సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు

సోయం బాపూరావు

ఫొటో సోర్స్, Facebook/soyam bapurao

    • రచయిత, పెదగాడి రాజేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఎంపీల్యాడ్ నిధులతో ఇల్లు కట్టి, కొడుకు పెళ్లి చేశా.. దీనిలో తప్పేంటి?’’ అని తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సోయం బాపూరావు చెబుతున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఇటీవల పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో తన నివాసంలో బాపూరావు సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

అయితే, ఈ వివాదంపై స్పందిస్తూ తన మాటలను వక్రీకరించారని, కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని సోయం బాపూరావు అన్నారు.

ఎంపీల్యాడ్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే వార్తలు తరచూ వస్తుంటాయి. ఇంతకీ ఈ నిధులు ఎందుకు కేటాయిస్తారు? వీటిని ఎలా ఖర్చు చేస్తారు?

పార్లమెంటు

ఫొటో సోర్స్, CENTRALVISTA.GOV.IN/

1. ఎంపీల్యాడ్స్ నిధులు అంటే ఏమిటి?

మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ దీన్నే ‘‘ఎంపీల్యాడ్ స్కీమ్’’గా పిలుస్తారు. ఈ పథకం కోసం తాజాగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్) శాఖ ఒక వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించింది.

ఈ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా సామాజిక ఆస్తుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే మంచి నీటి సౌకర్యం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం లాంటి వసతులను తమ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసేందుకు ఈ నిధులను కేటాయించాల్సి ఉంటుంది.

ఎంపీల్యాడ్స్ పథకాన్ని డిసెంబరు 1993లో మొదలుపెట్టారు. 2016 నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్, యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ (సుగమ్య భారత్ అభియాన్), వర్షపు నీటిని నిల్వ చేసే సదుపాయాల అభివృద్ధి.. లాంటి పథకాల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తున్నారు.

రోడ్డు నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

2. ఈ నిధులను ఎలా వెచ్చిస్తారు?

ఎంపీల్యాడ్స్ పథకం అమలు కోసం ‘‘నోడల్ డిస్ట్రిక్ట్ అథారిటీ (ఎన్‌డీఏ)’’ని ఏర్పాటుచేస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులపై పార్లమెంటు సభ్యులు మొదట ఈ అథారిటీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ సాధారణంగా జిల్లా కలెక్టర్లు లేదా జిల్లా మేజిస్ట్రేట్ లేదా జిల్లా కమిషనర్ ఎన్‌డీఏగా వ్యవహరిస్తుంటారు.

పనులను సిఫార్సు చేయడం వరకే ఎంపీల బాధ్యత. వాటిని ఆమోదించడం, అమలు చేయడం, పర్యవేక్షించడం.. ఇవన్నీ ఎన్‌డీఏనే చూసుకుంటుంది. ఒక్కో పనికి ఎంత వెచ్చిస్తున్నాం, మొత్తంగా ఎంత ఖర్చయింది లాంటి వివరాలను ఈ అథారిటీ దగ్గర ఉంటాయి.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

3. ఎంత కేటాయిస్తారు?

ఎంపీల్యాడ్స్ పథకం కింద ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లను ఇస్తారు. వీటిని రెండు దఫాలుగా ఒక్కో దఫా రూ.2.5 కోట్ల చొప్పున విడుదల చేస్తారు.

ఈ నిధులను వినియోగించకపోతే ల్యాప్స్ అయిపోవడం ఉండదు. అంటే వచ్చే ఏడాదికి ఆ నిధులు వెళ్తాయి.

వరద బాధిత ప్రాంతాలు

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో క్యాప్షన్, వరద బాధిత ప్రాంతాలు

4. ఎక్కడ పనులకు సిఫార్సు చేయొచ్చు?

ఎంపీల్యాడ్స్ నిధులను లోక్‌సభ ఎంపీలైతే తమ నియోజకవర్గాల పరిధిలోని పనులకు కేటాయించాల్సి ఉంటుంది. అదే రాజ్యసభ సభ్యులైతే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల పరిధిలో పనులకు కేటాయించాల్సి ఉంటుంది.

నామినేటెడ్ సభ్యులైతే దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు ఈ నిధులను సిఫార్సు చేయొచ్చు.

అయితే, ఒక ఏడాదిలో కనీసం 15 శాతం నిధులను ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, 7.5 శాతం నిధులను ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.

ఎంపీలు తమ నియోజకవర్గం అవతలి ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి అనుకుంటే ఇక్కడ ఒక నిబంధన ఉంది. దీని కోసం ఒక ఏడాదిలో 25 లక్షలకు మించి వెచ్చించకూడదు.

మరోవైపు వరదలు, తుపానులు, భూకంపాలతో ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కూడా ఈ నిధులను సిఫార్సు చేయొచ్చు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

5. ఎందుకు మధ్యలో రద్దు చేశారు?

ఎంపీల్యాడ్స్ పథకాన్ని ఏప్రిల్ 2020 నుంచి నవంబరు 2021 మధ్య రద్దు చేశారు. ఆ సమయంలో కోవిడ్-19 వైరస్ చెలరేగడంతో ఉపశమన చర్యలకు ఈ నిధులను మళ్లించారు.

అయితే, నవంబరు 2021లో మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2021-22లోని మిగిలిన ఆ నెలలకు ఒక్కో ఎంపీకి రూ.2 కోట్ల చొప్పున కేటాయించారు.

తాగునీరు

ఫొటో సోర్స్, Getty Images

6. ఎలా ఖర్చు పెడుతున్నారు?

17వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీల కోసం ఈ ఐదేళ్లలో మొత్తంగా రూ.182.50 కోట్లను కేటాయించారు. వీటికి పాత ఎంపీల నుంచి వచ్చిన నిధులు, వడ్డీ కలిపితే రూ.257.73 కోట్లుగా మారాయి.

వీటి కోసం మొత్తంగా ఎంపీలు 6,273 పనులను సిఫార్సు చేశారు. వీటిలో 4,234 పనులను జిల్లా అథారిటీలు ఆమోదించాయి.

అదే తెలంగాణ విషయానికి వస్తే.. ఐదేళ్ల కోసం రూ.120 కోట్లను కేటాయించారు. వీటికి వడ్డీ కలిపితే రూ.123.91 కోట్లుగా మారాయి.

వీటి కోసం మొత్తంగా ఎంపీలు 3,142 పనులను సిఫార్సు చేశారు. వీటిలో 2,771 పనులను జిల్లా అథారిటీలు ఆమోదించాయి. ఇప్పటివరకు వీటి కోసం రూ.70.94 కోట్లు ఖర్చు చేశారు. అంటే 59.1 శాతం నిధులను వెచ్చించారు. మరో రూ.52 కోట్లు అలానే ఉన్నాయి.

సోయం బాపూరావు

ఫొటో సోర్స్, Facebook/soyam bapurao

7. సోయం బాపూరావు ఎలా ఖర్చుపెట్టారు?

బాపూరావుకు మొత్తంగా 9.65 కోట్లను కేంద్రం విడుదల చేసింది. దీనిలో 6.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులను బాపూరావు సిఫార్సు చేశారు.

అంటే ఆయనకు కేటాయించిన నిధుల్లో 68.52 శాతం నిధులను ఆయన వెచ్చించారు. మరో 2.95 కోట్లు అలానే ఉన్నాయి.

అయితే, ఆయన ఏఏ పనులకు ఈ నిధులను వెచ్చించారో తెలుసుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ, ఈ వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.

జయప్రకాశ్ నారాయణ్

ఫొటో సోర్స్, FACEBOOK/JAYAPRAKASHNARAYAN

ఫొటో క్యాప్షన్, జయప్రకాశ్ నారాయణ్

8. ఎంపీల్యాడ్ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఈ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపై ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ, విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ బీబీసీతో మాట్లాడారు.

‘‘మనం ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది ఎగ్జిక్యూటివ్ ప్రతినిధులుగా కాదు. వారు శాసన సభ్యులు. చట్టసభ ప్రతినిధులుగా వారిని ఎన్నుకున్నాం. కానీ, వారు అధికారానికి కేంద్రంగా మారుతున్నారు. ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్, ప్రజాప్రతినిధి అంటే లెజిస్లేటివ్‌ల మధ్య ఒక గోడ ఉండాలి. చట్టాలు చేసేది చట్టసభ. దీనికి విధానాల అమలుతో సంబంధం ఉండకూడదు’’ అని ఆయన అన్నారు.

‘‘స్థానికంగా రోడ్డు వేయడం, పాఠశాల భవనం కట్టడం లాంటివి ప్రస్తుతం ఎంపీల్యాడ్ నిధులతో చేస్తున్నారు. నిజానికి వీటిని చేయాల్సింది స్థానిక సంస్థలు. కానీ, వీటికి మనం అధికారాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేల దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ ఎంపీల నుంచే ప్రధాన మంత్రి వస్తున్నారు. అందుకే వారికి ఏదో అధికారాలు ఇవ్వాలి కదా. అలా ఎంపీల్యాడ్స్‌ను తీసుకొచ్చారు. నేరుగా వారి చేతుల్లోనే డబ్బులు పెడుతున్నారు’’ అని ఆయన చెప్పారు.

‘‘కానీ, ఇది దేశానికి లేదా ప్రజలకు మంచిదికాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అసంపూర్ణంగా మిగిలిన పనులను పూర్తి చేసేందుకు, పూర్వం పెట్టిన ఖర్చుకు కూడా ఫలితం వచ్చేలా చేసేందుకు నిధులు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఎంపీల్యాడ్స్‌ను అలానే మార్చాలి. ఇక్కడ ఎంపీలతోపాటు జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో ఒక కమిటీ వేసి పనులను ఖరారు చేయడం, అమలుచేయడం లాంటివి చేయాలి. అప్పుడు కూడా ఎంపీ పాత్ర ఉంటుంది. కానీ, ఆయన అధికారాన్ని దుర్వినియోగంచేసే అవకాశం ఉండదు’’ అని ఆయన అన్నారు.

ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారమంటే స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడమేనని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ కొత్త సచివాలయం ఎలా ఉందో చూశారా?

9. ఈ సమస్య తీవ్రతను ఎలా అర్థం చేసుకోవాలి?

మరోవైపు ఈ సమస్య ఏదో ఒక్క సోయం బాపూరావు లేదా ఏదో ఒక నియోజకవర్గానికే పరిమితంకాదని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.

‘‘ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే అధికారిక యంత్రాంగాన్ని బైపాస్ చేస్తున్నాం. ఎంపీలు లేదా ఎమ్మెల్యేలకు నిధులతో నేరుగా సంబంధం ఉండకపోతేనే మంచిది. కానీ, పరిస్థితులు అలా లేవు. కాబట్టి ఉన్న వ్యవస్థలనే మనం మెరుగుపరుచుకోవాలి’’ అని ఆయన చెప్పారు.

‘‘ఇక్కడ మెరుగు పరచడం అంటే.. ఆ స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేయడానికి బదులు అక్రమాలకు తావు లేకుండా సామాజిక తనిఖీలు, వర్క్ అసెస్‌మెంట్‌లు, కాగ్ లాంటి సంస్థలతో పరిశీలనలు తదితర చర్యలను తీసుకోవాలి ’’ అని ఆయన అన్నారు.

అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటే స్థానిక సంస్థలకు ఆ అధికారాలను బదిలీ చేయడమేనని జేపీ వాదనతో చక్రపాణి కూడా ఏకీభవించారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ - నీరా కేఫ్: తాటిచెట్టు నుంచి నీరాను ఉదయాన్నే ఎందుకు తీస్తారు?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)