నిరుద్యోగులు రూ. ల‌క్ష నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొందడం ఇలా

వీడియో క్యాప్షన్, నిరుద్యోగులకు రూ. 50 లక్షల వరకూ రుణం, ఎలా తీసుకోవాలంటే...
    • రచయిత, ఎ.కిశోర్ బాబు
    • హోదా, బీబీసీ కోసం

నిరుద్యోగ యువ‌త‌కు స్వ‌యం ఉపాధి భ‌రోసా క‌ల్పించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ప్ర‌ధాన‌ మంత్రి ఉపాధి క‌ల్ప‌న కార్యక్రమం(PMEGP).

స్వ‌శ‌క్తితో నిల‌బ‌డాల‌నుకునే నిరుద్యోగుల‌కు ఈ ప‌థ‌కం ద్వారా ల‌క్ష రూపాయ‌ల నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది.

ఈ రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం 35 శాతం వ‌ర‌కు రాయితీ ఇస్తోంది.

పారిశ్రామికవేత్త‌లుగా ఎద‌గాల‌నే త‌ప‌న ఉన్న ఔత్సాహికుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కం ఇది.

ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా, ద‌ర‌ఖాస్తు చేయ‌డం మొద‌లు ఎంపికవ‌ర‌కు అంతా పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ప‌థ‌కం ఇది.

మ‌రి ఈ ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం (PMEGP) అంటే ఏమిటి? ఎవ‌రెవ‌రికి రుణాలు క‌ల్పిస్తారు? అర్హ‌త‌లు ఏమిటి? ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం ఎలా?

ఈ ప‌థ‌కం విధి విధానాలేంటి? త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, FACEBOOK/SKILLINDIAOFFICIAL

ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం (PMEGP) అంటే..

భార‌తదేశంలోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే ప్ర‌ధాన‌ మంత్రి ఉపాధి క‌ల్ప‌న కార్యక్రమం(PMEGP).

గ‌తంలో దీని కోసం ప్ర‌ధాన‌మంత్రి రోజ్‌గార్ యోజ‌న‌, గ్రామీణ ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం అనే రెండు ర‌కాల ప‌థ‌కాల‌ను కేంద్రం నిర్వ‌హించేది.

అనంతరం ఈ రెండింటినీ క‌లిపేసి ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం (PMEGP) ప్రారంభించింది.

కేంద్ర ప్ర‌భుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Ministry of Micro, Small & Medium Enterprises - MSME) ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ (Khadi & Village Industries Commission-KVIC) ద్వారా ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతోంది.

ఈ KVIC జాతీయ స్థాయిలో నోడ‌ల్ ఏజెన్సీ ద్వారా, రాష్ట్రాల ప‌రిధిలో కేవీఐసీ బోర్డులు, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం (District Industries Centre - DIC) ద్వారా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తుంటుంది.

వలసలు నిరోధించే లక్ష్యంతో..

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో స్వ‌యం ఉపాధి ప‌థ‌కాలు/ ప్రాజెక్టులు/ సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి త‌ద్వారా నిరుద్యోగుల‌కు ఉపాధి ఉద్యోగవకాశాలు క‌ల్పించ‌డం.

గ్రామాల్లో ప‌ట్ట‌ణాల్లో ఉపాధి, ఉద్యోగం లేక చెల్లాచెదురైపోయిన చేతి వృత్తుల వారిని/ నిరుద్యోగ యువ‌త‌ను మ‌ళ్లీ సంఘ‌టితం చేసి వారికి అక్క‌డ స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించి వారికి ఆర్థిక స్వావ‌లంబన చేకూర్చ‌డం. వారి జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రచ‌డం.

వారున్న ప్రాంతాల్లోనే సుస్థిర ఉపాధి, ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించ‌డం ద్వారా ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా నిరోధించ‌డం.

నిరుద్యోగం

దేనికి రుణ‌మిస్తారు?

కొత్త‌గా ఏర్పాటుచేసే చిన్న‌, సూక్ష్మ‌, కుటీర ప‌రిశ్ర‌మ‌ల యూనిట్ల మొద‌లు మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ స్థాయి వ‌ర‌కు రుణం అంద‌జేస్తారు.

అయితే ఈ ప‌థ‌కంలో ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్త‌ర‌ణ‌కు.. వాటి న‌వీక‌ర‌ణ (Modernization)కు రుణం ఇవ్వరు.

నెగిటివ్ ప‌రిశ్ర‌మ‌ల జాబితాలో ఉన్న‌వాటికి ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు.

ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు 2021-2022 నుంచి 2025-2026 మధ్య కాలంలో ఈ పథకం అమలుకోసం 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) రూ.13,554.42 కోట్లు కేటాయించింది.

ఎంత రుణ‌మిస్తారు?

మీరు పెట్టబోయే కొత్త తయారీ యూనిట్‌కు రూ. 50 లక్షల వరకు రుణం ఇస్తారు.

సర్వీసు యూనిట్లకైతే 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు

గతంలో ఈ రుణ సదుపాయం గరిష్ఠంగా 25 లక్షల వరకు మాత్రమే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందివ్వాలనే ఉద్దేశంతో రుణ పరిమితిని 50 లక్షల రూపాయల వరకు పెంచింది.

ఎంత పెట్టుబడి పెట్టాలి?

జనరల్ కేటగిరీ వ్యక్తులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు సంబంధించి మొత్తం వ్యయంలో 10 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాలి.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, AFP

మిగిలినది రుణంగా ఇస్తారా?

అవును. సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం అందజేస్తారు.

వెనుకబడిన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 95 శాతం మొత్తాన్ని రుణంగా అందజేస్తారు.

రుణంలో సబ్సిడీ ఎంత? ఎవరెవరికి ఇస్తారు?

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే వాటికి గరిష్ఠంగా 35శాతం రాయితీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వాటికి 25 శాతం రాయితీ ఉంటుంది. అయితే ఈ రాయితీ ప్రత్యేక కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కల్గినవారికి మాత్రమే కల్పిస్తారు.

జనరల్ కేటగిరీ అభ్యర్థులకూ రుణంలో సబ్సీడీ సదుపాయం ఉంటుంది. అయితే ఈ కేటగిరీ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు 25 శాతం సబ్సిడీ, పట్టణ ప్రాంతాల్లో వాటికి 15శాతం సబ్సిడీ కల్పిస్తారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఈ పథకం కింద లబ్ధిదారుల దరఖాస్తు చేసుకోవడం మొదలు, ఎంపిక ప్రక్రియ వరకు మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగుతుంది.

ఆ ప్రాజెక్టు ఏర్పాటును మాత్రం భౌతికంగా తనిఖీ చేసి పరిశీలన చేస్తారు.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.kviconline.gov.in క్లిక్‌ చేసి పీఎంఈజీపీఐ పోర్టల్‌లోకి వెళ్లాలి.

అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీకి, పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి.

దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకోవాలి.

https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైటుకు వెళ్లి అక్కడ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ముందుగా మీరు ఈ సైటులో లాగిన్ అవడం కోసం మీకు ప్రత్యేకంగా ఒక యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ పొందుపరచాలి.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, AFP

ఎన్నిరోజుల్లో స్పందిస్తారు?

దరఖాస్తు చేసిన వెంటనే 10 నుంచీ 15 రోజుల వ్యవధిలో అధికారుల నుంచీ స్పందన వస్తుంది.

ఆ తర్వాత మీ ప్రాజెక్టు మంజూరుకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి.

దరఖాస్తు చేసుకోగానే రుణం ఇచ్చేస్తారా?

ఇవ్వరు. మీరు దరఖాస్తు చేసుకున్న తరువాత మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల శిక్షణ ఇస్తుంది.

ఈ శిక్షణ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు.

ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.

దరఖాస్తు చేసుకోకముందే కూడా ఈ శిక్షణ పూర్తి చేసుకుని తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొదటి ఇన్ స్టాల్మెంట్ రుణం ఎప్పుడు ఇస్తారు?

ఈడీపీ శిక్షణ పూర్తి చేసుకున్న తరువాతే మొదటి ఇన్‌స్టాల్మెంట్ రుణం అందజేస్తారు.

సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు?

మీరు తీసుకున్న రుణంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వెంటనే ఇవ్వరు.

మీరు రుణం తీసుకున్న తరువాత మూడు సంవత్సరాలు మీరు బ్యాంకుకు వాయిదాలు సరిగ్గా చెల్లించాల్సి ఉంటుంది.

మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన రుణ సబ్సిడీ మొత్తాన్ని మీరు తీసుకున్న రుణంలో అడ్జెస్ట్ చేస్తారు.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

ఈ పథకానికి అర్హతలేమిటీ?

  • 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా అర్హులే.
  • కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు.
  • స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్‌కు చెందిన వారితో కలిపి) అర్హులు.
  • (వ్యక్తి, తన భార్య/భర్త కలిపి) ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు.

బ్యాంకుల పాత్ర ఏమిటి

ఎంపిక చేసిన లబ్ధిదారుడికి జాతీయ బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, స్టేట్ టాస్క్ ఫోర్సు కమిటీ ఆమోదించిన షెడ్యూల్డు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.

వడ్డీ ఎంత ఉంటుంది?

ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా వడ్డీ శాతం విధిస్తోంది. 7 నుంచీ 10 శాతం వడ్డీ సాధారణంగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు.

50 లక్షలకు మించి రుణం ఇవ్వరా?

అంతకంటే ఎక్కువ కూడా ఈ పథకం ద్వారా రుణం పొందే వీలుంటుంది. అయితే తొలిసారి తీసుకున్న రుణం తీర్చేశాక, రెండో సారి రుణం కావాల్సి వస్తే అప్పుడు ఈ పరిమితికి మించి తీసుకోవచ్చు.

రూ.1 కోటి వరకు రుణాన్ని రెండో రుణంలో పొందవచ్చు. ఈ రుణంపైన కేంద్ర ప్రభుత్వం నుంచీ 15 నుండీ 25 శాతం వరకు సబ్సిడీ కూడా పొందవచ్చు.

ఆదాయ పరిమితి ఉందా?

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదు

వీడియో క్యాప్షన్, దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా?

ఎలాంటి ప్రాజెక్టులు నెలకొల్పవచ్చు?

మీకు వచ్చే ఆలోచనలు, మీ వ్యాపార దక్షతను బట్టి ఇది ఉంటుంది. https://www.kviconline.gov.in/pmegp/pmegpweb/docs/jsp/newprojectReports.jsp సైటులో పలురకాల రంగాల్లో వ్యాపార యూనిట్లు ఏర్పాట చేయడానికి ఉన్న అవకాశాలు తెలుస్తాయి.

అందులో కొన్ని ఇవి. Agro-based Food Processing Units, Cement & Allied Products, Chemical/Polymers & Minerals, Cold Storage & Cold Chain Solution, Dairy & Milk Products, Electronic & Electrical Equipment. Food Processing Industry. Forest Industry.Horticulture-Organic Farming,Paper & Allied Products,Plastic and Allied Services, Service Sector Industry, Small Business Models, Textile & Apparel, Waste Management,.

దరఖాస్తు చేయడానికి ఏఏ పత్రాలు కావాలి

  • మీ పాస్ పోర్టు సైజు ఫొటోతోపాటు నింపిన దరఖాస్తు
  • మీ పెట్టబోయే యూనిట్‌కు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు
  • మీ చిరునామా, గుర్తింపునకు సంబంధించి ఐడెంటిటీ కార్డు, అడ్రెస్ ప్రూఫ్
  • మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు
  • మీరు ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్
  • కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన శిక్షణకు సంబంధించి ఎంటర్పెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (Entrepreneur Development Programme - EDP) వారు ఇచ్చిన సర్టిఫికెట్.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఎక్స్-సర్వీస్మెన్, పీహెచ్సీలకు సంబంధించిన సర్టిఫికెట్
  • మీకున్న విద్యార్హతలు, సాంకేతిక విద్యార్హతలు (ఏవైనా ఉంటే)
  • బ్యాంకు వారు వారి అవసరాన్ని బట్టి అడిగిన ఇతరత్రా ఏవైనా పత్రాలు
వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

దరఖాస్తు స్థితిని తెలుసుకోవడమెలా?

మీ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో పూర్తీ వివరాలను ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. kviconline.gov.in/pmegp/ వెబ్‌సైటులో మీరు లాగిన్ అయిన తరువాత మీ ధరఖాస్తును ఈ-ట్రాకింగ్ చేసుకోవచ్చు.

ఏఏ పరిశ్రమల స్థాపనకు ఈ పథకం వర్తించదు?

  • ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమ విస్తరణకు, దాని నవీకరణకు వర్తించదు.
  • ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ జాబితాలో ఉన్న ప్రతికూల పరిశ్రమలకు వర్తించదు.

నెగటివ్ పరిశ్రమలు జాబితాలో ఏమేం ఉన్నాయి?

  • మాంసానికి సంబంధించిన పరిశ్రమలు, వ్యాపార యూనిట్లకు.
  • సిగరెట్టు, బీడీ, పాన్ ఉత్పత్తుల తయారీ యూనిట్లకు.
  • మద్యం విక్రయించే, సరఫరా చేసే హోటళ్లు, దాబాలకు, కల్లుగీత ఆధారిత పరిశ్రమలకు.
  • పంట ఉత్పత్తుల సాగు సంబంధిత పరిశ్రమలు.. ఉదాహరణకు తేయాకు, కాఫీ, రబ్బరు, సెరీ కల్చర్, హార్టీ కల్చర్, ఫ్లోరీ కల్చర్, యానిమల్ హస్బెండరీ, పిసీ కల్చర్, పిగ్గరీ, పౌల్ట్రీ, హార్వెస్టర్ మిషన్స్ తదితరాలు..
  • 20 మైక్రానుల కంటే తక్కువ మందం కలిగిన పాలిథీన్ కవర్ల తయారీ పరిశ్రమలకు ఈ పథకం వర్తించదు.

సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి

అభ్యర్థులకు సహాయపడటానికి PMEGP ఒక HELP DESK ఏర్పాటు చేసింది.

 HELP DESK కాంటాక్టు నెంబరు : 07526000333/07526000555

పోస్టల్ చిరునామా

Directorate of Khadi

Khadi & Village Industries Commission

Ministry of MSME, Govt. of India

3 Gramodaya, Irla Road , Vile Parle (West)

Mumbai - 400056

Ph No: 022-26715860/26207624

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)