మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అభిశంసనకు ప్రయత్నాలు, ఎన్నికైన మూడు నెలల్లోనే కీలక పరిణామాలు.. ఇండియానే కారణమా?

మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూకు సమస్యలు పెరుగుతున్నాయి. ఆయన అభిశంసనకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం 'మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ'(ఎండీపీ) సిద్ధమవుతోంది.

అభిశంసన(ఇంపీచ్‌మెంట్)కు కావాల్సిన సంఖ్యాబలం తమకు ఉందని 'ద హిందూ' వార్తాపత్రికతో ఎండీపీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ అంధున్ హుస్సేన్ అంటున్నారు.

ముయిజ్జు కేబినెట్‌లోకి మరో నలుగురిని తీసుకోవాలని జనవరి 28న పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగింది. ఇది అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

ఇదే క్రమంలో ముయిజ్జుపై ఎండీపీ అభిశంసన ప్రయత్నం ఆసక్తిగా మారింది.

కొంత కాలంగా మాల్దీవులు, భారత్‌ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ముయిజ్జు మాల్దీవులకు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌ను దూరం పెట్టసాగారు.

భారత్ పట్ల ముయిజ్జు వైఖరిపై మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

ముయిజ్జు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో 'ఇండియా అవుట్' అనే నినాదంతో ముందుకెళ్లారు.

ముయిజ్జు గెలిచిన తర్వాత భారత సైనికులు దేశం విడిచి వెళ్లాలని మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు సూచించింది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఆ తర్వాత లక్షద్వీప్‌‌పై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, SM VIRAL GRAB

ఫొటో క్యాప్షన్, జనవరి 28న మాల్దీవులు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో గొడవ జరిగింది.

ప్రతిపక్షాలు చెబుతున్న కారణాలేంటి?

ముయిజ్జు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల్లోనే అభిశంసనకు ప్రయత్నించడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

దీని గురించి అంధున్ హుస్సేన్ 'ద హిందూ'తో మాట్లాడుతూ- ''అధ్యక్షుడు తన విధానాలతో హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. సైన్యాన్ని, అర్థ బలాన్ని ఉపయోగించి పార్లమెంట్‌ను సక్రమంగా నడవనివ్వడం లేదు'' అని తెలిపారు.

80 మంది సభ్యులున్న మాల్దీవుల సభలో ఎండీపీకి 42 సీట్లు ఉన్నాయి. అయితే, 13 సీట్లున్న డెమొక్రాట్లు కూడా ఈ విషయంలో ఎండీపీకి మద్దతిస్తున్నారు.

రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీల నేతల మధ్య ఈ విషయంలో సఖ్యత కుదిరింది. ఇరువురి లక్ష్యం ముయిజ్జుని గద్దె దించడమే.

మాల్దీవుల చిరకాల మిత్ర దేశమైన ఇండియాను దూరం చేసినందుకు ముయిజ్జును విమర్శిస్తూ ఎండీపీ, డెమొక్రాట్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

గతంలో మాల్దీవుల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు 'ఇండియా ఫస్ట్' అనే విధానాన్ని అవలంబించాయి.

ముయిజ్జును చైనా మద్దతుదారుగా పరిగణిస్తారు. అయితే చైనా, భారత్‌ల పేరెత్తకుండా 'మాల్దీవులు ఫస్ట్' అంటూ ముయిజ్జు మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, PMO

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు.

మార్చిలో మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలు

2024 ప్రారంభంలో మాల్దీవుల మంత్రులు, భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు, మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు భారత్‌కు మద్దతుగా నిలిచారు.

మంత్రులను సస్పెండ్ చేస్తే సరిపోదని, ప్రభుత్వం భారత్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంతలో దాదాపు 12 మంది ఎండీపీ ఎంపీలు అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో సభలో వారి సంఖ్యా బలం పెరిగింది.

ఇక మార్చి 17న మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ముయిజ్జుకు ఆ రోజు కఠిన పరీక్ష. చట్టాలు ఆమోదించాలంటే పార్లమెంటు మద్దతు అవసరం.

మరోవైపు ఫిబ్రవరి 3న మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ అంతర్గత (ప్రైమరీ) ఎన్నికలు జరగనున్నాయి.

హుస్సేన్ 'ద హిందూ'తో మాట్లాడుతూ* "అభిశంసన తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలో ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం" అన్నారు.

''మనం భౌగోళికతను మార్చలేం, చైనాను దగ్గరికి తీసుకురాలేం. భారత్ మన పొరుగు దేశం, ఫ్రెండ్, కుటుంబం. అది ఔషధమైనా, ఆహారమైనా భారత్ లేకుండా సాధించడం కష్టం. మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే భారత విధానమే కారణం'' అని తెలిపారు.

ముయిజ్జు చైనా పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ముయిజ్జు చైనాలో మొదటి అధికారిక పర్యటన చేశారు.

ఇంతకుముందు నాయకులు మాల్దీవులకు అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్‌ను సందర్శించేవారు.

మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు, భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు, భారత ప్రధాని మోదీ (ఫైల్)

మయిజ్జు గెలిచాక జరిగిన పరిణామాలు

2023 నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి, మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు

అధికారం చేపట్టిన తర్వాత భారత సైనికులను మాల్దీవుల నుంచి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు.

2023 నవంబర్ చివరలో ముయిజ్జు తుర్కియే, సౌదీ అరేబియాలను సందర్శించారు.

2023 డిసెంబర్ 1న దుబాయ్‌లో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ముయిజ్జు .

2024 జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. అయితే మాల్దీవుల మంత్రులు మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

దీంతో మాల్దీవులను బహిష్కరించాలని భారత కంపెనీలతో పాటు సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగింది

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను ముయిజ్జు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇది సరిపోదని, మాల్దీవుల ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

2024 జనవరి 8న ముయిజ్జు చైనా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం చిన్న దేశమనే కారణంతో మాల్దీవులను వేధించే హక్కు ఎవరికీ లేదంటూ వ్యాఖ్యలు చేశారు.

భారత సైనికులు మార్చి 15లోగా తమ దేశాన్ని విడిచిపెట్టాలని మాల్దీవుల ప్రభుత్వం జనవరి 14న ఆదేశించింది.

2024 జనవరి 28న మాల్దీవుల పార్లమెంట్‌లో ముయిజ్జు మద్దతుగల ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది.

మాల్దీవుల పార్లమెంట్‌లో గందరగోళం

మాల్దీవులలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) మధ్య పొత్తు ఉంది. మాల్దీవుల్లో ఇరు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.

ఈ కూటమి కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంది. కానీ ప్రతిపక్షాలు అంగీకరించలేదు. నలుగురు కేబినెట్ సభ్యుల ఆమోదాన్ని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ) నిలిపివేసింది.

ఈ నలుగురు సభ్యులలో అటార్నీ జనరల్‌గా అహ్మద్ ఉషామ్, హౌసింగ్, భూ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా అలీ హైదర్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిగా మహ్మద్ షహీమ్ అలీ సయీద్, ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి వ్యవహారాల మంత్రిగా మొహమ్మద్ సయీద్‌లను ఎంపిక చేయాలనుకున్నారు.

ఓటింగ్ జరిగినప్పుడు మొహమ్మద్ సయీద్‌కు అనుకూలంగా 37 ఓట్లు వచ్చాయి. మంత్రిగా పార్లమెంటు ఆమోదం కోసం 35 ఓట్లు అవసరం.

జనరల్ అహ్మద్ ఉషామ్‌కు అనుకూలంగా 24 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 44 ఓట్లు వచ్చాయి. అలీ హైదర్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 46 ఓట్లు వచ్చాయి.

షహీమ్‌కు అనుకూలంగా 30, వ్యతిరేకంగా 31 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ముయిజ్జు మంత్రివర్గంలోని 22 మంది సభ్యులలో 19 మందికి ఆమోదం లభించింది.

మాల్దీవులు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఏమవుతుంది?

మాల్దీవుల మీడియా సంస్థ 'ది ఎడిషన్' ప్రకారం- రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం మంత్రివర్గాన్ని నియమించిన ఏడు రోజుల్లోగా ఆమోదం కోసం పార్లమెంటుకు పంపాలి.

అయితే, ఆమోదం లభించకపోతే ఏం జరుగుతుందో రాజ్యాంగంలో గానీ, చట్టంలో గానీ ప్రస్తావించలేదు.

పార్లమెంటు ఆమోదం పొందలేదని మంత్రి పదవి నుంచి తప్పించలేమని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే లేదా స్వయంగా మంత్రి రాజీనామా చేస్తేనే వారి పదవి పోతుందని తెలిపింది.

మంత్రి నియామకాన్ని పార్లమెంట్ ఆమోదించకపోతే ఆ నియామకాన్ని అడ్డుకునే చర్య చట్టపరంగా సాధ్యంకాదని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ చీఫ్, అధ్యక్షుడి ప్రత్యేక సలహాదారు అబ్దుల్ రహీమ్ అబ్దుల్లా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)