లండన్‌లో చోరీ అయిన రెండున్నర కోట్ల రూపాయల కారు కరాచీలో దొరికింది... అక్కడికి ఎలా చేరింది?

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, మహమ్మద్ సుహైబ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో గత నెల 30న కస్టమ్స్ అధికారులు ఓ వాహనం కోసం గాలించారు. లండన్ నుంచి చోరీ అయిన ఓ కారు పాకిస్తాన్‌కు చేరిందనే సమాచారం కస్టమ్స్ శాఖకు అందింది. విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన సమాచారంతో కరాచీలోని డీహెచ్‌ఏ ప్రాంతంలో గాలించారు.
అది ఆషామాషీ కారు కాదు. బెంట్లీ మల్సాన్ వీటీ ఆటోమేటిక్ కారు. దాని విలువ రూ. 2.4 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
ఈ కారు గురించి నిఘా వర్గాలు చాలాకాలం నుంచి గాలిస్తున్నాయి. ఆగస్టు 30న అది ఒక ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే కస్టమ్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.
దానిపై నల్ల రంగు గుడ్డ కప్పి ఉంది. గుడ్డను తొలగించి చూస్తే స్థానిక నంబర్ ప్లేట్ కనిపించింది.

ఫొటో సోర్స్, TWITTER
'కస్టమ్స్ ఉద్యోగుల సహకారంతో రిజిస్ట్రేషన్'
కస్టమ్స్ రిపోర్ట్ ప్రకారం, వాహనం ఛాసిస్ నంబర్ ద్వారా దీనిని గుర్తించారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంలో ఉన్న నంబర్‌తో సరిచూసి ధ్రువీకరించారు. ఆ తరువాత దానిని స్వాధీనం చేసుకున్నారు.
కారును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కరాచీలో ఈ కారు యజమని మాట్లాడుతూ, తనకు కారు అమ్మిన వ్యక్తి 2022 నవంబర్ నాటికి చట్టపరంగా పత్రాలన్నీ పూర్తి చేస్తానని మాటిచ్చినట్టు చెప్పారు.
కారు తాళాలు లేకపోవడంతో క్యారియర్ సాయంతో దానిని తరలించినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎటువంటి చట్టపరమైన పత్రాలు లేకపోయినప్పటికీ, ఈ కారు సింధ్‌లో రిజిస్టర్ అయింది.
ఇలాంటి కార్ల రిజిస్ట్రేషన్ కోసం విదేశీ వ్యవహారాల శాఖ, కస్టమ్స్ అనుమతి కావాలి. అలాగే, పన్నులు, సుంకాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మోటార్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, పన్నుల శాఖ సహకారంతో ఈ కారు రిజుస్ట్రేషన్ సాధ్యమైందని కస్టమ్స్ రిపోర్టులో పేరొన్నారు.
ఈ కారుకు సంబంధించిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఈ వాహనం బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు రవాణా కావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానిపై నంబర్ ప్లేట్ ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కారు లండన్ నుంచి కరాచీ ఎలా వచ్చింది?
విచారణ పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు వస్తుంది. అయితే, లండన్ నుంచి దొంగిలించిన వాహనాలు పాకిస్తాన్‌కు ఎలా చేరుకుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేశాం.
ఈ విషయమై పాక్ వీల్స్ సహ వ్యవస్థాపకుడు సునీల్ ముంజ్‌తో బీబీసీ మాట్లాడింది.
ఇవన్నీ చేయడానికి గ్యాంగ్స్ ఉంటాయని, ఎక్కడ చోరీ జరుగుతుందో అక్కడ దాని గురించి రిపోర్ట్ కాకుండా చూసుకుంటారని సునీల్ చెప్పారు.
కారు రవాణా చేసేటప్పుడు బయలుదేరిన దేశంలో, చేరవలసిన దేశంలో పత్రాలన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ కారు చోరీ అయినట్టు రిపోర్ట్ అయితే, ఓడరేవులోనే తనిఖీ చేసి పట్టుకుంటారు. కాబట్టి, కారు చోరీ అయినట్టు రిపోర్ట్ కాకుండా ఉండడం వాళ్లకి ముఖ్యం.
ప్రస్తుత కారు విషయంలో, లండన్ నుంచి పాకిస్తాన్ బదిలీ అయినప్పుడు ఇది చోరీ అయిన కారని ఎవరికీ తెలీదని సునీల్ చెప్పారు. ఇక్కడ పాకిస్తాన్‌లో కారు క్లియర్ అయిపోయిన తరువాత, లండన్‌లో చోరీ అయినట్టు రిపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఏ గ్యాంగ్ అయినా సరే, చేసే పని ఇదే. వాహనం తరలింపు సక్రమంగా జరిగి, చేరవలసిన చోటుకు చేరిన తరువాత దొంగతనం అయినట్టు రిపోర్ట్ చేస్తారు. అప్పుడు దాని యజమాని దాని గురించి వెతకడం ప్రారంభిస్తారని సునీల్ ముంజ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, ఇది మొదటి కేసు కాదని, పాకిస్తాన్‌లో ఇలాంటి చాలా వాహనాలకు రిజిస్ట్రేషన్ అయిందని సునీల్ చెప్పారు.
"అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ కారు కస్టమ్స్ కన్నుగప్పి రాలేదు. దీనికి సంబంధించిన కొన్ని ఎంబసీ పేపర్లు క్లియర్ అయ్యాయి. దౌత్యవేత్తలకు డ్యూటీ-ఫ్రీ కారు రవాణా అనుమతిస్తారు. ఎన్నేళ్లు వాళ్లు పదవిలో ఉంటే అన్నేళ్లు డ్యూటీ-ఫ్రీ కారు వారికి అనుమతిస్తారు. అయితే, ఇలా చోరీ అయిన కార్ల ద్వారా అసలు నేరస్థుడిని చేరుకోవడం కష్టం. శాంతి భద్రతల దృష్ట్యా ఇది చాలా ప్రమాదకరమైన విషయం" అని సునీల్ ముంజ్ అంటున్నారు.
ఈ కారు పాకిస్తాన్‌కు రవాణా చేసిన సమయంలో దీని ధర పాకిస్తాన్ కరెన్సీలో రూ. 4 కోట్ల 14 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ చెప్పింది. ప్రస్తుత మారకపు రేటు ప్రకారం దీని ధర రూ. 5 కోట్ల 85 లక్షలు. కారుపై సుంకం, పన్నుల తరువాత ధర పాకిస్తాన్ రూపాయలలో 30 కోట్లకు పైనే ఉంటుందని కస్టమ్స్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, TWITTER
సోషల్ మీడియాలో చర్చ
పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఈ చోరీ కారు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు జోకులు వేశారు.
ఈ కారు లండన్ నుంచి పాకిస్తాన్‌కు ఎలా వచ్చిందో తెలియాలి. దీని మీద పూర్తి దర్యాప్తు జరపాలని కొందరు యూజర్లు డిమాండ్ చేశారు.
కొందరు సరదాగా కామెంట్లు రాస్తూ, "లండన్ నుంచి కారు దొంగతనం చేసి పాకిస్తాన్ తీసుకొచ్చిన తొలి వ్యక్తికి బహుమతి ఇవ్వాలి" అంటూ హాస్యమాడారు.
కారు వీడియోలో కొందరు దాన్ని నెడుతున్నట్టు చూడవచ్చు. దీనిపై కూడా యూజర్లు సందేహాలు వ్యక్తం చేశారు. కారును ఎందుకు నెడుతున్నారంటూ ప్రశ్నించారు.
"లండన్ వాసులు మొత్తం ఉపఖండాన్నే దోచుకెళ్లారు బ్రదర్. ఆయనెవరో ఒక్క కారు మాత్రమే చోరీ చేశారు" అంటూ ఒక యూజర్ సరదాగా వ్యాఖ్యానించారు.
"లండన్ నుంచి బెంట్లీ కారును జేబులో పెట్టుకుని పాకిస్తాన్ తీసుకొస్తారు. అది పాకిస్తాన్‌లో రిజిస్ట్రర్ అవుతుంది కూడా" అంటూ మరో యూజర్ జోక్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్-మొహాలీ: దసరా ఎగ్జిబిషన్లో 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన జెయింట్ వీల్
- భారత ఆర్ధిక వ్యవస్థ బ్రిటన్ను అధిగమించిందా, ఇది నిజమేనా?
- ఝార్ఖండ్‌లో ఏ పార్టీకి మెజారిటీ ఎందుకు రాదు? ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకంత బలహీనంగా ఉంటుంది?
- ఆమె ఖాతాలోకి రూ. 55 కోట్లు వచ్చిపడ్డాయి.. ఆనందంగా ఖర్చు చేశారు.. 10 కోట్లతో ఇల్లు కొన్నారు.. ఏడు నెలల తర్వాత...
- చేయని తప్పుకు ఒక వ్యక్తిని అన్యాయంగా ఉరి తీసి, 70 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












