అమెరికా: ప్రసవించిన కాసేపటికే బిడ్డను వదిలేసినా నేరం కాదు.. మహిళలకు అవగాహన కల్పిస్తున్న అమెరికా ప్రభుత్వం.. ఎందుకు?

ఫొటో సోర్స్, Tim Mansel
- రచయిత, లిండా ప్రెస్లీ
- హోదా, బీబీసీ న్యూస్, అరిజోనా
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని రద్దు చేయడం ముఖ్యమైన పాత్రను పోషించింది.
అబార్షన్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని సేఫ్ హెవెన్ చట్టాలు (safe haven laws)లలో కనుగొనవచ్చనే వాదన కూడా ఉంది.
సెఫ్ హెవెన్ లాస్ అనేవి అమెరికాలో శాసనాలు. వీటి ప్రకారం క్షేమంగా ఉన్న బిడ్డను చట్టప్రకారం నియమితులైన ప్రైవేటు వ్యక్తుల దగ్గర విడిచిపెడితే దాన్ని నేరంగా పరిగణించరు.
అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలో ఈ చట్టాలు అమల్లో ఉన్నాయి. బాధిత తల్లులు ప్రసవించిన కాసేపటికే బిడ్డను నిర్దేశించిన ప్రదేశాలలో ఎవరికీ తెలియకుండా వదిలి వెళ్లేందుకు ఈ చట్టాలు అనుమతిస్తాయి.
అమెరికా సేఫ్ హెవెన్ చట్టాలతో ముడిపడిన ముగ్గురు వ్యక్తుల కథలను ఇక్కడ చదవండి.

ఫొటో సోర్స్, THE BOSTON GLOBE VIA GETTY IMAGES
తల్లి
అరిజోనాలోని మైదాన ప్రాంతాల్లో ఒక శీతాకాలపు రాత్రి పూట నిర్మానుష్యమైన రహదారిపై డ్రైవింగ్ చేస్తూ మిషెల్ అకస్మాత్తుగా ఆగిపోయారు.
‘‘అప్పుడు నాకు బాగా నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తిరిగి వెళ్లలేకపోయాను’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. నగరానికి 20 మైళ్ల దూరంలోని ఒక సముద్రపు పాయ వద్ద తన కారులో బిడ్డకు మిషెల్ జన్మనిచ్చారు.
‘‘అది చాలా భయంకరం. నేను మా అమ్మ కోసం అరిచాను. అప్పుడు ఆమె నాకు అవసరం’’ అని మిషెల్ చెప్పారు.
మిషెల్ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఆమె పెద్ద కుమార్తె కారు వెనుక సీటులో నిద్ర పోతున్నారు. చీకట్లో మిషెల్ 15 నిమిషాలు అలాగే కూర్చుండిపోయారు. నవజాత శిశువును ఒక బ్లాంకెట్‌లో చుట్టి పదిలంగా పట్టుకున్నారు.
బిడ్డ ముఖం చూసిన ఆమె వెంటనే వేగంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.
తాను గర్భవతి అనే విషయం మిషెల్ ఎవరికీ చెప్పలేదు. ఆమె చాలా భయపడింది. ఆ పసిబిడ్డ తండ్రి నుంచి ఆమె విడిపోయారు.
ఆమె దగ్గర్లోని ఒక ఆసుపత్రికి వెళ్లారు. అరిజోనాలోని సేఫ్ హెవెన్ చట్టాల గురించి ఆమెకు తెలుసు. బిడ్డ క్షేమంగా ఉంటే ఎలాంటి ప్రాసిక్యూషన్ లేకుండా అక్కడి వారికి తన బిడ్డను అప్పగించి వెళ్లొచ్చు అనే సంగతి ఆమెకు తెలుసు. వెంటనే చేతుల్లో బిడ్డతో ఆమె ఆసుపత్రి రిసెప్షన్‌లోకి వెళ్లారు.
‘‘ప్రసూతి బృందంతో మాట్లాడమని నాకు చెప్పారు. ఆ విభాగం వారు వచ్చి నాతో మాట్లాడారు. నేను జరిగింది చెప్పాను. బిడ్డను వారికి ఇచ్చేయడమే ఉత్తమమని నేను భావించాను. నా మొదటి బిడ్డ తండ్రి నుంచి ఆమె సురక్షితంగా ఉండాలని నేను కోరుకున్నా’’ అని ఆమె చెప్పారు.
మిషెల్ పసిబిడ్డను నర్సులకు అప్పగించారు. ఆ బిడ్డను దత్తత ఇస్తారని ఆమెకు తెలుసు.
ఆమె మూడు నిమిషాల్లోనే ఈ పని ముగించి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Tim Mansel
నర్స్
హీథర్ బర్నర్ అనే మహిళ సేఫ్ హెవెన్స్ చట్టాల లాయర్‌గా మారడానికి కారణం ఒక నవజాత శిశువు మరణం.
ఒక దశాబ్దం క్రితం ఆమె ఫీనిక్స్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో పీడియాట్రిక్ నర్సుగా పనిచేసేవారు.
‘‘ఒక 15 ఏళ్ల బాలిక పొత్తి కడుపులో నొప్పితో ఆసుప్రతిలో చేరారు. ప్రాథమిక పరిశీలన తర్వాత ఆమె బాత్రూంకు వెళ్లారు. అక్కడ బిడ్డను ప్రసవించారు. ఆ బిడ్డను అక్కడే చెత్తకుండీలో వేశారు. 20 నిమిషాల తర్వాత ఆ బిడ్డను ఒక సిబ్బంది గుర్తించారు. బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ విఫలం అయ్యాం’’ అని హీథర్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆ టీనేజర్ తాను బిడ్డను ప్రసవించినట్లు ఒప్పుకోలేదు. ఆమె లైంగిక వేధింపుల బాధితురాలు అని అనుమానించాం. కుటుంబ సభ్యులే ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
‘‘ఇది చాలా బాధాకరమైనది’’ అని హీథర్ అన్నారు. ఇప్పుడు ఆమె అరిజోనా సేఫ్ హెవెన్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా, నేషనల్ సేఫ్ హెవెన్ అలియన్స్ (ఎన్‌ఎస్‌హెచ్‌ఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
1999 నుంచి దేశవ్యాప్తంగా 4,687 మంది శిశువులను ఇలా అప్పగించినట్లు ఆమె లెక్కలు చెప్పారు.
ఎన్‌ఎస్‌హెచ్‌ఏ ఒక హెల్ప్‌లైన్ నడుపుతోంది. దానికి నెలకు 60 నుంచి 100 కాల్స్ వస్తుంటాయి. జూన్‌లో సుప్రీం కోర్టు అబార్షన్ హక్కులను రద్దు చేసినప్పటి నుంచి ఈ ఫోన్ కాల్స్ సంఖ్య 300 శాతం పెరిగింది.
ఎలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బిడ్డను సేఫ్ హెవెన్‌లో అప్పగించాలని ఎన్‌ఎస్‌హెచ్‌ఏకు ఫోన్ చేసే వ్యక్తులకు సలహా ఇస్తారు.
‘‘బిడ్డను పెంచుకోవడానికి మీకున్న ఇబ్బంది ఏంటని వారిని మేం అడుగుతాం. చాలా సందర్భాల్లో బిడ్డతో వారికేం సమస్య ఉండదు, కానీ వారు ఎదుర్కొంటోన్న పరిస్థితులే బిడ్డను వదిలేలా చేస్తాయి. వారు నిరాశ్రయులా? వారికి పిల్లల రక్షణ రక్షణ అవసరమా? ఇలాంటి వవరాలన్నీ ఆరా తీస్తాం’’ అని హీథర్ చెప్పారు.
కొంతమంది మహిళలు తమ పిల్లలను పెంచుకుంటారు. మరికొంతమంది బిడ్డను దత్తతకు ఇస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ బిడ్డను సేఫ్ హెవెన్‌లో అప్పగించి వెళ్లిపోతారు.

ఫొటో సోర్స్, Tim Mansel
బేబీ
పోర్టర్ ఓల్సాన్ అనే బాలుడు తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, తనకు ఎంతో ఇష్టమైన కుక్కతో కలిసి పశ్చిమ ఫీనిక్స్‌లో నివసిస్తున్నారు. పోర్టర్ ఓల్సాన్ వయస్సు 11 ఏళ్లు. అతను క్యాంపులకు వెళ్లడం, వంట చేయడం, తోటపనిని చాలా ఉత్సాహంగా చేస్తారు.
2011లో ఒక దత్తత సంస్థ ద్వారా వారు ఓల్సాన్‌ను కలుసుకున్నారు. ‘‘తమ వద్ద ఒక బిడ్డ ఉందని చెబుతూ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది’’ అని మిషెల్ ఓల్సాన్ గుర్తు చేసుకున్నారు. వెంటనే తన భార్య నికోల్‌కు ఆయన ‘ఇదొక అద్బుతమైన రోజు’ అని మెసేజ్ చేశారు.
ఆ సమయంలో నికోల్ తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ‘‘వెంటనే మా ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి నాకు మెటర్నిటీ లీవ్ గురించి అడిగాను. నువ్వు ప్రెగ్నెంట్‌వా? అని ప్రిన్సిపల్ నన్ను అడిగారు. లేదు. కానీ నేను ఈ రోజు బిడ్డను పొందబోతున్నా అని చెప్పాను’’ అని నికోల్ తన సంతోషపు క్షణాలను వివరించారు.
పోర్టర్‌కు జన్మనిచ్చిన తల్లి అతన్ని ఒక డబ్బాలో పెట్టి ఆసుపత్రి వద్ద విడిచి వెళ్లిపోయారు. అరిజోనాలో బిడ్డ దొరికిన వెంటనే అదేరోజు దత్తత తీసుకునే కుటుంబాలు ఉంటాయి.
‘‘నేనెప్పుడు నిజంగా దాన్ని పట్టించుకోలేదు. మేమంతా కలిసి ఒక కుటుంబంగా ఎదుగుతామని మాత్రమే నేను గుర్తించా’’ అని నికోల్ చెప్పారు. ఇదంతా పోర్టర్‌కు తెలిసి ఉండటం మంచిదని ఆ దంపతులు భావించారు.
‘‘ఒకరోజు మా అమ్మ నన్ను డీఎన్‌ఏ పరీక్ష కోసం తీసుకెళ్లింది. నా గుర్తింపు ఏదైనా ఆమె దాన్ని సంతోషంగా వేడుక చేసుకోవాని నిర్ణయించుకుంది. డీఎన్‌ఏ పరీక్ష ముగిసింది. నేను యూరోపియన్, అమెరికన్, సబ్-సహారన్ ఆఫ్రికన్, ఈస్ట్ అమెరికన్’’ అని అని పోర్టర్ చెప్పారు.
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి మరింత తెలుసుకునేందుకు పోర్టర్‌కు అందుబాటులో ఎలాంటి అవకాశం లేదు. అందుకే కొంతమంది సేఫ్ హెవెన్ చట్టాలను ఆమోదించడం లేదు.

ఫొటో సోర్స్, Tim Mansel
మిషెల్‌కు ఏమైంది?
‘‘నా మనసులో నుంచి ఆ పసిబిడ్డ ముఖాన్ని చెరిపివేయలేకపోయాను’’ అని నర్సులకు తాను అప్పగించిన బిడ్డ గురించి మిషెల్ చెప్పారు.
మిషెల్ బిడ్డను ప్రసవించిన మూడు రోజుల తర్వాత ఎన్‌ఎస్‌హెచ్‌ఏకు ఫోన్ చేశారు. ఆమె పక్షాన హీథర్ బర్నర్ వాదించారు.
‘‘దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మిషెల్‌కు అనుకూలంగా వ్యవహరించారు’’ అని హీథర్ బర్నర్ చెప్పారు.
బిడ్డను విడిచిపెట్టిన 33 రోజుల తర్వాత మిషెల్ మళ్లీ తన బిడ్డను పొందారు.
తన బిడ్డను మళ్లీ చూడటం అత్యుత్తమ అనుభూతి అని మిషెల్ అన్నారు. ఆసుపత్రి నుంచి బిడ్డను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆ బిడ్డను తిరిగి మిషెల్‌కు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
ఒకవేళ వారు బిడ్డను తిరిగి ఇచ్చేందుకు నిరాకరించి ఉంటే మిషెల్ కోర్టులో పోరాడాల్సి వచ్చేది.
తాను కోరుకున్నట్లుగా బిడ్డ తిరిగి రావడంతో బీబీసీతో మిషెల్ సంతోషంగా మాట్లాడారు. కానీ, బిడ్డను తిరిగి పొందలేకపోయిన వేలాదిమంది మహిళల సంగతి ఏంటి?
మిషెల్ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును మార్చాం.
ఇవి కూడా చదవండి:
- సూర్యకుమార్ యాదవ్ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ
- హైదరాబాద్‌లో కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..
- పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో..
- ‘మనుషులు చంద్రుడి మీద జీవిస్తారు.. మరో 10 సంవత్సరాల్లోనే ఇది
- జ్ఞాపకశక్తి: ఏం తింటే పెరుగుతుంది, ఎలాంటి ఆహారాలతో దెబ్బతింటుంది?సాధ్యమవుతుంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















