తెలంగాణ: కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ - ‘పాత - కొత్త’ నేతల మధ్య గొడవలతో సతమతం

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, @revanth_anumula

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం తెలంగాణలో నడుస్తూ విలేకర్ల సమావేశం పెట్టారు. అక్టోబరు చివర్లో, హైదరాబాద్ శివార్లలో జరిగిన ఆ సమావేశంలో, విలేకరులు ఆయన్ను అడిగిన ఎక్కువ ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత గురించే. దాదాపు ఐదుకుపైగా ప్రశ్నలు కేవలం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం గురించే రాహుల్ ను అడిగారు రిపోర్టర్లు.

వాటన్నిటికీ రాహుల్ ఒకటే సమాధానం చెబుతూ వచ్చారు. ‘‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ’’ అని. ‘‘మేం బీజేపీలా నియంతృత్వం పాటించం’’ అంటూ తమ పార్టీలో అనైక్యతకు అందమైన ముసుగు వేశారాయన.

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో అనైక్యత.. రాహుల్ మాటల ప్రకారం ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ ఉచ్ఛ స్థితికి, ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ‘పీక్ స్టేజ్’కి చేరుకుంది.

తెలంగాణ కాంగ్రెస్

ఫొటో సోర్స్, @INCTelangana

తెలంగాణ ఏర్పడ్డాక, రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి చేరక ముందు కూడా కాంగ్రెస్‌లో గ్రూపులు ఉండేవి. ప్రస్తుతం సీనియర్లుగా చెప్పుకుంటోన్న బృందంలో కూడా విబేధాలు ఉండేవి. రేవంత్, ఆయనతో పాటు కొందరు చేరాక, ఆ అంతర్గత గొడవలు కాస్తా రేవంత్ గ్రూపు వర్సెస్ ఇతర గ్రూపులు అన్నట్టు మారాయి. పాత గొడవలన్నీ పక్కన పెడితే, తాజాగా వేసిన కమిటీలపై మరో కొత్త దుమారం లేచింది.

మధు యాష్కీ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజ నరసింహ, తూర్పు జగ్గా రెడ్డి, మహేశ్వర రెడ్డి, ప్రేమ సాగర రావు, కోదండ రెడ్డి.. వంటి సీనియర్లంతా శనివారం విక్రమార్క ఇంట్లో సమావేశం అయ్యారు.

వీళ్లలో చాలా మంది గతంలో రేవంత్‌నూ, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణికం ఠాగూర్‌నూ విమర్శించిన వాళ్లే. అది కొత్తేమీ కాదు. కానీ ఇంత మంది ఇలా మీటింగు పెట్టుకుని మరీ విమర్శించడం పెద్ద విషయం అయిందిప్పుడు. అంతేకాదు, వీళ్లంతా ఆ మరునాడు అంటే ఆదివారం జరిగిన కాంగ్రెస్ విస్తృత సమావేశానికి కూడా రాలేదు.

మామూలుగా కాంగ్రెస్‌లో ఎన్ని గొడవలు ఉన్నా, నెహ్రూ కుటుంబ వ్యవహారం అనే సరికి కలిసిపోతారు. సోనియా, రాహుల్, ప్రియాంక వంటి వారి విషయాలు వచ్చినప్పుడు కలసిమెలసి పనిచేస్తారు. కానీ విచిత్రంగా ప్రియాంక గాంధీ చేయబోతున్న యాత్రకు సంబంధించిన సమావేశానికి కూడా ఈ నాయకులు హాజరు కాకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, @UttamINC

పార్టీ కమిటీల్లో సీనియర్లను పక్కన పెట్టారనీ, సీనియర్లను కావాలని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెడుతున్నారనీ, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదనీ, కాంగ్రెస్ మూల స్తంభాలను బదనాం చేస్తున్నారనీ, వలస నేతలతో పార్టీకి నష్టమనీ, కోవర్టులంటూ తమని అవమానిస్తున్నారనీ, తాము ఒరిజినల్ కాంగ్రెస్ అనీ.. ఇలా అనేక ఆరోపణలు రేవంత్ వర్గంపై చేశారు సీనియర్ నాయకులు.

ఒక అడుగు ముందుకేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్త కమిటీల్లోని 180 మందిలో 54 మంది తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారని ఆరోపించారు. ‘‘నేను, భట్టి, దామోదర, జగ్గారెడ్డి.. మేం టీఆర్ఎస్ కోవర్టులం అని తీన్మార్ మల్లన్న అంటున్నాడు. అతనిచేత పోస్టులు పెట్టించింది ఎవరు? సునీల్ కనుగోలు ఆఫీసులో ఇతర పార్టీల వారితో పాటూ మా పార్టీ వారిపై కూడా పోస్టులు ఉన్నట్టు తెలిసింది’’ అన్నారు ఉత్తమ కుమార్ రెడ్డి. ‘‘మేం పార్టీని నాశనం చేసే వాళ్లమైతే, నాలుగు పార్టీలు మారినోడు ఉద్ధరిస్తాడా’’ అంటూ ఎద్దేవా చేశారాయన.

అయితే, ఈ వాదనను తప్పు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పాత నాయకుడే అయిన మల్లు రవి. తెలుగుదేశం నుంచి వచ్చిన వారు పార్టీ కమిటీల్లో 13 మందే ఉన్నారన్నారు. ‘‘రేవంత్ తప్ప ఎవరూ రాజకీయ వ్యవహారాల కమిటీలో టీడీపీ నుంచి వచ్చిన వారు లేరు. ఎగ్జిగ్యూటివ్ కమిటీలోని 40 మందిలో ఇద్దరు, 24 మంది ఉపాధ్యక్షుల్లో ఐదుగురు, 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో ఐదుగురు మాత్రమే టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు’’ అని లెక్కలు చెప్పారు ఆయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘‘మేం ఉండడమే సమస్య అయితే వెళ్లిపోతాం’’

ఒకపక్క కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. లోపలికి వచ్చే వారి సంఖ్య దాదాపు కనపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న నేతల మధ్య ‘అసలు నేతలు - వలస నేతలు’ అంటూ గొడవలు జరుగుతుండటం పార్టీకి పెద్ద సమస్యగా మారింది.

అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారు కూడా వాళ్ల వ్యూహం వారు అమలు చేశారు.

‘‘మేం కమిటీల్లో ఉండడమే సమస్య అయితే వెళ్లిపోతాం’’ అంటూ పార్టీ పదవులకు రాజీనామా చేసేశారు 12 మంది నాయకులు. కేసీఆర్‌పై పోరాటానికి పదవులు అడ్డంకి అయితే వదిలేస్తాం అంటూ ప్రకటన ఇచ్చారు వారంతా.

ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయరమణా రావు, దొమ్మాటి సాంబయ్య, జంగయ్య యాదవ్, సుభాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, చిలుక మధుసూదన రెడ్డి, చారగొండ వెంకటేశ్, సత్తు మల్లేశ్, శశికళ యాదవ్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణలు పదవులకు రాజీనామా చేశారు.

అటు సీనియర్లలో కొందరు కూడా రేవంత్‌పై ఇంకొందరు సీనియర్లు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈరవత్రి అనిల్, మానవతా రాయ్, మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి వారు రేవంత్‌కి అనుకూలంగా మాట్లాడారు. పార్టీ ఎవరి సొంతమూ కాదని వారు వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్

ఫొటో సోర్స్, @INCTelangana

ఈ గొడవ జరుగుతూండగానే, ఆదివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా చిన్న సైజు గొడవ అయినా, తరువాత సర్దుకుంది.

జానారెడ్డి, షబ్బీర్ అలీ, నదీమ్ జావెద్, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, నిరంజన్, మల్లు రవి, నాగం జనార్ధన రెడ్డి, మహేశ్ గౌడ్, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, చెఱకు సుధాకర్ వంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనవరి 26 నుంచి ప్రియాంక గాంధీ చేపట్టబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్ర గురించి చర్చించారు. దాంతో పాటూ, ఆమెకు మద్దతుగా తెలంగాణలో రేవంత్ కూడా యాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ యాత్ర ఏర్పాట్లు కమిటీల గురించి రేవంత్ చెప్పుకొచ్చారు.

అసలైన సీనియర్ల సమస్య గురించి కూడా మాట్లాడారు రేవంత్. తనకున్న సమస్యల్లో ఇవేం పెద్దవి కావన్నట్టు ఆయన మాట్లాడారు. పైకి రేవంత్ తీసిపారేసినా, సీనియర్ల సమస్య ఎంత పెద్దదో రేవంత్‌కు తెలియనది కాదు. కానీ ఎక్కడా బయట పడడం లేదు. ఎదురు దాడి చేయడం లేదు.

ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన రేవంత్, జాతీయ పార్టీ అంతర్గత రాజకీయాలు, గ్రూపిజం ఇప్పటికే చూశారు. రేవంత్ వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌లో ఆయన చుట్టూ సమస్యలు పుడుతూనే, పెరుగుతూనే ఉన్నాయి.

కోమటిరెడ్డి వెంకట రెడ్డి మొదటి నుంచీ రేవంత్‌కి దూరంగా ఉన్నారు. శశిధర రెడ్డి, శ్రవణ్ వంటి వారు వెళ్లే ముందు రేవంత్ మీద విమర్శలు చేసి వెళ్లారు. అటు, జగ్గారెడ్డి వంటి వారు నేరుగా రేవంత్‌పై అధిష్టానానికి లేఖలు రాశారు.

దిగ్విజయ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

చల్లార్చడానికి దిగ్విజయ్..

కాంగ్రెస్‌లో సమస్య వస్తే దిల్లీ నుంచి దూతలు వస్తారు. వారు అధిష్టానం మనుషులుగా వచ్చి బుజ్జగించి, కలిసుంటే కలదు సుఖం అని బోధించి వెళుతుంటారు. తెలంగాణ నుంచి వెళ్లిపోయేప్పుడు రాహుల్ కూడా ఇదే మాట చెప్పారు. కానీ ఎవరూ వినలేదు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ రాబోతున్నారు.

ఇప్పటికే దిగ్విజయ్ మహేశ్వర రెడ్డికి కాల్ చేశారు. అధిష్టానం తరఫున కొన్ని సూచనలు చేశారు. వాటిని స్వాగతిస్తున్నట్టు మహేశ్వర రెడ్డి చెప్పారు. అటు విక్రమార్కకు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. సమస్య పెంచొద్దు, గొడవలు వద్దు అని ఫోన్లోనే చెప్పారు.

మరో రెండు రోజుల్లో దిగ్విజయ్ లాండ్ అవుతారు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ఇంచార్జిగా చేసిన దిగ్విజయ్ ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో పెద్ద మనిషి పాత్ర పోషించబోతున్నారు.

సాధారణంగా కాంగ్రెస్‌లో ఒక అలవాటు ఉంటుంది. మంటలు రేగినప్పుడు వాటిపై కొన్ని నీళ్లు జల్లి మంటలను చల్లారుస్తారు తప్ప, శాశ్వతంగా మంట లేకుండా చేయడం ఆ పార్టీకి అలవాటు లేదు. నిప్పులు ఉండాలి, అవి మండుతూ ఉండాలి, అప్పుడప్పుడు భగ్గుమంటూ లేవాలి, వాటిని పైవాళ్లు చల్లార్చాలి.. ఇదే తరతరాల చరితం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)