గణితంలో బ్రిటన్ వెనుకబడిందా... 18ఏళ్ల వరకూ అందరూ మ్యాథ్స్ చదవాలంటున్న రిషి సునాక్

రిషి సునక్

బ్రిటన్‌లోని విద్యార్థులు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు తప్పకుండా గణితం అభ్యసించేలా కొత్త విద్యా విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ఉన్నారు.

లెక్కల విషయంలో బ్రిటన్ విధానం మారాలని ఆయన కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

‘నేడు డేటా అనేది అత్యంత ముఖ్యమైన ఈ ప్రపంచంలో ప్రతి పనికి స్టాటిస్టిక్స్ అనేది ఎంతో అవసరమవుతోంది. ఎన్నడూ లేనంతగా మన పిల్లలు ఇప్పుడు ఎనలటికల్ స్కిల్స్ అంటే విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.

ఈ నైపుణ్యాలు లేకుండా పిల్లలను ఉద్యోగ ప్రపంచంలోకి పంపడం వాళ్లకు చాలా నష్టం చేస్తుంది. 16 నుంచి 19ఏళ్ల వారిలో సగం మంది మాత్రమే గణితం చదువుతున్నారు’ అని సునాక్ అన్నారు.

అయితే హ్యుమానిటీస్, క్రియేటివ్ ఆర్ట్స్ వంటివి చదవాలనుకునే విద్యార్థులు కూడా గణితం చదవాలా? అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. ఈ విషయానికి సంబంధించి పూర్తి ప్రణాళికలను ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.

ఈ విషయం మీద ప్రధాని రిషి సునాక్ పని చేయడం ప్రారంభించినా వచ్చే సాధారణ ఎన్నికల లోపు అమలు చేయడం సాధ్యం కాదని కొన్ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రానున్న రెండేళ్లలో 5 నుంచి 16ఏళ్ల పిల్లల కోసం 2.3 బిలియన్ పౌండ్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే 16-18ఏళ్ల మధ్య వారికి కాలేజీ విద్య కోసం అదనంగా ఎటువంటి నిధులను కేటాయించలేదు.

గణితం

ఫొటో సోర్స్, Getty Images

''గణితం ఉపాధ్యాయులను నియమించకుండా ప్రణాళికేంటి?''

విద్యాసంస్థల్లో ఏళ్లుగా గణితం బోధించే ఉపాధ్యాయుల కొరత ఉందని స్కూల్ అండ్ కాలేజ్ లీడర్స్ అసోసియేషన్ పేర్కొంది. గణితంలో ఎంత మేర నిధులు సమకూరుస్తారో చేసి చూపించాలని లేబర్ షాడో ఎడ్యుకేషన్ సెక్రటరీ బ్రిడ్జేట్ ఫిలిప్సన్ అన్నారు. ఎక్కువ మంది గణిత ఉపాధ్యాయులు లేకుండా సునక్ తన ప్రణాళికలను అందించలేరని తెలిపారు. ప్రతి ఏడాది గణిత టీచర్ల లక్ష్యాలను ప్రభుత్వాలు వదిలేస్తున్నాయని ఆయన ఆరోపించారు. లిబరల్ డెమొక్రాట్ ఎడ్యుకేషన్ ప్రతినిధి మునిరా విల్సన్ మాట్లాడుతూ ‘‘గణితం విషయానికి వస్తే చాలా మంది పిల్లలు వెనుకబడి ఉన్నారు’’ అని ఆరోపించారు.

మరోవైపు పిల్లల సంరక్షణపై దృష్టి సారించాలని విద్యా కమిటీ అధ్యక్షుడు టోరీ ఎంపీ రాబిన్ వాకర్ ప్రధానికి సూచించారు. 16 ఏళ్లు దాటిన వారికి కూడా గణితం ఉండాలని ప్రధాని అంటుండగా వినడం చాలా ఆనందంగా ఉందని రాబిన్ బీబీసీ రేడియో 4 టుడే కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. "ప్రారంభ దశలోనే పిల్లలను ఉత్సాహపరిచేందుకు, వారికి మద్దతు ఇవ్వడానికి మాకు సరైన తోడ్పాటు లేకపోతే, పాఠశాలలో విద్యార్థులు వృద్ధి చెందడానికి అవకాశాలు సన్నగిల్లుతాయి" అని అన్నారు.

రిషి సునాక్

ఫొటో సోర్స్, PA Media

రిషి సునక్ ముందున్న సవాళ్లేంటి?

ప్రధాని సునాక్ రాబోయే రోజుల్లో తన ఎజెండాను వివరించడానికి బుధవారం ప్రసంగాన్ని ఉపయోగించుకోనున్నారు. ఆయన ఒక గందరగోళ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని అయ్యారు. ఈ కాలంలో బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్‌లు కన్జర్వేటివ్ సభ్యుల విశ్వాసం కోల్పోయి దిగిపోయారు. సునాక్‌కు ఇపుడు తన సొంత పార్టీ ఎంపీలను సంతోష పరచడం ఒక సవాలే. కాస్ట్ ఆఫ్ లివింగ్, నర్సింగ్, రైలు పరిశ్రమలు సహా పలు రంగాల్లో సమ్మెలు వినిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పనని, అయితే అత్యుత్తమ బ్రిటన్ కనిపించనుందని సునాక్ చెప్పారు. రష్యాతో చేస్తున్న యుద్ధంలో యుక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందని సునాక్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)