ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి? వారికి ఏం నేర్పించాలి? ఎలా నేర్పించాలి?

ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేవిడ్ రాబ్సన్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

చిన్న పిల్లల సంరక్షణ బాధ్యతలు చూస్తున్నప్పుడు, వారికి ఎలాంటి బాదరబందీలూ తెలియకుండా పెంచాలనుకోవడం ఒక్కోసారి వారిని మరింత ప్రమాదం లోకి నెట్టేస్తుంది.

చిన్న వయసులో పిల్లలు రోడ్డు మీద ప్రమాదానికి గురవుతారేమోనని, చెరువులోనో స్విమ్మింగ్ పూల్‌లోనో పడిపోతారేమోనని, కుక్కల కరుస్తాయేమోనని తల్లిదండ్రులు భయపడుతుంటారు.

అయితే పిల్లల వయసుతో పాటు ఈ భయాలు, ప్రమాదాలు కూడా మారుతూ వస్తున్నాయి. మద్యం, డ్రగ్స్, హింస, మానసిక ఆరోగ్య సమస్యలు వంటివి యువత మీద, కౌమారదశలోని పిల్లల మీద ఎక్కువగా ప్రభావితం చూపుతున్నాయి. ఈ విషయాల్లో తల్లిదండ్రులు ఎక్కువగా భయపడాల్సి వస్తోంది.

రోడ్డు ప్రమాదాలు కూడా ఈ కాలంలో మరింత భయానకంగా మారాయి. ఇంకా, కొన్ని కంటికి కనిపించని ప్రమాదాలు పిల్లల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైంది గాలి కాలుష్యం. వీటిని గుర్తించి, పరిష్కరించడం చాలా కష్టం.

ఈ సమస్యలను, ప్రమాదాలను పిల్లలు అధిగమించేందుకు వారు వాటిని అంచనా వేయగలగాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సహకారం లేకుండానే ఈ ప్రపంచంలో పిల్లలు సురక్షితంగా జీవనం కొనసాగించగలగాలి.

ఇలా బతకగలిగే నైపుణ్యాలు లేకపోతే.. పిల్లలు తమ జీవితాలను ప్రమాదంలో పడేసే నిర్ణయాలను తీసుకునే ముప్పు ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యం పాడవ్వడం, ఆర్థిక సమస్యల పాలవ్వడం, నేరాల్లో ఇరుక్కోవడం వంటివి జరుగుతాయి.

మరి ఈ జీవిత పాఠాలను పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఈ ప్రపంచంలో పిల్లల్ని సురక్షితమైన మార్గంలో ప్రయాణించేలా చేసేందుకు తల్లిదండ్రులు, వారి సంరక్షకులు ఏం చేయాలి? వారు కూడా కొన్ని ట్రిక్కులు నేర్చుకోవాల్సి ఉందా?

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

మానసిక ఎదుగుదల ముఖ్యం...

ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లలు శరీరకంగానూ మానసికంగానూ ఎదగడం ముఖ్యం. మానసిక ఎదుగుదలతోనే పిల్లలు సమస్యలను సులభంగా ఎదుర్కోగలరు.

పిల్లల అభివృద్ధి క్రమంలో ప్రతి దశలోనూ భిన్నమైన విధానం అవసరం. సరైన మార్గదర్శనంతో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేలా పిల్లల్ని, యువతను ప్రోత్సహించవచ్చు. దీనివల్ల వారి తదుపరి జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు వస్తాయి. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తారు.

‘‘మన తలరాతను నిర్ణయించే నైపుణ్యాలను మనం నేర్చుకోవాలి’’ అని ప్రమాదాలలో నిపుణుడైన యూకే లీడ్స్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ జోషువా వెల్లర్ అంటారు. ఈ నైపుణ్యాలను పిల్లలు చాలా రకాలుగా అభివృద్ధి చేసుకోగలరని ఆయన చెప్పారు. 

పిల్లలు పుట్టినపుడే వారిలో ఎంతో కొంత సహజ జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఈ జ్ఞానంతో వారు బేసిక్ ప్రమాదాల నుంచి బయటపడతారు.

భయపెట్టే అనుభవాల నుంచి పిల్లలు నేర్చుకుంటారని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలు తొలిసారి పాకుతూ బెడ్‌ మీద అంచుల వరకూ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఒక టేబుల్‌పై నుంచి మరో టేబుల్‌పైకి ఎలాంటి భయం లేకుండా వెళ్తారు.

ఇలాంటి అనుభవాల నుంచే భయాలు వస్తాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ భయంతోనే పిల్లలు కూడా మరింత శ్రద్ధతో నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంటున్నాయి.

ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు పదే పదే గుర్తు చేయాలి...

యువత అయితే ఇతరుల ముఖ కవళికలను బట్టి లేదా వారి శరీర సంకేతాలను బట్టి ప్రమాదాలను పరోక్షంగానే అంచనా వేయగలరని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే ప్రమాదాన్ని గుర్తించేలా చేయడం మాత్రమే పిల్లల్ని సురక్షితంగా ఉంచినట్టు కాదు. సమస్య వచ్చిన వెంటనే వారు వేగంగా స్పందించేలా వారి మెదళ్లను అభివృద్ధి చేయగలగాలి.

పదేళ్లు వచ్చేంత వరకు చూడటం లేదా వినడం వంటి ఇంద్రియ జ్ఞానాలతో మనం పూర్తిగా నిమగ్నమవటం నేర్చుకోలేమని పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రమాదాన్ని గుర్తించగలిగే సామర్థ్యం పిల్లల్లో క్రమక్రమంగా అభివృద్ధి అవుతుంది. అదే కొన్నిసార్లు సమస్యాత్మకంగా మారుతుంది. ఉదాహరణకు కారు ఎంత వేగంగా వస్తుందో గుర్తించగలగడం. ఆ సమయంలో ఎంత వేగంగా ప్రమాదాన్ని గుర్తిస్తే, అంత తేలిగ్గా ప్రమాదం నుంచి బయటపడతాం. లేదంటే కారు ప్రమాదానికి గురవుతాం.

అలాగే, పిల్లల మనస్సు చాలా వేగంగా వేరే అంశం పైకి మళ్లిపోతూ ఉంటుంది. అంటే ఏ విషయాన్నైనా వారు తేలిగ్గా మార్చిపోతూ ఉంటారు.

రోడ్డు భద్రత విషయానికి వస్తే, తల్లిదండ్రులు ఎన్నోసార్లు తమ పిల్లలకు పలు సూచనలు చేస్తూ ఉంటారు. ముందు, వెనుక చూసుకుని రోడ్డు దాటాలని, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆకుపచ్చ రంగు లైట్ పడితే ఆగిపోవాలని చెబుతూ ఉంటారు.

ఈ సూచనలను పిల్లలు నిత్యం అనుసరించడం ద్వారా వారికి పదే పదే గుర్తు చేయాల్సినవసరం లేకుండా వారు దాన్ని ఫాలో అవుతారు.

ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images

కౌమర దశలో ఎన్నో ప్రమాదాలు...

కౌమరదశలో పిల్లలకి మార్గదర్శనం చేయడంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులుంటాయి. కౌమరదశలో పిల్లల బ్రెయిన్‌లో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు వస్తుంటాయి. ఆ దశలో శరీరంలోనూ, మెదడులోనూ కీలక పాత్ర పోషించే నాడీ ప్రసరణ వ్యవస్థ న్యూరోట్రాన్సిమిటర్‌ డోపమైన్ ద్వారా సెన్సిటివిటీ పెరుగుతుంది.

ప్రమాదాలను తప్పించుకునే అవకాశాన్ని మనం యువతకు ఇస్తే, పిల్లలతో పోలిస్తే వారు అత్యంత సురక్షితమైన దాన్నే ఎంపిక చేసుకుంటారని నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ యూనివర్సిటీ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐవీ డెఫో అన్నారు.

అప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పిల్లలు స్వతంత్రత పొందితే, వారు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, డ్రగ్స్ వాడటానికి, ముఠాలు కట్టి గొడవలకు వెళ్లటానికి, అసురక్షిత సెక్స్‌లో పాల్గొనటానికి, స్నేహితులతో పోటీపడటానికి ఎన్నో అవకాశాలు వారి ముందుంటాయని, వారు స్వేచ్ఛగా వారికి నచ్చింది ఎంపిక చేసుకుంటూ ఉంటారని చెప్పారు.

కౌమరదశ, యుక్త వయసులో పిల్లల్ని ప్రమాదాల్లో పడేసే పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయని డెఫో అన్నారు. వాటి ఆకర్షణ నుంచి బయటపడటం కొన్నిసార్లు కష్టమవుతుందన్నారు.

అలాగే వివిధ వయసుల వారిలో ప్రమాదాన్ని అంచనా వేయడం భిన్నంగా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.

ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images

లాజికల్ స్కిల్స్ నేర్పించాలి...

చాలా కేసుల్లో పిల్లల్లో లాజికల్ స్కిల్స్ లోపించడం మనం చూస్తూ ఉంటాం. వీటిని పరిశోధించడానికి సైకాలజిస్టులు ఒక సమగ్రమైన పరీక్షను అభివృద్ధి చేశారు.

ప్రమాదాన్ని అంచనావేయడంలో వారు సాధారణంగా అనుసరించే చర్యలేమిటి? వివిధ రకాల అంశాలలో ఉన్న మంచి చెడులేంటి? వంటి ప్రశ్నల ఆధారంగా ప్రమాదాలను గుర్తించడంలో పిల్లలకున్న అవగాహనను కనుగొన్నారు. 

సాధారణ ప్రమాదాల విషయంలో వారికి ఏమాత్రం అవగాహన ఉంటుంది, వారి విశ్వాసం ఎలా ఉంటుందనే విషయాలను కూడా ఈ పరీక్షలో పాల్గొన్న వారి సమాధానాల ద్వారా తెలుసుకున్నారు.

అయితే, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడినప్పుడు మాత్రమే వారి సొంత సామర్థ్యాలు బయటకి వస్తాయని, అప్పటి వరకు వారి సమర్థతను మనం గుర్తించలేమని పరిశోధకులు చెప్తున్నారు.

‘‘నిర్ణయాలు తీసుకునే సమయంలో పిల్లలు వ్యవహరించే తీరు, వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఇదే భవిష్యత్‌లో చాలా అంశాలను నిర్ణయిస్తుంది’’ అని వెల్లర్ అన్నారు. పిల్లల మానసిక స్థితి, ప్రమాద సమయంలో వారు వ్యవహరించే తీరుపై వెల్లర్ ఎన్నో రకాల అధ్యయనాలు నిర్వహించారు.

ఏదైనా అనూహ్య పరిస్థితి ఎదురైనపుడు వారు ఎంత వేగంగా, ఎంత సమర్థంగా దాన్ని ఎదుర్కోగలుగుతున్నారనేది కూడా వారి మెదడు సామర్థ్యాన్ని తెలియజేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రమాదాలను ఎదుర్కొనేలా పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images

ఆకస్మిక ప్రమాదాల గురించి బోధించాలి...

జీవితంలో ఎదుర్కొనే ప్రమాదాల బారి నుంచి పిల్లలు, యువత ఎలా బయటపడాలో తల్లిదండ్రులు, టీచర్లు నేర్పించాల్సివసరం ఉందని డెఫో, వెల్లర్ పరిశోధనలు చెప్తున్నాయి.

మన పిల్లల్ని ప్రమాదం బారిన పడకుండా కాపాడటం కంటే, దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పించాలని సూచిస్తున్నాయి. ఇలా చేయటం వారికి దీర్ఘకాలంలో చాలా సాయం చేస్తుందని, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను ఇవి మెరుగుపరుస్తాయని వీరి అధ్యయనాలు చెప్పాయి.

ముఖ్యంగా స్వీయ నియంత్రణను ప్రోత్సహించడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటివి నేర్పించాలి. చాలా ప్రమాదాలు అకస్మాత్తుగా వస్తుంటాయి. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలను పిల్లలకి బోధించాలి.

క్లిష్టమైన ఆలోచనా విధానాలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అంటే ఒక సమస్య ఏ రూపంలో వస్తుంది, దాని ప్రభావాలేంటి? అనే కోణంలో ఆలోచించగలిగేలా చేయాలి. ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునేలా స్కూళ్లు, కాలేజీలు పిల్లలకు, యువతకు సాయపడాలి.

దీనికి బహుముఖ విధానం అవసరమని వెల్లర్ చెప్పారు. కేవలం ఒక్క విధానం పిల్లలకి సరిపోతుందని తాను అనుకోవడం లేదన్నారు. పిల్లలు, యువత మరింత విశ్లేషణాత్మకంగా ప్రమాదాల గురించి ఆలోచించగలగాలి.

తద్వారా వారు యుక్తవయసుకు చేరుకునే సమయానికి పూర్తిగా జీవిత సమస్యలను పరిష్కరించుకునేలా సిద్ధమవుతారు. అప్పుడే వారికి పుట్టే పిల్లల్ని కూడా వారు సంరక్షించగలుగుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)