హార్దిక్, సూర్యకుమార్ యాదవ్‌లకు పగ్గాలు... మరి రోహిత్, రాహుల్‌ల సంగతేంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ రిపోర్టర్, బీబీసీ హిందీ
నూతన సంవత్సరంలో శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేల కోసం శ్రీలంక జట్టు భారత్‌కు వస్తుంది. జనవరి 3న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఈ మార్పులతో, వైట్ బాల్ క్రికెట్ నుంచి కొంత కాలం పాటు రిషభ్ పంత్‌ను పక్కన పెట్టినట్లయింది.
అలాగే, రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు చెందిన మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అభ్యర్థిగా కేఎల్ రాహుల్‌ను అనుకున్నారు.
కానీ, వన్డే క్రికెట్ టీమ్‌లో వైస్-కెప్టెన్‌గా కాలేకపోవడంతో, ఈ రేసులో రాహుల్ వెనుకబడ్డారు.
టీ20 టీమ్‌లో, హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా, సూర్యకుమార్ యాదవ్‌కు వైస్-కెప్టెన్ బాధ్యతలను అప్పజెప్పారు.
ఓడీఐ సిరీస్‌కు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతారు. హార్దిక్ పాండ్యా వైస్-కెప్టెన్.
వన్డే టీమ్‌లో కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్‌గా చోటు దక్కింది. ఇదే ఇతనికి చివరి అవకాశంగా మారనుంది. ఒకవేళ ఇప్పుడు కనుక రాహుల్ తన ప్రదర్శనను మెరుగుచుకోకపోతే, జట్టులో చోటు కోల్పోవాల్సి రావొచ్చు.

ఫొటో సోర్స్, ANI
పంత్‌ను దూరపెట్టడానికి కారణమిదే..
టీ20 క్రికెట్‌లో ఈ మధ్య వరసగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో.. రిషభ్ పంత్‌ను పక్కన పెట్టారు.
చాలా సార్లు బాగా ఆడలేకపోతున్న క్రికెటర్లు జట్టులో స్థానం కోల్పోతూ ఉంటారు. అయితే, పంత్‌ను ఇలా తప్పించడం సమంజసంగా కనిపించడం లేదు. రిషభ్ టెస్ట్ క్రికెట్‌లో బాగానే ఆడుతున్నప్పటికీ, టీ20లో సరిగా ఆడలేకపోతున్నాడు.
పంత్ ఈ ఏడాది ఆడిన 25 టీ-20 మ్యాచులలో 364 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో, అతడిని జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది.
పంత్‌ను పక్కన పెట్టడానికి మరో కారణం ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లు రిషభ్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చడమే. వికెట్-కీపర్ బ్యాట్స్‌మన్‌గా వీరిద్దరు బాగా ఆడటంతో.. పంత్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ పర్యటనలో వన్డేలలో రెండు సెంచరీలు చేయడంతో... ఇషాన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
మూడు అర్థ సెంచరీలతో కలిపి ఈ ఏడాది 16 టీ20 మ్యాచులలో ఇషాన్ కిషన్ 476 పరుగులు చేశాడు. 127.95 స్ట్రయిక్ రేటు సాధించాడు.
సంజు శాంసన్ కూడా ఇటీవలి కాలంలో తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.
ఆరు మ్యాచులలో ఐదు ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేశాడు సంజు శాంసన్. అతడి స్ట్రయిక్ రేటు 158.4. సూర్యకుమార్ యాదవ్ తర్వాత స్ట్రయిక్ రేటు అత్యధికంగా ఉన్నది సంజు శాంసన్‌కే.
ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్‌కి పంత్ రావొచ్చు..
శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 టీమ్‌లలో రిషభ్ పంత్‌ను తీసుకోకపోయినప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో పంత్ ఆడే అవకాశం ఉంది.
ప్రస్తుతం తనకు స్వల్ప గాయం కావడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్నారు. ఈ గాయం మానిన తర్వాత, ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలో పంత్ ఆడనున్నారు.
అయితే, భవిష్యత్‌లో టీ20 టీమ్ మ్యాచులలో రిషభ్‌కు చాన్స్ రావడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లు తమకు అప్పజెప్పిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తే, పంత్ ఇక ఈ ఫార్మాట్‌లో రెస్టు తీసుకోవాల్సి ఉంటుంది.
పెరిగిన శుభ్‌మాన్ గిల్ ప్రాధాన్యం
శుభ్‌మాన్ గిల్‌కు ఇప్పటి వరకు టెస్టు, వన్డే టీమ్‌లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. ఇప్పుడు తొలిసారి టీ20 టీమ్‌లో అడే అవకాశం దక్కింది.
కేఎల్ రాహుల్‌కు బదులుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు శుభమాన్ గిల్‌ను కూడా ఓపెనింగ్‌లో దించాలని సెలక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
శుభ్‌మాన్ గిల్ ఇప్పటి వరకు ఆడిన టెస్టులు, వన్డేలలో తన ఆటతీరుతో ప్రతి ఒక్కర్ని ఆకట్టుకున్నాడు.
ఈ రెండు ఫార్మాట్లలో కూడా చక్కని ప్రదర్శన కనబర్చాడు. మంచి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అందుకే, అతడిని టీ20 టీమ్‌లో తీసుకోవాలని సెలక్టర్లు నిర్ణయించారు.

ఫొటో సోర్స్, ANI
వైట్ బాల్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా...
ఐపీఎల్‌లో తొలిసారి హార్దిక్ పాండ్యా గుజరాత్ లయన్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు. దాంతో, కెప్టెన్ స్థానానికి అతడి పేరు కూడా వినిపిస్తోంది.
రోహిత్ శర్మ లేనప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా సమర్థంగా బాధ్యతలను నిర్వర్తించాడు.
ఇక, కేఎల్ రాహుల్‌కు వన్డే జట్టులో స్థానం లభించినా వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాలేకపోయాడు. దీంతో కెప్టెన్సీ రేసులో రాహుల్ వెనకబడిపోయినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇంతకుముందు కూడా టీ20 టీమ్‌కి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే చేయాలని అనుకున్నారు. కానీ, వైట్ బాల్ కెప్టెన్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండటంపై సందిగ్ధత నెలకొంది.
టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలగడంతో, వన్డే టీమ్ కెప్టెన్సీ నుంచి కూడా ఆయనను తొలగించారు. వైట్ బాల్‌కి ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంతో కోహ్లీని తప్పించారు.
2023 ప్రపంచ కప్ ఏడాది. ఈ కారణంతో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీపై సెలక్షన్ కమిటీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కానీ, టీ-20, వన్డేలకు త్వరలోనే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ పర్యటనలో కేఎల్ రాహుల్ పేలవమైన ప్రదర్శన అతడిని కెప్టెన్సీకి దూరం చేసినట్లే కనిపిస్తోంది.
అయితే, కేఎల్ రాహుల్ కనుక భవిష్యత్తులో మంచి స్కోర్స్ చేయకపోతే వన్డే టీమ్ నుంచి కూడా ఉద్వాసనకు గురికావచ్చు.
చేతన్ శర్మ నేతృత్వంలో టీమ్‌ను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గడువు క్రిస్మస్‌తో ముగుస్తుండడంతో.. కొత్త సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో టీమ్ ఎంపిక ఉంటుందని భావించారు.
కానీ, బీసీసీఐ క్రికెట్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటులో ఆలస్యం కావడం వల్ల, ఇంకా కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో పాత సెలక్షన్ కమిటీనే టీమ్ సభ్యులను ఎంపిక చేసింది.
కొత్త అడ్వయిజరీ కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్ ఉన్నారు.
వీరి సమావేశం డిసెంబర్ 29న జరగనుంది. ఈ సమావేశంలో సభ్యుల తుది జాబితాను సిద్ధం చేసి, ఇంటర్వ్యూకి పిలిచి కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఆస్ట్రేలియాతో ఆడే భారత జట్టును మాత్రం కొత్తగా ఏర్పాటయ్యే సెలక్షన్ కమిటీయే ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చూడండి:
- కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’
- ధనిక దేశంలో పేదల కోసం సూపర్ మార్కెట్లు.. ఎలా సక్సెస్ అయ్యాయంటే
- ఇండియా-చైనా ఉద్రిక్తతలు: భారత్‌కు ఆయుధాల సరఫరాను రష్యా నిలిపివేస్తుందా
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














