18 పేజెస్ రివ్యూ: ఈ తరానికి సుకుమార్ రాసిన ప్రేమలేఖ

18 పేజెస్

ఫొటో సోర్స్, @GA2Official

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ తెలుగు కోసం

‘‘ప్రేమించడానికి కారణం వుండకూడదు కరక్టే.. కానీ ఒక మంచి కారణం వల్ల పుట్టిన ఇంత గొప్ప ప్రేమని ఎలా కాదనగలం'' – ‘18 పేజెస్’ చివర్లో సుకుమార్ చెప్పిన మాటిది.

నిజమే.. ప్రేమ పుట్ట‌డానికి కారణాలు అక్క‌ర్లేదు. ప్రేమ అనేది ఒక ఉద్వేగం. భిన్నధ్రువాలైన ఓ జంటని ఈ ఉద్వేగంలో భాగం చేశాడు సుకుమార్.

సుకుమార్ మంచి భావుకత వున్న రచయిత. కథ చెప్పడంలో ఆయన లాజిక్స్ వేరే స్థాయిలో ఉంటాయి. అయితే ప్రేమని ఆస్వాదించడానికి మంచి మనసుంటే చాలని భావించి ‘18 పేజెస్’ క‌థ‌ రాసుకున్నాడు.

కార్తికేయ2తో పాన్ ఇండియా విజయం అందుకున్న నిఖిల్ ఈ ప్రేమ కథకు కథానాయకుడు. సుకుమార్ కథతో ‘18 పేజెస్’ తెరకెక్కించాడు దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్. గతంలో ‘కుమారి 21F’ తో విజయాన్ని అందుకున్న కాంబినేషన్ ఇది. ఈసారి అల్లు అరవింద్ సమర్పణలో జీఏ పిక్చర్స్‌లో ‘18 పేజెస్’ సినిమాను బన్నీ వాసు నిర్మించారు.

ఇంతకీ ‘18 పేజెస్’లో కథ ఏంటి? ఒక మంచి కారణం వల్ల పుట్టిన ప్రేమ ఎంత గొప్పగా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? 2022ని నిఖిల్ విజయంతో ముగించాడా?

18 పేజెస్

ఫొటో సోర్స్, @GA2Official

ఆ ప్రేమ పేజీల్లో..

సిద్ధు (నిఖిల్) ఓ కార్పోరేట్ కంపెనీలో యాప్ డెవలపర్. కృతిమ మేధతో 'సి యూ' అనే యాప్‌ని డెవలప్ చేస్తుంటాడు. కంప్యూటర్, సెల్‌ఫోన్ ఇవే ప్రపంచంగా బతికే సిద్ధు ఆన్‌లైన్ లోనే ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు.

బ్రేకప్ బాధలో ఉన్న సిద్ధుకి ఓ డైరీ దొరుకుతుంది. నందిని (అనుపమ పరమేశ్వరన్) 2020లో రాసుకున్న డైరీ అది. నందిని డైరీ చదవడం మొదలు పెట్టిన సిద్ధు.. మెల్ల‌మెల్ల‌గా నందినిని ఆరాధిస్తాడు. ఆమెను చూడకుండానే ప్రేమిస్తాడు. మరి.. సిద్ధు, నందిని కలిశారా? తన ప్రేమ గురించి నందినితో చెప్పాడా? అనేది మిగిలిన కథ.

అమ్మాయిని చూడకుండా ఆమె రాసిన డైరీ చదివి ప్రేమించిన ఓ కుర్రాడి కథ ఇది. మనిషిని చూడకుండా ప్రేమ పుట్టే కథలు ఇదివరకూ వచ్చాయి. అయితే ‘18 పేజెస్’ కోసం సుకుమార్ రాసుకున్న నేపధ్యం వేరు.

సిద్ధు బ్రేకప్ ఎపిసోడ్, తర్వాత డైరీ దొరకటం, డైరీలో నందిని పరిచయం.. ఇలా సన్నివేశాలని చకచక నడిపి త్వరగానే కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. నందిని పాత్రని డిజైన్ చేసిన విధానంలో కొంత సందేశం ఇస్తున్నట్లు అనిపించినా అందులో లోతుగా చూస్తే రెండు త‌రాల‌ని ఒక చోట చేర్చి జీవన విధానంలో ఏది ఉత్తమమైనదో తేల్చుకునే అవకాశం ప్రేక్షకుడికే వదిలేస్తాడు కథకుడు.

ఉదాహరణకు.. సిద్ధుకి కంప్యూట‌ర్‌, ఫోన్ తప్పితే మరో ప్రపంచం లేదు. రోడ్డు మీద బిచ్చగాడికి డబ్బులు ఇస్తుంటాడు కానీ ఏ రోజు అతడి ముఖం చూడడు. అన్‌లైన్‌లో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. తను ప్రతి రోజూ బిచ్చం వేస్తున్నది మతిస్థిమితం లేక తప్పిపోయిన తన తాతయ్యకే అన్న సంగతి కూడా తెలుసుకోలేడు.

ఒక మనిషి మరో మనిషితో మాట్లాడటమే తగ్గిపోయింది. ఇంటర్‌నెట్ పని చేయకపోతేగానీ మనం ఫోన్ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాం.

నందిని పాత్ర ఇందుకు భిన్నంగా ఉంటుంది. 'హ్యూమన్ ఇంటరాక్షన్'ని ఎలా కోల్పోతున్నామో నందిని పాత్ర ద్వారా చెప్పారు. అయితే ఇది సందేశం ఇస్తున్నట్లు ఉండదు. నందిని క్యారెక్టర్‌లోని ప్రతి క్వాలిటీని స్క్రీన్ ప్లేలో వాడుకున్న విధానం సుకుమార్ కథలో ఉన్న బలమే.

18 పేజెస్

ఫొటో సోర్స్, @GA2Official

క్లైమాక్స్‌లో ఉద్వేగం...

ఈ కథలో హీరో హీరోయిన్ ఎప్పుడు క‌లుసుకుంటారు..? అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల‌లో క‌లిగించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. నందిని డైరీని ఫాలో అవుతుంటాడు సిద్దు. నందిని చేసే ప్రతి యాక్టివిటీ చేస్తుంటాడు. ఫోన్ వాడటం మానేస్తాడు. ప్రయాణాలు గూగుల్ మ్యాప్ సాయంతో కాకుండా మనుషుల సాయంతో చేస్తాడు.

నందిని, సందీప్ అనే డాక్టర్‌తో స్నేహంగా మాట్లాడుతుందని తెలిసి తెగ మదనపడిపోయాడు. ఇవన్నీ ఫీల్ గుడ్ మూమెంట్స్‌గా తెరపైకి వచ్చాయి.

అలాగే 'హ్యూమన్ ఇంటరాక్షన్' వలన కలిగే ఒక మేలుని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. నందిని డైరీలో '18 పేజెస్' పూర్తయిన తర్వాత కథలో మరో మలుపు వస్తుంది. ఇక్కడే ఇంటర్వెల్ పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠని చక్కగా కొనసాగించారు.

ద్వితీయార్థం కాసేపు సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతోంది. ఇక్కడే సుకుమార్ తెలివితేటలతో కూడుకున్న కథనం నడుస్తుంది. నందిని జాడ తెలుసుకునే సన్నివేశాలు సస్పెన్స్ తరహాలో నడిపారు. రియల్ ఎస్టేట్ మాఫియా నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు సుకుమార్ స్టయిల్‌లో కాసేపు తికమక పెట్టినా దాన్ని త్వరగానే ముగించేశారు.

విరామం తర్వాత సిద్దు, నందిని వదిలేసిన కొన్ని పనులని పూర్తి చేస్తాడు. అయితే అది సాగదీతగా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ కోసం అదే ట్రాక్‌ని కలపడం దర్శకుడి తెలివికి అద్దం పడుతుంది. ప‌తాక స‌న్నివేశాలు చప్పట్లు కొట్టిస్తాయి. ఒక ఫీల్ గుడ్ మూమెంట్‌ని ప్రేక్షకుల్లో కలిగిస్తుంది.

ప్రేమకథల్లో ప్రేమికులు కలిస్తే బావుంటుందని ఆ ప్రేమికుల కన్నా ప్రేక్షకులు భావించాలి. ఈ ఎమోషనల్ రాబట్టుకోవడంలో '18 పేజెస్' విజయం సాధించింది.

'18 పేజెస్' లో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. నందిని డైరీ హీరో చేతికి రావడం కథలో కీలకం. అయితే దీన్ని ఒక పాటలో ఒక మాంటేజ్‌గా చూపించేశారు. దీన్ని కాస్త క్రియేటీవ్‌గా డిజైన్ చేస్తే బాగుండేది. అలాగే నందిని మిస్సింగ్ ఎపిసోడ్‌లో వచ్చే సన్నివేశాలు కొన్ని సరిగ్గా రిజిస్టర్ కాకుండానే తొందరతొందరగా నడిపించేసినట్లు ఉంటుంది.

హీరో క్యారెక్టర్ డిజైన్ మీద కూడా కాస్త శ్రద్ద పెట్టాల్సింది. నందిని పాత్ర లక్షణాలు వివరంగా ఉంటాయి. సిద్దు పాత్రలో అది కొరవడింది. అలాగే నందినిని సిద్దు చూసిన తర్వాత కథని వీలైనంత త్వరగా ముగించాల్సింది. సిద్దు చేసే ప్రతి పనిని నందిని తెలుసుకునేలా నడిపిన విధానం కాస్త సాగదీత అనిపిస్తుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఎవ‌రికి వారే...

ప్రేమ కథలు నిఖిల్‌కి అలావాటైన జోనరే. సిద్దు పాత్రని చాలా సహజంగా చేసుకుంటూ వెళ్ళాడు. తెరపై హుషారుగా కనిపించాడు. లవర్ బాయ్‌గా తన స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. భావోద్వేగాలని చక్కగా పండించాడు.

నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకుంది. నిజానికి ఇది ఆమె కథే. ద్వితీయార్ధంలో చాలా సమయం స్క్రీన్ పై కనిపించదు. ఆమెని మళ్ళీ చూడాలనే ఆత్రుత ప్రేక్షకుల్లో కూడా ఉంటుంది. నందిని పాత్రని తీర్చిదిద్దడంలో ఉన్న మ్యాజిక్ ఇది.

అయితే కొన్నిసార్లు నందిని పాత్రని అతి మంచితనంతో తీర్చిదిద్దారా? అని కూడా అనిపిస్తుంది. అనుపమ నటన మాత్రం చాలా క్యూట్‌గా ఉంది.

సరయు నిఖిల్‌కి స్నేహితురాలు పాత్ర చేసింది. తెలంగాణ యాసలో ఆమె డైలాగులు కొన్ని నవ్విస్తాయి. పోసాని కృష్ణ మురళి, అజయ్, శత్రు తక్కువ నిడివి వున్న పాత్రలో కనిపించారు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఏడు రంగులు, నన్నయ్య రాసిన, టైం ఇవ్వు పిల్ల పాటలు అందంగా ఉంటాయి. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వసంత్ కెమరా పనితనం డీసెంట్‌గా ఉంది.

నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. ఎక్కడా అసభ్యత లేకుండా చక్కగా చిత్రీకరించారు. 'మోసం చేశారంటే ప్రేమించలేదనేగా', 'గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలే జీవితం', 'డబ్బులు ఎవడైనా సంపాదిస్తాడు. కానీ టైం మాత్రం నువ్వే ఇవ్వాలి' ఇలాంటి మాటలు సందర్భానికి తగట్టుగా ఉన్నాయి.

సుకుమార్ కథకు సరైన న్యాయం చేశాడు దర్శకుడు సూర్యప్రతాప్. ''ఆర్య'' లాంటి ప్రేమ కథతో ఒక తరం గుర్తుండిపోయే ప్రేమ కథని అందించిన సుకుమార్.. ఈ తరానికి కూడా ఓ ప్రేమ లేఖ రాసే ఓ చక్కని ప్రయత్నం ‘18 పేజెస్’తో చేశాడు.

నోట్: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)