చేయని తప్పుకు ఒక వ్యక్తిని అన్యాయంగా ఉరి తీసి, 70 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన పోలీసులు

- రచయిత, డేనియల్లె ఫహియా
- హోదా, బీబీసీ న్యూస్
చేయని హత్యకు ఒక వ్యక్తిని దోషిగా తేల్చి ఆయనను బ్రిటన్ జైలులో ఉరి తీశారు. ఇది జరిగిన 70 ఏళ్ల తర్వాత పోలీసులు ఇప్పుడు ఆ వ్యక్తి కుటుంబాన్ని క్షమించమని కోరుతున్నారు.
మహమూద్ మట్టన్ ఒక బ్రిటిష్ సోమాలి, మాజీ నౌకాదళ ఉద్యోగి. ఆయనను 1952లో ఉరి తీశారు. కార్డిఫ్‌లో ఒక దుకాణ యజమాని లిలీ వోల్పర్ట్‌ను హత్య చేశారనే కేసులో దోషిగా తేలడంతో ఆయనకు ఉరిశిక్ష విధించారు.
1998లో రివ్యూ కమిషన్ ఆయన కేసును 'కోర్ట్ ఆఫ్ అప్పీల్' దృష్టికి తీసుకెళ్లింది.
ఈ సందర్భంగా మహమూద్ మట్టన్ విషయంలో ప్రాసిక్యూషన్ లోపభూయిష్టంగా జరిగిందని ఒప్పుకున్న సౌత్ వేల్స్ పోలీసులు కోర్టులో క్షమాపణలు తెలిపారు.
''ప్రాసిక్యూషన్ సరిగా జరగకపోవడం వల్ల మహమూద్ మట్టన్ బాధితుడిగా మారాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు అన్యాయం జరిగింది. ఇందులో పోలీసుల పాత్ర స్పష్టంగా తెలుస్తుంది'' అని చీప్ కాన్‌స్టేబుల్ జెరెమీ వాఘన్ అన్నారు.
"70 ఏళ్ల క్రితం ఈ కేసులో ఘోరమైన తప్పిదం జరిగింది. మహమూద్ కుటుంబం చాలా క్షోభ అనుభవించింది. వారు పడిన వేదనకు గానూ పోలీసుల తరఫున ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. అదే సరైన పని'' అని అన్నారు.

మహమూద్‌కు ఉరి వేసిన తర్వాత... హత్యానేరంలో ఆయన పాత్ర లేదంటూ మహమూద్ భార్య లారా, ఆయన ముగ్గురు కుమారులు డేవిడ్, ఒమర్, మెర్విన్‌లు 46 సంవత్సరాల పాటు ప్రచారం చేశారు.
కాలక్రమంలో వారంతా మరణించారు. ఇప్పుడు మహమూద్ కుమారులకు చెందిన మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారు పోలీసుల క్షమాపణను స్వీకరించారు. అయితే, అందులో ఒకరు మాత్రం పోలీసులు ఇప్పుడు క్షమాపణ చెప్పడాన్ని 'కపట చర్య' అని పిలిచారు.
''ఈ కేసులో ప్రత్యక్షంగా వేదన అనుభవించిన వారెవరూ ఇప్పుడు మాతో లేరు. క్షమాపణ విషయంలో చాలా ఆలస్యం జరిగింది. ఇప్పటికీ వారు ఇంకా క్షమాపణ చెప్పలేదు'' అని ఆయన మనవరాలు తాన్యా మట్టన్ అన్నారు.
మట్టన్ కుటుంబానికి 2001లో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందింది. కానీ, ఇప్పటివరకు పోలీసులు వారికి క్షమాపణ చెప్పలేదు.
1952 మార్చి 6వ తేదీన కార్డిఫ్ డాక్స్ ప్రాంతంలోని వస్త్రాల దుకాణంలో వోల్ఫర్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును కార్డిఫ్ సిటీ పోలీసులకు చెందిన డిటెక్టివ్‌లు దర్యాప్తు చేశారు.
41 ఏళ్ల వోల్ఫర్ట్‌ను గొంతు కోసి చంపారు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న పక్క గదిలో ఆమె తల్లి, సోదరి, కోడలు ఉన్నారు.

ఫొటో సోర్స్, RUTH
ఎలాంటి ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండానే హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మహమూద్‌ను అరెస్ట్ చేశారు. తెల్లజాతీయులతో కూడిన జ్యూరీ ఆయనపై హత్య ఆరోపణలు మోపి దోషిగా తేల్చింది. మరోవైపు, మహమూద్ మట్టన్‌కు ఇంగ్లిష్ చదవడం, రాయడం రాదు. ఆయన తక్కువగా ఇంగ్లిష్ మాట్లాడేవారు
మూడు రోజుల పాటు జరిగిన ఈ కేసు ట్రయల్‌లో మహమూద్ పట్ల తీవ్ర పక్షపాతం చూపించారు. మహమూద్ ఏర్పాటు చేసుకున్న డిఫెన్స్ న్యాయవాది కూడా ఆయనను 'అనాగరికుడు' అని పిలిచాడు.
హత్య జరిగిన ఆరు నెలల్లోపే మహమూద్‌ను ఉరి తీశారు. అప్పుడు ఆయన వయస్సు 28 ఏళ్లు. 1952 సెప్టెంబర్ 3వ తేదీన కార్డిఫ్ జైలులో తలారి అల్బర్ట్ పియరీపాయింట్ ఆయనను ఉరి తీశారు.
జైలులో ఉన్న తన భర్తను చూడటానికి లారా వెళ్లినప్పుడు అక్కడ తలుపుకు అంటించిన నోటీసును చూసి మహమూద్‌ను ఉరి తీసినట్లు ఆమె తెలుసుకున్నారు. డేవిస్ వీధిలోని లారా ఇంటికి కొన్ని వందల గజాల దూరంలోనే జైలు ఉంటుంది.

ఫొటో సోర్స్, NATIONAL ARCHIVES
''సమాజంలో, పోలీసు వ్యవస్థలో పేరుకుపోయిన జాత్యాహంకారం, పక్షపాతాన్ని నిర్మూలించేందుకు నేటికీ మేం కృషి చేస్తున్నాం. ఈ కేసు 70 ఏళ్ల నాటిది. అప్పడు జరిగిన అన్యాయంతో ప్రభావితమైన వారి వేదనను మేం మరువలేం. వ్యక్తులపై ఆ ఘటన చూపిన ప్రభావాన్ని మేం తక్కువగా అంచనా వేయలేం'' అని వాఘన్ అన్నారు.
''ఒక అమాయకుడికి, నిరపరాధికి న్యాయం జరిగేలా చూడటంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. మట్టన్‌ను దోషిగా తేల్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. క్రిమినల్ జస్టిస్ మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న మనందరం గతంలో చేసిన తప్పును, ఒక కుటుంబానికి చేసిన నష్టాన్ని గుర్తించాలి'' అని సౌత్ వేల్స్ పోలీస్, క్రైమ్ కమిషనర్ అలున్ మైఖేల్ అన్నారు.

మహమూద్ మట్టన్ పేరును ఈ హత్యా నేరం నుంచి తొలగించడానికి 46 ఏళ్ల పాటు చేసిన పోరాటాన్ని ఆయన కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అని వారి బంధువులు చెప్పారు.
''నేను, నా కుమారులు జీవచ్ఛవాల్లా బతికాం'' అని ఆయన భార్య లారా గతంలో అన్నారు. ఆమె 2008లో మరణించారు.
తన తండ్రి పట్ల జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నప్పుడు మహమూద్ రెండో కుమారుడు ఒమర్ వయస్సు 8 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి జీవితంపై తన దృక్పథం మారిపోయిందని ఒమర్ అన్నారు.
''జీవితాంతం మా నాన్న ఈ బాధ అనుభవించాడని నేను అనుకుంటున్నా. ఆయనకు ఈ విషయంలో చాలా కోపం ఉండేది'' అని ఒమర్ కుమార్తె తాన్యా మట్టన్, బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, KIRSTY MATTAN
ఒమర్ 2003లో 53 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఒక మారుమూల స్కాటిష్ బీచ్‌లో ఆయన మరణించారు.
''ప్రపంచంపై చాలా కోపంతో ఆయన పెరిగారు. ఆయన ఎందుకు కోపాన్ని పెంచుకున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ, ఇలా జరిగి ఉండకూడదు. చివరకు వారు తమ తప్పును తెలుసుకున్నందుకు సంతోషం. కానీ ఇది కపట చర్యలాగే అనిపిస్తోంది'' అని ఆమె వ్యాఖ్యానించారు.
తాన్యా కజిన్ కిర్ట్సీ. ఆమె మహమూద్ చిన్న కుమారుడు మెర్విన్ కూతురు.
''పోలీసుల నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు. ఆయన ముగ్గురు కుమారులు జీవితాంతం తమ తండ్రి హంతకుడు అనే కళంకాన్ని మోశారు'' అని కిర్ట్సీ అన్నారు.

ఫొటో సోర్స్, NATIONAL ARCHIVES
''మా నాన్న చాలా గొప్ప వ్యక్తి. మా బలం ఆయనే. కానీ, ఆయన చీకటిలో బతికారు. మద్యానికి బానిసయ్యారు. దాని వల్లే చనిపోయారు. వాళ్ల నాన్నకు జరిగిన అన్యాయం వారిని మానసికంగా చిదిమేసింది'' అని ఆమె చెప్పారు.
మహమూద్ మట్టన్, కేసు విచారణ సమయంలో కీలకమైన సాక్ష్యం అందుబాటులో లేనందున సంస్థాగతమైన జాత్యాహంకారానికి బాధితుడిగా మారాడని 'కోర్ట్ ఆఫ్ అప్పీల్'లో మట్టన్ కుటుంబానికి ప్రాతినిధ్యం వహించిన న్యాయ బృందం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
''శ్వేతజాతీయులు కాని వారు న్యాయస్థానాల్లో అధ్వాన్న పరిస్థితులు ఎదుర్కొనేవారు'' అని మానవహక్కుల కార్యకర్త, మట్టన్ తరఫు న్యాయవాది మైఖేల్ మ్యాన్స్‌ఫీల్డ్ అన్నారు.
''ఈ కేసులో సోమాలీలంటే వ్యతిరేకత కూడా పెద్ద పాత్ర పోషించింది. సౌత్‌వేల్స్‌లో సోమాలీలను చొరబాటుదారులుగా పరిగణించేవారు. ఉద్యోగాలు, ఇళ్లను వారు కొల్లగొడుతున్నారని అనుకునేవారు. సోమాలీలను ఎలాగైనా తరిమేయాలి అని భావించేవారు. మహమూద్ మట్టన్ కేసును వింటున్న జ్యూరీ కూడా ఇలా ఆలోచించే వాళ్లలో ఒకరు. 'ఈ హత్యను మహమూద్ చేసి ఉండకపోతే, ఆయన వర్గానికే చెందిన మరొకరు చేసి ఉంటారు' అని జ్యూరీ భావించి ఉంటుంది. అప్పుడు అలాంటి పరిస్థితులు ఉండేవి'' అని మైఖేల్ చెప్పుకొచ్చారు.
మహమూద్ మట్టన్ నిజానికి హర్గీసాకు చెందినవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ సోమాలీ ల్యాండ్‌గా పిలిచేవారు.

వేల్స్‌కు వచ్చిన ఒక ఏడాది తర్వాత 1947లో స్థానిక అమ్మాయి లారాను మహమూద్ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లోని జాత్యాహంకారం కారణంగా వీరిద్దరూ ఒకే వీధిలో వేర్వేరుగా ఉండాల్సి వచ్చింది.
''ఆయన ప్రతీ ఒక్కరినీ ప్రేమించాడు. మిగతా వారు కూడా తనను అలాగే ఆదరిస్తారని అనుకున్నారు. కానీ, తన చుట్టూ ఉన్న శత్రువుల గురించి ఆయనకు తెలియదు'' అని ఒకసారి లారా గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- రాతి యుగంలో మనుషులు ఎలా మాట్లాడుకునేవారు? పేర్లు, వేర్వేరు తెగలు, భాషలు ఉండేవా?
- కన్నెపొర: తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- ఆమె ఖాతాలోకి రూ. 55 కోట్లు వచ్చిపడ్డాయి.. ఆనందంగా ఖర్చు చేశారు.. 10 కోట్లతో ఇల్లు కొన్నారు.. ఏడు నెలల తర్వాత...
- వరంగల్: ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్ ఎందుకు తెరిచారు, ఇది ఎలా నడుస్తోంది?
- ఏ.కోడూరు: ఒకే పాఠశాలకు తండ్రి, కొడుకు, మనవడు.. మూడు తరాల ప్రభుత్వ స్కూల్ ఇదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












