చైనాతో ‘సరిహద్దు ఘర్షణలు’ జరుగుతున్నా.. ఆ దేశం నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.. ఎందుకు?

చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ సారి లద్దాఖ్‌కు బదులుగా అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. డిసెంబరు 9న ఉదయం తవాంగ్ సెక్టార్‌కు చెందిన యాంగ్సేలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఘటనలో కొందరు భారతీయ సైనికులకు గాయాలు అయ్యాయి. చైనా వైపు గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సైనిక వర్గాలు చెబుతున్నాయి.

ఇదివరకు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడితప్పాయి.

గల్వాన్‌కు ముందుగా డోక్లాంలోని భారత్, చైనా, భూటాన్‌ల కూడలిలోనూ దాదాపు రెండు నెలలు ప్రతిష్టంభన నెలకొంది.

గత ఏడేళ్లలో భారత్, చైనా సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కోవడం ఎక్కువైంది. అయితే, అదే సమయంలో చైనా దిగుమతులపై భారత్ ఆధారపడటం కూడా పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడేళ్లలో ముఖ్యంగా చైనా నుంచి భారత్ దిగుమతులు 60 శాతం పెరిగాయి.

సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే, చైనా వస్తువులను కొనుగోలు చేసేందుకు 2014లో భారత్ రూ. 100 వెచ్చిస్తే.. ఇప్పుడు ఆ దిగుమతుల ఖర్చు రూ. 160కి పెరిగింది.

అయితే, ఇలా ముప్పు పొంచివుండే దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని దౌత్య ప్రతినిధులు చెబుతున్నారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, కూడా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పశ్చిమ దేశాలు ప్రకటించాయి.

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నప్పటికీ, చైనాపై ఆధారపడటాన్ని భారత్ ఎందుకు తగ్గించుకోలేకపోతోంది? చైనా నుంచి భారత్ ఎక్కువగా కొనుగోలుచేసే వస్తువులు ఏమిటి? భారత్ ఇలానే చైనాపై ఆధారపడటాన్ని కొనసాగిస్తే, భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?

చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనా నుంచి ఎగుమతులు ఇలా...

భారత్ 2021-22లో 216 దేశాలు, ప్రాంతాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంది. దీని కోసం మొత్తంగా 61,305 కోట్ల డాలర్లను భారత్ ఖర్చుపెట్టింది.

భారత్ దిగుమతుల వల్ల ఎక్కువగా లాభపడింది చైనానేనని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం పరిశీలిస్తే తెలుస్తుంది.

భారత్ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15.42 శాతం వరకూ ఉంది. సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే, దిగుమతుల కోసం భారత్ వెచ్చిస్తున్న ప్రతి వంద రూపాయల్లో 15 రూపాయలు చైనాకు వెళ్తున్నాయి.

చైనా తర్వాత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, ఇరాక్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, హాంకాంగ్, సింగపూర్, ఇండోనేసియా, దక్షిణ కొరియా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, టెలికాం సాధ‌నాలు, కంప్యూట‌ర్ విడిభాగాలు, ఫార్మా ఉత్ప‌త్తులు, ప్లాస్టిక్ బొమ్మ‌లు.. భార‌త్‌కు చైనా నుంచి ఎక్కువగా దిగుమ‌తి అవుతున్నాయి

అత్యవసరమైనవి కూడా ఉన్నాయా?

చైనాపై భారత్ ఆధారపడటం ఎక్కువ కావడానికి భారత్‌లో పారిశ్రామిక విధానం (ఇండస్ట్రియల్ పాలసీ) లేకపోవడమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణుడు సంతోష్ మెహ్రోత్రా చెప్పారు.

‘‘ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం 2011లో మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకొచ్చింది. అయితే, దీన్ని అమలు చేయలేకపోయింది. 1992 నుంచి 2014 మధ్య జీడీపీలో వస్తూత్పత్తి వాటా 17 శాతంగానే స్థిరంగా ఉండిపోయింది. అయితే, ఈ తర్వాత దీనిలో ఒక రెండు శాతం పెరుగుదల కనిపించింది. మళ్లీ 2014 తర్వాత మూడు శాతం పడిపోయింది’’ అని ఆయన చెప్పారు.

అసలు ఏ వస్తువులను చైనా నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో 13,000 కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. దీనిలో ఎలక్ట్రికల్ మెషినరీ, ఎక్విప్‌మెంట్, స్పేర్ పార్ట్స్, సౌండ్ రికార్డులు, టీవీలు లాంటివి కూడా ఉన్నాయి.

మొదటి పది వస్తువులను పరిశీలిస్తే, వీటిలో న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, రసాయనాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఎరువులు, వాహనాల పరికరాలు, రసాయన సమ్మేళనాలు, ఇనుము, స్టీలు, స్టీల్ ఉత్పత్తులు, అల్యూమినియం ఉత్పత్తులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

భారత్ నుంచి ఏ వస్తువులు వెళ్తున్నాయి?

చైనా నుంచి దిగుమతులు, ఎగుమతుల గురించి సంతోష్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఎక్కువగా ముడి సరకులను సరఫరా చేస్తోంది. అటు నుంచి మాత్రం పూర్తిగా తయారైన వస్తువులు వస్తున్నాయి’’ అని చెప్పారు.

‘‘ఎలక్ట్రికల్, మెకానికల్ వస్తువులతోపాటు చైనా నుంచి భారత్ చాలా రసాయనాలను కూడా దిగుమతి చేసుకుంటోంది. భారత ఫార్మా రంగానికి ఈ రసాయనాలు చాలా ముఖ్యమైనవి. వీటి సాయంతో భారత్ చాలా ఔషధాలను తయారుచేస్తోంది. వీటికి అవసరమైన ముడి పదార్థాలు చాలావరకు భారత్‌కు చైనా నుంచే వస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

భారత్ నుంచి చైనాకు వెళ్లే వస్తువుల్లో ఎక్కువగా పత్తి, ఇనుము, స్టీలు, ప్లాస్టిక్ పువ్వులు, రసాయన సమ్మేళనాలు తదితర వస్తువులు ఉన్నాయి.

చైనా

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/GETTYIMAGES

గల్వాన్ తర్వాత వాణిజ్యం ఇలా..

గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ 2020లో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు.

సరిహద్దుల్లో ఘర్షణల ప్రభావం చైనాతో ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని రంగాలపైనా పడుతుందని ఆనాడు భారత్ చెప్పింది.

భారత్‌లోని మోదీ ప్రభుత్వం చైనాపై ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి వచ్చే పెట్టుబడుల్లో తగ్గుదల కనిపించింది. మరోవైపు 5జీ ట్రయల్స్‌లో చైనా కంపెనీలు పాల్గొనకుండా భారత్ ఆంక్షలు విధించింది. 200కు పైగా చైనా యాప్‌లపై భారత్ నిషేధం కూడా విధించింది.

కానీ, భారత వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను పరిశీలిస్తే, చైనా నుంచి దిగుమతులు క్రమంగా పెరిగినట్లు తెలుస్తోంది.

2019-20లో చైనాతో భారత్ వాణిజ్యం 80 బిలియన్ డాలర్లుగా ఉండేది. దీనిలో చైనా నుంచి దిగుమతుల వాటా 65 బిలియన్ డాలర్లు. మిగతావి ఎగుమతులు.

అయితే, 2021-22 డేటాను పరిశీలిస్తే, చైనాతో వాణిజ్యం 115 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు వాటా 94 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు గణాంకాలను పరిశీలిస్తే, చైనాతో వాణిజ్యం 69 బిలియన్ డాలర్ల వరకు నమోదైంది. వీటిలో ఎగుమతులు కేవలం 8 బిలియన్ డాలర్లు మాత్రమే.

చైనాతో వాణిజ్య లోటును పరిశీలిస్తే, 2014-15లో ఇది 46 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇది 2021-22కు 73 బిలియన్ డాలర్లకు పెరిగింది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఉత్పత్తుల వెల్లువ..

ఆత్మనిర్భర భారత్ పేరుతో చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చైనాతో వాణిజ్య లోటులో తగ్గుదల ఏమీ కనిపించడం లేదు.

చవకైన చైనా ఉత్పత్తులు వెల్లువలా భారత్ మార్కెట్లలో కుమ్మరించడమే దీనికి కారణమని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ ఎకనామిస్ట్ ఎస్‌.పి.శర్మ వ్యాఖ్యానించారు. అందుకే చైనాతో వాణిజ్య లోటు క్రమంగా పెరుగుతోందని ఆయన అన్నారు. దీని వల్ల భారత పరిశ్రమలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఆయన చెప్పారు.

‘‘చైనా భారీ స్థాయిలో చవకైన ధరకే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. వీటిని భారత మార్కెట్లలో కుమ్మరిస్తోంది. ముఖ్యంగా క్వాలిటీ చెక్‌లు సరిగ్గా చేస్తే ఈ నాణ్యతలేని ఉత్పత్తులకు కళ్లెంవేయొచ్చు. దీని కోసం యాంటీ-డంపింగ్ డ్యూటీ విధిస్తున్నారు. ఈ సుంకాన్ని మరింత పెంచాలి’’ అని ఆయన వివరించారు.

‘‘చైనా ప్లాస్టిక్ బొమ్మలకు భారత్ అతిపెద్ద మార్కెట్. ఈ విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ చాలా పథకాలు, కార్యక్రమాలను తీసుకొచ్చింది. మేకిన్ ఇండియాతో పాటు సింగిల్ విండో క్లియరెన్స్ విధానాలను కూడా తీసుకొచ్చింది’’ అని శర్మ చెప్పారు.

అయితే, మేకిన్ ఇండియాపై ఆర్థిక నిపుణుడు సంతోష్ ప్రశ్నలు సంధించారు. ‘‘మేకిన్ ఇండియా, విదేశీ పెట్టుబడులతో ఇక్కడి పరిశ్రమలు బలోపేతం అవుతాయని చెప్పారు. కానీ, వచ్చే పెట్టుబడులన్నీ వస్తూత్పత్తికి బదులుగా సేవల రంగానికి పరిమితం అవుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా ఇదివరకటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా భారత్ తరహాలోనే చైనాపై వాణిజ్య యుద్ధం పేరుతో చర్యలు ప్రకటించారు. కానీ, ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యంలో గత ఏడాది 28.7 శాతం పెరుగుదల కనిపించింది.

సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణను అదుపుచేయడం కంటే మార్కెట్‌లో చైనా ఉత్పత్తులను అడ్డుకోవడం మరింత కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, చైనా రాజధాని బీజింగ్‌లో కొనసాగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)