మొరాకో అస్తిత్వం ఏమిటి? అరబ్ దేశమా.. ఆఫ్రికా దేశమా.. లేక అమజీ దేశమా..?

ఫొటో సోర్స్, Reuters
ఈ ఏడాది ఖతార్ వరల్డ్ కప్‌ను చుట్టుముట్టినంత వివాదాలు గతంలో ఏ వరల్డ్ కప్ విషయంలో జరగలేదు.
మానవ హక్కుల విషయంలో పేలవ రికార్డును కలిగి ఉన్న ఖతార్‌కు ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు కట్టబెట్టడం దగ్గరి నుంచి, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ ఆదివారం వరల్డ్ కప్‌ను అందుకునేముందు అతడి భుజాలపై ఖతార్ ఎమిర్ అరబ్ సంప్రదాయ వస్త్రాన్ని కప్పటం వరకు ఈ వివాదాలు కొనసాగాయి.
కానీ, ఒక వివాదం మాత్రం ఉత్తర ఆఫ్రికా బయటి ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు.
ఇదంతా సింపుల్ ప్రశ్నతో మొదలైంది. అదేంటంటే.. మొరాకో జట్టును ‘అట్లాస్ లయన్స్’ అని ఎలా వర్ణిస్తారు? సెమీఫైనల్ చేరిన ‘‘తొలి అరబ్’’ జట్టు అని కానీ, ‘‘తొలి ఆఫ్రికన్’’ జట్టు అని కానీ ఎలా పిలుస్తారు? అనే ప్రశ్నతో ఇది ప్రారంభమైంది.
ఫుట్‌బాల్ ఆటలో పటిష్ట జట్లయిన స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లను తాజా వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఓడించిన మొరాకో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఫొటో సోర్స్, AFP
మొరాకో ప్రజల్లో ఎక్కువ మంది సాంస్కృతిక పరంగా తమను తాము ఆఫ్రికన్లగా కంటే ఎక్కువగా అరబ్బులమని పరిగణిస్తారు.
మొరాకోలో జాత్యాహంకార వైఖరులు ఎప్పుడూ కొనసాగుతున్నాయని అక్కడి కొంతమంది సహారన్ ఆఫ్రికన్లు ఫిర్యాదు చేస్తారు.
కానీ, వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్‌పై విజయం సాధించిన అనంతరం మొరాకో వింగర్ సోఫియాన్ బుఫాల్ చేసిన వ్యాఖ్యలు మొరాకో ఖండాంతర గుర్తింపుకు చెందిన చర్చను ముందుకు తెచ్చాయి.
‘‘మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మొరాకన్లు అందరికీ, అరబ్ ప్రజలందరికీ, ముస్లిం ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ విజయం మీదే’’ అని సోఫియాన్ వ్యాఖ్యానించాడు.
సోషల్ మీడియాలో దీనిపై దుమారం రేగడంతో, తమకు మద్దతుగా నిలిచిన ఆఫ్రికా ఖండం గురించి ప్రస్తావించకపోవడం పట్ల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతను క్షమాపణలు చెప్పాడు.
మొరాకో తమ సామర్థ్యం, పట్టుదలతో ఖండం మొత్తం గర్వపడేలా చేసిందని నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత సోఫియాన్ మరో పోస్ట్ చేశాడు. ‘‘నేను కూడా ఈ విజయాన్ని మీకు అంకితం చేస్తున్నాను. (ఆఫ్రికా) ఖండంలోని మా సోదరులందరికీ ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నాం’’ అని సోఫియాన్ పోస్టులో రాశాడు.
మిగిలిన ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించడానికి చక్రవర్తి చేసిన ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తోంది.
‘‘ఆఫ్రికా నా ఇల్లు. నేను నా ఇంటికి తిరిగొస్తున్నా’’ అని 2017లో ఆఫ్రికా యూనియన్‌లో తిరిగి చేరిన సందర్భంగా కింగ్ మొహమ్మద్ అన్నారు. 30 ఏళ్ల తర్వాత మొరాకో తిరిగి ఆఫ్రికా యూనియన్‌లో 2017లో చేరింది.
ఈ చర్య ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా దేశాలతో వ్యాపారం వృద్ధి చెందడానికి వీలు కల్పించింది.
కానీ, అరబ్ లీగ్‌లో కూడా మొరాకో ఒక సభ్య దేశం. కాబట్టి మొరాకో అధికారికంగా రెండు సంస్కృతులకు చెందుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆఫ్రికన్’’ అనే పదం మొరాకో భౌగోళిక స్వరూపం గురించి వర్ణిస్తే, ‘‘అరబ్’’ అనే పదం వాడకం వల్ల ఆ గుర్తింపు ఇష్టం లేని చాలా మంది మొరాకన్లు దూరం అయ్యారు.
మొరాకోలో గణనీయ సంఖ్యలో బెర్బర్స్, అమజి ప్రజలు ఉంటారు. బెర్బర్స్, అమజి అని పిలిపించుకోవడానికి ఈ ప్రజలు ఇష్టపడతారు. 3.4 కోట్లకు పైగా ఉండే మొరాకో దేశ జనాభాలో వీరు దాదాపు 40 శాతంగా ఉంటారని అంచనా వేశారు.
అమజి ప్రజలు మాట్లాడే భాషల్లో ‘టమాజియాట్’ ప్రధానమైనది. మొరాకోలో అరబిక్‌తో పాటు ఇప్పుడు ఈ టమాజియాట్ భాషను కూడా అధికార భాషగా గుర్తించారు.
2022 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య బాధ్యతలు ఖతార్‌కు అప్పగించిన వెంటనే అక్కడి మీడియా ఈ ఈవెంట్‌ను ‘‘ఇస్లాం విజయం, పాన్ అరబిజం’’ అని పిలిచింది. 2010లోనే ఇలాంటి హెడ్డింగ్‌లతో అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి.

టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ‘పాన్ అరబిజం’, ‘ఇస్లామిజం’ వంటి పదజాలం మళ్లీ తెరపైకి వచ్చింది.
కానీ, తొలుత ఖతార్ మీడియా ఈ ఈవెంట్‌ను ‘‘ఇస్లామిక్ లేదా అరబ్ విజయం’’ అంటూ చిత్రీకరించింది. అయితే, ఇది పెద్దగా అందరి దృష్టిలో పడలేదు.
వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి పశ్చిమాసియా జట్టుగా ‘అట్లాస్ లయన్స్ (మొరాకో)’ చరిత్ర సృష్టించినప్పుడు దీన్ని ముస్లిం, అరబ్ దేశాల విజయంగా చూశారు.
ఈ రీజియన్‌కు చెందిన ట్యూనీషియా, సౌదీ అరేబియా, ఖతార్ దేశాల జట్లు టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాయి. దీంతో పొరుగు దేశాల ఫుట్‌బాల్ ప్రేమికులు, మొరాకోకు మద్దతుగా నిలవడమనేది సహజంగా జరిగింది.
కానీ, కొన్ని గ్రూపులు మాత్రం మొరాకో విజయాన్ని చాలా పెద్దదిగా, మరింత సైద్ధాంతికమైనదిగా, రాజకీయ పరమైనదిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. దీని పర్యావసానంగా ఇస్లాంకు, అరబ్ ప్రపంచానికి ప్రాతినధ్యం వహించే గుర్తింపు కూడా మొరాకోకు లభించింది.
మొరాకో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు మైదానంలో పాలస్తీనా జెండాను పట్టుకొని సంబరాలు చేసుకోవడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది.
ఈ రకమైన భావన చాలా మంది ఉత్తర ఆఫ్రికా ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ముఖ్యంగా ఇలాంటి సిద్ధాంతాలను, దృక్పథాలను పట్టించుకోని మొరాకన్లలో ఇది ఎక్కువగా కోపాన్ని తెప్పించింది.
‘సంస్కృతి యుద్ధం’
ఒక అసమ్మతివాద మొరాకో యూట్యూబర్, ఒక గంట నిడివి గల వీడియోలో ఆటకు రాజకీయ రంగు పులిమి, దాన్ని ప్రపంచ సాంస్కృతిక యుద్ధంగా మార్చాలని ప్రయత్నించిన వారిపై విరుచుకుపడ్డాడు.
‘‘మీరు మొరాకో జట్టు డీఎన్‌ఏను విశ్లేషిస్తే, అందులో ఎక్కువ మంది ‘అమజి’లని మీకు తెలుస్తుంది. వారిలో ఎక్కువ మంది అరబిక్ మాట్లాడరు. ఒకవేళ వారు మాట్లాడినా అది ‘బ్రోకెన్ అరబిక్’ అవుతుంది. ఎందుకంటే వారిలో ఎక్కువ మంది పశ్చిమ దేశాల్లో పెరిగారు’’ అని తన 3,85,000 మంది సబ్‌స్కైబర్లను ఉద్దేశించి రాచిడ్ మాట్లాడారు.
మొరాకో జట్టులోని సగం మంది ఆటగాళ్లతో పాటు ఆ జట్టు కోచ్ కూడా యూరప్‌లో పుట్టిపెరిగారని ఆయన అన్నారు. వీరింతా మొరాకో వలసదారుల పిల్లలు అని, యూరప్‌లో ఆట నేర్చుకొని ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లుగా మారారని చెప్పారు.
మొరాకోలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇస్లాం పాత్ర అనేవి సున్నిత అంశాలు. ఇక్కడి రాజవంశం, తమను తాము మొహమ్మద్ ప్రవక్త వారసులమని భావిస్తుంది. ఇక్కడి రాజుకు ‘ద కమాండర్ ఆఫ్ ద ఫెయిత్‌పుల్’ అనే టైటిల్ ఉంటుంది. ముస్లిం పాలకుల పరంగా ఇదొక చారిత్రక టైటిల్.
‘‘మిడిల్ ఈస్ట్‌లో మొరాకో భిన్నమైనది. ఎందుకంటే ప్రాథమికంగా ఇది ఒక బెర్బర్ సమాజం. ఏడో శతాబ్దంలో అరబ్‌లు బయటి వ్యక్తులుగా ఇక్కడికి వచ్చారు. ఈరోజు మొరాకోలో అరబ్, బెర్బర్స్, ముస్లిం, యూదులు, నాస్తికులు, ఏ మతం లేనివారు, బహాయి, షియాలు, సున్నీలు ఉన్నారు.
మొరాకో విజయాన్ని ‘అరబ్, ఇస్లామ్’ విజయంగా పరిగణలోకి తీసుకుంటే అది మొరాకో సమాజంలోని ఇతర వర్గాలపై దాడి అవుతుంది’’ అని ఆయన అన్నారు.
మొరాకో విజయాన్ని ఇస్లాం, పాన్ అరబిజం విజయంగా చిత్రీకరించాలని చూస్తున్నవారికి వ్యతిరేకంగా, ఇది ‘మొరాకో’ జట్టు విజయంగా ప్రచారం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.
ఫుట్‌బాల్ క్రీడను ఒక మతమపరమైన లేదా జాతి యుద్ధంగా తీర్చిదిద్దడంలోని అసంబద్ధతను కొంతమంది విమర్శకులు ఎత్తి చూపారు. మొరాకో సాధించినది ‘ఇస్లాం’ విజయమైతే.. ఇన్నాళ్లుగా బ్రెజిల్, ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు సాధించిన విజయాన్ని ‘క్రైస్తవ మత విజయం’గా పరిగణించాలా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
యూరప్‌లోని కొన్ని ఫుట్‌బాల్ జట్లలో మిళితమైపోయిన మతపరమైన, జాతిపరమైన వైవిధ్యాన్ని ఉదాహరణగా చూపుతూ ఒక జట్టు సాధించిన విజయమనేది ఒక మత విజయంగా మారడం అసంభవమని అంటున్నారు.
ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న ‘సాంస్కృతిక యుద్ధం’ పరిణామ క్రమంలో మొరాకో జట్టు గుర్తింపు వివాదం తాజాది.
ఇవి కూడా చదవండి:
- చార్లెస్ శోభరాజ్: పదేళ్లలో 20 మర్డర్లు, 5కిపైగా దేశాల్లో హత్య కేసులు, 4 దేశాల జైళ్ల నుంచి పరారీ.. ఎవరీ ‘బికినీ కిల్లర్’
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- కరోనా: బీఎఫ్7.. ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎంత డేంజరస్
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















