రామసేతు ఉన్నట్టు ఆధారాలేమీ లేవని పార్లమెంటుకు తెలిపిన మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, NASA
రామసేతు మూలాలకు సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలను భారతీయ ఉపగ్రహాలు గుర్తించలేదని కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘‘భారత్, శ్రీలంక ప్రాంతాలను అనుసంధానం చేసే రామసేతు ఫోటోలను భారతీయ ఉపగ్రహాలు హై రిజల్యూషన్‌తో తీశాయి. కానీ, అది ఉన్నట్టు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు దొరకలేదు’’ అని చెప్పారు.
సముద్రంలో మునిగిపోయిన ద్వారక ఫోటోలను రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ల ద్వారా తీయలేమని, ఎందుకంటే భూ ఉపరితలం కింద ఫోటోలను అవి తీయలేవని కూడా మంత్రి పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
అయితే, ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై విపక్షాలు తీవ్ర విమర్శలు లేవనెత్తాయి.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పిందని, అప్పుడు కాంగ్రెస్‌ని బీజేపీ హిందూ వ్యతిరేక పార్టీగా అభివర్ణించిందని విపక్షాలు మండిపడ్డాయి.
హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ ఈ ప్రశ్నను పార్లమెంట్‌లో లేవనెత్తారు.
భారతీయ పురాతన నాగరిక సమాజం గురించి వస్తున్నవి కేవలం అపోహలేనా? లేదా ఇవి ఉన్నట్టు ఏమైనా ఆధారాలున్నాయా? అని కార్తికేయ శర్మ ప్రశ్నించారు.
ఒకవేళ ఆధారాలుంటే, రామసేతు ఉన్నట్టేనా, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోల ద్వారా ద్వారక నగరం సముద్రంలో కలిసిపోయినట్టు శాస్త్రీయంగా నిరూపితమైందా? అని కార్తికేయ శర్మ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, SANSAD TV
జితేంద్ర సింగ్ ఏం చెప్పారు?
ఈ ప్రశ్నలకు బదులిస్తూ జితేంద్ర సింగ్ తొలుత ఎంపీ కార్తికేయ శర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ప్రశ్నలు సభలో చాలా అరుదుగా అడుగుతారని జితేంద్ర సింగ్ అన్నారు.
‘‘చరిత్రకు సంబంధించిన అంశాల సమాచారాన్ని సేకరించేందుకు ఆధునిక సాంకేతికను వాడుతున్నాం. అంతరిక్ష, సాంకేతిక విభాగం ఈ పనిలో భాగమైంది’’ అని జితేంద్ర సింగ్ తెలిపారు.
రామసేతు విషయానికి వస్తే, ‘‘దీన్ని కనుగొనడంలో ఎన్నో ఆటంకాలున్నాయి. ఎందుకంటే దీని చరిత్ర 18 వేల సంవత్సరాల కిందటిది. ఒకవేళ చరిత్రను చూస్తే, ఈ వంతెన 56 కిలోమీటర్ల పొడవైనదిగా తెలుస్తుంది. అంతరిక్ష సాంకేతికత ద్వారా సున్నపురాయితో రూపొందిన కొన్ని ద్వీపాలను మేము గుర్తించగలిగాం. వాటి బండరాళ్ల నుంచి విడిపోయిన కొన్ని చిన్న రాళ్లను కనుగొన్నాం. అయితే, ఈ రాళ్లు ఆ వంతెనకు సంబంధించినవేనా? అని చెప్పడం కష్టం. కానీ, కొంత మాత్రం ఆ వంతెనకు చెందినవేనని తెలుస్తుంది’’ అని మంత్రి అన్నారు.
కానీ, దీని నుంచి ఎలాంటి తుది నిర్ణయానికి రాలేమని చెప్పారు. ఎలాంటి రకం నిర్మాణం అక్కడ ఉందో కచ్చితంగా చెప్పడం కష్టమని తెలిపారు. అయితే, అక్కడ ఏదో ఒక నిర్మాణం అయితే ఉందని ప్రత్యక్ష, పరోక్ష సంకేతాలు ఉన్నట్లు చెప్పారు.
ఆ తర్వాత సరస్వతి నది కూడా మంత్రి ప్రస్తావించారు. రాజస్తాన్ ఇసుక దిబ్బల కింద పెద్ద నది ఉన్నట్టు ఆధారాలున్నాయని మంత్రి చెప్పారు.
భారత్‌లో ఉన్న చాలా పౌరాణిక కథలు కూడా రాజస్తాన్ ఇసుక దిబ్బల కింద పురాతన నది ఉన్నట్టు తెలుపుతున్నాయి.
సున్నితమైన రాజకీయ అంశం..
రామసేతు అనేది సున్నితమైన రాజకీయ అంశం. భారత్, శ్రీలంక మధ్యలో రామసేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని బీజేపీ సైతం వ్యతిరేకిస్తోంది.
రామసేతు ఆనవాళ్లను ఈ ప్రాజెక్టు నాశనం చేస్తుందని బీజేపీ, సంఘ్ పరివార్‌లు పేర్కొంటున్నాయి.
అయితే రామసేతు ఉన్నట్టు సరియైన ఆధారాలు లేవని కాంగ్రెస్ పార్లమెంట్‌లో చెప్పినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
ఆడమ్స్ బ్రిడ్జ్ (రామసేతు)గా పేర్కొన్న ఈ ప్రాంతాన్ని, భారత అంతరిక్ష విభాగం కాంగ్రెస్ కాలంలో ప్రచురించిన తన పుస్తకంలో ప్రస్తావించింది.
ఇమేజస్ ఇండియా పేరుతో ప్రచురించిన పుస్తకంలో.. ‘‘రామసేతు ఒక రహస్యం. పురావస్తు అధ్యయనాలు ఇది 1,75,000 సంవత్సరాల కిందటిదని చెప్తున్నాయి. కానీ, దీని నిర్మాణం చూస్తే, ఇది మానవ నిర్మిత కట్టడంగా అనిపించడం లేదు’’ అని తన పుస్తకంలో పేర్కొంది.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సైతం రామసేతు ఉన్నట్టు పటిష్టమైన ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘భక్తులందరూ, కళ్లు అప్పగించుకుని, చెవులు బార్ల తెరుచుకుని వినండి. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఏం చెప్పిందంటే, రామసేతు ఉన్నట్టు కచ్చితమైన ఆధారాలు లేవంది’’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. ఈ మేరకు పవన్ ఖేరా ఓ ట్వీట్ చేశారు.
జన్ అధికార్ పార్టీ నేత పప్పు యాదవ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు.
‘‘మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది. కానీ, ఆ సమయంలో కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకులు అంటూ బీజేపీ విమర్శించింది’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అసలు రామ సేతు ఏమిటి?
రావణుడి రాజధాని శ్రీలంక నుంచి సీతను రక్షించేందుకు శ్రీరాముడు వానర సేన సాయంతో రామసేతు నిర్మాణాన్ని చేపట్టినట్టు రామాయణంలో రచించారు.
12 మీటర్ల లోతైన, 300 మీటర్ల వెడల్పున సీతాసముద్రం ప్రాజెక్టును నిర్మించేందుకు 2005లో యూపీఏ-1 ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం. దీనివల్ల రామసేతు రాళ్లు పగలగొట్టాల్సి వచ్చింది.
ఈ ప్రాజెక్టు వల్ల శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు, 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతాయని భావించింది.
కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండటంతో దీనిని హిందూ సంస్థలు వ్యతిరేకించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సమయంలో మద్రాసు హైకోర్టులో ఒక ఫిర్యాదు దాఖలైంది.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ అంశం సుప్రీంకోర్టుకి కూడా వెళ్లింది. రామాయణంలో ప్రస్తావించిన విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నాటి ప్రభుత్వం తన పిటిషన్‌లో తెలిపింది.
అప్పటి ప్రభుత్వం దీనిపై భారత పురావస్తు శాఖ సాయంతో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. రామసేతును రాముడు నిర్మించాడని చెప్పటానికి చాత్రిక ఆధారాలు ఏవీ లేవని పేర్కొంది.
2007లో సుప్రీంకోర్టు ఆ ప్రాజెక్టును నిషేధించింది.
ఆ తర్వాత 2021లో మోదీ ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధనకు, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది.
రామసేతు మానవ నిర్మితమా? కాదా? రామాయణ కాలంలో దీనిని నిర్మించారా? అన్నది తెలుసుకోవడం కోసం మూడేళ్ల పరిశోధన చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
- మావోయిస్టులతో గెరిల్లా పోరాటం చేస్తున్న మహిళా పోలీస్ కమాండోలు...
- ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?
- పురుషుల గంభీరమైన స్వరం అంటే మహిళలకు ఎందుకు అంత ఇష్టం
- హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?
- డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















