కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి

జప్‌సిమ్రన్ కౌర్
    • రచయిత, పర్‌దీప్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక జప్‌సిమ్రన్ కౌర్, కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) కార్యక్రమంలో 50 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.

జలంధర్‌కు చెందిన జప్‌సిమ్రన్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. తనకు జనరల్ నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొనాలని జప్‌సిమ్రన్ తండ్రి ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను చూసి స్ఫూర్తి పొందిన జప్‌సిమ్రన్ ఆ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు. తన ప్రయాణం గురించి జప్‌సిమ్రన్ చెప్పారు.

‘‘కేబీసీలో నేను 50 లక్షలు గెలిచాను. మొదట్లో ఆ షో చూస్తూ యాప్‌లో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేదాన్ని. 15 రోజుల తర్వాత, మా నాన్నకు షో నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు ఆయన ఆఫీసులో ఉన్నారు.

రాత పరీక్ష కోసం మొదట ముంబయి రమ్మని వారు పిలిచారు. ఆ పరీక్షలో విజయం సాధిస్తేనే తర్వాత మౌఖిక పరీక్షకు వెళ్తాం.

ఆ రౌండ్‌లో ఇష్టాలు, అయిష్టాలు, కుటుంబ సభ్యుల నేపథ్యం, కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారు.

మాకు కాల్ వచ్చినప్పుడు మా తాతయ్య కూడా మెట్లు ఎక్కి మేడపైకి వచ్చారు. అందరూ ప్రశాంతంగా విన్నారు. ఫోన్ పెట్టేసిన వెంటనే అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అంతా కలిసి గురుద్వారా సాహిబ్‌కు వెళ్లాం.

వీడియో క్యాప్షన్, కేబీసీలో రూ. 50 లక్షలు గెలిచిన 14 ఏళ్ల బాలిక

షో వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్‌ను కలవడం, 50 లక్షలను గెలవడం గురించి కూడా జప్‌సిమ్రన్ మాట్లాడారు.

‘‘ఒక్కసారిగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అసలు వారు ఎందుకు చప్పట్లు కొడుతున్నారో నాకు అర్థం కాలేదు. అప్పుడే నా కుడివైపు అమితాబ్ సర్ వచ్చారు. ఆ తర్వాత నేను హాట్ సీట్‌లోకి వెళ్లాను.

నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. అక్కడ కూర్చోక ముందే, అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అమితాబ్ సర్‌తో మాట్లాడాను.

ఆయన పిల్లలతో చక్కగా మాట్లాడతారు. నాకు చాలా బాగా అనిపించింది. ఆయన మాటలతో ఇతరుల్లో ఆందోళనను తగ్గిస్తారు. ఆయన మాట్లాడుతుంటే ఆందోళన దానంతట అదే తగ్గిపోతుంది.

ఆ తర్వాత ప్రశ్నలు మొదలయ్యాయి. మూడు లక్షల 20 వేలకు చేరుకున్నప్పుడు నాకు చెక్ ఇచ్చారు. 3.2 లక్షలు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది.

ఆ తర్వాత ముందుకు వెళ్లేకొద్దీ ప్రశ్నలు కాస్త కఠినంగా అనిపించాయి. కానీ అలా ముందుకు వెళ్లాను. 50 లక్షల పాయింట్లు గెలుచుకున్నాను” అని జప్‌సిమ్రన్ వివరించారు.

జప్‌సిమ్రన్ కౌర్

జప్‌సిమ్రన్ సాధించిన విజయాన్ని చూస్తే గర్వంగా అనిపిస్తోందని ఆమె తండ్రి బల్‌జీత్ సింగ్ అన్నారు. మా కుటుంబానికి, నగరానికి, రాష్ట్రానికి కూడా తను మంచి పేరు తీసుకొచ్చింది అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

‘‘మా పేరు షార్ట్ లిస్ట్ అయినట్లు మాక ఐవీఆర్ కాల్ ద్వారా తెలిసింది. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత జప్‌సిమ్రన్ కాస్త ఆందోళనకు గురైంది. అంత పెద్ద కార్యక్రమంలో ఎలా రాణించగలను అని భయపడింది.

అప్పుడు కుటుంబం మొత్తం తనకు ధైర్యం చెప్పింది. తన నాన్నమ్మ, అమ్మ అందరూ ఆమెకు భరోసా ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దని తనకు ధైర్యం చెప్పారు. ఆమె ఆడిషన్స్ కోసం నేను కూడా తనతో లైన్‌లో నిల్చున్నా. ఎట్టకేలకు తను హాట్ సీట్‌కు చేరుకుంది’’ అని ఆయన వివరించారు.

జప్‌సిమ్రన్ కౌర్

తన కూతురు విజయం సాధిస్తుందనే తనకు పూర్తిగా నమ్మకం ఉందని ఆమె తల్లి గుర్విందర్ కౌర్ అన్నారు.

‘‘ఆమె రెండు, మూడేళ్లు ఉన్నప్పుడే రాయడంపై ఆసక్తి చూపించేది. 10 నెలల వయస్సులోనే మాట్లాడటం మొదలుపెట్టింది.

మొదటి నుంచి పుస్తకాలు అంటే ఆమెకు ఇష్టం. స్పేస్ సైంటిస్టు అవ్వాలని అనుకుంటుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు ఇలాంటి ఆసక్తులు ఉండేవి’’ అని ఆమె తల్లి చెప్పుకొచ్చారు.

చిన్నతనం నుంచే జప్‌సిమ్రన్ సింగ్ చాలా ఉత్సాహంగా ఉండేదని ఆమె నాన్నమ్మ మంజీత్ కౌర్ తెలిపారు.

పాయింట్లను డబ్బులుగా మార్చుకున్న తర్వాత, తన నాన్నమ్మ మోకాళ్ల ఆపరేషన్‌కు సాయం చేయాలని జప్‌సిమ్రన్ భావిస్తున్నారు. తను స్పేస్ సైంటిస్ట్ కావాలని అనుకుంటున్నారు. భవిష్యత్‌లో విద్యార్థులకు కూడా సాయం చేయాలని భావిస్తున్నారు.

జప్‌సిమ్రన్ కౌర్

‘‘ఆ డబ్బులతో మా నానమ్మకు ఆపరేషన్ చేయిస్తాను. నేను స్పేస్ సైంటిస్టు కావాలని అనుకుంటున్నాను. దీని కోసం మొదట 12వ తరగతిలో మంచి మార్కులు సాధించి ఐఐటీలో చేరాలి. ఈ డబ్బులో కొంత కోచింగ్ క్లాసులకు ఉపయోగిస్తాను. నేను స్థిరపడిన తర్వాత పిల్లలు చదువుకునేందుకు కూడా సాయం చేస్తాను’’ అని జప్‌సిమ్రన్ చెప్పారు.

కేబీసీ నిబంధనల ప్రకారం, జప్‌సిమ్రన్‌కు 18 ఏళ్ల వయసు వచ్చాక 50 లక్షల రూపాయలు ఇస్తారు. అందుకే కేబీసీ జూనియర్స్‌లో వీటిని పాయింట్లుగా పిలుస్తున్నారు. ఈ విజయంలో ఆమెకు కుటుంబం, స్కూల్ నుంచి మంచి మద్దతు లభించింది.

వీడియో క్యాప్షన్, పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా ఐఏఎస్ కావాలని అనుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)