స్పామ్ కాల్స్: 'హలో... మీకు 5 లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, తీసుకుంటారా?'
- రచయిత, పూర్ణిమా తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
చాలా పని ఒత్తిడిలో ఉన్న సమయంలో, ఎవరి ఫోన్ కోసమైనా ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో ఫోన్ మోగగానే ఠంచనుగా లిఫ్ట్ చేశాక…
“మీకు పర్సనల్ లోన్ అవసరం ఉందా? స్పెషల్ ఆఫర్ నడుస్తుంది…”
“ఫలనా ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి… ఒక రెండు నిమిషాల్లో వివరాలన్నీ చెప్పేస్తాం… ప్లీజ్, వినండి…”
“ఐదొందల రూపాయలకే లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మేడం…”
“మీకు జుట్టు ఎక్కువ ఊడిపోతుందా? బట్టతల వస్తోందా…”
“మేం అనాథ శరణాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం, డొనేషన్స్ కోసం…”
ఇలాంటి ప్రొమోషనల్ కాల్స్ అని తెలిస్తే విసుగు, చిరాకు వస్తుంది. ఈ సర్వీసులు కావాలని మనం అడిగి ఉండం. మన నెంబర్ వాళ్ళకెలా చేరిందో తెలీదు.
పోనీ, నెంబర్ బ్లాక్ చేద్దామని చూసినా వేర్వేరు కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అలా అని, తెలియని నెంబర్ నుంచి వస్తున్న కాల్ ఎత్తకపోతే నిజంగానే ఎవరన్నా అవసరం పడి ఫోన్ చేస్తున్నారేమోనన్న అనుమానం మరో పక్క.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమోషనల్ కాల్స్ బెడద అంతా ఇంతా కాదు…
లోకల్ సర్కిల్స్ (localcircles.com) వారు చేసిన ఒక సర్వే ప్రకారం ఇండియాలో సగటున ప్రతి ఒక్కరికీ రోజుకు 4-5 స్పామ్ కాల్స్ వస్తున్నాయని, వాటిలో అధికంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ (పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ మొదలైనవి), రియల్ ఎస్టేట్ (ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్ సేల్స్ వగైరా) గురించేనని తేలింది.
దీని బట్టి ఈ సమస్య తీవ్రత ఎంత ఉందో మనకి అర్థమవుతోంది. ప్రతీ సర్వీస్ రిజిస్టర్ అయినప్పుడు, ఏదన్నా కొనుగోలు చేశాక, ఒక ఆప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరైపోతుంది.
ఆ తర్వాత డేటా దొంగతనాల వల్ల మన నెంబర్ పబ్లిక్ డొమైన్‍లోకి వచ్చేస్తుంది. అక్కడనుంచి ఎవరన్నా, ఎప్పుడన్నా, దేనికన్నా మనల్ని కాల్ చేసి విసిగించవచ్చు. చిన్న విషయమే అనిపించినా చాలా చిరాకు కలిగించే విషయమిది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమోషనల్ కాల్స్‌ను అడ్డుకోవడం ఎలా?
DND సర్వీస్‍కు సబ్‍స్క్రైబ్ చేసుకోవడం
ప్రతీ టెలి సర్వీసెస్ కంపెనీ (ఉదా: ఏర్‍టెల్, జియో వగైరా) ఒక నెంబర్‍కు SMS పంపిస్తే, టెలిమార్కెటింగ్/ప్రొమోషనల్ కాల్స్ బ్లాక్ చేస్తామని హామీ ఇస్తుంటుంది. అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటే ఈ DND సర్వీస్‍కు రెజిస్టర్ చేసుకోవడం ఉత్తమం.
ఈ సర్వీసులకు రెజిస్టర్ చేసుకున్నాక కూడా మార్కెటింగ్ కాల్స్ వస్తూనే ఉంటాయనేది చాలా మంది అనుభవం. అయినా కూడా దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల కొంత శాతమైనా అనవసరపు కాల్స్‌ను తగ్గించుకోవచ్చు.
ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు:
- SMS యాప్ ఓపెన్ చేసి, కొత్త మెసేజ్ తెరిచి అందులో START అని టైప్ చేయండి
- దీన్ని1909 అనే నెంబర్‍కు పంపండి
- మీ సర్వీస్ ప్రొవైడర్ మీకు కొన్ని కేటగిరీలు పంపిస్తారు. ఉదా: బ్యాంకింగ్, హాస్పిటాలిటి.
- మీకు ఏ కేటగిరీల నుంచి కాల్స్ వద్దో వాటి కోడ్ పంపండి.
- 24 నాలుగు గంటల లోపు మీ నెంబర్ పై DND సర్వీస్ ఆక్టివేట్ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
థర్డ్ పార్టీ యాప్ వాడడం
ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడడం వల్ల స్పామ్ నెంబర్లని గుర్తించడం తేలికవుతుంది. వీటిలో ఉచితంగా పనిజేసేవి, డబ్బు వేస్తే పనిచేసే పెయిడ్ యాప్స్ అని రెండు రకాలు ఉంటాయి.
మన ఫోన్‍కు కాల్ రాగానే, మన ఫోన్ బుక్‍లో లేని నెంబర్ అయితే, అది ఎవరిది, దాన్ని “స్పామ్”గా ఇంకెంతమంది మార్క్ చేశారు లాంటి వివరాలు చూపిస్తుంది. ఆ వివరాలతో మనం ఫోన్ లిఫ్ట్ చేయచ్చా, వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.
ఈ యాప్స్‌తో కూడా కొంచెం భద్రంగా ఉండాలి. స్పామ్ కాల్స్ నిర్ధారిస్తున్నాయి కదా అని వీటికి అన్ని పర్మిషన్స్ ఇచ్చేయకూడదు. మన డేటా మొత్తానికి యాక్సెస్ దొరికాక ఇవి వేరే విధంగా హాని చేయవచ్చు.
అందుకే, వీటిని డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్‌లో వీటి రేటింగ్స్, రివ్యూస్ చూసుకోవాలి. అవసరమైన మేరకే ఆప్ పర్మిషన్స్ ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
రోబో కాల్స్‌ని మార్క్ చేయడం
ఈ మధ్యకాలంలో రోబో కాల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. వీటిని ఎదుర్కోడానికి కొన్ని సూచనలు:
- ఒక్కో నెంబర్‍ను బ్లాక్ చేసుకుంటూ పోవడం: ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పనే, అయినా మళ్లీ అదే నెంబర్ నుంచి కాల్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
- రోబో కాల్స్‌ని గుర్తించే యాప్స్ ఏమన్నా ఉంటే వాటిని ఉపయోగించడం: ప్రస్తుత టెక్నాలజీ పరిమితులని బట్టి ఇవి కూడా అంతంతమాత్రంగానే పనిజేస్తున్నాయి. కొంత వరకూ వీటి ద్వారా రోబో కాల్స్‌ను అరికట్టవచ్చు.
స్పామ్/మార్కెటింగ్ కాల్స్ రాకుండా జాగ్రత్తలు
ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో స్పామ్ కాల్స్ రాకుండా అరికట్టడం చాలా కష్టం. ఎందుకంటే,చాలా చోట్ల రిజిస్ట్రేషన్స్ కోసం ఫోన్ నెంబరే ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మన నెంబర్ ఎన్ని చేతులు మారి ఎక్కడెక్కడికి చేరుకుంటుందో చెప్పలేం. అయినా, వీలైనంతలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు:
- నెంబర్‍ను ఎక్కడపడితే అక్కడ రిజిస్ట్రేషన్, లేదా ఇన్ఫోగా ఇవ్వకూడదు. ముఖ్యంగా ఎప్పుడూ వినని, మొదటిసారిగా వాడుతున్న వెబ్‍సైట్లలో ఇవ్వకూడదు.
- బ్యాంకింగ్, హాస్పిటల్, గవర్నమెంట్ రికార్డ్స్ వగైరా ముఖ్య విషయాలకు ఒక నెంబర్, మిగితా వాటికి ఇంకో నెంబర్ పెట్టుకునే వెసులుబాటు ఉంటే ఆ పద్ధతి పాటించాలి.
- ఏదన్నా సర్వీస్/ఆప్ వాడే ఉద్దేశం లేదనుకున్నాక ఆ సర్వీసు ను చి unsubscribe అయ్యే వీలుంటే, వెంటనే అయిపోవాలి. దీనివల్ల ఆ రికార్డులో మన నెంబర్ డిలీట్ అయ్యి, అనసరపు కాల్స్ రావు.
స్పామ్ కాల్స్ ఎత్తక తప్పని పరిస్థితి వస్తే…
ఒక్కోసారి స్పామ్ కాల్స్ ఎత్తక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్పుడు:
- వీలైతే తెలీని నెంబర్ నుంచి ఫోన్ ఎత్తకండి.
- థర్డ్ పార్టీ యాప్స్ అన్ని వేళలా కరెక్టుగా స్పామ్ నెంబర్లను ఐడెంటిఫై చేయలేవు. అందుకని వాటిని పూర్తిగా నమ్మకండి.
- స్పామ్ కాల్ ఎత్తితే, అది మీకు అవసరం లేని సర్వీసుకు సంబంధించిన కాల్ అని తెలియగానే కట్ చేసేయండి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ వివరాలను (పేరు, పుట్టినరోజు, క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ లాంటివి) ఫోన్ ద్వారా కన్‍ఫర్మ్ చేయవద్దు.
- అవతలివాళ్ళు వివరాల కోసం కంగారు పెడుతుంటే వెంటనే కాల్ కట్ చేయండి. వాళ్ళు మీకు హాని చేయడానికే అలా తొందర పెడతారని గుర్తించండి.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ: ప్రధాని హిందుత్వ ఇమేజ్.. ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు అవరోధం కాలేదు.. ఎందుకు?
- గుంటూరులో ‘చంద్రన్న కానుకల’ పంపిణీ వెనుక లక్ష్యం ఏమిటి? తొక్కిసలాటకు బాధ్యులెవరు?
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది?
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















