వజ్రాన్ని ల్యాబ్‌లో ఎలా తయారు చేస్తారు... జో బైడెన్ భార్య జిల్‌కు మోదీ ఇచ్చిన వజ్రం ప్రత్యేకత ఏంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, జై శుక్లా
- హోదా, బీబీసీ గుజరాతీ
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అనేక బహుమతులు ఇచ్చారు. ఆ బహుమతులు అన్నింటిలో గ్రీన్ డైమండ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
భారత ప్రధాని మోదీ 7.5 క్యారెట్ల విలువైన పర్యావరణ అనుకూల వజ్రాన్ని అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు బహుమతిగా ఇచ్చారు.
మోదీ ఇచ్చిన వజ్రం అమూల్యమైనది. దాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్‌లో తయారు చేశారు.
దీని తయారీలో పునరుత్పాదక వనరులని ఉపయోగించారు.
ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రం అయినప్పటికీ, భూమిలో లభించిన వజ్రానికి ఉండే లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి.
ల్యాబ్‌లో చేసిన వజ్రం అంటే ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? దాని ప్రత్యేకత ఏంటి? ఇది సాధారణ వజ్రాల కంటే భిన్నంగా ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వజ్రాల పరిశ్రమకు సంబంధించిన నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, ANI
గ్రీన్ డైమండ్ ఎవరు తయారు చేశారు?
అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రాన్ని గుజరాత్‌లోని సూరత్‌లో తయారు చేశారు.
భారత వజ్రాల పరిశ్రమకు సూరత్‌ను కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని ప్రతీ 11 వజ్రాల్లో 9 వజ్రాలు సూరత్‌లో కట్-పాలిష్ అవుతుంటాయి.
గ్రీన్ డైమండ్‌ను ముకేశ్ పటేల్‌కు చెందిన సూరత్‌లోని 'గ్రీన్‌ల్యాబ్' కంపెనీలో తయారు చేశారు.
1960లో గ్రీన్ ల్యాబ్ ఏర్పాటైంది. ప్రస్తుతం ల్యాబ్‌లలో వజ్రాలను తయారు చేసే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా గ్రీన్ ల్యాబ్ పేరు పొందింది.
ఈ కంపెనీ తన వజ్రాల తయారీ యూనిట్‌లో 25 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సోలార్ ప్లాంట్ 90 ఎకరాల్లో విస్తరించి ఉంది.
గ్రీన్‌ల్యాబ్ కంపెనీలో రెండు వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
భారత్‌లోని వజ్రాల పరిశ్రమ తరఫున ఈ వజ్రాన్ని బైడెన్‌కు బహుమతిగా ఇచ్చినట్లు బీబీసీతో ముకేశ్ పటేల్ కుమారుడు స్మిత్ పటేల్ చెప్పారు.
"ఈ వజ్రం చాలా విలువైనది. సూరత్‌లో అభివృద్ధి చెందుతున్న ల్యాబ్ తయారీ వజ్రాల పరిశ్రమకు అది చిహ్నం’’ అని స్మిత్ పటేల్ అన్నారు.
గ్రీన్‌ల్యాబ్ టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయలు.
ఈ కంపెనీలో వజ్రాల కట్-పాలిషింగ్‌తో పాటు, ల్యాబ్‌లో వజ్రాలను తయారు చేయడం, వజ్రాలతో ఆభరణాలను రూపొందిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ల్యాబ్‌లో తయారు చేసిన గ్రీన్ డైమండ్ అంటే ఏంటి?
జిల్ బిడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రాన్ని... ప్రతీ క్యారెట్‌కు కేవలం 0.028 గ్రాముల కార్బన్‌ను విడుదల చేసే సాంకేతికతతో తయారు చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ వజ్రాన్ని పర్యావరణానికి అనుకూలమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ వజ్రం తయారీలో సౌర శక్తి, పవన శక్తి వంటి వనరులను ఉపయోగించారు.
ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐజీఐ)కు చెందిన జెమోలాజికల్ ల్యాబ్ ఈ వజ్రాన్ని ధ్రువీకరించింది.
వజ్రానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలను ఇది అందుకుంది. కట్, కలర్, క్యారెట్ పరంగా ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ గ్రీన్ డైమండ్‌కు ఉన్నాయి.
ప్రయోగశాలలో అధిక ఉష్ణోగ్రత, హెచ్చు పీడనాల వద్ద దీన్ని తయారు చేశారు.
భౌతిక-రసాయన లక్షణాల నుంచి ఆకృతి వరకు, ఇది సహజ వజ్రానికి ఉండే అన్ని లక్షణాలను కలిగి ఉంది.
ఈ వజ్రాన్ని మొదటిసారి చూసిన ఎవరైనా సహజ వజ్రానికి, దీనికి మధ్య తేడాను గుర్తించలేరు.
బహుమతిగా ఇచ్చిన వజ్రం ధర గురించి తమకు తెలియదని కానీ, ఇలాంటి వజ్రం ధర దాదాపు 17వేల డాలర్లు అంటే 15 లక్షల రూపాయలుగా ఉంటుందని వజ్రాల పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతిలో లభించే 7.5 క్యారెట్ల సహజ వజ్రం కొనాలంటే దాదాపు రూ.5 కోట్లు ఖర్చవుతుంది. ల్యాబ్‌లో 7.5 క్యారెట్ల డైమండ్‌ను తయారు చేయడానికి 40 రోజుల సమయం పడుతుంది.
ప్రయోగశాలలో వజ్రాలను తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వజ్రాల తయారీలో సాధారణంగా హెచ్‌పీహెచ్‌టీ అనే పద్ధతిని వాడతారు. అంటే అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతల మధ్య వజ్రాన్ని తయారు చేస్తారు.
ఈ ప్రక్రియలో 7,30,000 చదరపు అంగుళాల పీడనాన్ని, సుమారు 1500 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతను ఉపయోగిస్తారు.
సాధారణంగా, గ్రాఫైట్‌తో వజ్రాలను తయారు చేస్తారు. ఈ గ్రాఫైట్‌ను 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా వజ్రంగా మార్చుతారు.
కృత్రిమ వజ్రాలను తయారు చేసే మరొక పద్ధతి కూడా ఉంది. దాన్ని సీవీడీ పద్ధతి లేదా కెమికల్ వేపర్ డిపొజిషన్ అంటారు.
ఇందులో మీథేన్, హైడ్రోజన్ వాయువులను 800 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత, పీడనం ఉన్న ఒక చాంబర్‌లోకి పంపిస్తారు.
ఆ చాంబర్‌లో మైక్రోవేవ్, లేజర్ లేదా ఎలక్ట్రాన్ బీమ్ ద్వారా రసాయన చర్య జరుగుతుంది. అప్పుడు హైడ్రోకార్బన్ గ్యాస్, మీథేన్‌లో ఉండే కార్బన్ డైమండ్‌గా మారుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాల భవిష్యత్తు ఏమిటి?
భవిష్యత్తులో సహజ వజ్రాల పరిశ్రమను ఈ ల్యాబ్ డైమండ్ పరిశ్రమ వెనక్కి నెట్టగలదని నిపుణులు అంటున్నారు.
సూరత్ డైమండ్ అసోసియేషన్ కార్యదర్శి దామ్‌జీభాయ్ మవానీ బీబీసీతో మాట్లాడుతూ, ఇలా అన్నారు.
"ఒకవేళ భారత్‌లో ల్యాబ్ డైమండ్ పరిశ్రమ అభివృద్ధి చెందితే, సూరత్ వజ్రాల పరిశ్రమకు ప్రయోజనం చేకూరడం ఖాయం. ఎందుకంటే, సహజ వజ్రాల ధరతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాల ధర మూడింటిలో ఒక వంతు ఉంటుంది. కాబట్టి సహజ వజ్రాలను కొనుగోలు చేయలేని వారంతా ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలను కొంటారు. ఈ రకంగా భారత వజ్రాల పరిశ్రమకు లాభం కలుగుతుంది’’ అని ఆయన వివరించారు.
ప్రకృతిలో లభించే వజ్రాల కంటే ప్రయోగశాలలో తయారైన వజ్రాల ధర తక్కువగా ఉంటుందా? అని అడిగితే, ఆయన అవుననే సమాధానం చెప్పారు.
సహజ వజ్రాల కంటే 30 శాతం వరకు ఇవి చౌకగా ఉంటాయని అన్నారు. కానీ, వీటికి రీసేల్ వాల్యూ ఉండదని చెప్పారు.
ల్యాబ్ వజ్రాలకు రీసేల్ విలువ ఉండదు కాబట్టి అవి చౌకగా లభించినప్పటికీ, సహజ వజ్రాలతో వాటిని పోల్చలేమని వజ్రాల పరిశ్రమ ఎగుమతిదారు కీర్తి షా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సూరత్ వజ్రాల పరిశ్రమ ఏం చెబుతోంది?
జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్‌ను ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ సూరత్ వజ్రాల పరిశ్రమ గర్వించేలా చేశారని బీబీసీతో సూరత్‌కు చెందిన వజ్రాల తయారీదారు, వజ్రాల ఎగుమతి సంస్థ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీభాయ్ ధోలాకియా అన్నారు.
సావ్జీభాయ్ ధోలాకియా మాట్లాడుతూ, “వజ్రాల పరిశ్రమకు భవిష్యత్తు ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలే. ఇంతకుముందు వజ్రాల కోసం ముడి సరుకును దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది.
సూరత్‌లోని చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ కూడా పెరుగుతోంది" అని సావ్జీభాయ్ ధోలాకియా చెప్పారు.
సూరత్ వజ్రాల పరిశ్రమ ప్రాసెసింగ్ యూనిట్లలో సౌర శక్తిని ఉపయోగిస్తే, గ్రీన్ డైమండ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ పరిశ్రమ తీర్చగలదని బీబీసీతో సూరత్ డైమండ్ అసోసియేషన్ సెక్రటరీ దామ్‌జీభాయ్ మవానీ అన్నారు.
ఇండియన్ డైమండ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దినేష్‌భాయ్ నవాడియా దీని గురించి బీబీసీతో మాట్లాడారు.
"సూరత్‌లోని కొందరు వ్యక్తులు సీవీడీ టెక్నిక్‌తో ల్యాబ్‌లో వజ్రాలను ఉత్పత్తి చేయడానికి సౌర, పవన శక్తిని ఉపయోగించడం ప్రారంభించారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ రకంగా తయారైన వజ్రాలు కూడా పర్యావరణానికి అనుకూలమైనవి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలకు భారత్‌లో డిమాండ్ ఎంత?
భారత్‌లో ల్యాబ్‌లో అభివృద్ధి చేసే వజ్రాలను ప్రోత్సహించడం వల్ల సూరత్ వజ్రాల పరిశ్రమ విలువ పెరుగుతుందని బీబీసీతో దినేష్‌భాయ్ నవాడియా అన్నారు.
"మేం మొదట్లో వజ్రాల కట్-పాలిష్‌తో పాటు ఆభరణాలను తయారు చేసేవాళ్లం. ఇప్పుడు మేం ల్యాబ్ డైమండ్స్ కట్-పాలిష్‌తో పాటు వాటితో ఆభరణాలను కూడా తయారు చేస్తాం. మేం ప్రతీ ఏటా రూ. 1,96, 641 కోట్లు (24 బిలియన్ డాలర్లు) విలువైన సహజ వజ్రాలను ఎగుమతి చేస్తాం. ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాల ఎగుమతి విలువ రూ. 10.241 కోట్లు (1.25 బిలియన్ డాలర్లు) మాత్రమే. భారత్‌లో ఈ విధంగా ల్యాబ్‌లలో వజ్రాలను ఉత్పత్తి చేసి వాటిని ఎగుమతి చేస్తే వాటి విలువ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’ అని అన్నారు.
ల్యాబ్‌లో తయారైన వజ్రాల ఎగుమతి గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం భారత్‌లో రూ. 15,000 కోట్ల విలువైన ల్యాబ్‌లో తయారైన వజ్రాలు, ఆభరణాలు ఎగుమతి అవుతున్నాయి. దేశీయ మార్కెట్ చిన్నది. కానీ, రాబోయే రోజుల్లో దేశీయ డిమాండ్ పెరుగుతుంది, ఎగుమతులు కూడా పెరుగుతాయి’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం
- మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














