కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’

ఆండ్రేజ్ వెలన్సియా

ఫొటో సోర్స్, ELSA VALENCIA

    • రచయిత, లీరీ సేల్స్
    • హోదా, బీబీసీ ముండో

- నువ్వు వేసిన పెయింటింగ్స్‌లో అన్నింటికంటే ఇష్టమైనది ఏది?

- నాకు రెండు అంటే ఇష్టం. వీటిలో మొదటిది అవుట్ సైడర్స్: దీనిలో కొందరు యువత హాయిగా గడుపుతూ కనిపిస్తారు. రెండోది వెన్‌క్యూబ్: పోకీమాన్‌ నుంచి స్ఫూర్తి పొంది దాన్ని వేశాను.

ఈ సమాధానం చెప్పిన చిన్నారి పేరు ఆండ్రేజ్ వెలన్సియా.

11 ఏళ్ల వయసున్న ఆండ్రేజ్ వేసిన పెయింటింగ్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఆ చిన్నారి కథను తెలుసుకునేందుకు అతడి ఇంటికి బీబీసీ వెళ్లింది.

శాన్‌డీగోలో తన స్కూలుకు వెళ్తూ దారిలో బీబీసీతో తన విశేషాలను ఆండ్రేజ్ వివరించాడు.

ఆండ్రేజ్ వెలన్సియా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని మయామీ ఆర్ట్ సెంటర్‌లో డిసెంబరు మొదటి వారంలో జరిగిన ప్రదర్శనలో ఆండ్రేజ్ పెయింటింగ్స్‌కు విశేష ప్రజాదరణ లభించింది.

ఆర్ట్ ఫెయిర్‌లో విలేకరుల ఫోటోలకు ఫోజులిస్తూ ఆండ్రేజ్ కనిపించారు.

అతడి పెయింటింగ్స్ అన్నీ అమ్ముడు పోయాయని వాటిని విక్రయించేందుకు పెట్టిన సంస్థ ‘‘చేజ్ కాంటెంపరరీ’’ వెల్లడించింది.

హాయిగా బయట మద్యపానం, ధూమపానం చేస్తున్న యువత పెయింటింగ్‌తోపాటు నీన్‌టెండో వీడియో గేమ్ నుంచి స్ఫూర్తి పొందిన డైనోసర్ వెనూసర్ పెయింటింగ్ కూడా అమ్ముడుపోయింది.

అందుకే ఇప్పుడు ఈ 11 ఏళ్ల చిన్నారిని ‘‘లిటిల్ పికాసో’’అని పిలుస్తున్నారు.

ఆండ్రేజ్ వెలన్సియా

ఫొటో సోర్స్, ELSA VALENCIA

భారీ ధరకు

‘‘అతడి ఒక్కో పెయింటింగ్‌కు వచ్చిన సగటు ధర 1,50,000 డాలర్లు (రూ.1.24 కోట్లు)’’అని ఆర్ట్ గ్యాలరీ యజమాని బెర్నీ చేజ్ బీబీసీతో చెప్పారు.

అయితే, ‘‘ఆర్ట్ మయామీ’’లో ఆండ్రేజ్ పెయింటింగ్స్‌కు ఇంత ధర పలకడం చూసి ఇక్కడివారేమీ ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే గత జూన్‌లో గ్యాలరీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలోనూ ఈ లిటిల్ పికాసో పెయింటింగ్స్ ఇలానే అమ్ముడుపోయాయి.

న్యూయార్క్ సోహోలో ఇదివరకు నిర్వహించిన ప్రదర్శనలో ఆండ్రేజ్ పెయింటింగ్స్ ఒక్కోటి 50 వేల డాలర్లు (రూ.41.36 లక్షలు) నుంచి 1.25 లక్షల డాలర్లకు (రూ.1.03 కోట్లుకు) అమ్ముడుపోయాయి.

తను తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు వేసిన మిస్.క్యూబ్ పెయింటింగ్ కూడా ఆరు అంకెల డాలర్ల విలువను అందుకుంది.

ఆండ్రేజ్ వెలన్సియా

ఫొటో సోర్స్, Getty Images

గత జులైలో ఇటలీలో నిర్వహించిన ప్రదర్శనలో పికాసో కుమార్తె స్ఫూర్తిగా ఆండ్రేజ్ వేసిన మాయ పెయింటింగ్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయింది.

కొట్టొచ్చినట్లు కనిపించే భావాలు, భిన్నమైన దృక్కోణాలు అతడి పెయింటింగ్స్‌లో కనిపిస్తున్నాయి.

గత నవంబరులో బీటీఎస్ సింగర్ ‘‘వీ’’ కూడా ఆండ్రేజ్ పెయింటింగ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

‘‘ఇంత అందమైన పెయింటింగ్ వేసినందుకు ధన్యవాదాలు. మీ పెయింటింగ్స్ చూసిన తర్వాత మీకు నేను అభిమానిగా మారిపోయాను’’అని వీ ట్వీట్ చేశారు.

‘‘రోజూ ఇంటర్వ్యూల కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. టాక్ షోలలోనూ మాట్లాడటానికి పిలుస్తున్నారు. కానీ, మేం వద్దని చెబుతున్నాం’’అని లిటిల్ పికాసో తల్లి, 48 ఏళ్ల సైకాలజిస్టు ఎల్సా వెలన్సియా చెప్పారు.

‘‘మా బాబు ఆర్టిస్టు. సెలబ్రిటీ కాదు. అన్నింటి కంటే ముఖ్యమైనది, తను ఒక చిన్నారి. తను స్కూలుకు వెళ్లాలి. చదువుకోవాలి. సంగీతం నేర్చుకోవాలి, పియానో వాయించాలి. స్పానిష్ నేర్చుకోవాలి. ఫ్రెండ్స్‌తో హాయిగా పార్కుకు వెళ్లాలి’’అని ఆమె వివరించారు.

ఆండ్రేజ్ వెలన్సియా

ఫొటో సోర్స్, Getty Images

సేవా కార్యక్రమాలు కూడా..

ఎల్సా, ఆమె భర్త గాడాల్యూప్ మెక్సికో సంతతికి చెందిన కాలిఫోర్నియా వాసులు. వీరికి అతియానా అనే కుమార్తె కూడా ఉంది. వీరు సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడుతున్నారు.

‘‘మేం ధనవంతులుగా పుట్టలేదు. థెరపిస్టుగా అయ్యేముందు, నేను ఏళ్లపాటు సామాజిక కార్యకర్తగా పనిచేశాను. జైళ్లు, వృద్ధాశ్రమాల్లో పనిచేశాను. పేదరికం అంటే ఎలా ఉంటుందో నేను దగ్గర నుంచి చూశాను. నిజానికి ఇప్పుడు మేం అదృష్టవంతులమని చెప్పొచ్చు’’అని ఎల్సా చెప్పారు.

అందుకే సమాజానికి సేవ చేయాలనే ఆలోచన తమ పిల్లల్లోనూ కలిగిస్తున్నట్లు ఎల్సా వివరించారు. ఆండ్రేజ్‌కు ఇప్పటికే సేవా గుణం అలవాటు అయిందని ఆమె వివరించారు.

ప్రదర్శనల ద్వారా తమకు వచ్చే ఆదాయంలో కొంత వీరు యూనిసెఫ్, యామ్‌ఫార్ లాంటి సంస్థలకు విరాళంగా ఇస్తున్నారు. ‘‘ఇన్‌వేషన్ ఆఫ్ యుక్రెయిన్’’ పేరుతో ఇటీవల ప్రచురించిన తన పెయింటింగ్స్ ద్వారా వచ్చి నిధులు మొత్తాన్ని క్లిట్స్‌కో ఫౌండేషన్ ద్వారా యుక్రెయిన్‌లో చిన్నారులకు వీరు విరాళంగా అందించారు.

ఈ విషయంలో లిటిల్ పికాసోపోపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పుట్టుకతో చేతుల్లేవు, అయినా పిల్లల్ని దత్తత తీసుకుని పోషిస్తున్న మహిళ

చిన్నప్పటి నుంచే ప్రత్యేకం..

ఆండ్రేజ్‌ను ప్రత్యేకమైనవాడు, మేధావి లాంటి పదాలతో సంబోధించేందుకు అతడి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అయితే, చాలా చిన్నప్పటి నుంచే అతడిలో ప్రతిభను తాము గుర్తించామని వారు చెప్పారు.

‘‘దాదాపు నాలుగేళ్ల వయసున్నప్పుడే అతడు పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు. మొదట్లో మేం కొన్నిసార్లు అతడిని సరిచేసేవాళ్లం’’అని ఎల్సా వివరించారు.

‘‘మనకు రెండు కళ్లు ఉంటాయి, మూడు కాదు. చెవులు ఉండే దగ్గర ముక్కు ఎందుకు వేస్తున్నావు. అలా వేయకూడదు’’అని అతడికి చెప్పేవాళ్లమని ఆమె వివరించారు.

‘‘అయితే, హాలోవీన్ పార్టీలో తను వేసిన పెయింటింగ్స్‌ చూసి అతడి స్నేహితులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో మేం అతడిని మందలించడం, లేదా తప్పులు చెప్పడం మానేశాం’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, తన చిత్రాలతోనే అబ్బురపరుస్తున్న హైపర్ రియలిస్టిక్ పెయింటర్‌ వరుణ

‘‘ఆ రోజు తర్వాత, అతడి పెయింటింగ్స్‌లో జోక్యం చేసుకోవడం ఆపేశాం’’అని ఆమె తెలిపారు.

ఎల్సా క్లినిక్‌లోనే ఆండ్రేజ్ గంటలపాటు పెయింటింగ్స్ వేస్తుంటాడు. మరోవైపు ఎల్సా కూడా ఖాళీ సమయంలో ఆభరణాల డిజైన్‌ చేస్తారు.

‘‘నాకు పికాసో అంటే చాలా ఇష్టం. జార్జి కోండో, అమేడియో అన్నా ఇష్టమే’’అని ఆండ్రేజ్ వివరించాడు.

ఇప్పటివరకు ఆండ్రేజ్ పెయింటింగ్‌లో ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. ‘‘మేం 20 ఏళ్లగా పెయింటింగ్స్‌పై పనిచేస్తున్నాం. ఇలా శిక్షణ లేకుండా ఇంత చక్కటి పెయింటింగ్స్ వేయడం మేంక్కడా చూడలేదు’’అని చేజ్ ప్రతినిధులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)