మోదీని ఎదుర్కోవడానికి ఏర్పాటైన 'ఇండియా' కూటమికి అసలు సమస్య కాంగ్రెస్సేనా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రెండు డజన్లకు పైగా ప్రతిపక్ష పార్టీలు కలిసి 2023 జులైలో ఒక కూటమిని ఏర్పాటు చేశాయి.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర చిన్నాపెద్ద ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఈ కూటమికి 'ఇండియా' అనే పేరుపెట్టారు.
ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ అని పేరు పెట్టి దాన్ని 'ఇండియా' అని పిలవడం ప్రారంభించారు.
కూటమిలో మిత్రపక్షాలు కలిసికట్టుగా ఉండి, వ్యూహాత్మకంగా సీట్లను పంచుకోవడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి దీటుగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపైనే ఈ కూటమి విజయం ఆధారపడి ఉంది.
భారత్‌లోని బహుళ పార్టీ విధానం ప్రకారం, ''ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్'', అంటే ఎవరు ముందువరుసలో ఉంటే వారికే అన్నీ దక్కుతాయి.
ప్రతిపక్షాలు ఎవరికి వారుగా విడిపోయి ఉంటే అది అధికార పార్టీకే కలిసొస్తుంది. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, లోక్ సభలోని 543 సీట్లలో 303 సీట్లను దక్కించుకుంది.
అయితే, పుట్టిన ఆరు నెలలకే ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రతిపక్ష కూటమి భాగస్వామి, బిహార్‌లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ అధినేత నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో చేరడమే అందుకు కారణం.
ఏడాదిన్నర కిందట నితీష్ కుమార్ బీజేపీ కూటమి నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు బిహార్‌లోని 40 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్)తో జట్టుకట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత రాజకీయాల్లో యూటర్న్‌లు కొత్తేమీ కాదు. అయితే, ఒకప్పుడు ప్రతిపక్ష కూటమి నుంచి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పిన 72 ఏళ్ల నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టడం చాలా మందికి షాకిచ్చింది.
''ప్రతిపక్ష కూటమి నుంచి ఆయన పక్కకు తప్పుకోవడం 'ఇండియా'కి పెద్దదెబ్బ. కూటమి వల్ల ప్రయోజనం లేదనే సంకేతాలు పంపుతోంది'' అని భారత రాజకీయాలపై అవగాహన కలిగిన గిల్లెస్ వెర్నియెర్స్ అభిప్రాయపడ్డారు.
అది మాత్రమే కాదు. విపక్ష కూటమిలోని మరో ఇద్దరు ప్రాంతీయ పార్టీల అధినేతలు మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న అర్వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కి దూరంగా జరగడంతో పాటు, తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగనున్నట్లు స్పష్టం చేశారు. అంటే, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలు ఉండవు.
కొద్దినెలల కిందటే పుట్టిన ఈ కూటమిలో తలెత్తిన గందరగోళంతో మోదీని ఎదుర్కోలేకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తోంది.
డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ బెల్ట్‌లోని ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించింది. అలాగే, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ద్వారా మోదీ ఏప్రిల్, మేలో జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని అనధికారికంగా ప్రారంభించినట్లు కనిపించారు.
''బీజేపీ విషయంలో డిసెంబర్ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఎన్నికల్లో విజయానికి అనుకూల అవకాశాలు పెరిగాయి'' అని దిల్లీలోని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్‌కి చెందిన రాహుల్ వర్మ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
విపక్ష కూటమి అంత బలపడకపోవడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీనే కారణంగా అనిపిస్తోంది. ఇది బీజేపీకి ఏకైక పాన్ ఇండియా ప్రత్యామ్నాయం. 2019లో కాంగ్రెస్ పార్టీకి 20 శాతం కంటే తక్కువ ఓట్లు రాగా, కేవలం 52 సీట్లకే పరిమితమైంది.
''ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మిత్రపక్షాలకు ఆమోదయోగ్యం కాని రీతిలో సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది'' అని వెర్నియర్స్ అభిప్రాయపడ్డారు. ''పార్టీ బలహీనంగా ఉండడం, కానీ ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ విపక్ష కూటమికి హానికరంగా మారింది'' అని ఆయన అన్నారు.
అయితే, ప్రతిపక్ష కూటమి గందరగోళానికి పూర్తిగా కాంగ్రెస్‌నే నిందించడం సరికాదని చాలా మంది భావిస్తున్నారు. ఈ పోటాపోటీ రాజకీయాల్లో ప్రతి పార్టీ తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ తమ సత్తాచాటేందుకు ప్రయత్నిస్తుంటాయి.
''ఇండియా కూటమిలోని సభ్య పార్టీలు ఉమ్మడి ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారికి వారి సొంత రాష్ట్రంలో సత్తాచాటుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వెనకబడిపోతారు'' అని వెర్నియర్స్ చెప్పారు.
అధికార పక్షంపై పోరులో సీట్ల పంపకం ఒక భాగం మాత్రమే. బీజేపీ హిందూ జాతీయవాదం, అభివృద్ధి నమూనాకు దీటైన నమూనాను ప్రతిపక్షం రూపొందించలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నమూనాకు సమాజంలోని మెజార్టీ వర్గం నుంచే కాకుండా, మీడియా, వ్యాపారవర్గాల నుంచి మద్దతు లభిస్తోందని రాజకీయ శాస్త్రవేత్త (పొలిటికల్ సైంటిస్ట్) అసిమ్ అలీ అభిప్రాయపడ్డారు. ''సామాజిక మద్దతు బలంగా ఉన్నప్పుడే సమస్యలు తెరపైకి వస్తాయి'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP
విపక్షాలకు కలిసొచ్చే అంశాలకు కొదువేం లేదు. ఉద్యోగాల కల్పనలో మోదీ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. బీజేపీ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యానాలు, మీడియా, మేథావులు, రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా వేధించడాన్ని ఖండించారు. డిసెంబర్‌లో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ సస్పెన్షన్‌కు గురైన 140 మంది ఎంపీలకు మద్దతుగా ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి.
వెర్నియర్స్ చెప్పినట్లు, ప్రతిపక్షాలను కలిపి ఉంచే ''సైద్ధాంతిక శక్తి'', మరీముఖ్యంగా మోదీ, బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న హిందూ జాతీయవాదానికి వ్యతిరేకంగా బలమైన సిద్ధాంతం కనిపించడం లేదు.
నిజం చెప్పాలంటే, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడి నేతృత్వంలో, అన్ని వనరులూ కలిగిన బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలనుకోవడం సులభమే. కానీ, చెట్టుకొకటి, పుట్టకొకటిగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి 30 ఏళ్ల పాటు దేశాన్ని నిరాటంకంగా పాలించిన కాంగ్రెస్‌ను 1977 ఎన్నికల్లో ఓడించేందుకు దశాబ్దాలు పట్టింది.
జనతా పార్టీ కూటమి సైద్ధాంతికంగా వేర్వేరు అభిప్రాయాలున్న పార్టీలను ఏకం చేసింది. ఎమర్జెన్సీ విధించి పౌరహక్కులను కాలరాసిన ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సోషలిస్టుల నుంచి హిందూ జాతీయవాదుల వరకూ అందరూ ఒక్కటిగా పోరాడారు. (అంతర్గత విభేదాలు, నేతల పదవీకాంక్ష కారణంగా రెండేళ్లలోనే ఆ కూటమి కుప్పకూలింది. కానీ, తనకు ఎదురులేదనుకున్న ప్రత్యర్థికి ఓటమి రుచిచూపించింది.)

ఫొటో సోర్స్, AFP
''తీవ్రమైన అస్తిత్వ పోరాటం, లేదా అసాధారణ పరిస్థితులు మాత్రమే వేర్వేరు భావజాలాలున్న పార్టీలను ఏకమయ్యేలా చేయడంతో పాటు అధికార పార్టీని బలంగా ఎదుర్కోగలవు. సాధారణ పరిస్థితుల్లో అలా జరగడం చాలా కష్టం'' అని వర్మ అన్నారు.
కాబట్టి ఇండియా కూటమి కుప్పకూలుతుందా? అంటే.. ''కూటమి ఇబ్బందుల్లో ఉంది. కానీ, వారు కలిసి పోటీచేసేందుకు ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషించాలి'' అని వర్మ చెప్పారు. రాష్ట్రాల్లో మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీలు సాధించే సీట్ల కంటే, బీజేపీ బలంగా ఉన్న ఉత్తర భారతం, పశ్చిమ భారత్‌లోని 250 సీట్లలో కాంగ్రెస్ ప్రభావంపై ఈ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.
దీనికి వెర్నర్స్ ఒక పరిష్కారాన్ని సూచించారు. ''జాతీయ స్థాయిలో ప్రధాన పోటీదారుగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు అంత సుముఖంగా లేవు. కాబట్టి బీజేపీతో నేరుగా పోటీ పడే అవకాశం ఉన్న రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ చేయాలి. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాలి''. అన్నారు.
కానీ, ఇది చెప్పడం సులువు. చేతల్లో కాదు.
ఇవి కూడా చదవండి:
- Cervical Cancer: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా
- అయోధ్యలో ప్రభుత్వం సెక్యులరిజం పరిధిని ఉల్లంఘించిందా?
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్: ఎవరెవరు ఏం ఆశిస్తున్నారు? కేంద్రం ఆలోచనలు ఎలా ఉండొచ్చు..
- మునావర్ ఫారూకీ: ఈ బిగ్‌బాస్ విజేత చుట్టూ ఎందుకింత చర్చ?
- సముద్రపు దొంగల నుంచి పాకిస్తాన్ నావికులను భారత నౌకాదళం ఎలా కాపాడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














