మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ ఆలయం: 320 ఎకరాలలో 49 ఎకరాలే మిగిలాయి

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములను కొందరు కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ ఆలయ భూముల వివరాలపై బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది
రికార్డుల ప్రకారం దేవస్థానానికి విలువైన భూములు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
అధికారిక నివేదికల ప్రకారం చూస్తే విలువైన భూములు ప్రస్తుతం కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దాంతో అరకొర ఆదాయంతోనే ఆలయ నిర్వహణ సాగుతోంది.
మిగిలిన ఆస్తులను కాపాడే ప్రయత్నాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయని మాజీ ఉద్యోగులు, స్థానికులు చెబుతున్నారు.
జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి, దానిని సొంతం చేసుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీని వెనుక నియోజకవర్గంలో పదవిలో ఉన్న ఓ నేత ఉన్నారని ప్రతిపక్షాలకు చెందిన స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.
అక్కడ బీబీసీ బృందం పరిశీలన చేస్తుండగా, వివాదంలో ఉన్న భూములను తమ సొంతవిగా చెప్పుకొంటున్న కొందరు అడ్డగించేందుకు యత్నించారు.

రికార్డుల్లో భారీ ఆస్తులు
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో లక్ష్మీ చెన్నకేశవుని ఆలయం ఒకటి. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. బ్రహ్మనాయుడు కాలంలో ఈ ఆలయానికి విశిష్ట స్థానం దక్కినట్టు చెబుతుంటారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి రికార్డుల ప్రకారం దాదాపు 320 ఎకరాల భూమి ఉండాలి.
అందులో వివిధ సర్వీసుల కింద ఇనాం భూములే అత్యధికం. ఇప్పటికే రికార్డుల్లోని మొత్తం 269 ఎకరాల 55 సెంట్ల స్థలం ప్రైవేటు పరమై చేతులు మారిపోయింది. అంటే దాదాపు 80 శాతం భూమిని ఆలయం కోల్పోయినట్టయింది.
ప్రస్తుతం 49.46 ఎకరాల భూమి మాత్రమే ఆలయ పరిధిలో ఉంది. అందులో 24.62 ఎకరాల భూమి లీజుకు ఇస్తున్నారు. దీని ద్వారా ఏటా కేవలం రూ. 57,900 ఆదాయం లభిస్తోంది. అంటే నెలకు వచ్చే ఆదాయం రూ.5 వేల లోపే.

మిగిలిన ఆస్తులపై కన్నేసిన పెద్దలు
ఇనాం భూముల్లో భజంత్రీ సర్వీసుల పేరుతో 124 ఎకరాలు, పెద పురోహితులకు కేటాయించిన 43 ఎకరాలు, చిన పురోహితుల పేరుతో కేటాయింపులు జరిగిన 33 ఎకరాల భూమి దేవస్థానం చేతుల్లోంచి జారిపోయింది. ఇతరాలకు కేటాయించిన భూముల్లో కూడా ఇప్పుడు దేవస్థానం హక్కు కోల్పోయింది. పైగా ఆయా భూముల్లో అధికారికంగానే రెండు, మూడు.. అంతకుమించి కూడా లావాదేవీలు జరిగిపోయాయి.
మూడు, నాలుగు దశాబ్దాలుగా ఆలయ భూములు తరిగిపోతుండగా, మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా కొందరు కాజేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు 6 ఎకరాలపై వివాదం
తాజాగా ఈ దేవస్థానానికి చెందిన 6.02 ఎకరాల భూమి చుట్టూ వివాదం ఏర్పడింది.
పట్టణ సమీపంలోని హైవే 565ని ఆనుకుని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకి ఎదురుగా ఉన్న స్థలంలో కొందరు గోడ కట్టారు.
206 బి సర్వే నెంబర్ లో ఉన్న ఈ భూమి చాలా విలువైనది. ఇప్పటికే ఈ భూమి ఇనాం భూమిగా వివాదంలో ఉంది. నాలుగేళ్లకు మునుపే దేవస్థానం అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చారు.
22సీ కింద దేవాదాయ శాఖ నిషేధం విధించిన భూమిలో లావాదేవీలకు అవకాశం ఉండదు.
అయినప్పటికీ ఈ భూమిపై హక్కు తనదేనంటూ మార్కాపురం పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందని దేవాదాయ శాఖ ఈవో జి.శ్రీనివాసరెడ్డి బీబీసీకి తెలిపారు.
అదే సమయంలో కుమారి అనే మహిళ పేరుతో ఆ భూమి మీద పట్టా ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులను ఆశ్రయించిన కొందరు ఇటీవల భూమిలో అడుగు పెట్టే ప్రయత్నం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఆ భూమి ఆలయానిదే: ఈవో
లక్ష్మీ చెన్నకేశవ ఆలయ భూముల్లో మిగిలినదైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఈవో శ్రీనివాసరెడ్డి బీబీసీకి తెలిపారు.
"వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలోని భూమి ఎండోమెంట్‌కి చెందినది అని రికార్డులు చెబుతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్‌తో కలిసి ఆ భూమిని పరిశీలించాం. దానికి అనుగుణంగా ఉన్నతాధికారులకు నివేదించాం ఇప్పటికే దాని మీద ఎటువంటి హక్కు పత్రాలు జారీ కాకుండా నిషేధం ఉంది. నిబంధనలను అనుసరించి దేవాదాయ భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కొంత భూమి మీద వివాదం కోర్టులో ఉండగా, మిగిలిన భూమి మీద హక్కు కోసమంటూ మరియదాసు భార్య పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు" అంటూ ఆయన వివరించారు.
ఈ ఆలయ భూముల రికార్డులను వెలికి తీసి, వాటికి అనుగుణంగా పరిరక్షణ ప్రయత్నాలు చేస్తున్నామని ఈవో చెప్పారు.
మార్కాపురం పట్టణంలోకి ప్రవేశించే రోడ్డులో జాతీయ రహదారి మీద ఉన్న విలువైన భూమి కావడంతో ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు.
దేవాదాయ శాఖ అధికారులు సమర్థవంతంగా స్పందించకపోతే వాటిని కబ్జా చేసేందుకు కాచుకుని ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
"మార్కాపురం ప్రాంతంలో ఆక్రమణలు పెరిగిపోయాయి. ఖాళీ భూమి కనిపిస్తే చాలు రికార్డులు తారుమారు చేసే ముఠా తయారైంది. దేవాదాయ భూములను కూడా వదలడం లేదు. లక్ష్మీ చెన్నకేశవుని ఆలయ భూమి ఇప్పుడు ఆక్రమించాలని చూస్తున్నదే వంద కోట్లు విలువ చేస్తుంది. అలాంటి విలువైన భూములు కాపాడాలి. అందుకోసం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించబోతున్నాం" అంటూ ఆయన తెలిపారు.
దేవాదాయ భూమికి ప్రైవేటు వ్యక్తులు గోడ కట్టినా అడ్డుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్నప్పటికీ పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆయన అధికారులపై విమర్శలు చేశారు.
కాగా ఈ భూమిపై హక్కు తమదేనంటున్న నాదెళ్ల సుబ్రహ్మణ్యం, మరియదాసులు ఏమంటున్నారో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించినా వారి నుంచి స్పందన రాలేదు.

అదే జరిగితే ఆలయ నిర్వహణ ప్రశ్నార్థకమే: రిటైర్డ్ ఉద్యోగి
మార్కాపురంలో కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఒకనాడు దేవస్థానానికి చెందిన భూముల్లోనే ఉన్నాయని దేవాదాయ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ఎల్.రమణ అన్నారు. ఇప్పుడు కొత్త ఆక్రమణలను అడ్డుకోకపోతే చెన్నకేశవ స్వామి ఆలయం నిర్వహణ కూడా ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
"మా చిన్నప్పుడు ప్రస్తుతం ఆర్డీవో ఆఫీసు సమీపంలో ఉన్న కాలనీల భూములన్నీ దేవాదాయ శాఖవే. కానీ ఇప్పుడు రాష్ట్ర మంత్రి సహా ప్రముఖుల నివాసాలన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన భూములను కూడా రికార్డులు తారుమారు చేసి అధికారంలో ఎవరు ఉంటే వారు కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత రికార్డులంటూ సృష్టించి భూములు సొంతం చేసుకుంటున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయం నిర్వహణే భారం అవుతోంది. ఆదాయం లేని దేవస్థానంగా మిగిలిపోతోంది" అంటూ రమణ బీబీసీతో అన్నారు.
పట్టణంలో దేవదాయ భూముల రికార్డులు మార్చేస్తున్న తీరు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలోని భూమి విలువ ఎక్కువగా ఉండడంతో అందరి దృష్టి అటు మళ్లిందని అభిప్రాయపడ్డారు.

బీబీసీ బృందాన్ని అడ్డుకున్న యువకులు
మార్కాపురంలో భూ ఆక్రమణల గురించి సమాచారం అందుకున్న బీబీసీ బృందం రికార్డుల ఆధారంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సర్వే నెం. 206 బి లో ఉన్న భూములను పరిశీలించే యత్నం చేసింది.
ఆ సమయంలో కొందరు యువకులు బీబీసీ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ భూమిని పరిశీలించడానికి వీలు లేదంటూ అడ్డగించారు.
దేవస్థానం భూమి ఎవరి సొంతమో ఎలా అవుతుందని ప్రశ్నించినా ససేమిరా అన్నారు. చివరకు పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి జారుకున్నారు.
విలువైన భూమి కావడంతో స్థానికంగా కొందరు భూకబ్జాదారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
స్థానికంగా ఎండోమెంట్ సిబ్బందిని రాజకీయ ఒత్తిడితో అడ్డు రాకుండా చేసుకునే యత్నం జరుగుతున్నట్టు ఆ శాఖలో పనిచేసిన రిటైర్డ్ సిబ్బంది కూడా అంటున్నారు. ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తేనే ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడడం సాధ్యమని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?
- ఎడ్వర్డ్ స్నోడెన్: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?
- మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












