దిల్లీ: మనీష్ సిసోడియాపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఏముంది... కొత్త లిక్కర్ పాలసీ కథేంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సుచిత్ర మొహంతి
- హోదా, బీబీసీ కోసం
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలులో ఉన్నారు. తాజాగా ఎక్సైజ్ పాలసీలో అవకతవకల ఆరోపణలతో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
సీబీఐ నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) కాపీని బీబీసీ సంపాదించింది. దిల్లీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో అమలులోకి తెచ్చిన దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించటంలోనూ, అమలు చేయటంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని 11 పేజీల ఈ ఎఫ్‌ఐఆర్ ఆరోపిస్తోంది.
ఆగస్టు 17వ తేదీ సీబీఐ రిజిస్టర్ చేసిన ఈ ఎఫ్ఐఆర్‌లో.. మనీష్ సిసోడియా పేరును ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఐపీసీలోని నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద మరో 15 మందిని కూడా ఈ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చింది.

ఫొటో సోర్స్, ANi
సీబీఐ శుక్రవారం నాడు సెంట్రల్ దిల్లీలోని సిసోడియా అధికారిక నివాసంతో పాటు.. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 20 చోట్ల ఆకస్మిక సోదాలు నిర్వహించింది.
సిసోడియా తన నివాసంలో సీబీఐ 14 గంటల పాటు సోదాలు చేసి వెళ్లిన తర్వాత శుక్రవారం రాత్రి పొద్దుపోయాక మీడియాతో మాట్లాడారు. తను భయపడటం లేదని చెప్పారు. ''సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని మాకు తెలుసు. దానిని పై నుంచి నియంత్రిస్తున్నారు. మేం నిజాయితీ రాజకీయాలు చేస్తున్నాం'' అని పేర్కొన్నారు.
సీబీఐ కొన్ని ఫైళ్లను, తన ఫోనును, కంప్యూటర్‌ను తీసుకువెళ్లినట్లు తెలిపారు.
ఎక్సైజ్ శాఖ అధికారులు, లిక్కర్ కంపెనీల అధికారులు, డీలర్ల పేర్లు ఈ ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి. వీరితో పాటు గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొంది.

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
''2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి.. టెండర్ల అనంతరం లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలను అందించే ఉద్దేశంతో.. అధీకృత అథారిటీ అనుమతి లేకుండా సిఫారసులు, నిర్ణయాలు తీసుకోవటంలో దిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అర్వ గోపి కృష్ణ (మాజీ ఎక్సైజ్ కమిషనర్), ఇతర వ్యక్తులు పాలుపంచుకున్నారు'' అని సీబీఐ ఎఫ్ఐఆర్ ఆరోపిస్తోంది.
భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477-ఎ (అనుచిత లాభం కోసం ఖాతాలు తారుమారు చేయటం), అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సిసిడియా, ఇతరుల మీద సీబీఐ నేరాభియోగాలు నమోదు చేసింది.
ఈ కేసులో సిసోడియా, ఇతర నిందితులను సంబంధిత కోర్టు దోషులుగా నిర్ధారించినట్లయితే.. వారికి కనిష్టంగా 6 నెలల జైలు శిక్ష మొదలుకుని, గరిష్టంగా మరణ శిక్ష వరకూ శిక్షలు ఎదుర్కొనే అవకాశముంది.
''లైసెన్స్ ఫీజులలో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించటం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్సుదారులకు కల్పించటానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటం సహా అక్రమాలు జరిగాయని ఆరోపణ'' అని సీబీఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images
లిక్కర్ లైసెన్సుదారుల నుంచి అనుచిత ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించటంలోను, ఆరోపిత ప్రభుత్వ సిబ్బందికి బదిలీ చేయటంలోను సిసోడియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్ ఆరోపించింది.
ఎక్సైజ్ పాలసీని అమలు చేయటానికి వీలుగా అవసరమైన విధంగా స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని దిల్లీ మంత్రిమండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని.. కానీ ఆతర్వాత నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సీబీఐ పేర్కొంది. అయినా కూడా.. ఉప ముఖ్యమంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం.. ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేసిందని సీబీఐ ఆరోపించింది.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో ఆరోపిత అవకతవకల మీద సీబీఐ దర్యాప్తు జరపాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గత నెలలో సిఫారసు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- అఫ్గానిస్తాన్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












