గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...

శత్రుంజయ పర్వతంలోని మందిరాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాక్సీ గాగ్డేకర్ చారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • పలిటానాలోని శత్రుంజయ కొండపై ఉన్న జైన దేరాసర్‌ (జైన దేవాలయం)కు సంబంధించిన డిమాండ్లపై జైన సంఘం నిరసనలు చేస్తోంది
  • జైన సంఘం డిమాండ్ల మేరకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
  • జైనుల డిమాండ్‌ ప్రకారం, శత్రుంజయ కొండ కింద భాగంలో పోలీస్ స్టేషన్‌ నిర్మాణంతో పాటు, 15 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది
  • ఈ వివాదానికి శివాలయం ఒక కారణం కాగా, ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది
  • శివాలయం నిర్వహణ గురించి 2017లో విశ్వహిందూ పరిషత్, గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
  • ఆనంద్‌జీ కళ్యాణ్‌జీ కుటుంబం దాదాపు 400 సంవత్సరాలుగా పలిటానాలోని జైన దేరాసర్లను నిర్వహిస్తోంది.

దేశంలోని అతిచిన్న మైనారిటీ సమూహాల్లో జైన కమ్యూనిటీ కూడా ఒకటి.

పలిటానాలోని శత్రుంజయ కొండపై ఉన్న జైన దేరాసర్‌కు సంబంధించిన డిమాండ్లతో జైన సంఘం నిరసనలు చేస్తూ వీధుల్లోకి వచ్చింది.

వారి డిమాండ్ల మేరకు, ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇదే కాకుండా, వారు డిమాండ్ చేస్తున్నట్లుగా కొండ కింద భాగంలో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 15 మంది పోలీసులను కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

జనవరి 1-3 వరకు అహ్మదాబాద్, వడోదర నగరాల్లో జైనులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. జైన సన్యాసులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

జైనుల నిరసనలు

ఫొటో సోర్స్, SAMAGRA JAIN SHWETAMBAR TAPOGACHCHHA SRIMAHSANGH

వివాదానికి శివాలయమే కారణమా?

ఈ వివాదానికి శివాలయం కూడా ఒక కారణం. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. 2017లో విశ్వహిందూ పరిషత్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జైన సమాజానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టు కూడా ఈ తీర్పులో ఎలాంటి మార్పులు చేయలేదు.

పలిటానాలోని జైన దేరాసర్లను దాదాపు 400 సంవత్సరాలుగా ఆనంద్‌జీ కళ్యాణ్‌జీ కుటుంబం నిర్వహిస్తోంది. ఈ కుటుంబం వారు కేవలం దేవాలయాలనే కాకుండా కొండను కూడా సంరక్షిస్తున్నారని జైన సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న శివాలయం కారణంగా ఈ వివాదం మొదలైందని భావిస్తున్నారు.

ప్రస్తుత నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ‘‘సమగ్ర్ జైన్ శ్వేతాంబర్ మూర్తిపూజక్ తపగచ్ఛ్ శ్రీమహాసంఘ్’’ అనే సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రణవ్ షా ఈ వివాదం గురించి బీబీసీతో మాట్లడారు.

‘‘శత్రుంజయ శ్రేణిలో మందిరాలు, విగ్రహాలు నిర్మిస్తున్న సమయంలో విగ్రహాలు తయారు చేయడం కోసం సోంపురా కమ్యూనిటీ ప్రజలు చాలా కాలం పాటు ఇక్కడ ఉండాల్సి వచ్చింది. వారి కోసం ఇక్కడ శివాలయాన్ని జైన్ కమ్యూనిటీ వాళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఆలయ నిర్వహణకు సంబంధించిన సమస్య తలెత్తింది’’ అని ఆయన చెప్పారు.

ఈ శివాలయం నిర్వహణను ఆనంద్‌జీ కళ్యాణ్‌జీ ట్రస్ట్‌కి కాకుండా ఒక హిందూ సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ 2017లో గుజరాత్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 

అయితే, హైకోర్టు ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఆనంద్‌జీ కళ్యాణ్‌జీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోనే శివాలయం నిర్వహణ బాధ్యతలు ఉండాలని ఆదేశించింది. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం, ట్రస్టు వారితో కలిసి శివాలయంలో అర్చకుడిని నియమించవచ్చని కూడా సూచించింది.

జైన సంఘం తరఫున గుజరాత్ హైకోర్టులో ప్రాతినిధ్యం వహించిన జైన మత గురువు అజయసాగర్‌సూరి మహారాజ్, బీబీసీతో మాట్లాడారు.

"గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు వచ్చిన తర్వాత ఈ సమస్య ముగిసిపోవాలి. కానీ, పూజారిని నియమించిన తర్వాత అతన్ని రాత్రిపూట ఆలయంలోనే ఉంచాలనే డిమాండ్‌తో ఇప్పుడు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది" అని అన్నారు.

ప్రపంచ హిందూ పరిషత్ గుజరాత్ సంయుక్త కార్యదర్శి అశ్విన్ పటేల్ కూడా ఈ అంశం గురించి తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.

‘‘ఇది పాత వివాదం. దీన్ని పరిష్కరించడం కోసం ఇరు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకోవాలి. వీలైనంత త్వరగా దీనిపై చర్చ జరగాలి. ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే చివరకు హిందు, జైన సమాజాలు ఒక్కటే’’ అని ఆయన అన్నారు.

2017లో విశ్వహిందూ పరిషత్, శివాలయం నిర్వహణకు సంబంధించి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

జైనులు

ఫొటో సోర్స్, SAMAGRA JAIN SHWETAMBAR TAPOGACHCHHA SRIMAHSANGH

శత్రుంజయ పర్వతం చరిత్ర ఏంటి?

జైన దేవాలయాలు, శత్రుంజయ పర్వతం చరిత్ర గురించి ఆనంద్‌జీ కల్యాణ్‌జీ ట్రస్ట్ మేనేజర్ శ్రీపాల్ షా, బీబీసీకి వివరించారు.

‘‘1877లో అప్పటి పాలిటానా రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రస్ట్‌కు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, దేవాలయాల నిర్వహణ బాధ్యతలు శత్రుంజయ గిరిరాజ్‌కు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని ఒప్పందంలో రాసుకున్నారు.

గుజరాత్‌లోనే కాకుండా ఆనంద్‌జీ కల్యాణ్‌జీ ట్రస్టు అనేక ప్రాంతాల్లోని ఆస్తులను జాగ్రత్తగా చూసుకుంటోంది. కానీ, శత్రుంజయ పర్వత మందిరాలకు సంబంధించి మాత్రమే ట్రస్టుకు ఇలాంటి సమస్య ఎదురైంది’’ అని ఆయన చెప్పారు.

జైనులు

ఫొటో సోర్స్, SAMAGRA JAIN SHWETAMBAR TAPOGACHCHHA SRIMAHSANGH

పలిటానాలో ఇతర సమస్యలు ఉన్నాయా?

ఇక్కడొక విషయాన్ని గమనించాలి. శత్రుంజయ పర్వత శ్రేణిలో రాత్రిపూట ఉండటానికి జైన సన్యాసులతో సహా ఎవరినీ అనుమతించరు.

ఆనంద్‌జీ కల్యాణ్‌జీ ట్రస్టు ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని కొంతకాలం కిందట ఎవరో ధ్వంసం చేశారు. దీనిపై ఒక ఫిర్యాదు కూడా నమోదైంది.

అజయసాగర్‌సూరి మహారాజ్, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘శత్రుంజయ పర్వత ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోంది. అలాగే అక్రమ మైనింగ్ కూడా జరుగుతోంది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగానే జైనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’ అని అన్నారు.

జైన కమ్యూనిటీ నాయకుడు భద్రేష్ షా, బీబీసీతో మాట్లాడుతూ ఇలా అన్నారు. “ఈ పర్వత శ్రేణి చుట్టూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టాలని ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. కానీ, ఇప్పటివరకు ఏమీ చేయలేదు. దీని కారణంగానే జైనులు ఇలా రోడ్డుపైకి వచ్చారు’’ అని అన్నారు.

భావ్‌నగర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర పటేల్, బీబీసీతో మాట్లాడారు.

‘‘భావ్‌నగర్ జిల్లాలో మద్యం వ్యాపారం జరుగుతున్న ప్రతీచోటా నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క పాలిటానాలోనే కొన్ని నెలల్లోనే 700 కంటే పైగా మద్యం సంబంధిత కేసులు నమోదయ్యాయి. 10 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఇతర చర్యలు కూడా తీసుకున్నాం’’ అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఘర్‌వాపసీ:ఇస్లాం నుంచి హిందువుగా మారిన ఒక కుటుంబం ఇప్పుడెలా ఉంది?

జైన సంఘం డిమాండ్లు

  • ఆలయ ప్రాంతం సరైన కొలత
  • కొండపై అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం
  • కొండ ప్రాంతంలో అక్రమ మద్యం వ్యాపారం అరికట్టడం
  • మైనింగ్ కార్యకలాపాల శాశ్వత నిలిపివేత
  • హిందూ, జైన మతాల మధ్య శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తోన్న వారిపై విచారణ
వీడియో క్యాప్షన్, ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)