పాకిస్తాన్‌లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?

ఉల్లి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తన్వీర్ మాలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత కొన్ని వారాలుగా పాకిస్థాన్‌లో ఉల్లి ధర బాగా పెరిగింది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో ఇలా ధరలు పెరగడంతో ఉల్లిపాయలను కొనడం పౌరులకు కష్టంగా మారింది.

ఉల్లి ఉత్పత్తి గతంలో మాదిరిగానే ఉందని, అంతేకాకుండా పొలం నుంచి మార్కెట్‌కు ఉల్లి సరఫరాలో ఎలాంటి సమస్యా లేదని వ్యాపారులు అంటున్నారు. మరి ధర ఎందుకు పెరుగుతోంది?

దీనికి కారణం భారతదేశమని వారంటున్నారు. భారత్ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో పాకిస్తాన్‌లో ఉల్లి ధర పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్ స్థానిక మార్కెట్‌లో ఉల్లి ధర గత నెలలో కిలోకు 150 పాకిస్తానీ రూపాయల నుంచి రూ. 270కి పెరిగింది.

ఉల్లి

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఎందుకు నిషేధించింది?

ఉల్లి ఎగుమతిని భారత్ 2023 డిసెంబర్ 8న నిషేధించింది. స్థానిక మార్కెట్‌లో ఉల్లి ధర పెరగకుండా నిరోధించి, వినియోగదారులకు తక్కువ ధరలకు అందించడమే దాని ఉద్దేశం.

భారత్ నుంచి పాకిస్థాన్ ఉల్లిని దిగుమతి చేసుకోనప్పటికీ భారత నిర్ణయం అక్కడి ధరలపై ప్రభావం చూపింది.

భారత నిర్ణయంతో ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల నుంచి ఉల్లి కోసం పాకిస్థానీ ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చాయని ఆల్ పాకిస్థాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్స్‌పోర్టర్స్, ఇంపోర్టర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ అబ్దుల్ వహీద్ అహ్మద్ తెలిపారు.

సరకు ఎగుమతులను పాకిస్థాన్ ప్రారంభించిందని, దీంతో ఉల్లి ధరలు పెరిగాయని తెలిపారు.

పండ్లు, కూరగాయల ఎగుమతిదారు, వ్యాపారవేత్త అయిన షాజహాన్ బీబీసీతో మాట్లాడుతూ భారత్ నిషేధం విధించినప్పుడు, స్థానిక హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక మాండ్ (40 kg) ఉల్లిపాయ ధర రూ. 6,000-6,500 మధ్య ఉంది. ఇది 9 వేల పాకిస్తానీ రూపాయలకు పెరిగింది.

పాకిస్తాన్‌లో ఆహార పదార్థాల వారాంతపు ధరలను అక్కడి స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ సేకరిస్తుంది, దాని ఆధారంగా ద్రవ్యోల్బణం రేటు నిర్ణయిస్తారు.

ఉల్లి ఎగుమతిని భారత్ నిషేధించినప్పుడు పాకిస్తాన్‌లో ఒక కిలో ఉల్లి సగటు ధర రూ. 150గా ఉందని స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డేటా ఆధారంగా తెలుస్తోంది.

పాకిస్థాన్‌లోని వివిధ నగరాల్లోని సగటు ధర ఇది. కానీ నెల తర్వాత కిలో ఉల్లి ధర రూ. 220కి చేరుకుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దాని ధర కిలో రూ. 270 లేదా అంతకంటే ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం బలూచిస్తాన్‌లో ఉల్లి సరకు అయిపోయిందని, సింధ్ నుంచి సరఫరా వస్తోందని కరాచీలోని పండ్లు, కూరగాయల మార్కెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు జాహిద్ అవాన్ తెలిపారు.

పాకిస్థాన్ నుంచి ఉల్లి ఎగుమతి ఇలాగే కొనసాగితే, దాని ధర మరింత పెరుగుతుందనే భయం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉల్లి ధరల పెరుగుదల

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం ఏం చేస్తోంది?

పాకిస్తాన్ దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సరకు ఎగుమతుల నియంత్రణపై దృష్టి సారించింది అక్కడి ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతి ధరను కేంద్ర ప్రభుత్వం టన్నుకు 1,200 డాలర్లు చేసింది. అంటే ఈ ధర కంటే తక్కువ ధరకు ఉల్లిని విదేశాలకు పంపడం సాధ్యం కాదు.

గతంలో ఈ ధర టన్నుకు దాదాపు 750 డాలర్లు ఉండేది. ఎగుమతుల ధర పెరగడంతో దేశీయంగా ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

స్థానికంగా ఉల్లి డిమాండ్‌, సరఫరాపై నిఘా ఉంచాలని, అవసరాన్ని బట్టి ఎగుమతి ధరను మరింత పెంచాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎగుమతులను ఆపడానికి ఈ ధరల నియంత్రణ పద్ధతిని అవలంబిస్తున్నట్లు బీబీసీతో విదేశీ వాణిజ్య నిపుణుడు ఇక్బాల్ తబీష్ తెలిపారు.

ఈ పద్దతితో దేశం నుంచి సరకు విదేశాలకు ఎక్కువగా వెళ్లకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అధిక ఎగుమతి ధర కారణంగా విదేశాల నుంచి కొనుగోలు చేయడానికి తక్కువ ఆర్డర్లు వస్తాయని, తద్వారా ఆ వస్తువుల లభ్యత దేశంలో మెరుగ్గా ఉంటుందని ఆయన అంటున్నారు.

ఉల్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'బడా ఎగుమతిదారుల కనుసన్నల్లోనే'

ఎగుమతి ధరను పెంచే బదులు, ఇంతకు మించి ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయలేమని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని షాజహాన్ సూచిస్తున్నారు.

విదేశాల్లో ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.

పాకిస్థాన్‌లో ముగ్గురు, నలుగురు బడా ఎగుమతిదారులు ఉల్లి ధరలను నియంత్రిస్తున్నారని, వారే ఎక్కువ ధరకు విక్రయిస్తారని, దీనివల్ల దేశంలో ఉల్లి ధర తగ్గబోదని షాజహాన్ ఆరోపిస్తున్నారు.

అయితే షాజహాన్‌తో అబ్దుల్ వహీద్ అహ్మద్ ఏకీభవించడం లేదు.

ఎగుమతి ధర పెరగడం వల్ల ఉల్లి ధర తగ్గే అవకాశం ఉందని, ఒక్కరోజులోనే ఒక్కో మాండ్ రూ.1,000 వరకు తగ్గిందని తెలిపారు.

రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని అబ్దుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఉల్లి ధరలు పెరగడానికి భారత్ కారణమా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)