బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ స్థానంలో వచ్చిన అభిమన్యు ఈశ్వరన్ ఎవరు?

అభిమన్యు ఈశ్వరన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ కోసం

నాన్నమ్మ ఒడిలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ మూడేళ్ల చిన్నారి ఒక మాట ఇచ్చాడు. ‘‘ఏదో ఒక రోజు నేను కూడా అలానే సిక్స్‌లు, ఫోర్లు కొడతాను. నువ్వు దాన్ని టీవీలో చూసి చప్పట్లు కొడతావు’’అని చెప్పాడు.

ఆ చిన్నారి పేరు అభిమన్యు ఈశ్వరన్. తను ఇప్పుడు బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌కు భారత జట్టులో స్థానం సంపాదించాడు. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా జట్టులోకి వచ్చాడు అభిమన్యు.

అభిమన్యు ఈ స్థానానికి చేరుకోవడంపై తన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని స్పోర్ట్స్ అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

28 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. అవసరమైతే లెగ్ స్పిన్ కూడా వేయగలడు. అయితే, మొదటి టెస్టు మ్యాచ్‌లో అతడికి ఆడేందుకు అవకాశం రాలేదు. రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు అతడు ఎదురుచూస్తున్నాడు.

అభిమన్యు ఈ స్థాయికి చేరుకోవడంలో తండ్రి ఆర్‌పీ ఈశ్వరన్‌ది ప్రధాన పాత్రగా చెప్పుకోవాలి. ఆయన మొదట్లో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసేవారు. అయితే, క్రికెట్ కోసం ఆయన తన వృత్తిని పక్కనపెట్టేశారు. సొంతంగా ఆయన క్రికెట్ కోచింగ్ అకాడమీని మొదలుపెట్టారు.

ఆర్‌పీ ఈశ్వరన్ సొంత ఊరు తమిళనాడులోని చెన్నై. అయితే, ఉద్యోగంలో భాగంగా ఆయన దెహ్రాదూన్‌లో స్థిరపడ్డారు. ఇక్కడే బేలాను ఆయన పెళ్లి చేసుకున్నారు. 1995 సెప్టెంబరు 6న అభిమన్యు వీరికి జన్మించారు. అభిమన్యుకు ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు పల్లవి.

నిజానికి ఆర్‌పీ ఈశ్వరన్ క్రికెటర్ కావాలని భావించారు. కానీ, ఆ లక్ష్యాన్ని ఆయన చేరుకోలేకపోయారు. అయితే, తన కుమారుడినైనా క్రికెటర్‌గా చూడాలని ఆయన భావించారు. అభిమన్యు పుట్టేందుకు ఏడేళ్ల ముందు నుంచే క్రికెట్‌తో ఆయన బంధం బలపడింది.

అభిమన్యు ఈశ్వరన్

ఫొటో సోర్స్, ABHIMANYU

ఫొటో క్యాప్షన్, తండ్రితో అభిమన్యు ఈశ్వరన్

ఆ మాటే..

క్రికెటర్‌ కావాలనుకునే యువకులకు మార్గనిర్దేశం చేసేందుకు 1988లో అభిమన్యు క్రికెట్ అకాడమీని ఆర్‌పీ ఈశ్వరన్ పెట్టారు.

తను క్రికెటర్ కాలేకపోవడంతో, తనలాంటి యువకులకు సాయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఆ అకాడమీకి ఆయన అభిమన్యు పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన తన కుమారుడికి కూడా ఆయన అదే పేరు పెట్టారు.

‘‘నేను దక్షిణ భారతీయుణ్ని. నా భార్య ఉత్తర భారత దేశంలో పుట్టారు. అందుకే పిల్లాడికి పేరు పెట్టడంలో ఎలాంటి వివాదం లేకుండా ఉండాలని భావించాను. మొత్తంగా అభిమన్యు అనే పేరును ఎంచుకున్నాం. నిజానికి మా అకాడమీకి కూడా ఇలానే ఆలోచించి అభిమన్యు అనే పేరు పెట్టాం’’అని ఆర్‌పీ ఈశ్వరన్ తెలిపారు.

అభిమన్యు గురించి మాట్లాడుతూ.. ‘‘అభిమన్యు మూడో తరగతిలో ఉండేటప్పుడు స్కూలుకు వెళ్లనని మారాం చేసేవాడు. పెన్సిల్‌కు బదులుగా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌కు వెళ్తానని చెప్పేవాడు. ఒక రోజు వాళ్ల నాన్నమ్మ ఒడిలో కూర్చొని ఏదో ఒక రోజు ఇండియా కోసం ఆడతాను చూడని అన్నాడు’’అని ఆయన చెప్పారు.

అభిమన్యులో ఆసక్తిని గుర్తించిన ఆర్‌పీ మొదట తానే శిక్షణ ఇచ్చారు. 2004లో అతడికి పశ్చిమ బెంగాల్‌లోని బనగావ్‌లో నిర్మల్ సేన్ గుప్తా దగ్గరకు శిక్షణకు పంపించారు. అలా దేహ్రాదూన్‌లో మొదలుపెట్టి కోల్‌కతా వరకు అభిమన్యు శిక్షణ భిన్న ప్రాంతాల్లో కొనసాగింది.

చిన్నప్పుడు క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఆటను అభిమన్యు చాలా ఇష్టపడేవాడు. ద్రావిడ్ మ్యాచ్‌లను టీవీలో మళ్లీ మళ్లీ చూసేవాడని ఆర్‌పీ ఈశ్వరన్ చెప్పారు.

అయితే, పెద్దయ్యాక ఆయనే తనకు కోచ్‌గా వస్తారని ఎవరు ఊహించగలరు?

అభిమన్యు అకాడమీ

ఫొటో సోర్స్, BHIMANYU CRICKET ACADAMY

అకాడమీలో ఏం అంటున్నారు?

భారత జట్టులో అభిమన్యు ఎప్పుడు ఆడతాడోనని దేహ్రాదూన్-మసూరీ లోయలో అభిమన్యు క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న యువకులు ఎదురుచూస్తున్నారు.

అభిమన్యుకు భారత జట్టులో చోటు దక్కడంతో ఈ అకాడమీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్న పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది.

అభిమన్యు గురించి ఏం అనుకుంటున్నారని ఇక్కడి గ్రౌండ్‌లో మధ్యాహ్నం ఎండలో క్రికెట్ ఆడుతున్న పిల్లలను మేం ప్రశ్నించాం. ‘‘భారత జట్టు టోపీ పెట్టుకొని ఆడాలంటే మేం కూడా అభిమన్యులా చాలా ప్రాక్టీస్ చేయాలి’’అని వారు చెప్పారు.

చిన్నప్పటి నుంచీ అభిమన్యు చాలా కష్టపడేవాడని అతడి కోచ్‌తోపాటు అభిమన్యు క్రికెట్ అకాడమీకి హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న సుశీల్ జావలే తెలిపారు.

అభిమన్యు దేహ్రాదూన్‌కు వచ్చినప్పుడు.. తాము ప్రత్యేక షెడ్యూల్ రూపొందింస్తామని, ఆటను మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్లాన్ సిద్ధంచేస్తామని సుశీల్ వివరించారు.

‘‘రోజువారీ శిక్షణలో స్కిల్ ట్రైనింగ్‌తోపాటు జిమ్ సెషన్లు కూడా ఉంటాయి’’అని సుశీల్ చెప్పారు. ప్రస్తుతం అభిమన్యు మంచి ఫామ్‌లో ఉన్నాడని, అతడు భారత జట్టుకు ఎంపిక కావడంతో యువకుల్లో స్ఫూర్తి నింపినట్లు అవుతోందని ఆయన వివరించారు.

అభిమన్యు ఈశ్వరన్

ఫొటో సోర్స్, RAVI KUMAR

షెడ్యూల్ ప్రకారం..

భారత జట్టుకు అభిమన్యు ఎంపిక కావడంతో అకాడమీ మొత్తం చాలా సంతోషంగా ఉందని అతడి ఫిట్‌నెస్ ట్రైనర్ రవి కుమార్ చెప్పారు. తమ అకాడమీ నుంచి సీనియర్ క్రికెట్‌కు ఒక ప్లేయర్ ఎంపిక కావడం ఇదే తొలిసారని వివరించారు.

అభిమన్యు దేహ్రాదూన్‌కు వచ్చినప్పుడు తన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను తానే దగ్గరుండి చూసుకుంటానని రవి కుమార్ చెప్పారు.

‘‘ఫిట్‌నెస్‌లో భాగంగా మనం ఏదైనా పనిచేయాలని అభిమన్యుకు చెప్పినప్పుడు అతడు ఆ పనిని ఆస్వాదిస్తాడు. అందుకే అతడు ఈ స్థానానికి చేరుకోగలిగాడు’’అని ఆయన వివరించారు.

అభిమన్యు ఇక్కడకు వచ్చేటప్పుడు, అతడి నుంచి కొత్త ప్లేయర్లు చాలా విషయాలు నేర్చుకుంటున్నారని రవి కుమార్ చెప్పారు.

2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు అభిమన్యు వయసు 15 ఏళ్లు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోని ఏ గ్రూపులో అతడు మంచి స్కోరు కొట్టేవాడు. 64 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లలో 13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో మొత్తంగా అతడు 4,401 రన్లు కొట్టాడు.

అయితే, భారత సెలక్టర్ల దృష్టి అభిమన్యుపై పడలేదు. మరోవైపు ఐపీఎల్‌లోనూ అతడికి అదృష్టం కలిసి రాలేదు. అయినప్పటికీ క్రికెట్‌పై నమ్మకాన్ని అభిమన్యు కోల్పోలేదు.

అభిమన్యు క్రికెట్ కెరియర్‌లో మైలురాయిగా 2013-14 రంజీ ట్రోఫీని చెప్పుకోవాలి. ఆనాడు సుదీప్ చటర్జీతో కలిసి పార్ట్‌నర్‌షిప్‌లో అతడు 163 రన్లు కొట్టాడు.

2016-17లో బెంగాల్ టీ20 జట్టులో అంతర్రాష్ట్ర టీ20 టోర్నమెంట్‌లో అభిమన్యుకు చోటు దక్కింది. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ 2019-20 సీజన్‌లోనూ అతడు ఆడాడు. ఫైనల్ మ్యాచ్‌లో గ్రీన్ టీమ్‌పై 153 రన్లు కొట్టాడు.

అభిమన్యు ఈశ్వరన్

ఫొటో సోర్స్, Getty Images

చిన్నప్పటి స్నేహితులు ఏం అంటున్నారు?

భారత జట్టుకు అభిమన్యు ఎంపిక కావడం తనకు గర్వకారణమని దేహ్రాదూన్‌కు చెందిన అభిమన్యు చిన్నప్పటి స్నేహితుడు సన్నీ రానా చెప్పారు. ‘‘చిన్నప్పటి నుంచీ మేం ఇద్దరమూ కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. అలాంటి స్నేహితుడు నాకు దొరకడం నిజంగా అదృష్టం’’అని ఆయన వివరించారు.

ఏదో ఒక రోజు అభిమన్యు తప్పకుండా భారత జట్టుకు ఆడతాడని తనకు నమ్మకం ఉందని సన్నీ వివరించారు.

‘‘మ్యాచ్‌లో అభిమన్యు చాలా పాజిటివ్‌గా ఉంటాడు. తాము గెలుస్తామని బలంగా నమ్ముతాడు. అతడు బాగా ఆడటానికి అదే కారణం’’అని సన్నీ చెప్పారు.

కోల్‌కతాలో ఒక రోజు 46 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య కూడా 200 రన్లను అభిమన్యు కొట్టాడని సన్నీ వివరించారు. ‘‘మొదటి రెండు రన్లు కొట్టినప్పుడు ఎలా ఉన్నాడో.. 200 కొట్టినప్పుడు కూడా అలానే ఉన్నాడు. అంత దృఢంగా అతడు క్రీజులో నిలబడతాడు’’అని సన్నీ వివరించారు.

వీడియో క్యాప్షన్, #T20WorldCup: పాకిస్తాన్‌పై భారత్ విజయం తరువాత మెల్‌బోర్న్‌లో అభిమానుల సంబరాలు

చాలా చిన్నప్పటి నుంచీ అభిమన్యు క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడని అతడి మరో చిన్నప్పటి మిత్రుడు హనీ చెప్పారు.

‘‘మేం అభిమన్యును చూసి చాలా నేర్చుకునేవాళ్లం. స్కూల్ తర్వాత కూడా అతడు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు’’అని హనీ వివరించారు.

‘‘మ్యాచ్ మొదట్నుంచి చివరి వరకు అభిమన్యులో ఎనర్జీ అలానే ఉంటుంది. అసలు అతడు అలసిపోడు’’అని హనీ చెప్పారు.

తాము అందరమూ ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, అభిమన్యు ప్రాక్టీస్ అలానే కొనసాగించేవాడని హనీ తెలిపారు.

భారత జట్టుకు అభిమన్యు ఎంపిక కావడంతో తమ లాంటి యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపినట్లు అయిందని హనీ వివరించారు.

అభిమన్యుతో కలిసి ఆడిన యువ క్రీడాకారులు ఏం చెబుతున్నారు?

నిఖిల్ కోహ్లీ ఫాస్ట్ బౌలర్. మూడేళ్లుగా ఆయన దేహ్రాదూన్‌లో క్రికెట్ ఆడుతున్నారు. అభిమన్యు క్రికెట్ ఆడేటప్పుడు ఆయన చాలాసార్లు బౌలింగ్ వేశారు. అయితే, అభిమన్యును ఔట్ చేయడం చాలా కష్టంగా అనిపించేదని ఆయన చెప్పారు.

‘‘అభిమన్యుకు బౌలింగ్ వేసేటప్పుడు మనం చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు’’అని నిఖిల్ చెప్పారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌పై అతడు మంచి స్కోర్ సాధిస్తాడని, తమ అంచనాలను అందుకుంటాడని ఇక్కడి అకాడమీలో యువకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)