2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేస్తారు, మోదీ ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అర్చనా శుక్లా
- హోదా, బిజినెస్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్
పశ్చిమ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. మరోవైపు పురోగతి చూపించిన 2022లోని వృద్ధి రేటును కొనసాగించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారుతోంది.
అయినప్పటికీ, 2023లో ఆర్థిక ప్రగతికి సంబంధించి ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని కొందరు ఆర్థికవేత్తలంటున్నారు.
ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటంతో, భారత్ జీడీపీ అంచనాలను ప్రపంచ బ్యాంకు 6.9 శాతానికి సవరించింది.
అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ చవిచూడదని అర్థం కాదు.
ఇప్పటి వరకు మన ఆర్థిక వ్యవస్థకు దేశీయ వినియోగం కీలక మద్దతిచ్చింది.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని ప్రస్తావించింది.
‘‘సమస్యల సమతుల్యత లోపం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతుంది. దీని మూలంగా వర్ధమాన దేశ ఆర్థిక వ్యవస్థలు బాగా ప్రభావితం కానున్నాయి’’ అని పేర్కొంది.
దేశ జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)కి 20 శాతం సహకారం అందించే భారత ఎగుమతులు ఇప్పటికే కుదేలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితులు వీటిని మరింత బలహీనపరుస్తున్నాయి.
దీనివల్ల ఇంజనీరింగ్ ఉత్పత్తులు, జ్యూవెల్లరీ, చేనేత, ఔషధ వంటి ఎగుమతి రంగాలు బాగా ప్రభావితం కానున్నాయి. ఈ రంగాల్లో ఎక్కువగా మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఈ సమయంలో భారత్ తన ఆదాయం కన్నా కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్య లోటు రెండూ వేగంగా పెరుగుతూ, తీవ్ర ఆందోళకర పరిస్థితులను కలగజేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవ్యోల్బణం, వృద్ధి రేటులో సమతుల్యత ఎలా...
గత కొన్ని నెలలుగా ఆహారం, ఇంధనం, ఇతర వినియోగదారుల ఉత్పత్తుల ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టినప్పటికీ... దేశీయంగా ద్రవ్యోల్బణం మాత్రం కిందకి రాలేదు.
అధికంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం పరిస్థితిని మరింత క్లిష్టతరంగా మార్చింది.
పెట్రోలియం ఉత్పత్తుల కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటమే అతిపెద్ద సమస్యాత్మక అంశం.
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు నెలకొన్నాయి.
ఈ సరఫరా సమస్యలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తీవ్ర ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి.
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు, వృద్ధి రేటును మరింత పెంచేందుకు ఎదురవుతున్న ప్రతి సవాలును ఎదుర్కొంటూ.. 2023లో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు వడ్డీ రేట్లను పెంచడంతో, ద్రవ్యోల్బణం కాస్త దిగొచ్చి స్వల్ప ఊరటనిచ్చింది.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే తమ తొలి ప్రాధాన్యమని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చెబుతోంది.
అవసరమైతే తప్ప.. పెంచుతున్న వడ్డీ రేట్ల నుంచి వెనక్కి తగ్గమని సంకేతాలిచ్చింది.
దీని వల్ల గృహ రుణాలు మాత్రమే కాదు, వ్యక్తిగత రుణాలు కూడా భారతీయులకు ప్రియంగా మారాయి.
కార్పొరేట్ రుణాలపై కూడా పెరుగుతున్న వడ్డీ రేట్లు ప్రభావం చూపుతున్నాయి.
కానీ, 2023లో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆశావహంగా ఉన్నాయి.
ఈ పెట్టుబడులు వృద్ధి రేటును పెంచుతాయని భావిస్తున్నాయి.
భారత కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఒక వర్గం తాజా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
అయితే, ఏ మేర పెట్టుబడులు పెట్టనుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ముందున్న అవకాశాలు...
ఫ్యాక్టరీ ఉత్పత్తిని కొలిచే దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచిక(ఐఐపీ) అక్టోబర్ 2022లో 26 నెలల కనిష్టానికి చేరుకుంది.
కానీ, పారిశ్రామికోత్పత్తికి భారత్‌లో పుష్కలమైన అవకాశాలున్నాయి.
ఒకవైపు ప్రపంచమంతా తన సప్లయి చెయిన్‌ను చైనా నుంచి బయటికి తరలించాలని సిద్ధమవుతోంది.
మరోవైపు స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఈ నేపథ్యంలో, భారత్ పెద్ద మొత్తంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు మెరుగైన స్థానంలో ఉంది.
ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) లాంటి తయారీ పథకాలపై ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.
2024 ఏడాది దేశీయ తయారీ రంగంలో ఒక బూమ్‌ను తీసుకురానుందని రీసెర్చ్ అండ్ అవుట్‌రీచ్ హెడ్ రోహిత్ అహుజా నవంబర్ నివేదికలో తెలిపారు.
దేశీయ తయారీ రంగం పుంజుకుంటున్నప్పటికీ, వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం ప్రజా వ్యయాన్ని పెంచాల్సినవసరం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, తక్కువ వేతన ఉద్యోగాల్లో వృద్ధి సాధించడం, సరఫరా చెయిన్‌లో ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా ద్రవ్యోల్బణ, ప్రపంచ మందగమన పరిస్థితుల ప్రభావాన్ని కాస్త మేర తగ్గించుకోవచ్చని క్రెడిట్ సూసీ ఆసియా పసిఫిక్ ఈక్విటీ స్ట్రాటజీ కో-మేనేజర్, ఇండియా రీసెర్చ్ హెడ్ నీల్‌కంఠ్ మిశ్రా తన తాజా నివేదికలో తెలిపారు.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటును కూడా తగ్గించాల్సినవసరం ఉందన్నారు.
మరిన్ని వాణిజ్య ఒప్పందాల సాయంతో.. ప్రపంచ మార్కెట్‌లో భారత్ తన ప్రాబల్యాన్ని, వ్యాప్తిని పెంచుకునేందుకు తనకున్న పూర్తి సమర్థతను వాడుకోవాలి.
ఆస్ట్రేలియా, యూఏఈలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న తర్వాత.. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌తో భారత్ సంప్రదింపులు జరుపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్‌లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుందా?
జీ-20 అధ్యక్షతతో భారత్ 2023లో ప్రపంచ వేదికపై నిల్చుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితులు భారత్‌కి కూడా ఆందోళనకరంగా మారాయి.
రక్షణాత్మక విధానాలు(విదేశీ వాణిజ్యంలో ఆంక్షలు) ప్రపంచ మార్కెట్లో వెలుగు చూస్తున్నాయి.
ఈ సమయంలో, భారత్ తన ఎగుమతులను పెంచే, విదేశీ పెట్టుబడిదారులన్ని ఆకర్షించే విషయంలో చాలా తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంది.
ఇదే భారత్ ముందున్న అతిపెద్ద సవాలు.
కానీ, ఈ ఏడాది తర్వాత వెంటనే 2024లో దేశీయంగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బరిలోకి దిగనుంది.
ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కొన్ని కీలకమైన ప్రకటనలను ఆర్థిక మంత్రి చేయనున్నారని అంచనాలున్నాయి.
ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.
ద్రవ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో, ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం వద్ద అంత ఎక్కువ వెసులుబాటు లేదు.
ఈ ఆర్థిక క్లిష్టతర పరిస్థితులను, రాజకీయ లక్ష్యాలను మోదీ ప్రభుత్వం ఎలా సమర్థవంతంగా నిర్వహించనుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














