టైటానిక్‌ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?

ఓషన్‌గేట్

ఫొటో సోర్స్, OCEANGATE

టైటానిక్‌ను చూడటానికి పర్యాటకులతో బయలుదేరి, అట్లాంటిక్ మహాసముద్రంలో ఆదివారం తప్పిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్(నీటి లోపలికి తీసుకెళ్లే వాహనం) అనే వాహనం కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

నీటిలోకి ప్రవేశించిన గంట 45 నిమిషాలకు ఈ సబ్‌మెర్సిబుల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు బోస్టన్ తీర ప్రాంతానికి చెందిన అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

ఆ సమయంలో కేప్ కాడ్ తీరానికి సుమారు 900 మైళ్ల దూరంలో ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఉన్నట్లు అంచనావేశారు.

అంత సుదూర ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టడం కష్టంగా మారినట్లు అమెరికా కోస్ట్ గార్డు వర్గాలు తెలిపాయి.

ఈ సబ్‌మెర్సిబుల్‌లో 70 నుంచి 96 గంటలకు సరిపడ ఎమర్జెన్సీ ఆక్సిజన్ ఉంటుందని భావిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.

టైటాన్ సబ్‌మెర్సిబుల్ తప్పిపోయిన ప్రాంతం
ఫొటో క్యాప్షన్, టైటాన్ సబ్‌మెర్సిబుల్ తప్పిపోయిన ప్రాంతం

పర్యాటక కంపెనీ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందిన ఈ చిన్న టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఐదుగురు వ్యక్తులున్నట్లు తెలిసింది.

ఈ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న వారందర్ని సురక్షితంగా తీసుకొచ్చేందకు అవసరమైన అన్ని రకాల ఆప్షన్లను వెతుకుతున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.

ఈ గాలింపు చర్యల్లో ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

‘‘పలు ప్రభుత్వ ఏజెన్సీలు, డీప్ సీ కంపెనీలు మాకు అందిస్తోన్న విస్తృతమైన సహకారానికి మేం చాలా రుణపడి ఉంటాం.’’ అని కంపెనీ తెలిపింది.

సముద్ర గర్భంలో కనిపించకుండా పోయిన సబ్‌మెర్సిబుల్‌ను వెతికేందుకు రెండు సీ-130 హెర్క్యూలస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపినట్లు అమెరికా కోస్ట్ గార్డు అధికారి తెలిపారు.

అండర్ వాటర్ సోనార్ సెర్చ్ కూడా చేపడుతున్నట్లు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సబ్‌మెర్సిబుల్‌లో వ్యాపారవేత్తలు
ఫొటో క్యాప్షన్, సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న పాకిస్తానీ వ్యాపారవేత్త షాహజాదా దావూద్, బ్రిటీష్ అన్వేషకుడు హమీష్ హార్డింగ్

ఈ సబ్‌మెర్సిబుల్‌లో ఎవరెవరు ఉన్నారు?

ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో పాకిస్తాన్‌కు చెందిన వ్యాపారవేత్త షాహజాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటీష్ బిలీనియర్ బిజినెస్‌మ్యాన్ హమీష్ హార్డింగ్‌లు ఉన్నారు.

అంతర్జాతీయ కంపెనీ యాక్షన్ ఏవియేషన్‌కు హమీష్ హార్డింగ్ చైర్మన్. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌కి చెందిన కంపెనీ ఇది. బిజినెస్ ఏవియేషన్ ఇండస్ట్రీలో డీల్స్‌ను, సేల్స్‌ను చేపడుతోంది.

అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ శిథిలాలను చూసేందుకు షాహజాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్ వెళ్లినట్లు దావూద్ కుటుంబం మంగళవారం ప్రకటనలో తెలిపింది.

షాహజాదా వయసు 48 ఏళ్లు, ఆయన కొడుకుకి 19 ఏళ్లుంటాయి.

పాకిస్తాన్ సంపన్న కుటుంబాల్లో దావూద్ ఫ్యామిలీ కూడా ఒకటి.

ఈ యాత్ర ప్రారంభం కావడానికి ముందు హార్డింగ్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఫ్రెంచ్ అన్వేషకుడు పౌల్ హెన్రీ నార్గోలెట్ కూడా ఈ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్నట్లు తెలిసింది.

ఓషన్‌గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్‌టన్ రష్ కూడా ఈ యాత్రకి వెళ్లినట్లు తెలుస్తోంది.

టైటానిక్ శిథిలాలు

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN

ఫొటో క్యాప్షన్, టైటానిక్ శిథిలాలు

టైటానిక్‌కి ఏమైందసలు?

అట్లాంటిక్ సముద్రం కింద ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున టైటానిక్ శిథిలాలు ఉన్నాయి.

ఇది కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీర ప్రాంతానికి 600 కి.మీల దూరంలో ఉంది.

1912 నాటికి అతిపెద్ద నౌక అయిన టైటానిక్, 1912 ఏప్రిల్ 14న సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయింది.

ఈ నౌకలో ఉన్న 2,200 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 1,500 మందికి పైగా మరణించారు.

1985లో దీని శిథిలాలను కనుగొన్నప్పటి నుంచి టైటానిక్ కోసం తీవ్రంగా వెతికారు.

టైటాన్ సబ్‌మెర్సిబుల్

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఎలా పనిచేస్తుంది?

తప్పిపోయిన ఈ వాహనం పర్యాటక కంపెనీ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందింది.

దీని బరువు 10,432 కేజీలు. 6.7 మీటర్ల పొడవు ఉంది. ఐదుగురు వ్యక్తులను ఇది నీటిలోకి తీసుకెళ్లి, టైటానిక్ శిథిలాలను చూపించగలదు. దీనికి అయ్యే ఖర్చు ఒక్కొక్కరికి 2,50,000 డాలర్లు. ( సుమారు రూ. 2 కోట్లు)

ఈ వాహనం గంటకు 3.5 మైళ్ల దూరం ఇది ప్రయాణిస్తుంది.

సముద్రం కింద ఉపరితలానికి 4 వేల మీటర్ల అడుగుకు చేరుకునేలా ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ను రూపొందించారు.

టైటానిక్ శిథిలాల దగ్గరకి పర్యాటకులను తీసుకెళ్లడమే కాకుండా, దీన్ని ఒక సైట్ సర్వేగా, పర్యవేక్షణ, పరిశోధన, డేటా సేకరణ, సినిమా, మీడియా ప్రొడక్షన్, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల డీప్ సీ టెస్టింగ్‌కు కూడా వాడుతున్నారు.

అధునాతన లైటింగ్, సోనార్ నేవిగేషన్ సిస్టమ్స్‌ను, దీని లోపల, బయట 4కే వీడియో, ఫొటోగ్రాఫిక్‌ ఇక్విప్‌మెంట్‌ను దీనికి అమర్చినట్లు కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)