గుండెపోటు: 40వేల అడుగుల ఎత్తులో విమానప్రయాణికునికి హార్ట్‌స్ట్రోక్... 5 గంటల పాటు వైద్యం చేసి బతికించిన డాక్టర్

ఫొటో సోర్స్, NHS FOUNDATION TRUST
విమానప్రయాణంలో ఐదు గంటల పాటు పోరాడి ఓ ప్రయాణికుడి ప్రాణాలను డాక్టర్ విశ్వరాజ్ వేమల అనే వైద్యుడు కాపాడారు.
బర్మింగ్‌హామ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో కాలేయ డాక్టర్‌గా ఉన్న విశ్వరాజ్ వేమల(48) ఆయన తల్లితో కలిసి లండన్ నుంచి బెంగళూరు వస్తుండగా తోటి ప్రయాణీకునికి గుండెపోటు వచ్చింది. విమానంలోని వైద్య సామగ్రి, ప్రయాణీకులు అందించిన కొన్ని వస్తువుల సాయంతో 43 ఏళ్ల పేషెంట్‌ని రెండుసార్లు ప్రాణాపాయం నుంచి డాక్టర్ విశ్వరాజ్ వేమల కాపాడారు. ఆ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని డాక్టర్ విశ్వరాజ్ అన్నారు.
‘మెడికల్ ట్రైనింగ్‌లో ఇలాంటి కేసులను హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది. కానీ ఇలా 40,000 అడుగుల ఎత్తులో ఎప్పుడూ చేయలేదు’ అని వేమల అన్నారు.
ఈ ఘటన గత ఏడాది నవంబర్‌లో జరిగింది. లండన్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఒక వ్యక్తికి గుండెపోటు రావడంతో పల్స్ పడిపోయింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో క్యాబిన్ సిబ్బంది ఫ్లైట్‌లో డాక్టర్ కోసం వెతికారు. ‘అతన్ని బతికించడానికి నాకు గంట సమయం పట్టింది. అదృష్టవశాత్తూ వారి దగ్గర అత్యవసర కిట్ ఉంది అని డాక్టర్ విశ్వరాజ్ తెలిపారు.
రెండోసారి గుండెపోటు
ఆక్సిజన్, ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ లేకపోవడంతో పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కష్టమైందని డాక్టర్ విశ్వరాజ్ అన్నారు. హార్ట్ రేట్ మానిటర్, పల్స్ ఆక్సిమీటర్, గ్లూకోజ్ మీటర్, బీపీ మెషిన్ వంటి పరికరాలను ప్రయాణికులను అడిగి ఆయన తీసుకున్నారు. పేషెంట్‌కు రెండో సారి కూడా గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనకు మళ్లీ చాలాసేపు చికిత్స అందించారు.
‘మేం 5 గంటల పాటు ఆయన్ని ప్రాణాలతో ఉంచడానికి ప్రయత్నించాం’ అని డాక్టర్ విశ్వరాజ్ అన్నారు. చివరకు పైలట్ విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అక్కడ పేషెంట్‌ను ఎమర్జెన్సీ వార్డ్‌కు తీసుకెళ్లారు. పేషెంట్ ప్రాణాలు కాపాడినందుకు డాక్టర్ విశ్వరాజ్‌కు విమానసిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.
‘నా ఏడేళ్ల కన్సల్టెంట్ జీవితంలో నేను ట్రీట్ చేస్తుండగా మా అమ్మ చూడటం ఇదే మొదటిసారి. అది మరింత భావోద్వేగానికి గురి చేసింది’ అని ఆ డాక్టర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- దర్గా ముందు తిండి కోసం ఎదురు చూసే ఈ చిన్నారి మిలియనీర్ ఎలా అయ్యాడు?
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- స్పామ్ కాల్స్: 'హలో... మీకు 5 లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, తీసుకుంటారా?'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














