్షకులే రిబేట్లూ, డిస్కౌంట్లూ ఇస్తుంటారు.
రవితేజ కూడా అలాంటి హీరోనే. తన బలం.. ఎంటర్‌టైన్‌మెంట్. లాజిక్కుల్ని పక్కన పెట్టేసి కేవలం వినోదంతో ఎన్నో విజయాల్ని అందుకొన్నాడు. ఇప్పుడు ‘ధమాకా’తో వచ్చాడు. మరి ‘ధమాకా’ సౌండ్ ఎలా ఉంది?

ఫొటో సోర్స్, @peoplemediafcy
బిజినెస్ మాన్.. కామన్ మాన్...
చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత. తన చివరి రోజుల్లో విశాఖపట్నంలో మరో కంపెనీ స్థాపించాలని, తన కంపెనీలో సగం వాటా కార్మికులకు ఇవ్వాలని అనుకొంటాడు. అందుకు ప్రయత్నాలు మొదలెడతాడు. మరోవైపు జేపీ (జయరాం) కన్ను పీపుల్స్ మార్ట్ పై పడుతుంది. ఆ కంపెనీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు.
చక్రవర్తి వారసుడు ఆనంద్ (రవితేజ). ఎలాంటి సమస్య వచ్చినా కూర్చుని మాట్లాడుకొంటే పరిష్కారం దొరుకుతుంది అనుకొనే బిజినెస్ మాన్. ఆనంద్‌లా ఉండే మరో వ్యక్తి స్వామి (రవితేజ). తను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. సమస్య ఎస్తే నిలబడి ఎదిరించాల్సిందే అనుకొనే కామన్ మాన్.
వీరిద్దరినీ ఒకేసారి ప్రేమిస్తుంది ప్రణవి (శ్రీలీల). ఒకేసారి ఇద్దరిని ప్రేమించినా.. ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి. అందుకోసం ఒకరికి ‘నో’ చెప్పాలనుకొంటుంది.
మరి.. ప్రణవి ఎవరిని వదులుకొంది? ఎవరిని ప్రేమించింది? పీపుల్స్ మార్ట్‌ని లాక్కోవడానికి జేపీ చేసిన ప్రయత్నాలేంటి? వాటిని ఆనంద్ ఎలా తిప్పికొట్టాడు? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కమర్షియల్ మీటర్‌లో...
రవితేజ సినిమాలన్నీ ఓ టెంప్లేట్‌లో సాగిపోతుంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్, హీరోయిజం, పాటలూ, పంచ్ డైలాగులూ.. ఇదీ వరుస. అచ్చంగా ఇదే ఫార్మెట్‌లో సాగే సినిమా ధమాకా. తొలి సీన్ నుంచే ఈ సినిమా కమర్షియల్ మీటర్‌లోనే పరుగెడుతుంటుంది.
ఈసారి ఇద్దరు రవితేజలు కాబట్టి.. తెరపై డబుల్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆనంద్‌ని క్లాస్‌గా, స్వామిని మాస్‌గా చూపించాడు దర్శకుడు. ఇద్దరి పాత్రలు.. అవి ప్రవర్తించే విధానం, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆయా పాత్రలకు తగినట్టుగానే ఉంటాయి.
రవితేజలు ఇద్దరైనా. కాస్త ఎక్కువ తూగింది స్వామి పాత్రే. ఎందుకంటే రవితేజని తన అభిమానులు ఎలా చూడాలనుకొంటారో.. ఆ పాత్ర అలా ఉంటుంది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంటుంది.
ఇంటికొచ్చి అమ్మానాన్నలను బెదిరించి వెళ్లారని.. రఘబాబు అండ్ కోకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు స్వామి. ఈ సినిమాలో రవితేజ ఇంట్రడక్షన్ సీన్ అదే. తొలి సన్నివేశంలోనే ఆ పాత్ర తాలుకూ క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా చెప్పేశాడు దర్శకుడు. పైగా.. ఈ సినిమాలో లాజిక్కులు ఉండవని, మ్యాజిక్ మాత్రమే చూడాలని హింట్ ఇచ్చేశారు.
లవ్ ట్రాక్ కాస్త భిన్నంగానే ఉంటుంది. ఒకేలాంటి ఇద్దరిని ఒకేసారి ప్రేమిస్తుంది కథానాయిక. ఆ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో తెలీక సతమతమవుతుంది. ఓ అబ్బాయిని ఓ అమ్మాయి ప్రేమిస్తే.. ఆ అబ్బాయికే కాదు.. ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లోవాళ్లకూ ‘ఐ లవ్ యూ’ చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యామిలీ మొత్తం ప్రేమించినప్పుడే ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని చెప్పడం బాగుంది.
అసలు ఈ కథలో రవితేజలు ఇద్దరా? ఒక్కరేనా? అనేదే పెద్ద ట్విస్టు. కానీ.. అసలు నిజం ఏమిటన్నది తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడికి అర్థమైపోతుంటుంది. దాన్ని పెద్ద ట్విస్టుగా ఇంట్రవెల్‌లో రివీల్ చేశాడు దర్శకుడు. ప్రేక్షకులు కూడా దాన్ని సర్‌ప్రైజింగ్‌గా తీసుకొన్నట్టు నటిస్తారంతే.. ఎందుకంటే అసలు విషయమేమిటన్నది ముందే తెరలు తెరలుగా అర్థమైపోతుంటుంది.

ఫొటో సోర్స్, @peoplemediafcy
రవితేజ మార్క్ - రిమార్క్
కథలో బలం లేదన్నది ముందే తెలిసిపోతుంది. దర్శకుడూ కథని పెద్దగా నమ్మలేదనిపిస్తుంది. అందుకే వీలున్న ప్రతీ చోటా.. రవితేజ మార్క్ వినోదాన్ని కావల్సినంత ఇచ్చేద్దాం అని ఫిక్సయ్యాడు. దానికి తగ్గట్టుగానే సన్నివేశాలు రాసుకొన్నాడు.
విశ్రాంతికి ముందు.. ‘ఇంద్ర’ సినిమాని పోలిన ఓ సీన్ తెరపైకి వస్తుంది. దాన్ని కాపీ అనుకోకూడదని స్పూఫ్‌గానే కలరింగు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకే ఇంద్ర సన్నివేశంలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగులు మక్కీకి మక్కీ వాడేశాడు. థియేటర్లో ఈ సీన్ బాగానే వర్కవుట్ అయ్యింది.
ఈమధ్య జానపదాలు, పల్లె పాటలు బాగా పాపులర్ అవుతున్నాయి. ప్రైవేటు ఆల్బమ్స్ ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇలాంటి పాట సినిమాల్లో ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ తీసుకొస్తున్నాయి. `పల్సర్ బైకు మీద` పాట ఒకటి. దాన్ని ఈ సినిమాలో వాడేశారు. విలన్ ముందు హీరోయిజం చూపించిన తరవాత ఈ పాట ప్లే అవుతుంది. ఆ పాటలోని ఊపు.. రవితేజ - శ్రీలీల స్టెప్పులు మాస్‌కి బాగా నచ్చేస్తాయి.
రావు రమేష్ - హైపర్ ఆది ట్రాక్‌ని దర్శక నిర్మాతలు బలంగా నమ్మారు. ఈ సినిమాలో ఈ ట్రాక్ హైలెట్ అవుతుందని భావించారు. కానీ తెరపై ఆశించిన స్థాయిలో పండలేదు. హైపర్ పంచ్ వేసినప్పుడల్లా.. జబర్‌దస్త్ స్కిట్లే గుర్తొస్తుంటాయి.
అప్పుడెప్పుడో జొన్నవిత్తుల తిట్ల దండకాన్ని రాశారు. అది అప్పట్లో పెద్ద పాపులర్ కాలేదు. కానీ ఇప్పుడు ఆ దండకాన్ని రవితేజ - రావు రమేష్‌లపై ప్లే చేశారు. అది కాస్త ఫన్నీగానే ఉన్నా - ఇక్కడ ఇలాంటి ప్లేస్‌మెంట్‌లో వాడడం.. నిజంగా ఇరికించిన ఫీలింగ్ కలిగిస్తుంది.
అప్పటి వరకూ జేపీని క్రూరమైన విలన్‌గా చూపించిన దర్శకుడు.. సడన్‌గా హీరో ఎత్తులకు చిత్తయిపోతున్నట్లుగా చూపిస్తాడు. ప్రతినాయకుడి నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోతుంది.
నిజానికి హీరో - విలన్ పాత్రలు ఎంత పోటా పోటీగాఉంటే తెరపై అంత హీరోయిజం పండుతుంది. ఆ విషయాన్ని దర్శకుడు నిర్లక్ష్యం చేశాడు. ప్రతీ సన్నివేశంలోనూ మాస్, మసాలా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవా? అనిచూసుకొన్నాడు కానీ.. అసలు తీస్తున్న సన్నివేశంలో బలం ఉందా? అది నిలబడుతుందా? అనే అంచనాకు రాలేకపోయాడు దర్శకుడు.
పతాక సన్నివేశాలు కూడా విసిగిస్తాయి. చాలా రొటీన్ ఫార్మాట్‌లో ఈ సినిమాని ముగించిన తీరు చూస్తే. దర్శకుడి దగ్గర కొత్తగా చెప్పడానికి ఏం లేదా? అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, @peoplemediafcy
ఆగయా మాస్ రాజా
ఇలా అతుకుల బొంతలా తయారైన ఈ సినిమాకి కాస్త అయినా భరించారంటే దానికి కారణం.. రవితేజ ఎనర్జీనే. ‘రాజా ది గ్రేట్’ తరవాత రవితేజ ఇంత హుషారైన పాత్ర చేయలేదు. కాబట్టి.. రవితేజ అభిమానులకు ఈ సినిమాలో రవితేజని ఇలా చూడడం నచ్చుతుంది.
డాన్సులపై రవితేజ శ్రద్ధ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా చోట్ల సన్నివేశంలో, సంభాషణలో బలం లేని చోట కూడా రవితేజ తనదైన మేనరిజంతో పాస్ అయిపోయేలా చేశాడు.
పెళ్లి సందడితో శ్రీలీల మెరిసింది. తన చేతిలో పడిన తొలి పెద్ద సినిమా ఇదే. అయితే శ్రీలీల ఒక్కో చోట ఒక్కోలా కనిపించింది. తన అల్లరి.. కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఓవరాక్షన్ కూడా చేసింది. అయితే డాన్సుల్లో మాత్రం రవితేజకు గట్టి పోటీ ఇచ్చింది.
సచిన్ ఖేడ్కర్‌కి ఇది అలవాటైన పాత్రే. జయరాం విలనిజం స్టైలిష్‌గా ఉంది. కొన్ని చోట్ల తన నటనను డబ్బింగ్ డామినేట్ చేసింది.

ఫొటో సోర్స్, @peoplemediafcy
భీమ్స్.. మామూలుగా కొట్టలేదు
ఈ సినిమాలో రవితేజ కంటే ఎనర్జిటిక్‌గా అనిపించిన అంశం.. భీమ్స్ అందించిన పాటలు. ప్రతీ పాటా హుషారుగా సాగింది. జింతాత అయితే మాస్‌కి బాగా నచ్చేస్తుంది. తెలంగాణ ఫోక్ పాట మరోటి ఆల్బమ్‌లో లేదు కానీ థియేటర్లో ఉంది. అది కూడా బీ, సీ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేసిందే.
సీన్ ఎప్పుడైతే పడిపోయిందో.. అప్పుడు పాటతో కాస్త ఊతం ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రసన్న రాసిన కథలో బలం లేదు. రాసిన మాటల్లో మ్యాజిక్ లేదు. స్ఫూఫ్స్ ఎక్కువయ్యాయి. తెరపై ఎంత పెద్ద స్టార్ ఉన్నా, ఎంత హంగామా చేసినా కథ విషయంలో రాజీ పడకూడదు.
బలమైన కథ లేకపోయినా ఫర్వాలేదు. కానీ లాజిక్కులకు అందని కథలతో మాత్రం అద్భుతాలు చేయాలని చూడకూడదు. రవితేజ అభిమానులకు కాస్తో కూస్తో ధమాకా టైమ్ పాస్ అందించేస్తుంది. మిగిలిన వాళ్లకు మాత్రం నిరాశ తప్పదు.
నోట్: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.
ఇవి కూడా చదవండి:
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
- చార్లెస్ శోభరాజ్: పదేళ్లలో 20 మర్డర్లు, 5కిపైగా దేశాల్లో హత్య కేసులు, 4 దేశాల జైళ్ల నుంచి పరారీ.. ఎవరీ ‘బికినీ కిల్లర్’
- కోవిడ్-19 బీఎఫ్7: భారత్‌లోనూ ముప్పు తప్పదా.. ఇప్పుడు ఏం చేయాలి
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనా: బీఎఫ్7.. ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎంత డేంజరస్














