సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’

బొ క్యార్ యెన్
ఫొటో క్యాప్షన్, బొ క్యార్ యెన్
    • రచయిత, కొ కొ ఆంగ్, చార్లెట్ అట్వుడ్, రెబెక్కా హెన్స్‌కే
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

‘నేను ముందుగా తుపాకీ కాల్చాల్సి వస్తే... నిన్ను కచ్చితంగా చంపేస్తాను.’

ఇది ఒక తండ్రి కొడుక్కి చేస్తున్న హెచ్చరిక.

మియన్మార్ సైన్యంలో పని చేస్తున్న తన కొడుకుతో ఫోనులో మాట్లాడుతున్నారు బొ క్యార్ యెన్. 2021 ఫిబ్రవరిలో ప్రజాప్రభుత్వాన్ని సైన్యం కూలదోసిన తరువాత ఆ దేశంలో అంతర్యుద్ధం తలెత్తింది. తిరుగుబాటు దళాల్లో కలిసిన బొ క్యార్, తన కొడుకు నెయి నెయి సైనికునిగా పని చేస్తున్న మియన్మార్ సైన్యంతో పోరాడుతున్నారు.

‘తండ్రిని కాబట్టి... కాస్త జాలిపడి నువ్వు నన్ను వదిలి పెట్టొచ్చు. కానీ నేను మాత్రం నిన్ను అసలు వదలను’ అని మర్రిచెట్టు నీడలో కూర్చొని ఉన్న బొ క్యార్ కొడుకుతో అంటున్నారు. ‘నిన్ను తలచుకుని చాలా బాధపడుతున్నాం’ అని బొ క్యార్ అనగానే... ‘నాన్న, నీ గురించి నాకు కూడా ఆందోళనగా ఉంది. సైనికుడు కావాలంటూ నన్ను మీరే కదా వెన్నుతట్టారు’ అంటూ నెయి నెయి అంటున్నాడు.

బొ క్యార్ కుటుంబం

ఫొటో సోర్స్, BBC/DAVIES SURYA

ఫొటో క్యాప్షన్, మియన్మార్ అంతర్యుద్ధం వల్ల బొ క్యార్ కుటుంబం చీలి పోయింది.

బొ క్యార్‌, యిన్ యిన్ దంపతులకు 8 మంది పిల్లలు. వారిలో ఇద్దరు అబ్బాయిలు సైన్యంలో పని చేస్తున్నారు. పెద్దవాడు ఆయన ఫోన్ కాల్స్ తీయడం మానేశాడు.

‘ఇళ్లను సైన్యం నాశనం చేస్తోంది. వాటికి నిప్పు పెడుతోంది. ప్రజలను చంపుతోంది. అక్రమంగా నిరసనకారులను కాల్చి పారేస్తున్నారు. కారణం లేకుండానే పిల్లలను చంపేస్తున్నారు. ఆడవాళ్లను రేప్ చేస్తున్నారు. నీకు ఆ సంగతులు తెలిసి ఉండక పోవచ్చు’ అని బొ క్యార్ కొడుక్కి నచ్చచెబుతున్నాడు.

‘మీరు అలా చూస్తున్నారు నాన్న. కానీ మేం అలా అనుకోవడం లేదు’ నెయి నెయి చాలా మర్యాదగా తండ్రికి సమాధానం ఇస్తున్నాడు.

సైన్యంలో పని చేసే తన బిడ్డలను తిరుగుబాటుదారుల్లో కలిసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బొ క్యార్ అంటున్నారు. ‘కానీ వారు నా మాట వినడం లేదు. మేం యుద్ధంలో ఎదురు పడితే ఏం జరుగుతుందో కాలమే చెప్పాల్సి ఉంటుంది’ అని బొ క్యార్ అన్నారు.

‘గుప్పెడు గింజలు తీసుకుంటే వాటిలో రెండో మూడో బాగా గట్టిగా ఉంటాయి. ఇంట్లో కూడా అంతే. కొందరు మంచిగా ఉండరు. మాట వినరు’ అని బొ క్యార్ నిట్టూర్చారు.

తన పిల్లల్లో ఇద్దరు సైన్యంలో చేరినప్పుడు బొ క్యార్ చాలా గర్వపడ్డారు. సెంట్రల్ మియన్మార్‌లో సైన్యానికి పూలతో స్వాగతం పలికే రోజుల్లో ఆయన కొడుకులు సైన్యంలో చేరారు.

వైల్డ్ టైగర్స్ దళం

ఫొటో సోర్స్, BBC/DAVIES SURYA

తన ఇద్దరు కొడుకులను సైన్యంలో చేర్చడానికి కావాల్సిన డబ్బు కోసం తమ కుటుంబం మొత్తం పొలం పని చేసేదని యిన్ యిన్ అన్నారు. అంతర్యుద్ధానికి ముందు మియన్మార్ సైన్యంలో ఉద్యోగం అంటే కుటుంబాలకు సామాజిక గుర్తింపుతోపాటు ఆర్థిక భరోసా లభించేది.

కానీ 2021లో ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు అంతా మార్చివేసింది.

శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిని కఠినంగా అణచివేసిన తీరును చూసిన బొ క్యార్, సైన్యం నుంచి వెంటనే బయటకు రావాలని తన కొడుకులను కోరారు.

‘నిరసన తెలియజేసే ప్రజలను ఎందుకు వారు కాల్చి చంపుతున్నారు? వారిని ఎందుకు హింసిస్తున్నారు? కారణం లేకుండానే ప్రజలను ఎందుకు చంపుతున్నారు?’ అని వక్క పలుకులు నములుతూనే ప్రశ్నిస్తున్నారు బొ క్యార్.

సైనిక తిరుగుబాటుకు ముందు బొ క్యార్ ఒక రైతు. ఆయన ఎన్నడూ తుపాకీ పట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఒక సివిలియన్ మిలీషియా యూనిట్‌కు నాయకుడు. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్(పీడీఎఫ్) అనే ఒక సంస్థలో ఆయన పని చేస్తున్నారు. తమ కంటే బలమైన మియన్మార్ మిలిటరీని ఢీ కొట్టేందుకు పీడీఎఫ్ ప్రయత్నిస్తోంది.

సుమారు 70మంది ఉండే ఒక చిన్న దళానికి బొ క్యార్ నాయకత్వం వహిస్తున్నారు. వైల్డ్ టైగర్స్ అని పిలిచే ఈ దళం దగ్గర ఉన్నది మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ మాత్రమే. బొ క్యార్ కొడుకుల్లో నలుగురు ఆయనతోనే కలిసి పోరాడుతున్నారు.

బొ క్యార్ ఉండే క్యాంప్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనే సైన్యంలో పని చేసే ఆయన కుమారుల మిలిటరీ బేస్ ఉంది.

ప్రార్థన

గత ఫిబ్రవరిలో సైన్యం దాడులు చేస్తున్నట్లు దగ్గర్లోని ఊరి నుంచి బొ క్యార్ దళానికి ఫోన్ వచ్చింది. ఆయన రెండో పెద్ద కొడుకు మిన్ ఆంగ్ ఆ గ్రామానికి వెళ్లడానికి అందరి కంటే ముందే సిద్ధమయ్యాడు. అతన్ని ఆపలేనని తెలిసిన తల్లి, కొడుకు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేసింది.

వైల్డ్ టైగర్స్ దళ సభ్యులు బైకులు వేసుకుని బయలు దేరారు. కొడుకు మింగ్ ఆంగ్‌ను ఎక్కించుకుని అందరికంటే ముందు బొ క్యార్ బండి నడుపుతున్నారు.

ఒక్కసారిగా వారి మీద దాడి జరిగింది.

‘దాక్కోవడానికి చెట్లు కానీ ఏమీ లేవు. వారితో పోలిస్తే మా దగ్గర ఉన్న ఆయుధాలు చాలా తక్కువ’ అని బొ క్యార్ మరొక కొడుకు మిన్ నాయింగ్ తెలిపారు.

తన దళాన్ని వెనక్కి తిరగాల్సిందిగా బొ క్యార్ ఆదేశించారు. పక్కనే ఉన్న వరి పొలాల్లో వారు దాక్కున్నారు. రెండు వర్గాల మధ్య చాలా సేపు కాల్పులు జరిగాయి.

దాడి జరిగిన కొద్ది గంటల్లోనే తాము 15 మందిని చంపాం అంటూ సైన్యం ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టింది. అప్పుడే తన కొడుకు మిన్ ఆంగ్ చనిపోయినట్లు యిన్ యిన్‌కు తెలిసింది.

ఆ తరువాత జూన్‌లో బొ క్యార్ గ్రామం మీద దాడి చేసిన సైన్యం ఆయన ఇంటితో సహా 150 ఇళ్లను తగులబెట్టింది. తిరుగుబాటు దళంలో ఆయన పని చేస్తున్నట్లు సైన్యానికి తెలిసినట్లుగా అర్థమవుతోంది. కానీ ఆయన పిల్లలు సైన్యంలో పని చేస్తున్నారనే విషయం వారికి తెలుసో లేదో తెలియదు.

కొడుకును పోగొట్టుకున్న యిన్ యిన్ ఇంకా ఆ బాధ నుంచి పూర్తిగా తేరుకోలేదు. సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నాక పది లక్షల మందికిపైగా ప్రజలు ఇళ్లు విడిచి పారిపోయారు. సుమారు 30 వేల ఇళ్లను కాల్చివేశారు.

నేటి వరకు 2,500 మందికి పైగా ప్రజలను చంపినట్లు ది అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ చెబుతోంది.

మిన్ ఆంగ్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రెండు రోజుల పాటు బొ క్యార్ కుటుంబం ప్రయత్నించింది. కానీ సైనిక పహారా వల్ల అది సాధ్యం కాలేదు.

బూడిదగా మారిన బొ క్యార్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, బూడిదగా మారిన బొ క్యార్ ఇల్లు

సైనిక తిరుగుబాటు, అంతర్యుద్ధం వల్ల బొ క్యార్ కుటుంబం చీలి పోయింది.

‘మేం కావాలని సైన్యంతో పోరాడటం లేదు. కుక్కల వంటి మీ నాయకులు చేసే అన్యాయపు పనుల వల్ల మేం పోరాడాల్సి వస్తోంది. మీ వల్లే నీ సోదరుడు చనిపోయాడు. వచ్చి చూడు నీ సొంత ఊరు ఇప్పుడు బూడిదగా మారింది’ అని ఫోనులో బొ క్యార్ ఆవేశంగా అన్నారు.

‘కనీసం నీ ఫొటోలు కూడా మా దగ్గర లేవు. నా గుండె ఎంతగా తల్లడిల్లుతోందో అర్థం చేసుకో.

నేనుండే ప్రాంతంలోకి వచ్చి నువ్వు యుద్ధాన్ని మొదలు పెడితే... నిన్నే కాదు ఎవరినీ నేను వదలను. నేను ప్రజల కోసమే నిలబడతాను. నీకు అండగా ఉండలేను’ అని కొడుకును హెచ్చరించి ఆయన ఫోన్ పెట్టేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)