అమెరికా మహిళల క్రికెట్ జట్టులో సగం మంది తెలుగు అమ్మాయిలే...

క్రికెట్

ఫొటో సోర్స్, USA CRICKET

    • రచయిత, నవీన్ కుమార్ కందేరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా క్రీడా వేదికపై చరిత్ర సృష్టిస్తున్నారు తెలుగు అమ్మాయిలు. ఐసీసీ వుమన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ 2023 కోసం 15 మందితో అమెరికా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో తెలుగు మూలాలున్న అమ్మాయిలు ఐదుగురు స్థానం సంపాదించారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా తెలుగు అమ్మాయిలే కావడం మరో విశేషం.

ఈ ఐదుగురు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఇతర వృత్తుల కోసం అమెరికా వెళ్లి స్థిరపడ్డ తెలుగు కుటుంబాలకు చెందినవారు. వీరిలో కెప్టెన్ కొడాలి గీతిక, వైస్ కెప్టెన్ కొలన్ అనిక రెడ్డి, భద్రిరాజు భూమిక, ముళ్లపూడి లాస్య, ఈయ్యుని సాయి తరుణి ఉన్నారు.

తెలుగు మూలాలున్నవారే కాదు, ఈ జట్టులో భారత్‌లోని ఇతర రాష్ట్రాల నేపథ్యమున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

ఈ 15 మందితో కూడిన జట్టుకు అదనంగా మరో ఐదుగురు క్రికెటర్లను రిజర్వు ప్లేయర్లగా అమెరికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వీరిలోనూ వేదాంతం కస్తూరి అనే ఒక తెలుగు అమ్మాయి ఉన్నారు.

అమ్మాయిల అండర్-19 టీ20 ప్రపంచ కప్ టోర్నీ 2023 జనవరిలో దక్షిణాఫ్రికాలో జరుగనుంది. ప్రపంచ కప్ టోర్నీకి అమెరికా అమ్మాయిల జట్టు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

క్రికెట్

ఫొటో సోర్స్, USA CRICKET

తాము పుట్టి పెరిగిన అమెరికాకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందని గీతిక, అనిక బీబీసీతో చెప్పారు.

‘‘నేను ఒక భారతీయ అమెరికన్‌ను. నాలాగా నా టీమ్ మెంబర్లు కూడా అమెరికాలో పుట్టి పెరిగారు. నా కుటుంబం, స్నేహితుల మద్దతుతో మేం అమెరికా - భారతీయ విలువలతో పెరిగాము. రెండు దేశాలంటే మాకు ఎంతో గౌరవం ఉంది.’’ అన్నారు అనిక.

భారత్‌లో క్రికెట్‌ను సంస్కృతిలో భాగంగా చూస్తారని గీతక అభిప్రాయపడ్డారు. క్రికెట్ ఆడినప్పుడు భారతీయ మూలాలతో అనుసంధానమైనట్టు భావిస్తుంటామని ఆమె చెప్పారు.

“అమెరికాలో ఎన్నో దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారు ఉన్నారు. క్రికెట్ అన్ని సంస్కృతులనూ కలిపే ఆట. క్రికెట్ ఆడితే భారతీయ మూలాలకు కనెక్ట్ అయినట్టు భావిస్తుంటాం. మా(అమెరికా) దేశపు జెండా రంగులు ఎరుపు, నీలం, తెలుపు. ఆ రంగులతో ఉన్న యూనిఫాంలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది’’ అని గీతిక చెప్పారు.

కుటుంబంతో అనిక
ఫొటో క్యాప్షన్, కుటుంబంతో అనిక

గీతిక, అనిక ఇద్దరూ గతంలో ఒకే క్లబ్‌కు ఆడేవారు.

‘‘అమెరికాలో క్రికెట్ ఆడతారని చాలా మందికి తెలియదు. అమెరికా జాతీయ టీముకు సెలక్ట్ కావాలంటే ఇంటర్నేషనల్, రీజినల్, నేషనల్స్‌లో ఆడి ప్రతిభ చూపించాలి. యాటిట్యూడ్, ఫిట్‌నెస్, పెర్ఫార్మెన్స్ ఆధారంగా క్రీడాకారుల్ని ఎంపిక చేస్తారు. అనిక, భూమిక, లాస్య, కస్తూరి.. ఇలా ఎంపికైన వాళ్లమంతా క్రికెట్ లోకల్ టోర్నమెంటుల్లోనే కలుసుకున్నాం. అందరం టీములోకి సెలెక్ట్ అవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది’’ అని గీతిక తెలిపారు.

‘‘కాలిఫోర్నియాలో గీతిక, నేనూ ఒకే క్లబ్‌కు ఆడేవాళ్లం. లాస్య, ఇసాని, చేతన, సుహానిలతో నేను ఫ్రీకింగ్ క్లబ్ బే ఏరియాలో టోర్నమెంటులు ఆడతాను’’ అని అనిక వివరించారు.

గీతిక కుటుంబం
ఫొటో క్యాప్షన్, గీతిక కుటుంబం

‘మా కోచ్ చంద్రపాల్ మాకు పెద్ద బలం’

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్ శివనారాయణ్ చంద్రపాల్ అమెరికా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆయన తమ జట్టుకు పెద్ద బలమని గీతిక, అనిక చెప్పారు.

‘‘30 సంవత్సరాల అనుభవం ఉండి, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న శివనారాయణ చంద్రపాల్ మాకు కోచ్‌గా ఉండడం అదృష్టం’’ అని అనిక సంతోషం వ్యక్తంచేశారు.

‘‘ఆయనకు క్రికెట్ పట్ల తపన, అంకితభావం చాలా ఎక్కువ. ఆయన మా టీమ్ అందరినీ క్రికెట్‌తోపాటు చదువుల్లోనూ ముందుండాలని ప్రోత్సహిస్తారు’’ అని గీతిక వివరించారు.

ప్రపంచ కప్‌లో తమ సత్తా చాటాలని అమెరికన్ తెలుగు అమ్మాయిలు ఉవ్విళ్లూరుతున్నారు.

ప్రపంచ కప్‌లో తమ జట్టు పెద్ద జట్లతో పోటీ పడబోతోందని గీతిక వివరించారు. రెండేళ్లుగా అమెరికా క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన టోర్నమెంట్లలో ఆడి తమ ఆటను మెరుగుపరచుకున్నామని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశారు.

క్రికెట్

ఫొటో సోర్స్, USA CRICKET

‘ఆ భారతీయ ప్లేయర్లతో ఆడటానికి మేం సిద్ధం’

అవకాశం వస్తే తమకు ఇష్టమైన భారతీయ మహిళా ప్లేయర్లతో ఆడటానికి తాము సిద్ధమని గీతిక, అనిక బీబీసీతో చెప్పారు.

 ‘‘కొంత కాలం క్రితం హైదరాబాద్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో మిథాలీ రాజ్‌ను కలిసే అదృష్టం కలిగింది. మిథాలీ, స్మృతి మందాన గేమ్ అంటే నాకు ఇష్టం. వాళ్లు మహిళా క్రికెట్‌కు గౌరవం తెచ్చారు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో వాళ్లతో కలసి ఆడే అవకాశం వస్తే సంతోషిస్తా’’ అని అనిక అన్నారు.

‘‘జులన్ గోస్వామి, శిఖర్ పాండేల ఫాస్ట్ బౌలింగ్ ఇష్టం. స్మృతి మందాన బ్యాటింగ్ అంటే ఇష్టం. ఐపీఎల్ లేదా మరో లీగ్ లో స్మృతి ఉన్న టీమ్ లేదా అపోజిట్ టీములో ఆడే అవకాశం వస్తే తప్పకుండా ఆడతాను. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీని కూడా బాగా అభిమానిస్తాను’’ అని గీతిక చెప్పారు.

 టీ 20 ఫార్మాట్లో అమ్మాయిల అండర్ 19 ప్రపంచ కప్ జరగడం ఇదే మొదటిసారి. మొదటి ప్రయత్నంలోనే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది అమెరికా జట్టు.

వీడియో క్యాప్షన్, అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలుగు అమ్మాయిల హవా...

అమెరికాలో క్రికెట్‌కు పెరుగుతున్న క్రేజ్: సీహెచ్ వెంకటేశ్

అమెరికాలో క్రికెట్‌కు క్రేజ్ పెరుగుతోందని క్రీడావిశ్లేషకుడు సీహెచ్ వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

‘‘అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. ఈ మధ్య లీగ్స్ కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ క్రికెట్ కి మంచి స్పేస్ దొరుకుతుంది. రాబోయే రోజుల్లో అమెరికా టీ20 వాల్డ్ కప్ నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు’’ అని ఆయన తెలిపారు.

పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళా క్రికెట్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఈ మధ్య భారత మహిళా క్రికెట్ జట్టు మ్యాచ్‌కు స్టేడియం మొత్తం నిండిందని ప్రస్తావించారు. బీసీసీఐ కూడా మహిళా క్రికెటర్లకు పారితోషికాన్ని మగవారితో సమానంగా ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు.

వీడియో క్యాప్షన్, 15 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన చిన్న వయస్కురాలు షెఫాలీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)