ఝార్ఖండ్: ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకంత బలహీనంగా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 2005 నాటి మాట. సమయం రాత్రి 2.30 గంటలకు కావొస్తోంది. రాంచీ నగరంలో నిర్మానుష్యంగా ఉన్న మెయిన్ రోడ్డు పై ఒక్కసారిగా కలకలం మొదలైంది. కొన్ని వాహనాలు వేగంగా వెళుతుండగా, పోలీసు వ్యాన్‌లు వాటిని అనుసరిస్తూ వెళుతున్నాయి.
ఆ సమయంలోనే రాంచీ మెయిన్ రోడ్డులోని అన్ని హోటళ్లలో గదిగదినీ సోదా చేశారు.
అది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీకి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగల మెజారిటీ రాలేదు.
బీజేపీకన్నా తక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్, మిగిలిన పక్షాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి.
ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. ఇప్పుడు అధికారం ఎవరికి అని నిర్ణయించే అవకాశం కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది.
చిన్నపార్టీలు, కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ విజయ ధృవీకరణ పత్రాలతో రాంచీకి చేరుకోవడంతో పోలీసులు వారిని హోటల్‌కు తీసుకెళ్తున్నారు.
రాంచీ పోలీస్ సూపరింటెండెంట్ ఒక ఎమ్మెల్యేని కాలర్ పట్టుకుని లాగారు.
రాత్రంతా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఆ సమయంలో బీబీసీ ప్రతినిధిగా పని చేస్తున్న శ్యామ్ సుందర్, నేను రాత్రంతా ఈ ఘటనలను రికార్డ్ చేస్తున్నాం. వీటిని రికార్డు చేయరాదని అప్పటి పోలీస్ సూపరింటెండెంట్ కోరడంతో మేం ఆయనతో వాదనకు దిగాం.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త రాష్ట్రాల ఏర్పాటు
2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్. బిహార్ నుంచి విడిపోయిన తర్వాత జార్ఖండ్‌కు 81 అసెంబ్లీ స్థానాలు మిగిలాయి.
ఝార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అయిన బాబులాల్ మరాండీ తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు.
అప్పట్లో ఆయన ప్రభుత్వంలోని కూటమిలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో, ఆయన స్థానంలో అర్జున్ ముండా ముఖ్యమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
కీలక ఘట్టాలు
- ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఆ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఒక్కసారి కూడా పదవీకాలం పూర్తి చేయలేకపోయారు.
- ఒకసారి శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కేవలం పది రోజులే అధికారంలో ఉన్నారు.
- ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రికార్డు కూడా ఆయన సొంతం.
- ఝార్ఖండ్‌లో 21 ఏళ్లలో 11 ప్రభుత్వాలు మారాయి. ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చారు.
- రాజకీయ అస్థిరత కారణంగా ఝార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన కూడా విధించాల్సి వచ్చింది.
- 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా తన పూర్తి పదవీకాలాన్ని అనుభవించారు. కానీ, ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేలు, కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే, ఆయన పార్టీలోనే తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది.
- అధికార పార్టీకి పూర్తి మెజారిటీ లేనందున రాజకీయ సమీకరణాలలో భాగంగా ఝార్ఖండ్ రాష్ట్రానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కూడా నియమించాల్సి వచ్చింది. చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు బెంగాల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా జంషెడ్‌పూర్ సమీపంలో పోలీసులకు పట్టుబడ్డారు.
- ఝార్ఖండ్‌లో మరో కొత్త ప్రయోగం కూడా కనిపించింది. కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర ఎమ్మెల్యే మధు కోడా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆయన తన పదవీకాలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఝార్ఖండ్‌లో కేవలం 81 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండటంతో, మెజారిటీ విషయంలో తరచూ లెక్కలు మారుతుంటాయని, అందువల్ల రాజకీయ అస్థిరత ఏర్పడుతుంటుందని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు హరినారాయణ్ సింగ్ బీబీసీతో అన్నారు. ఝార్ఖండ్‌లో అసెంబ్లీ సీట్లను డీలిమిటేషన్ ద్వారా పెంచాలని రాజకీయ పార్టీలు పలుమార్లు ఎన్నికల కమీషన్‌ను కోరాయి.
81 స్థానాలలో మెజారిటీ సాధించాలంటే 41 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో రాజకీయ సంక్లిష్ట సమీకరణాల కారణంగా ఇక్కడ ఏ పార్టీ అయినా ఆ సంఖ్యను సాధించడం కష్టం.
"ఝార్ఖండ్‌కు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. యూపీ, బీహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్. ప్రతి ప్రాంతం భాష భిన్నంగా ఉంటుంది. కొందరు భోజ్‌పురి మాట్లాడతారు, కొందరు ముండారి, మరికొందరు ఖోర్తా, ఇంకొందరు బంగ్లా, ఒరియా ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోక్క విధంగా ఉంటుంది. ఈ ప్రాంతాల రాజకీయ సమస్యలపై కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు, బీహార్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు ప్రభావం చూపిస్తుంటాయి" అని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ బీబీసీతో అన్నారు.
ఇది కాకుండా ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ, ఝార్ఖండ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ-ఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి పార్టీలు అనేక రంగాల్లో ప్రభావం చూపుతున్నాయి. అందుకే, సొంత బలంతో ఎన్నికల్లో గెలవాలన్న జాతీయ పార్టీల కల ఒక పెద్ద డైలమాగా మిగిలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అవినీతి ఆరోపణలు
ఝార్ఖండ్‌లో అవినీతి మరక అంటని ప్రభుత్వం అంటూ ఏదీ లేదు.
మధు కోడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ఆయనతో పాటు ఆయన మంత్రుల కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి.
కోడా స్వయంగా జైలుకు వెళ్లడంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
గతంలో కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రభుత్వం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన సమయంలో ముగ్గురు ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు ' ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు డబ్బు తీసుకున్నారని' ఆరోపణలు వచ్చాయి.
ఇందులో ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌తో పాటు, ఆయన పార్టీకి చెందిన శైలేంద్ర మహతో, సూరజ్ మండల్‌లపై కూడా ఆరోపణలు వచ్చాయి. వారు జైలుకు కూడా వెళ్లారు.
సీబీఐ నివేదిక ప్రకారం, ఈ ఎంపీలు తాము తీసుకున్న ''లంచం మొత్తాన్ని నేరుగా బ్యాంకులోనే డిపాజిట్ చేశారు''
ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న హేమంత్ సోరెన్ తన పేరు మీద మైనింగ్ లీజును పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందున ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం గవర్నర్‌కు లేఖ కూడా రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
హేమంత్ సోరెన్ ప్రభుత్వం పడిపోతుందా?
''ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 18 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లకు పూర్తి మెజారిటీ ఉంది'' అని బీజేపీ నేత బాబూలాల్ మరాండి అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు రాగా, దాని కూటమి భాగస్వామి ఏజేఎస్‌యూ పార్టీకి 2 సీట్లు వచ్చాయి.
''స్వతంత్ర ఎమ్మెల్యేలందరినీ కలుపుకున్నామాకు మెజారిటీ సరిపోదు. అందుకే మేం ఇప్పుడే ఏమీ చేయలేం. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. దాని తర్వాతే మా స్టాండ్ ఏంటో నిర్ణయిస్తాం'' అని మరాండి వ్యాఖ్యానించారు.
హేమంత్ సోరెన్‌కు ఒకే ఒక ఆప్షన్ మిగిలి ఉందని ఝార్ఖండ్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న గౌతమ్ బోస్ భావిస్తున్నారు. హేమంత్ సోరెన్ తన భార్యను ముఖ్యమంత్రిని చేయవచ్చని, తద్వారా ప్రభుత్వం వచ్చే రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని బోస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పీఠాన్ని విడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 5న ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ హరి నారాయణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
''ఈ సమావేశాల్లోనే ఆయన తన భార్యను ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు ప్రకటించవచ్చు. తర్వాత ఆయనే ప్రభుత్వాన్ని నడిపించవచ్చు'' అని హరి నారాయణ్ సింగ్ అంచనా వేస్తున్నారు.
"ఈ రాజకీయ అస్థిరత కారణంగా, అడవులు, నదులు, ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఈ రాష్ట్రం నేటికీ అభివృద్ధి చెందలేదు. ఛత్తీస్‌గఢ్ కూడా ఈ రాష్ట్రంతోపాటే ఉనికిలోకి వచ్చింది. కానీ, ఆ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందింది" అని గౌతమ్ బోస్ అన్నారు.
రాజకీయ అస్ధిరత కారణంగా ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోయాయని, అవిభాజ్య బిహార్ కాలంలో ముఖ్యమంత్రి ఇంట్లోనే రాంచీ డివిజనల్ కమిషనర్‌గా ఉండేవారని బోస్ అన్నారు.
"కొత్త రాజధాని నిర్మించే ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయి. స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కానీ, పనులు మాత్రం జరగలేదు. అసెంబ్లీ పరిస్థితి కూడా ఇదే అన్నారు గౌతమ్ బోస్.
ఝార్ఖండ్ ఒక 'విఫల రాష్ట్రం'గా మారిందని బోస్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














