కోవిడ్-19 బీఎఫ్7: భారత్‌లోనూ ముప్పు తప్పదా.. ఇప్పుడు ఏం చేయాలి

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై గత రెండు, మూడు రోజులుగా భారత్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ముందెన్నడూ లేని స్థాయిలో చైనాలో కరోనావైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 80 కోట్లకు పెరిగే అవకాశముందని అంచనాలు వస్తున్నాయి.

చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్‌లలోనూ కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

చైనాలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్7 కారణమని వార్తలు వస్తున్నాయి.

ప్రొఫెసర్ ఎన్‌కే మెహ్రా
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ ఎన్‌కే మెహ్రా

భారత్‌లోనూ..

భారత్‌లోనూ మూడు ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్7 కేసులు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురిలో ఇద్దరు రోగులు కోలుకున్నట్లు గుజరాత్ ప్రజారోగ్య విభాగం ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపింది.

మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కొంతమందికి విమానాశ్రయాల్లో బుధవారం నుంచి కరోనావైరస్ టెస్టులు కూడా చేయడాన్ని మొదలుపెట్టినట్లు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

చైనాలో భారీగా కేసులకు కారణం అవుతున్న ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్7 భారత్‌లో కూడా వ్యాపిస్తోందనే వార్తల నడుమ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా ఆందోళన చెందాల్సిన అవసరముందా? ఒకవేళ ఇక్కడ కూడా కేసులు పెరిగితే, పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? రెండు డోసులతోపాటు బూస్టర్ వ్యాక్సీన్ తీసుకున్న వారికి మళ్లీ కోవిడ్-19 సోకే అవకాశముందా?

చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ ప్రశ్నలపై దిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్ ఎన్‌కే మెహ్రా మాట్లాడారు. ఆ సమాధానాలు ఆయన మాటల్లోనే..

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ప్రజలు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇప్పటికే కోవిడ్-19 సోకింది.

చైనాలో మొదట్నుంచీ ‘‘జీరో కోవిడ్’’ విధానాన్ని అమలుచేశారు. ప్రజలను బయట తిరగకుండా ఆంక్షలు విధించారు. అందుకే అక్కడ ఎక్కువ మందికి వైరస్ సోకలేదు. కానీ, ఇక్కడ అలా కాదు. ఒమిక్రాన్ సమయంలో చాలా మందికి ఈ వైరస్ సోకింది.

ఒకసారి వైరస్ సోకితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అదే మీరు వ్యాక్సీన్ తీసుకుంటే, సహజంగానే బలపడిన రోగ నిరోధక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది.

మన దగ్గర చాలా మందికి వైరస్ సోకడంతో సహజంగానే రోగ నిరోధక వ్యవస్థ బలపడింది. నిజానికి చాలా మందిలో వైరస్ సోకిన లక్షణాలు కూడా కనిపించలేదు. అదే సమయంలో చాలా మంది వ్యాక్సీన్లు కూడా తీసుకున్నారు. ఇక్కడ చాలా మంది రెండు డోసుల వ్యాక్సీన్ పూర్తిచేసుకున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, NURPHOTO

చైనాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

అయితే, చైనాలో అలా జరగలేదు. ఎందుకంటే అక్కడ జీరో కోవిడ్ పాలసీని పక్కాగా అమలు చేశారు. దీంతో ఎక్కువ మందికి వైరస్ సోకలేదు.

మరోవైపు చైనాలో ఎక్కువగా సినోవ్యాక్, సినోఫార్మ్ వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చారు.

అయితే, మిగతా వ్యాక్సీన్లతో పోల్చినప్పుడు వీటి ప్రభావం తక్కువగా కనిపిస్తోందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డైరెక్టర్ గువవో ఫూ అంగీకరించారు. ఈ రెండు వ్యాక్సీన్లను ఇక్కడే తయారుచేశారు.

ఒకవైపు వ్యాక్సీన్లు తక్కువ ప్రభావంతో పనిచేయడం, రెండోవైపు జీరో కోవిడ్ పాలసీ వల్ల అక్కడ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి.

మరోవైపు ఆ వ్యాక్సీన్లు తీసుకుని చాలా మంది ఆరు నెలలకుపైనే గడిచింది. ఫలితంగా శరీరంలో యాంటీబాడీల సంఖ్య తగ్గడంతో వాటి ప్రభావం కూడా తగ్గుతుంది.

వ్యాక్సీన్ శక్తిమంతంగా లేకపోతే, కొత్త టీ-కణాలు ఏర్పడటం కష్టం అవుతుంది. ఇవి రోగ నిరోధక వ్యవస్థకు మెమరీలా పనిచేస్తాయి. ఇవి కరోనావైరస్‌ను గుర్తుపట్టి, మళ్లీ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసేలా రోగ నిరోధక వ్యవస్థకు సంకేతాలు పంపిస్తాయి.

వీడియో క్యాప్షన్, వ్యర్థాల సమస్యను మహమ్మారి మరింత పెంచిందంటున్న ఓ అధ్యయనం

భారత్ వ్యాక్సీన్లు శక్తిమంతమైనవి..

భారత్‌లో ఎక్కువ మందికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఇచ్చారు. ఈ రెండూ చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయి.

ఒక వ్యాక్సీన్ 80 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తే దాన్ని శక్తిమంతమైన వ్యాక్సీన్‌గా చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అయితే, 60 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తే శక్తిమంతమైన వ్యాక్సీన్‌గా చెబుతోంది. మన వ్యాక్సీన్లు డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల కంటే చాలా ముందున్నాయి.

కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఐదు అంచెల కోవిడ్-19 రక్షణ చర్యలను ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెస్టు, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ జాగ్రత్తలు పాటించడం లాంటి చర్యలు వీటిలో ఉన్నాయి.

కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని, అప్పుడే వేరియంట్లను ట్రాక్ చేయడానికి వీలుపడుతుందని కేంద్రం భావిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఈ 11 ఏళ్ళ అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది...

ప్రజలకు సూచినలివీ..

ఇక ముప్పు ఎక్కువగా ఉండే ప్రజల విషయానికి వస్తే, అంటే క్యాన్సర్ రోగులు, మధుమేహులు, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ఉండేవారు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి.

ఒమిక్రాన్ వేవ్‌లో వైరస్ సోకినవారు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే, జాగ్రత్తలు మాత్రం అందరూ తీసుకోవాలి.

ఇన్ఫెక్షన్లు పెరిగితే, ఇంట్లోని వృద్ధులకు ముప్పు పొంచివుండే అవకాశం ఎక్కువ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)