కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?

కోవిడ్-19 బీఎఫ్7

ఫొటో సోర్స్, REUTERS/NAVESH CHITRAKA

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనాలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కూడా భయం పెరిగింది. ఈసారి కోవిడ్ విషయంలో మనం ఎంత భయపడాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి?

వ్యాక్సీన్, మాస్కులు, ట్యాబ్లెట్లు, ఆక్సిజన్, ప్రయాణాలు..ఇలా ఎన్నో సందేహాలు వెంటాడుతోన్న వేళ, కోవిడ్ గురించి బాగా అధ్యయనం చేసిన డాక్టర్ మాదాల కిరణ్ తో బీబీసీ మాట్లాడింది. డాక్టర్ కిరణ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం ఉపాధ్యక్షులుగా పని చేస్తున్నారు. ఈ సందేహాలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇవే

ఇప్పుడు వ్యాపిస్తున్న వేరియంట్ ఏంటి?

అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఒమిక్రాన్ వేరియంటే. అందులో మళ్లీ రకరకాలు ఉంటాయి. ప్రస్తుతం చైనాలో బీఏ2.75, బీక్యూ1, ఎక్స్ బీబీ, బీఎఫ్ 7 వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ ఒమిక్రాన్ వేరియంట్లే.

ఇప్పుడు విస్తరిస్తోన్న వేరియంట్ లక్షణాలు ఏమిటి?

ఒమిక్రాన్ లక్షణాలే వీటికీ ఉంటాయి. గొంతు గరగర, ముక్కు కారడం, ఇతర వైరల్ ఫీవర్ లక్షణాలైన బాడీ పెయిన్స్, కాళ్లు లాగడం, నీరసం వంటివి ఉంటాయి.

కోవిడ్-19 బీఎఫ్7

ఫొటో సోర్స్, Getty Images

వ్యాప్తి తీవ్రత ఎలా ఉంది? అది ఎంత ప్రమాదకారి?

వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన కరోనా వేరియంట్లు అన్నిట్లో ఒమిక్రాన్ అన్నిటికంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

అందులో 540 పైగా సబ్ వేరియంట్లు ఉన్నాయి. వాటిలో ఐదింటిని ప్రమాదకారిగా డబ్ల్యుహెచ్ఒ గుర్తించింది. ఆ ప్రమాదకారిగా గుర్తించిన వాటిలో బీఎఫ్ 7 లేదు.

చైనాలో బీఏ2.75, బీక్యూ1, బీఏ2.30.2, బీఏ5 (దాని ఐదు మ్యూటేషన్ల వెర్షన్) – ఇవే ప్రమాదకరం.

540 పైగా ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో వ్యాక్సీన్‌ను ఛేదించే లక్షణాలు ఉన్నవి పైన చెప్పిన అయిదే. మిగతా వేరియంట్లు అంత ప్రమాదకరం కాదు.

ప్రమాద స్థాయి అనేది దేశాన్ని బట్టి మారుతుంది. ఆయా దేశాల్లో ఎందరికి వ్యాక్సీన్ ఇచ్చారు?, ఎందరికి సామాజిక వ్యాప్తి ద్వారా ఇప్పటికే కరోనా సోకింది..ఇలాంటివన్నీ కలసి ప్రమాద స్థాయిని నిర్ణయిస్తాయి.

ఉదాహరణకు ప్రస్తుతం చైనాలో వ్యాక్సీనేషన్ సక్రమంగా, పూర్తిగా జరగలేదు. దాంతో పాటూ అక్కడ ఎక్కువ మందికి గతంలో కరోనా రాలేదు. దీంతో ఇప్పుడు తీవ్రత ఎక్కువ ఉంది.

కోవిడ్-19 బీఎఫ్7

ఫొటో సోర్స్, ANI

భారతదేశానికి ఎంత ప్రమాదకారి?

ఇప్పుడు చైనాలో కనిపిస్తోన్న వేరియంట్లు, భారతదేశంలో ప్రమాదకరం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే చాలా మందికి కరోనా రావడం, వ్యాక్సినేషన్ కూడా పూర్తవడం వల్ల 80శాతం పైగా ప్రజల్లో యాంటీబాడీస్ ఉన్నాయి.

సహజంగా వైరస్ సోకడం వల్ల, వ్యాక్సినేషన్ వల్ల – ఇలా రెండు రకాలుగా వచ్చిన యాంటీబాడీస్ ప్రజల్లో ఉన్నాయి.

దానికితోడు ఒమిక్రాన్ వేరియంట్లు అన్నీ డెల్టా కంటే తక్కువ హాని కలిగించేవే. కాబట్టి భారతదేశానికి ఇది తక్కువ ప్రమాదకారి.

కరోనా వేరియంట్లలో అతి ఎక్కువ ప్రమాదకారి బీటా, తరువాత డెల్టా.. ప్రమాద తీవ్రత స్థాయిలో మూడవస్థానంలో ఆల్ఫా, ఆ తరువాత గామా, చివరగా ఒమిక్రాన్ ఉంటాయి.

భారతదేశం ఇప్పటికే ఒమిక్రాన్ చూసింది. కాబట్టి ఇప్పుడు కేసులు కూడా వేవ్ లాగా వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం చైనాలో వ్యాపిస్తోన్న వేరియంట్‌తో ఇక్కడ ప్రమాదం లేదు.

అయితే ఒక పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే, చైనాలో జనాభా ఎక్కువ కాబట్టి, అక్కడ కోట్ల మందికి వ్యాపించే క్రమంలో మళ్లీ ఏదైనా కొత్త వేరియంట్ పుడితే, ఆ వేరియంట్ ఎలా ఉంటుందో, దాన్ని భారతీయులు తట్టుకుంటారా లేదా అనేది చెప్పలేం.

కోవిడ్-19 బీఎఫ్7

ఫొటో సోర్స్, YALCINSONAT1

భారతదేశంలో ఎవరు జాగ్రత్తపడాలి?

అందరూ జాగ్రత్త పడాలి. అయితే మామూలు వ్యక్తుల కంటే వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారు, కోమార్బిడిటీస్ ఉన్న వారు అంటే షుగర్, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వారు ఎక్కువ జాగ్రత్త పడాలి.

ప్రస్తుతానికి కరోనా చిన్న పిల్లలను ఏమీ చేయడం లేదు.

భారతదేశంలో అందరూ మాస్కు పెట్టుకోవాలా?

ప్రస్తుతానికి పైన చెప్పిన హైరిస్క్ ఉండేవారు ఎక్కువ మంది ఉండే చోటుకు వెళ్లినప్పుడు, గుమిగూడిన ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కు పెట్టుకోవాలి.

అలాగే ఇంట్లో ఎవరికైనా జలుబు లేదా ఇతర కరోనా లక్షణాలు ఉన్నవారు కూడా ఐసోలేట్ అవ్వాలి. వారు, వారింట్లో వారూ మాస్కు పెట్టుకోవాలి.

అంటే రిస్కీ సిచ్యుయేషన్లలో ఉన్నవారు, రిస్క్ ఎక్కువగా ఉన్నవారు మాస్కు పెట్టుకోవాలి. కేసులు ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలన్నీ పాటించాలి.

కోవిడ్-19 బీఎఫ్7

ఫొటో సోర్స్, NURPHOTO

వ్యాక్సీన్ బూస్టర్ డోస్ తీసుకోవాలా?

వ్యాక్సీన్ డోస్ తీసుకున్న తరువాత 6 నెలల వరకూ దాని ప్రభావం బాగుంటుంది. కాబట్టి గత వ్యాక్సీన్ డోస్ తీసుకుని ఆరు నెలలు దాటిన వారంతా ఇప్పుడు మళ్లీ డోస్ తీసుకోవడం ఉత్తమం. దానివల్ల రిస్కును బాగా తగ్గించుకున్న వాళ్లం అవుతాము.

ఈ విషయంలో కూడా సాధారణ వ్యక్తుల కంటే హైరిస్కు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన దగ్గర హైరిస్కు వారిలో కూడా చాలా మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు. బూస్టర్ డోస్ అదనపు రక్షణ కల్పిస్తుంది.

మన ప్రభుత్వ గైడ్ లైన్స్ ఆరు నెలలు దాటిన వారు వ్యాక్సీన్ తీసుకోవాలని చెబుతున్నాయి. మూడు నుంచి ఆరు నెలలు దాటిన వారు కూడా తీసుకోవచ్చు.

వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్టుల గురించి?

వ్యాక్సీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ. వాటి కంటే కరోనా వల్ల జరిగే ప్రాణ నష్టమే ఎక్కువ.

ఉదాహరణకు వ్యాక్సీన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ వల్ల పది లక్షల్లో ఒకరు మరణిస్తున్నారు అనుకుంటే, కరోనా వల్ల 0.1 శాతం మరణించినా అప్పుడు పది లక్షల మందికి వెయ్యి మంది చనిపోతారు. అంటే కరోనా చేసే నష్టమే ఎక్కువ.

వీడియో క్యాప్షన్, ఈ 11 ఏళ్ళ అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది...

ఆక్సిజన్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?

అంత అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వేవ్ సమయంలోనే వాటి అవసరం రాలేదు.

భారతీయుల శరీరాల్లో యాంటీబాడీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి వేవ్ వచ్చే అవకాశం లేదు. కేసులు పెరిగినా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చాలు.

గత వేవ్‌లకీ, ఇప్పటికీ మందులు, చికిత్స విషయంలో ఏమైనా పురోగతి ఉందా?

మెడిసిన్ విషయంలో ఏ పురోగతీ లేదు. గత వేవ్‌లలో వాడినవే, ఇప్పుడూ వాడుతున్నాం. మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సీన్ ఒకటే. జాగ్రత్తలు పాటించడం అతి ముఖ్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)