అఫ్గానిస్తాన్: ‘ఇదొక దేశం కాదు.. మహిళలకు బందిఖానా.. మగవాళ్లకు ఈ నిషేధాలు ఎందుకు వర్తించవు?’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలియా ఫర్జాన్, ఫ్రాన్సెస్ మావో
- హోదా, బీబీసీ న్యూస్
తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్తాన్‌లో మహిళల, బాలికల భయభ్రాంతులకు గురవుతున్నారు.
బుధవారం హిజాబ్‌లు ధరించిన అమ్మాయిలను వారి యూనివర్సిటీల్లోకి రాకుండా అడ్డుకున్నారు.
తాలిబాన్ గార్డులు వారిని యూనివర్సిటీ క్యాంపస్‌లలోకి అనుమతించకపోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది.
ఫోటోలలో చూడొచ్చు.. గుంపులు గుంపులుగా నిల్చుని ఉన్న మహిళలు యూనివర్సిటీ గేట్ల ముందే కన్నీటి పర్యంతమవుతున్నారు.
అఫ్గాన్‌లో ఇప్పటికే అనేక సెకండరీ పాఠశాలల్లో విద్యకు బాలికలు దూరమయ్యారు.
గత 16 నెలలుగా సెకండరీ స్కూల్స్‌లో బాలికలు చదువుకోకుండా నిషేధించిన తర్వాత, ఈ వారంలో తాలిబాన్లు యూనివర్సిటీ చదువులను కూడా మహిళలకు రద్దు చేశారు.
‘‘నా భవిష్యత్‌కు ముడిపడి ఉన్న ఏకైక అవకాశాన్ని వారు పూర్తిగా నాశనం చేశారు’’ అని కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థి బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
‘‘నేనేం చెప్పగలను? నేను చదువుకోగలనని నమ్మాను. నా భవిష్యత్ మారుతుందని, జీవితంలో వెలుతురు వస్తుందని అనుకున్నాను. కానీ దానంతా వారు నాశనం చేశారు’’ అని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని నిషేధిస్తూ మంగళవారమే తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత వెంటనే పలు ప్రావిన్స్‌లలో కొనసాగే ఇస్లామిక్ మత పాఠశాలలు, ప్రైవేట్ ట్యూషన్ కాలేజీలతో సహా మహిళలకు ప్రవేశం నిరాకరించారు.
ప్రైవేట్ విద్యా కేంద్రాలకు బాలికలు రాకుండా తాలిబాన్లు ఆపివేసినట్టు ఉత్తరాన తాఖర్, ఆగ్నేయంలో ఘాజ్ని, రాజధాని కాబూల్‌కు చెందిన వర్గాలు బీబీసీకి ధ్రువీకరించాయి.
ఈ ఆదేశాలతో మహిళలకు అందుతున్న అధికారిక విద్యకు చెందిన అన్ని తలుపులనూ మూసివేసినట్టయింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాబూల్‌లో కొందరు మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా నిరసన చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నిరసనలను సైతం తాలిబాన్ అధికారులు అణచివేశారు.
తమ తల్లులకు, అక్కలకు అందని విద్య తమకు అందుతుందని భావించిన ఈ తరం మహిళలు, తాము ఎంతో అదృష్టవంతులమని భావించారు.
కానీ, ఇప్పుడు వారి కలలు కల్లలవుతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ అయిన తాలిబాన్ గతేడాది ఆగస్టులోనే అఫ్గానిస్తాన్‌లో తిరిగి తమ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ సమయంలో మహిళల హక్కులను తాము గౌరవిస్తామంటూ చెప్పుకొచ్చారు.
1996-2001 మధ్యలో అఫ్గానిస్తాన్‌ను పాలించిన తాలిబాన్లు, కనీసం ఆ దేశ మహిళలకు చదువుకునేందుకు, పని చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చే వారు కాదు.
అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాలు వెనుతిరిగి, తాలిబాన్ల చేతిలోకి ఆ దేశ పాలన వచ్చిన తర్వాత.. అప్పటి వరకు మహిళలకు కల్పించిన చిన్న చిన్న స్వేచ్ఛలను, అధికారాలను సైతం ప్రస్తుతం తాలిబాన్లు లాగేసుకుంటున్నారు. వారిపై మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు.
మూడు నెలల క్రితమే, తాలిబాన్లు మహిళలు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు రాసుకునేలా అనుమతిచ్చారు.
ఈ అనుమతితో ఆ దేశంలోని ప్రావిన్స్‌లలో ఏర్పాటైన పరీక్షా కేంద్రాలకు వేలాది మంది అమ్మాయిలు హాజరయ్యారు.
చాలా మంది అమ్మాయిలు చదువుకోవాలనే కోరికతో, రహస్యంగా ఈ పరీక్షలకు సిద్ధమయ్యారు. కొందరు ఇంట్లోనే కూర్చుని చదువుకోగా, కొందరు మహిళలు వారి కోసం ప్రత్యేకంగా, రహస్యంగా ఏర్పాటు చేసిన ట్యూషన్ కాలేజీల్లో ప్రమాద పరిస్థితుల్లో చదువుకున్నారు.

ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని పరీక్షల సమయంలో బాంబర్లు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఆ సమయంలో కొందరు పిల్లలు చనిపోయారు.
అయినప్పటికీ, బాలికలు చదువుకునేందుకే మొగ్గు చూపారు.
నవంబర్‌లో కూడా తాలిబాన్లు చివరి నిమిషంలో మహిళలు కొన్ని సబ్జెట్లను చదవకుండా ఆంక్షలు తీసుకొచ్చారు. వెటర్నరీ సైన్స్, ఇంజనీరింగ్, ఎకనమిక్స్, అగ్రికల్చర్ సబ్జెక్టులపై పరిమితులు విధించిన తాలిబాన్లు, జర్నలిజం సబ్జెక్టుపై తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో ప్రస్తుతం చాలా మంది టీచింగ్, మెడిసిన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు.
‘‘మేమే ప్రతిసారీ ఎందుకు బాధితులం కావాలి? అఫ్గానిస్తాన్ పేద దేశం. కానీ, ఈ దేశంలోని మహిళలు పేదరికంతో పాటు ప్రతి సమస్యను భరిస్తున్నారు. అయినప్పటికీ, మేమింకా ఇబ్బందులు పడాల్సి వస్తోంది’’ అని ఒక మహిళా విద్యార్థి బీబీసీతో మాట్లాడేటప్పుడు అన్నారు.
మహిళలకు, బాలికలకు ఆధునిక విద్య అనేది ఇస్లామిక్ బోధనల ప్రకారం తప్పని తాలిబాన్ల సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా విశ్వసిస్తారు. బాలికలు, మహిళలు చదువుకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఈ పాలనలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించడం లేదు. కాబూల్‌లో ఆధునిక భావాలున్న కొందరు అధికారులు 12 ఏళ్లకు పైబడిన బాలికలకు విద్య అందాలని కోరుకుంటున్నారని నివేదికలు తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం తాలిబాన్లు తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘ఏ దేశం కూడా తమ జనాభాలో సగం మందిని వెనక్కి నెట్టేసి అభివృద్ధి సాగించలేదు’’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు.
ప్రపంచ గుర్తింపును తాలిబాన్లు కోరుకుంటే, మహిళలకు వారు విద్యను అందించాలని పశ్చిమ దేశాలు బలంగా చెబుతున్నాయి. అయితే, తాలిబాన్లు మాత్రం తమపై వస్తున్న ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు.
ఆ దేశంలో, ప్రపంచంలో ఉన్న అఫ్గాన్ కుటుంబాలు మళ్లీ తమ కూతుర్ల భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టివేయడంపై తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
తాలిబాన్లు మహిళలకు యూనివర్సిటీ ప్రవేశాన్ని నిషేధం విధించిన తర్వాత.. అఫ్గాన్‌లోని కొందరు మహిళా కార్యకర్తలు తమ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ రోజులకు చెందిన కథనాలను పోస్టు చేస్తున్నారు.
ఇటీవలి వారాల్లో మహిళల రోజువారీ జీవితంపై తాలిబాన్ల ఆంక్షలు పెరిగాయి. నవంబర్‌లో, పార్కులు, జిమ్‌లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లోకి కాబూల్‌లోని మహిళలు వెళ్లకుండా నిషేధించారు.
తాలిబాన్ల విధానాలు పలు శిక్షలకు దారి తీస్తుండటంతో మహిళలు బలవంతంగా తమ ఇళ్లకే పరిమితమవ్వడం పెరిగిందని ఐక్యరాజ్య సమితి కూడా తెలిపింది.

ఫొటో సోర్స్, SUPPLIED
ఒక న్యాయ విద్యార్థినికి తన ఉన్నత విద్యా మార్గమంతా మూసుకుపోయింది. శీతాకాల సెలవుల కారణంతో ఆమె ప్రస్తుతం యూనివర్సిటీకి వెళ్లడం లేదు. మార్చి వరకు యూనివర్సిటీ క్యాంపస్‌లు తెరుచుకోవు.
కానీ, ఇప్పుడు ఆమె సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి క్యాంపస్‌లోకి అడుగు పెట్టడానికి వీలు లేదు. ‘‘నేనంతా కోల్పోయాను’’ అని షరియా లా స్కాలర్ బీబీసీకి తెలిపారు.
తమకు ఇస్లాం, అల్లా కల్పించిన హక్కులను తాలిబాన్లు లాగేసుకుంటున్నారని పేర్కొంది.
‘‘వారు ఇతర ఇస్లామిక్ దేశాలకు వెళ్లి చూడాలి. వారి చర్యలు కనీసం ఇస్లామిక్‌వి కావు. ఇది షరియా అని వారు చెబుతున్నారు. కానీ, ఎందుకు దీన్ని కేవలం మహిళలపైనే విధిస్తున్నారు? ఎందుకు వీటిని పురుషులకు వర్తింపజేయడం లేదు?’’ అని ఆమె ప్రశ్నించారు.
ఆమె అభిప్రాయానికి ఇతర మత స్కాలర్లు కూడా మద్దతిచ్చారు. ఈ ఆంక్షలు ఇస్లామిక్ విలువలను తిరస్కరిస్తుందని అఫ్గాన్ మత స్కాలర్లలో ఒకరైన నవిదా ఖురసాని అన్నారు.
ఇస్లాంలో దీనికసలు చోటే లేదన్నారు. ఇస్లాం ఆదేశాల ప్రకారం మహిళలకు, పురుషులకు ఇద్దరికీ విద్య అవసరమని కెనడాలో నివసించే నవిదా చెప్పారు.
ఇస్లాం ప్రకారం పురుషులు, మహిళలు ఇద్దరూ విద్యను పొందాల్సి ఉందని అఫ్గానిస్తాన్‌లో నివసించే మరో పురుష మత స్కాలర్ బీబీసీతో చెప్పారు.
తాలిబాన్ చర్యలను ఇస్లామిక్ బోధనలుగా చెప్పడానికి ప్రయత్నించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మహిళలను పూర్తిగా కట్టడి చేయాలన్న లక్ష్యంతో, వారికి ఇన్నేళ్లుగా అందుతున్న స్వేచ్ఛను తొలగించడం కోసమే మహిళలు యూనివర్సిటీల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారని ఆయన పేర్కొన్నారు.
‘‘అఫ్గానిస్తాన్ మహిళలకు దేశం కాదు. అదొక పంజరం’’ అని అమెరికాలో నివసించే అఫ్గాన్ అకాడమిక్, కార్యకర్త హుమైరా ఖాదేరి అన్నారు.
అఫ్గాన్ మహిళలకు ఎలాంటి సామాజిక జీవితం లేదన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో వీధులన్నీ పురుషాధిక్యంతో నిండిపోయినట్టు పేర్కొన్నారు.
తాలిబాన్లు చేయాలనుకున్న చివరిది ఇదే. వారు చేసి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














