ఆకాశంలో ఆర్మీ జవాన్ ప్రాణాలు కాపాడిన కేరళ నర్స్

గీత

ఫొటో సోర్స్, P GEETHA'S FAMILY

    • రచయిత, ఇమ్రాన్ ఖరేషీ
    • హోదా, బీబీసీ హిందీ

రోగులకు అందించిన సేవలకు గుర్తింపుగా తనకు ప్రకటించిన అవార్డును అందుకోవడానికి ఆ నర్స్ దిల్లీ వెళ్తున్నారు.

కేరళ నుంచి విమానంలో దిల్లీ వెళ్తున్న ఆమె ఆ విమానంలోనూ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఆమె కాపాడింది ఒక ఆర్మీ జవాన్‌ను.

కేరళకు చెందిన నర్స్ పి.గీత ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డ్ అందుకోవడానికి దిల్లీ బయలుదేరారు.

ఆమె విమానం ఎక్కిన అరగంట తరువాత కేబిన్ సిబ్బంది నుంచి అత్యవసర ప్రకటన వచ్చింది.

విమానంలోని ఓ ప్రయాణికుడికి అత్యవసరంగా వైద్య సహాయం కావాలన్నది ఆ ప్రకటన సారాంశం.

ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు

ఫొటో సోర్స్, P GEETHA'S FAMILY

కశ్మీర్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ సుమన్ తన సెలవులు ముగించుకున్న తరువాత విధులకు హాజరయ్యేందుకు కేరళ నుంచి దిల్లీ విమానం ఎక్కారు.

ఆయన తన సీట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. పల్స్ కూడా పూర్తిగా పడిపోవడంతో కేబిన్ సిబ్బంది వైద్య సహాయం కోసం విమానంలో ఎవరైనా డాక్టర్లు కానీ వైద్య అనుభవం ఉన్నవారు కానీ ఉన్నారా అంటూ అనౌన్స్‌మెంట్ చేశారు.

దాంతో గీత వెంటనే సుమన్ సీటు వద్దకు చేరుకుని సీపీఆర్ చేశారు.

‘ఒకసారి నేను పనిచేసే ఆసుపత్రిలోనే కొలీగ్ ఒకరు ఇలాగే కుప్పకూలిపోతే సీపీఆర్ చేసి వెంటనే కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి ప్రాణాలు కాపాడాం’ అని గీత చెప్పారు. ‘అంతేకాదు... మా హాస్పిటల్‌లో ఇలాంటివి చాలా కేసులు చూశాను. కానీ, విమానంలో ఇలా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడడం మాత్రం నాకు ఇదే తొలిసారి’ అని చెప్పారు గీత.

సుమన్‌కు గీత సీపీఆర్ చేసిన తరువాత ఆయన పల్స్ మెరుగుపడింది.

విమానం సిబ్బంది దగ్గర రెండు బాటిళ్ల ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్‌ను నరాల్లోంచి రోగి శరీరంలోకి ఎక్కించి డీహైడ్రేషన్ నుంచి బయటపడేలా చేస్తారు.

అదే విమానంలో ప్రేమ్ కుమార్ అనే డాక్టర్ ఉన్నారు. ఆయన ఈ ఐవీ ఫ్లూయిడ్స్‌ను సుమన్‌కు ఎక్కించారు.

దీంతో అక్కడికి ఒక గంట తరువాత సుమన్ కోలుకున్నారు. తనంతట తాను తినగలిగారు కూడా.

‘విమానం దిల్లీ చేరే వరకు సుమన్ దగ్గరే ఉంటూ సపర్యలు చేశాను’ అని చెప్పారు గీత.

విమానం దిల్లీ చేరగానే వైద్య బృందం వెంటనే చేరుకుని సుమన్‌ను ఆసుపత్రికి తరలించింది.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంటున్న గీత

ఫొటో సోర్స్, P GEETHA'S FAMILY

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అధికారి డాక్టర్ మొహమ్మద్ అషీల్ కూడా అదే విమానంలో ఉన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.... ‘సుమన్‌కు గీత చేసిన సహాయం చూసి ఆమె ఆయనకు బంధువేమో అనుకున్నాను’ అన్నారు.

‘సిబ్బంది ప్రకటన చేయగానే ఆ మహిళ వెంటనే సుమన్ సీటు దగ్గరకు చేరుకున్నారు. మరో ముగ్గురు వైద్యులు కూడా వెళ్లారు. అందులో ఒకరు ఎమర్జెన్సీ కేర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు’ అని అషీల్ చెప్పారు.

విమానం ల్యాండ్అయిన తరువాత అషీల్ గీతతో మాట్లాడారు. 2019లోనే ఆమె కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నర్స్ అవార్డ్ అందుకున్నట్లు తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు కూడా ఆమె రాష్ట్రపతి నుంచి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డ్ అందుకోవడానికి వెళ్తూ విమానంలో ఒక రోగికి సాయం చేయడం యాదృచ్ఛికమే అయినా గొప్ప విషయమని అన్నారు అషీల్.

గీతకు 2020లోనే ఫ్లోరెన్స్ నైటింగేల్ నేషనల్ అవార్డు వచ్చినా కోవిడ్ కారణంగా ఇప్పటివరకు ప్రదానోత్సవం నిర్వహించలేదు.

గీత, మరికొందరు విజేతలకు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయడానికి దిల్లీకి పిలిచారు.

2018లో కేరళలో నిఫా వైరస్ ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు వచ్చింది.

వరదలు, కోవిడ్ సమయంలోనూ ఆమె ప్రజలకు సేవలందించారు.

కేరళలోని కోజికోడ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో గీత నర్సుగా తన కెరీర్ ప్రారంభించారు.

ఈ ఏడాది ప్రారంభంలో రిటైరైన ఆమె అనంతరం కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.

కేరళకు చెందిన నర్సులు వేలమంది విదేశాల్లో పనిచేస్తుంటారు. కానీ, గీత మాత్రం విదేశాలకు వెళ్లనందుకు తానేమీ బాధపడడం లేదని చెబుతుంటారు.

‘ఇక్కడ ప్రజలకు నేను సేవలందించాలని దేవుడు కోరుకుంటున్నాడు’ అంటారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)