భారతరత్న పురస్కారానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు...విజేతలకు కలిగే సదుపాయాలు, ప్రయోజనాలు ఏంటి?

ఫొటో సోర్స్, INDIAN GOVERNMENT
ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన వారికి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమే భారత రత్న.
మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, కళాకారులు, సాహిత్యకారులు తదితరులు ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.
1954 జనవరి 2న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డును ఆవిష్కరించారు.
తొలి అవార్డును స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ డాక్టర్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డా. చంద్రశేఖర వెంకట రామన్‌లకు అందించారు.
ఆ తర్వాత భిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన చాలా మందికి ఈ అవార్డులను అందించారు.
1954లో కేవలం జీవించి ఉండే వారికే అవార్డు ఇచ్చారు. అయితే, 1955లో మరణానంతరం కూడా అవార్డు ఇస్తామని ప్రకటించారు.
భారత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సదరు వ్యక్తికి భారత రత్న ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారు.
ఈ పురస్కారాన్ని జనవరి 26న ప్రదానం చేస్తారు.

ఫొటో సోర్స్, www.padmaawards.gov.in
ఎలా ఎంపిక చేస్తారు?
భారతరత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. భారతరత్నకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధానమంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు.
కులం, వృత్తి, జెండర్ ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారతరత్నకు పరిశీలించొచ్చు.
ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు. అయితే, ప్రతి ఏటా ఒక్కరికైనా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు.
ఇప్పటివరకు 50 మందికి ఈ అవార్డును ప్రకటించారు.
2019లో సామాజిక సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపెన్ హజారిక (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
2024లో కర్పూరి ఠాకుర్, ఎల్‌కే అడ్వాణీకి భారత రత్నను ప్రకటించారు.

ఫొటో సోర్స్, www.padmaawards.gov.in
భారత రత్నలో భాగంగా ఏం ఇస్తారు?
భారతరత్న గ్రహీతలకు ఒక సర్టిఫికేట్, ఒక మెడల్‌ను భారత ప్రభుత్వం ఇస్తుంది. దీనిలో భాగంగా ఎలాంటి నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వరు.
అయితే, భారతరత్న గ్రహీతలకు ప్రభుత్వం కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. రైల్వేలో ఉచిత ప్రయాణం లాంటివి దీనిలో ఉంటాయి.
ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా భారతరత్న గ్రహీతలకు ఆహ్వానం అందుతుంది. ప్రోటోకాల్‌లోనూ భారతరత్న గ్రహీతలకు స్థానం ఉంటుంది.
మరోవైపు భారతరత్న గ్రహీతలకు వారి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రాధాన్యం దక్కుతుంది.
అయితే, పేరుకు ముందు ఈ అవార్డు పేరును పెట్టుకోవడానికి వీల్లేదు. అయితే, తమ రెస్యూమ్, లెటర్‌హెడ్, విజిటింగ్ కార్డుల్లో ప్రభుత్వం నుంచి ఈ అవార్డు అందుకున్నట్లు రాసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మెడల్ ఎలా ఉంటుంది?
రాగితో చేసిన రావిచెట్టు ఆకు రూపంలో ఆ పతకం కనిపిస్తుంది. దానిపై ప్లాటినంతో చెక్కిన సూర్యుడి ముద్ర ఒకవైపు ఉంటుంది. కింద హిందీలో భారత రత్న అని రాసి కనిపిస్తుంది. ఆ పతకం అంచుల్లో కూడా ప్లాటినం లైనింగ్ కూడా ఉంటుంది.
రెండో వైపు అశోక స్తంభం ముద్ర కనిపిస్తుంది. దాని కింద హిందీలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది.
- భారత రత్నను జీవించి ఉన్నప్పుడు లేదా మరణానంతరం కూడా ఇస్తుంటారు.
- 2013లో తొలిసారి స్పోర్ట్స్‌లో కూడా భారత రత్న ఇవ్వబోతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
- 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు భారత రత్న ఇచ్చారు.
- మదర్ థెరెసా (1980) లాంటి భారతీయేతరులకు కూడా ఈ అవార్డు ఇచ్చారు. మరోవైపు పాకిస్తాన్‌లో జన్మించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాలకు భారత రత్నను ప్రదానం చేశారు.
- ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి భారతరత్న ఇవ్వొచ్చు.
- కేవలం పతకం, సర్టిఫికేట్ మాత్రమే ఈ అవార్డులో భాగంగా ఇస్తారు. ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు.
- 1956, 1959, 1960, 1964, 1965, 1967, 1968-70, 1972-74, 1977-79, 1981, 1982, 1984-86, 1993-96, 2000, 2002-08, 2010-13, 2020-23 మధ్య ఎవరికీ భారత రత్న ఇవ్వలేదు.
- 2024లో కర్పూరి ఠాకుర్, ఎల్‌కే అడ్వాణీలకు భారత రత్న ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఈ అవార్డులు పొందిన వారి సంఖ్య 50కి చేరింది.

ఫొటో సోర్స్, TWITTER/PADMA AWARDS
పద్మ అవార్డులు కూడా..
భారతరత్నతోపాటు భిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులను కూడా అందిస్తారు.
పద్మ అవార్డుల్లో మూడు రకాలు ఉంటాయి.
- పద్మ విభూషణ్- అసాధారణ విశేష సేవలు
- పద్మ భూషణ్- విశేష సేవలు
- పద్మ శ్రీ – విశిష్ట సేవలు
ఈ అవార్డులను కూడా 1954లో మొదలుపెట్టారు. మొదట్లో వీటిని ప్రథమ వర్గం, ద్వితీయ వర్గం, తృతీయ వర్గ అవార్డులుగా పిలిచేవారు. అయితే, 1955లో వీటిని పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులుగా నామకరణం చేశారు.
1978, 1979, 1993-97 మధ్య మినహా ఏటా ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెబ్‌సైట్ చెబుతోంది.
కళలు, సాహిత్యం, విద్య, స్పోర్ట్స్, మెడిసిన్, సామాజిక సేవలు, సైన్స్, ఇంజినీరింగ్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో విశేష సేవ చేసిన వారికి ఈ అవార్డులను అందిస్తారు.
కులం, వృతి, జెండర్ లాంటి భేదాలు లేకుండా ఈ అవార్డు పొందేందుకు అందరూ అర్హులే.
ఏటా మే 1 నుంచి సెప్టెంబరు 15 వరకు పద్మ అవార్డులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నామినేషన్లను పద్మ అవార్డుల కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ ఆమోదం పొందిన పేర్లను ప్రధాన మంత్రికి పంపిస్తారు.
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పార్లమెంటు సభ్యులు, భారత రత్న గ్రహీతలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా పద్మ అవార్డులకు పేరు ప్రతిపాదిస్తూ ప్రతిపాదనలు పంపొచ్చు.
ఒక ఏడాదిలో 120కు మించి పద్మ అవార్డులను ఇవ్వకూడదు. అయితే, మరణానంతర, విదేశీయులకు ఇచ్చే అవార్డులు వీటికి అదనం.
పద్మ అవార్డుల్లో భాగంగా పతకం, సర్టిఫికేట్ ఇస్తారు. వీరికి బ్యాడ్జ్ కూడా ఇస్తారు. దీన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు పెట్టుకోవచ్చు.
ఈ అవార్డుల్లోనూ ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఇవ్వరు. మరోవైపు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ కల్పించదు.
2024 వరకు 50 భారత రత్న, 336 పద్మ విభూషణ్, 1320 పద్మ భూషణ్, 3,531 పద్మ శ్రీ అవార్డులను భారత ప్రభుత్వం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














