ముస్లిం పురుషులు నాలుగు పెళ్లిళ్లు ఎలా చేసుకోగలుగుతున్నారు, మహిళల హక్కులేంటి?

పెళ్లి

ఫొటో సోర్స్, LUTHFI LUTHFI / EYEEM

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముస్లిం పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చా?

నిజానికి ముస్లింలో పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఖురాన్ అనుమతిస్తోంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చాలా షరతులపై ఈ పెళ్లిళ్లను అనుమతిస్తారు.

ముస్లింలలో బహుభార్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ తాజాగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బీఎంఎంఏ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఈ పిటిషన్‌ ద్వారా కొందరు ముస్లిం మహిళలు సుప్రీం కోర్టును అభ్యర్థించారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీచేసింది.

బహుభార్యత్వంతోపాటు ఇలాంటి పెళ్లిళ్లలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో బీఎంఎంఏ ఒక నివేదిక కూడా విడుదల చేసింది. దీని ద్వారా ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించాలని సంస్థ కోరింది.

పెళ్లి

ఫొటో సోర్స్, MAHESH HARIANI/GETTYIMAGES

ఈ నివేదికను సిద్ధం చేసేందుకు 50 కేస్ స్టడీలను పరిశీలించారు. దీనిలో భాగంగా 289 ప్రశ్నలను ఆ ముస్లిం మహిళలను అడిగారు.

దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశాలకు చెందిన మహిళలు ఇందులో పాల్గొన్నారు.

సర్వేలో పాల్గొన్న మహిళల్లో ఎవరూ 12వ తరగతి వరకు చదువుకోలేదు. వీరికి ఆర్థికపరమైన స్వేచ్ఛ కూడా లేదు. వీరిలో 49 శాతం మందికి భర్తలను వీరి తల్లిదండ్రులే ఎంపిక చేశారు.

మొత్తంగా వీరిలో 50 శాతం మంది మహిళలు కుంగుబాటుతో బాధపడుతున్నారు. తమ భర్త రెండో పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ దీనిలో 29 శాతం మంది ఖాజీలను ఆశ్రయించారు. అయితే, వారు మాత్రం సర్దుకుపోవాలని సూచించారు.

పెళ్లి

ఫొటో సోర్స్, SUPPASIT CHUKITTIKUN/GETTYIMAGES

సర్వేపై చర్చ

అయితే, ఈ సర్వేపై కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. మిగతా మతాలతో పోలిస్తే, ఇస్లాంలో మహిళలకు ఎక్కువ హక్కులు ఉందని వారు చెబుతున్నారు.

‘‘మేం ముస్లిం మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నాం. వారి సమస్యలకు రాజ్యాంగంలోని నిబంధనలు, ఇస్లాంకు అనుగుణంగా పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని బీఎంఎంఏకు చెందిన జాకియా సోమన్ చెప్పారు.

‘‘నిజానికి హిందూ, క్రైస్తవ మతాల్లో మహిళలకు హక్కులు కల్పించేలా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. వారితో పోలిస్తే హక్కుల్లో ముస్లిం మహిళలు చాలా వెనుకపడి ఉన్నారు. వీటి కోసం మేం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాం. బ్రిటిష్ ప్రభుత్వం 1937లో తీసుకొచ్చిన షరియా చట్టం ఇప్పటికీ ఇక్కడ అమలవుతోంది. దీనిలో ముస్లిం మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా దీన్ని సరిచేసే చర్యలేవీ తీసుకోలేదు’’ అని ఆమె చెప్పారు.

‘‘ఆ చట్టాలను ఆధారంగా చేసుకొని నాలుగు పెళ్లిళ్లు చేసుకొనే హక్కు తమకుందని కొందరు మగవారు చెబుతున్నారు. నిజానికి ఆ నిబంధనల ఉద్దేశం అది కాదు’’అని ఆమె వివరించారు.

పెళ్లి అనేది ఇస్లాంలో అత్యంత పవిత్రమైన బంధం అని, ఇస్లాంలో మహిళల హక్కులను సమగ్రంగా నిర్వచించారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సభ్యుడు కమాల్ ఫరూఖీ చెప్పారు. మరోవైపు భర్తలు నిర్వచించాల్సిన బాధ్యతలను కూడా సూచించారని వివరించారు.

పెళ్లి

ఫొటో సోర్స్, SOPA IMAGES/GETTYIMAGES

హక్కులు తెలియజేయడం ముఖ్యం..

‘‘ఆ సర్వేపై నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అవి అఫీషియల్ సర్వేలు కావు’’అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కమాల్ ఫరూఖీ వివరించారు.

‘‘కానీ, నా దగ్గరకు వచ్చే కేసుల్లో మొదటి, రెండవ భార్యలకు వారి హక్కుల గురించి తెలియజేస్తాను’’అని ఆయన చెప్పారు.

వివాహాల్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే మహిళలు మొదట ఖాజీ దగ్గరకు వెళ్లాలని ఆయన సూచించారు.

‘‘జమాతే ఇస్లామీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమియాత్ ఉలేమా-ఐ-హింద్ లాంటి సంస్థల దగ్గరకు కూడా వెళ్లొచ్చు’’అని ఆయన సూచించారు.

‘‘దారుల్ ఖాజాలు అన్నిచోట్లా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా తప్పులు కనిపిస్తే, వెంటనే తప్పని చెబుతారు. చట్టపరమైన, నైతిక అంశాలపైనా అవగాహన కల్పిస్తారు’’అని ఆయన తెలిపారు.

‘‘మహిళలు కోర్టుకు వెళ్లాలని భావిస్తే, అక్కడకు వెళ్లొచ్చు. కానీ, దారుల్ ఖాజాలో మతపరమైన అంశాలు చక్కగా వివరిస్తారు. సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తారు’’అని చెప్పారు.

పెళ్లి

ఫొటో సోర్స్, JESSICAPHOTO/GETTYIMAGES

‘‘అందరి విషయంలో ఇలా జరగడం లేదు’’

మరోవైపు బీఎంఎంఏ సర్వేపై రాజ్యాంగ నిపుణుడు, ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తాఫాపై ప్రశ్నలు సంధించారు. ‘‘అసలు బీఎంఎంఏ తీసుకున్న శాంపిల్ పరిమాణం ఎంత? వారు మహిళలను ఎలా ఎంపిక చేశారు?’’అని ఆయన అడిగారు.

‘‘నేడు ముస్లింల జనాభా 17 నుంచి 18 కోట్ల వరకు ఉంది. అలాంటప్పుడు అంతచిన్న శాంపిల్‌ను తీసుకున్న అందరికీ వర్తించేలా చెప్పకూడదు. అసలు ఈ సర్వే ఎంత కచ్చితంగా చేపట్టారు? అనేది కూడా ముఖ్యం’’అని ఆయన అన్నారు.

అయితే, ప్రొఫెసర్ ముస్తాఫా వ్యాఖ్యలపై జాకియా సోమన్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ శాంపిల్ పరిమాణం అనేది సమస్యే కాదు. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకొనేలా పురుషులకు నిబంధనలు అవకాశం కల్పించడంతో మహిళలు శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల వారు భావోద్వేగంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారి మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది’’అని ఆమె అన్నారు.

‘‘మేం ఇస్లాం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని, షరియాతో ఆడుకుంటున్నామని అంటున్నారు. నిజానికి ట్రిపుల్ తలాక్ విషయంలోనూ అలానే అన్నారు. మొత్తంగా అది చెల్లదని కోర్టు ప్రకటించింది. మేం ఇప్పుడు బహుభార్యత్వం కేసులోనూ విజయం సాధిస్తాం’’అని ఆమె చెప్పారు.

‘‘మమ్మల్ని ఆరెస్సెస్, బీజేపీ ఏజెంట్లని పిలుస్తున్నారు. కానీ, మేం మహిళల హక్కుల కోసం పోరాడుతున్నాం’’అని ఆమె వివరించారు.

‘‘భారత్‌ లాంటి ఆధునిక, అభివృద్ధి చెందుతున్న సమాజంలో రెండో పెళ్లికి అనుమతించడం ఎంతవరకు సమంజసం? ఇది మహిళలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ముస్తాఫా మీరే చెప్పండి..’’అని ఆమె ప్రశ్నించారు.

అసలు పెళ్లిళ్ల నిబంధనలను మతాలతో ముడిపెట్టి చూడకూడదని ప్రొఫెసర్ ముస్తాఫా అన్నారు.

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

పర్సనల్ లా ఏం చెబుతోంది?

హిందూ మ్యారేజీ యాక్ట్-1955 ప్రకారం, హిందువులు భార్య లేదా భర్త జీవించి ఉన్నప్పుడు, ఆ పెళ్లిని రద్దు చేసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.

ఒకవేళ ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆ భార్య లేదా భర్తకు విడాకులు ఇవ్వాలి. భార్య లేదా భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకోవచ్చు.

ఇంతకీ ఖురాన్ ఏం చెబుతోంది?

ఈ అంశంపై ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తాఫా మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

  • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవచ్చని ఖురాన్ చెబుతోంది.
  • ఏడో శతాబ్దంలో జంగ్-ఏ-ఓహద్ యుద్ధంలో ముస్లింలు ఓడిపోయారు. దీనిలో చాలా మంది పురుషులు చనిపోయారు.
  • దీని వల్ల వారి భార్యలు, పిల్లలకు సామాజిక, ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి.
  • ఈ సమస్యలను పరిష్కరించేందుకు వితంతువులను పెళ్లి చేసుకోవాలని, తండ్రులను కోల్పోయిన పిల్లలను చేరదీయాలని అప్పట్లో నిబంధనలు తీసుకొచ్చారు.
  • ఇక్కడ మరో విషయం ఏమిటంటే శారీకంగా, ఆర్థికంగా సామర్థ్యం కలిగిన వారు మాత్రమే ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలని షరతులు కూడా విధించారు.
  • మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ముందు దీని కోసం భార్య లేదా భార్యల నుంచి అనుమతులు తీసుకోవాలి.
  • ఒకవేళ ఆ షరతులను పాటించకపోతే, మరో పెళ్లి చేసుకోకూడదని పురుషులకు సూచించారు.
వీడియో క్యాప్షన్, బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ యాప్ వివాదం ఏంటి?

ముంబయిలో పనిచేసే సామాజిక సంస్థల్లో బెబాక్ కలెక్టివ్ కూడా ఒకటి.

బెబాక్ సభ్యురాలు, మహిళా హక్కుల కార్యకర్త హసీనా ఖాన్ ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.

‘‘ముస్లిం పర్సనల్ లా వివాహితలపై వివక్ష చూపిస్తోంది. పురుషాధిక్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిలో నిబంధనలను సిద్ధం చేశారు’’అని ఆమె అన్నారు.

‘‘ముస్లింలో ఒకటి లేదా రెండుశాతం మంది ఇలా పెళ్లి చేసుకున్నా.. ఈ సంఖ్య చాలా ఎక్కువే అవుతుంది. ఇది చాలా పెద్ద తప్పు. బహుభార్యత్వాన్ని అనుమతించకూడదు’’అని ఆమె అన్నారు.

తాము చేపట్టిన సర్వే ఫలితాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, మహిళా కమిషన్, మైనారిటీ కమిషన్‌లకు పంపిస్తామని జాకియా సోమన్ చెప్పారు.

ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం అవసరమని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)