నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో యువతి హత్య.. ఇప్పుడు భారత్‌లో నిందితుడి అరెస్ట్.. ఎలాగంటే..

తోయా కార్డింగ్లీ

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, తోయా కార్డింగ్లీ
    • రచయిత, సైమన్ అట్కిన్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక యువతి మృతదేహం కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

2018 అక్టోబర్‌లో 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ మృతదేహాన్ని ఉత్తర ఆస్ట్రేలియాలోని ఒక బీచ్ ఒడ్డున కనుగొన్నారు. ఆ తరువాత, అది "ఉన్మాదంతో కూడిన, దారుణమైన" హత్య అని పేర్కొన్నారు.

ఈ హత్యపై సమాచారం అందించినవారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతిగా అందిస్తామని ఈ నెల ప్రారంభంలో క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఆ దిశలో, తోయా హత్య కేసులో రాజ్విందర్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

రాజ్విందర్‌ను శుక్రవారం దిల్లీలో భారతీయ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారని క్వీన్స్‌లాండ్ పోలీసులు తెలిపారు. ఆయన్ను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగించే విషయంలో త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు.

ఆ తరువాత, రాజ్విందర్‌ను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లి నేర విచారణ జరుపుతారు.

38 ఏళ్ల రాజ్విందర్‌ ఆస్ట్రేలియాలో మేల్ నర్స్‌గా పనిచేసేవారు. తోయా మృతదేహాన్ని కనుగొన్న కొన్ని గంటలకే రాజ్విందర్‌ ఉద్యోగం, భార్యాపిల్లలను విడిచిపెట్టి ఆస్ట్రేలియా నుంచి పారిపోయారు. సిడ్నీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ఫొటో సీసీటీవీ కెమేరాకు చిక్కింది.

సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రాజ్విందర్ సింగ్

ఫొటో సోర్స్, QUEENSLAND POLICE

ఫొటో క్యాప్షన్, సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో రాజ్విందర్ సింగ్

తోయా హత్యకు సంబంధించి గూఢచారులు కొన్ని వివరాలను అందించారు.

2018 అక్టోబర్ 21న తోయా తన పెంపుడు కుక్కను తీసుకుని వాంగెట్టి బీచ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఆమె ఇంటికి తిరిగిరాలేదు.

మర్నాడు ఆమె తండ్రి బీచ్ ఒడ్డున కూతురి మృతదేహాన్ని గుర్తించారు. తోయా మృతదేహం సగం ఇసుకలో కప్పబడి ఉంది.

రాజ్విందర్‌ సింగ్‌ను పట్టుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రజల మద్దతు కావాలని ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియా అధికారులు కోరారు.

భారత్‌లోని పంజాబ్‌కు చెందిన రాజ్విందర్‌ సింగ్, ఆస్ట్రేలియాలోని ఇన్నిస్‌ఫెయిల్‌లో నివసించేవారు. ఈ ఊరు హత్య జరిగిన ప్రదేశానికి రెండు గంటల దూరంలో ఉంది. 

ఆస్ట్రేలియా నుంచి పారిపోయి పంజాబ్ చేరుకున్న రాజ్విందర్ అరెస్ట్‌ను తప్పించుకు తిరుగుతున్నారని క్వీన్స్‌లాండ్ పోలీస్ కమిషనర్ కాటరీనా కారల్ చెప్పారు.

రాజ్విందర్‌ను తమకు అప్పగించాలని ఆస్ట్రేలియా 2021 మార్చిలో భారత్‌ను కోరింది. భారత అధికారులు గత నెలలో అంగీకారం తెలియజేశారు. కానీ, వెంటనే రాజ్విందర్‌ను పట్టుకోలేకపోయారు.

క్వీన్స్‌లాండ్ పోలీసుకు చెందిన ఒక డిటెక్టివ్ ఇటీవలే భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తిరిగివెళ్లారు. కొన్ని నెలలుగా, క్వీన్‌లాండ్ పోలీసు విభాగంలో హిందీ, పంజాబీ మాట్లాడగలిగిన అయిదుగురు అధికారులకు వాట్సాప్ ద్వారా ఈ హత్య కేసుకు సంబంధించిన సమాచారం అందుతోందని ఆస్ట్రేలియా మీడియాలో రిపోర్టులు వచ్చాయి.

ఈ నెల ప్రారంభంలో రాజ్విందర్ గురించి సమాచారం అందించినవారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం బహుమతి ప్రకటించిన తరువాత, "తన కూతురికి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు" తోయా తండ్రి పేర్కొన్నారు. 

రాజ్విందర్ సింగ్ అరెస్ట్‌లో భారత అధికారులు అందించిన సహకారాన్ని కమిషనర్ కారల్ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)