లాల్‌కృష్ణ అడ్వాణీ: పార్టీని రెండు సీట్ల నుంచి ప్రధాని పీఠం వరకు తీసుకొచ్చిన నేత

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించారు.
‘అడ్వాణీని భారతరత్న పురస్కారంతో గౌరవిస్తున్నాం. ఈ తరంలోని అత్యంత గొప్ప రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరు. ఈ దేశ అభివృద్ధికి ఆయన కృషి చిరస్మరణీయం. క్షేత్ర స్థాయి నుంచి జీవితం ప్రారంభించి దేశ ఉప ప్రధాని పదవి వరకు సేవలు అందించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలియజేశాను’ అని మోదీ తెలిపారు.
2024 జనవరి 23న బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా ఈ గౌరవం అడ్వాణీకి దక్కింది.
భారత ప్రభుత్వం ఒక సంవత్సరంలో గరిష్టంగా ముగ్గురికి భారతరత్న గౌరవాన్ని ఇవ్వొచ్చు.
రామమందిర ఉద్యమానికి నేతృత్వం
అడ్వాణీ ప్రస్తుతం 96వ పడిలో ఉన్నారు.
1990లలో రామమందిర ఉద్యమానికి నేతృత్వం వహించిన బీజేపీ కీలక నేతలలో ఈయన ఒకరు
90లలో విశ్వహిందూ పరిషత్ అయోధ్య, కాశీ, మధురలో ఆలయాలకు విముక్తి కల్పించాలంటూ ఉద్యమం చేపట్టినపుడు దాని కోసం లాల్‌కృష్ణ్ అడ్వాణీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేశారు.
1990 సెప్టెంబర్ 25న ప్రారంభమైన అడ్వాణీ రథయాత్ర అక్టోబర్ 30న అయోధ్య చేరుకుంది. అయితే, బిహార్‌లో అప్పటి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సమస్తిపూర్ జిల్లాలో అక్టోబర్ 23న ఆయన్ను అరెస్టు చేయించారు.
అడ్వాణీపై మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారనే ఆరోపణలతో క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన ప్రస్తుతం బీజేపీ మార్గదర్శక కమిటీలో ఉన్నారు. కానీ, ఆయన బహిరంగంగా అంత చురుగ్గా కనిపించడం లేదు.
లాల్‌కృష్ణ్ అడ్వాణీ బాల్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో కొనసాగారు.
నేను చిన్నతనంలో ఏ సంస్థలో ఉన్నానో దానిని గౌరవిస్తాను. నాకు అందుకు గర్వంగా ఉంటుంది. ఆ సంస్థే ఆరెస్సెస్ అని ఒకసారి రాజస్థాన్ మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యక్రమంలో అడ్వాణీ చెప్పారు.
మనం ఎప్పుడూ తప్పులను ప్రోత్సహించకూడదు అనేది నేను ఆరెస్సెస్ నుంచే నేర్చుకున్నాను. దేశాన్ని ప్రేమించాలని, దేశం పట్ల విధేయత అనే పాఠాన్ని కూడా నేను ఆరెస్సెస్ నుంచే నేర్చుకున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
అవకాశం ఉన్నా వాజ్‌పేయి కోసం..
''రామమందిరం ఉద్యమ సమయంలో దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత, సంఘ్ పరివార్ పూర్తి ఆశీస్సులు ఉన్న నేత అయినప్పటికీ, 1995లో వాజ్‌పేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పిన అడ్వాణీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు'' అని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేదీ బీబీసీతో చెప్పారు.
ఆ సమయంలో అడ్వాణీ ప్రధాని కాగలిగేవారు. కానీ, ఆయన బీజేపీలో వాజ్‌పేయి కంటే పెద్ద నేత ఎవరూ లేరని ఆయన చెప్పారు.
50 ఏళ్ల వరకూ ఆయన వాజ్‌పేయితో కలిసి నంబర్ 2గా కొనసాగారు అన్నారు త్రివేది.

ఫొటో సోర్స్, Getty Images
50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం ఉన్నప్పటికీ అడ్వాణీ ఎలాంటి అవినీతి మచ్చ పడలేదు.
1996 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు విపక్షంలోని పెద్ద నేతలను హవాలా కుంభకోణంలో ఇరికించడానికి ప్రయత్నించారని చెప్తారు.
అప్పుడు అడ్వాణీ అందరికంటే ముందు రాజీనామా ఇచ్చి ఈ కేసులో మచ్చలేకుండా బయటపడే వరకూ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.
1996 ఎన్నికల తర్వాత ఆ కేసులో ఆయన నిర్దోషిగా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
పాతాళం నుంచి పీఠం వరకు
ప్రధాన మంత్రి మోదీ ఒకప్పుడు అడ్వాణీకి చాలా సన్నిహితంగా ఉండేవారు.
కానీ, 2014లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఇద్దరు నేతల మధ్య సంబంధాలు బీటలు వారాయి.
ఒకప్పుడు బీజేపీ వయోవృద్ధ నేత లాల్‌కృష్ణ్ అడ్వాణీని భారతదేశమంతటా ప్రశంసించేవారు. ఆయనను ప్రధానమంత్రి పదవికి బలమైన పోటీగా భావించారు.
1984లో రెండు సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీని అడ్వాణీ పాతాళం నుంచి భారత రాజకీయాల్లో కేంద్రంగా మారేవరకూ తీసుకొచ్చారు. 1998లో మొదటిసారి అధికారం అందుకునేలా చేశారు.
2004, 2009లో వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత.. ఒకప్పుడు ఆయన నీడలో ఎదిగిన నరేంద్రమోదీ ఆయన స్థానాన్ని తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘జిన్నాపై వ్యాఖ్యలు పాకిస్తానీలను సంతోషపరచడానికి కాదు’
అడ్వాణీ విమర్శకులు, ఆరెస్సెస్ మీద ఏజీ నూరానీ పుస్తకం రాశారు.
''1984 ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు సీట్లే వచ్చినపుడు, అందరూ కంగారుపడ్డారు. దీంతో పాత ఓట్లు రాబట్టుకోడానికి ఏకైక దారి ఉందని, హిందూత్వను మళ్లీ తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నారు.
1989లో బీజేపీ పాలంపూర్ తీర్మానం ఆమోదం పొందింది. అందులో అడ్వాణీ మా ప్రయత్నాలు ఓట్లుగా మారుతాయని మేం ఆశిస్తున్నాం అని అడ్వాణీ బహిరంగంగా చెప్పారు'' అని తన పుస్తకంలో నూరానీ ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
1995లో దేశం తనను ప్రధానిగా చేయదనే విషయం ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన వాజ్‌పేయి కోసం కుర్చీ వదిలారు. జిన్నా గురించి ఆయన మాట్లాడిన మాటలు, పాకిస్తానీలను సంతోషపరచడానికి కాదు. ఆయన భారత్‌లో ఒక ఉదారవాది ఇమేజ్‌ను కోరుకున్నారు.
కానీ, అలా చేసి ఆయన స్వయంగా తన ఉచ్చులోనే చిక్కుకున్నారు. ఆయన గుజరాత్ అల్లర్ల తర్వాత ఏ మోదీని కాపాడారో, అదే మోదీ ఆయన్ను బయటకు పంపించారు'' అని అందులో రాశారు ఏజీ నూరాని.

ఫొటో సోర్స్, Getty Images
కరాచీలో జననం
- లాల్ కృష్ణ అడ్వాణీ, 1927 నవంబర్ 8న అప్పటి ఉమ్మడి భారతదేశంలోని కరాచీలో జన్మించారు.
- ఆయన పాఠశాల విద్య కరాచీలో పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని (ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఉన్న) కళాశాలలో చదివారు.
- 1944లో కరాచీలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. విభజన తర్వాత 1947 సెప్టెంబర్‌లో ప్రస్తుత భారతదేశానికి వచ్చారు.
- 1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో వాలంటీర్‌గా చేరారు. 1947 తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్‌లో చురుకుగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్‌లో కొన్నాళ్లు పనిచేశారు.
- 1970లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1972లో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 1975లో ఎమర్జెన్సీ సమయంలో జన్‌సంఘ్ సభ్యులతో కలిసి జైలుకు వెళ్లారు.
- 1977 మార్చి నుంచి 1979 వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో అడ్వాణీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రామరథ యాత్ర ప్రారంభించారు అడ్వాణీ.
- ఆ తర్వాత 1998లో వాజ్‌పేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఉపప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
- లాల్ కృష్ణ అడ్వాణీ బీజేపీ వ్యవస్థాపక సభ్యులు, మూడుసార్లు (1986-1990, 1993-1998, 2004-2005) ఆ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- మోదీని ఎదుర్కోవడానికి ఏర్పాటైన 'ఇండియా' కూటమికి అసలు సమస్య కాంగ్రెస్సేనా
- పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?
- ‘చదువైనా మానేస్తాం కానీ, హిజాబ్‌ను వదిలేయం’ అంటున్న ముస్లిం విద్యార్థినులు.. రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
- Cervical Cancer: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా
- పార్లమెంట్ భద్రతా వైఫల్యం: పోలీసులు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చి హింసిస్తున్నారంటూ కోర్టులో నిందితుల ఫిర్యాదు















